మర్డర్

Thu Dec 24 2020 GMT+0530 (IST)

మర్డర్

చిత్రం :  ‘మర్డర్’
నటీనటులు: శ్రీకాంత్ అయ్యంగార్-సాహితి-గాయత్రి భార్గవి-గిరిధర్ తదితరులు
సంగీతం: డీఎస్ఆర్
ఛాయాగ్రహణం: జగదీష్ చీకటి
నిర్మాతలు: నట్టి కుమార్-నట్టి క్రాంతి
దర్శకత్వం: ఆనంద్ చంద్ర

నిజ జీవిత కథలతో సినిమాలు తీయడం రామ్ గోపాల్ వర్మ సిద్ధహస్తుడు. ఇప్పుడాయన పర్యవేక్షణలో ఆనంద్ చంద్ర అనే కొత్త దర్శకుడు మిర్యాలగూడ ప్రణయ్-అమృతల ఉదంతం ఆధారంగా ‘మర్డర్’ అనే సినిమా రూపొందించాడు. కోర్టు కేసుల తాలూకు అడ్డంకులను దాటే ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: మాధవరావు (శ్రీకాంత్ అయ్యంగార్)కు తన కూతురు నమ్రత (సాహితి) అంటే పంచ ప్రాణాలు. ఏకైక సంతానం అయిన అమృతను అల్లారుముద్దుగా పెంచుతాడు. తన వ్యాపారాలన్నింటినీ ఆమె పేరు మీదే నడిపిస్తుంటాడు. ఐతే నమ్రత.. వేరే కులానికి చెందిన తన క్లాస్ మేట్ ప్రవీణ్ ను ప్రేమిస్తుంది. ఐతే మాధవరావుకు ప్రవీణ్ ఏ కోశానా నచ్చడు. అతను డబ్బు కోసమే తన కూతుర్ని వలలో వేసుకున్నాడనుకుంటాడు. కానీ నమ్రతకు ఎంతగా నచ్చజెప్పినా వినదు. ఆమె ప్రేమను మాధవరావు అర్థం చేసుకోడు. చివరికి నమ్రత ఇంట్లోంచి లేచిపోయి ప్రవీణ్ ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటుంది. ఈ స్థితిలో మాధవరావు ఏం చేశాడు.. తర్వాతి పరిణామాలేంటి అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: ‘మర్డర్’ సినిమా పూర్తిగా ఒక కల్పిత కథతో తెరకెక్కినట్లుగా రామ్ గోపాల్ వర్మ ఎంత నమ్మబలికినా.. ఇది మిర్యాలగూడ ప్రణయ్-అమృతల కథ ఆధారంగా తెరకెక్కిందని సినిమా మొదలైన రోజు నుంచి అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా ప్రకటించిన రోజు నుంచే అమృత తరఫు నుంచి దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయినా వర్మ టీం తగ్గింది లేదు. ఈ సినిమా ప్రోమోలు చూస్తే ఇది పూర్తిగా మారుతీరావు కోణంలో సాగే కథ అనిపించింది. ఆయన వెర్షన్ ను బలంగా చెప్పే ప్రయత్నం చేసినట్లు కనిపించింది. సినిమా ఆ అంచనాలకు తగ్గట్లే సాగుతుంది. కూతురిని ప్రేమించిన వాడి మీద విపరీతమైన ద్వేషం పెంచుకుని.. కూతురు గర్భవతి అని కూడా చూడకుండా ఆమె తండ్రి అల్లుడిని చంపించేంత దారుణానికి ఎందుకు ఒడిగట్టాడన్నది ఆయన కోణంలో చూపించే ప్రయత్నం జరిగింది ‘మర్డర్’లో. అలాగే కూతురి మీద ప్రేమతోనే చివరికి తాను కూడా తనువు చాలించినట్లు ఇందులో చూపించారు.

ప్రణయ్ హత్యోదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం రేపిందో.. ఎంతగా చర్చనీయాంశం అయిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ హత్య తాలూకు వీడియో బయటికి వచ్చినప్పటి నుంచి ఈ ఉదంతం మీడియాలో పతాక శీర్షికల్లో ఉంటూ వచ్చింది. ఈ హత్య జరగడానికి ముందు ఏం జరిగిందో.. ఆ తర్వాత పరిణామాలేంటో మీడియా కథలు కథలుగా వివరిస్తూనే వచ్చింది. మారుతీరావు ఏ స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు.. తర్వాత ఏం జరిగిందన్నదీ తెలిసిందే. ఇంతగా మీడియా ఫోకస్ లో ఉన్న వ్యవహారం గురించి నిజానికి సినిమాలో కొత్తగా చెప్పడానికి ఏమీ లేనట్లే. మీడియాకు కూడా చిక్కని సమాచారం ఏదైనా ‘మర్డర్’ టీం సేకరించి.. మనకు తెలియని కొత్త కోణాలేవైనా తెరపై చూపిస్తే ఆసక్తి ఉంటుంది. అలాగే జరిగిన పరిణామాల్ని మరేదైనా కొత్త కోణంలో చూపించే ప్రయత్నం జరిగినా బాగుండేది. కానీ ‘మర్డర్’ అలా ఎంతమాత్రం కనిపించదు. మీడియా ద్వారా మనకు తెలిసిన విషయాలు చూసిన దృశ్యాలనే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ గా చూపించడం తప్ప ‘మర్డర్’లో ఏమీ లేదు.

పోలీసుల దగ్గరికెళ్లి కేస్ ఫైల్ తీసుకుని ఒకప్పటి క్రైమ్ సీరియల్ ‘నేరాలు ఘోరాలు’ తరహాలో ఒక వాయిస్ ఓవర్ తో నరేషన్ ఇప్పిస్తూ సన్నివేశాలు చూపించడం మినహాయిస్తే ‘మర్డర్’లో ఏ విశేషమూ కనిపించదు. ఇందులో సన్నివేశాలు నడిచే తీరు.. నటీనటుల అభినయం కూడా సీరియల్ స్థాయిలోనే కనిపిిస్తాయి. నూతన్ ప్రసాద్ వాయిస్ బదులు శ్రీకాంత్ అయ్యంగార్ తండ్రి పాత్రలో తన వెర్షన్ చెప్పుకుంటూ నరేషన్ ఇవ్వడం మాత్రమే తేడా. అంతకుమించి ‘నేరాలు ఘోరాలు’కు ‘మర్డర్’ భిన్నంగా ఏమీ కనిపించదు. ప్రణయ్ హత్య.. మారుతీరావు ఆత్మహత్యలకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలను పక్కన పెడితే మారుతీరావు ఇంట్లో ఏం జరిగి ఉండొచ్చన్నది ఊహించి సన్నివేశాలు తీర్చిదిద్దినట్లు అనిపిస్తుంది తప్ప.. ఇందులో పెద్దగా కసరత్తు లోతు కనిపించదు. పెద్దింటి అమ్మాయి వేరే కులానికి చెందిన మామూలు అబ్బాయిని ప్రేమిస్తే సాధారణంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించి సన్నివేశాలు లాగించేసినట్లు అనిపిస్తుంది.

అమృతకు జరిగిన అన్యాయం విషయంలో మీడియా సహా మెజారిటీ వర్గాలు ఆమె పక్షం వహించి మారుతీరావును ఒక రాక్షసుడిగా చిత్రీకరించిన నేపథ్యంలో ఆయన కోణమేంటో చెప్పడానికి ఈ సినిమా తీసినట్లు అనిపిస్తుంది. తండ్రి కోణంలో కథ చెప్పాలని నిర్ణయించుకోవడంతో కూతురి పాత్రకు ఏమాత్రం పరిణతి లేనట్లు చూపించారు. ఆమె ప్రేమకథను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయలేదు. ఆమెను పెళ్లి చేసుకున్న అబ్బాయి అతడి కుటుంబం గురించి ఏమీ చూపించలేదు. ఆ కుర్రాడు.. అతడి స్నేహితులు అమ్మాయి తండ్రిని రెచ్చగొట్టి ఈ దారుణానికి ఒడిగట్టేట్లు చేసినట్లు ప్రొజెక్ట్ చేశారు. దీంతో కనీసం ఈ కథను సంపూర్ణంగా తెలుసుకున్న భావన కలగదు. హత్యోదంతాన్ని కొంచెం ఉత్కంఠభరితంగా చిత్రీకరించడం.. తండ్రి బాధను ఉద్వేగభరితంగా చెప్పే ప్రయత్నం చేయడం తప్పితే.. ‘మర్డర్’లో ఏ ప్రత్యేకతా కనిపించదు. ఈ సినిమా చూసి కొత్తగా తెలుసుకునే విషయాలైతే ఏమీ లేవు. ఓ సంచలన ఉదంతాన్ని అత్యంత సాధారణంగా తెరమీద ప్రెజెంట్ చేసిన సినిమా ‘మర్డర్’.

నటీనటులు: సినిమాలో నటన పరంగా చెప్పుకోవాల్సింది ఒక్క శ్రీకాంత్ అయ్యంగార్ గురించే. కొన్ని చోట్ల అతిగా నటించిన భావన కలిగినప్పటికీ.. చాలా వరకు ఓకే అనిపించాడు. హత్య తర్వాత.. ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు సన్నివేశాల్లో ఆయన నటన ఉద్వేగభరితంగా సాగుతుంది. ఆయన భార్య పాత్రలో గాయత్రి భార్గవి ఓకే. నమ్రత పాత్రధారిగా సాహితి పర్వాలేదనిపిస్తుంది. గిరిధర్ కొన్ని సన్నివేశాల్లో అవసరానికి మించి నటించాడు. వర్మ సినిమాల్లో ఈ అతి మామూలే కాబట్టి సర్దుకోవచ్చు. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతిక వర్గం: వర్మ బ్రాండుతో వచ్చే సినిమాల్లోసాంకేతిక విభాగాల పనితీరు ఒక స్టయిల్లో సాగిపోతుంది. ఈ సినిమాలో వర్మ భాగస్వామ్యం ఏ మేర ఉందో కానీ.. బ్యాగ్రౌండ్ స్కోర్ ఆయన గత సినిమాల స్టయిల్లోనే సాగిపోతుంది. మామూలు సన్నివేశాలకు కూడా ఏదో జరిగిపోతున్నట్లు విపరీతమైన బిల్డప్ ఇస్తూ సాగే నేపథ్య సంగీతం చాలా వరకు చికాకు పెడుతుంది. సంగీత దర్శకుడు డీఎస్ఆర్ పనితనం హత్య జరిగే ఒక్క సన్నివేశంలో మాత్రం ప్రత్యేకంగా అనిపిస్తుంది. జగదీష్ చీకటి ఛాయాగ్రహణంలో ఏ విశేషం లేదు. మిగతా సాంకేతిక విభాగాల పనితీరూ అంతంతమాత్రమే. నిర్మాణ విలువలు చాలా సాధారణంగా అనిపిస్తాయి. దర్శకుడు ఆనంద్ చంద్ర గురించి చెప్పడానికి ఏమీ లేదు. ముందే అన్నట్లు మిర్యాలగూడ ఉదంతం కేస్ ఫైల్ తీసుకుని..  కొంత కల్పన జోడించి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పుకుంటూ వెళ్లినట్లు అనిపిస్తుంది తప్ప ‘మర్డర్’లో అతను కొత్తగా కానీ.. లోతుగా కానీ.. తెలియని కోణాలు కానీ ఏమీ చెప్పలేకపోయాడు. అతడి నరేషన్ టీవీ సీరియళ్లను తలపిస్తుంది.

చివరగా: మర్డర్.. వెండితెర పై ‘నేరాలు ఘోరాలు’

రేటింగ్: 1.5/5

LATEST NEWS