పుష్పక విమానం

Fri Nov 12 2021 GMT+0530 (IST)

పుష్పక విమానం

చిత్రం :  పుష్పక విమానం

నటీనటులు: విజయ్ దేవరకొండ-శాన్వి మేఘన-గీతా సైని-నరేష్-సునీల్-గిరి-కిరీటి-హర్షవర్ధన్ తదితరులు
సంగీతం: రామ్ మిరియాల-సిద్దార్థ్ సదాశివుని-మార్క్ కె.రాబిన్-అమిత్ దసాని
నేపథ్య సంగీతం: మార్క్ కె.రాబిన్
ఛాయాగ్రహణం: హెస్టిన్ జోస్ జోసెఫ్
నిర్మాతలు: గోవర్ధనరావు దేవరకొండ-విజయ్ మట్టపల్లి-ప్రదీప్ ఎర్రబెల్లి
రచన-దర్శకత్వం: దామోదర

‘దొరసాని’ సినిమాతో విమర్శలెదుర్కొని.. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’తో మెప్పించిన ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం.. పుష్పక విమానం. దామోదర అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమా ఆసక్తికర ట్రైలర్ తో అంచనాలు పెంచింది. ఆ అంచనాల్ని సినిమా ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

సుందర్ (ఆనంద్ దేవరకొండ) ప్రభుత్వ పాఠశాలతో పని చేసే ఒక మామూలు ఉపాధ్యాయుడు. అతడికి మీనాక్షి (గీతా సైని) అనే అమ్మాయితో పెళ్లవుతుంది. ఐతే తొలి రాత్రే వీరి మధ్య అనుకోకుండా అభిప్రాయ భేదాలు వస్తాయి. దీంతో కొన్ని రోజుల తర్వాత తనకు నచ్చిన వాడితో మీనాక్షి వెళ్లిపోతుంది. అక్కడి నుంచి సుందర్ తన భార్య లేచిపోయిన సంగతి కవర్ చేయడానికి నానా తంటాలు పడుతుంటాడు. అతడీ అవస్థల్లో ఉండగానే మీనాక్షి హత్యకు గురైన సంగతి వెల్లడవుతుంది. దీంతో పోలీసుల చూపు సుందర్ మీద పడుతుంది. ఇంతకీ మీనాక్షి ఇల్లు విడిచి వెళ్లిపోయాక ఏం జరిగింది.. ఆమె మర్డర్ మిస్టరీ ఎలా వీడింది.. సుందర్ ఈ కేసు బయటపడ్డాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

కాసేపట్లో తన పెళ్లనగా హీరో కోసం హీరోయిన్ పెళ్లి మండపం నుంచి పారిపోవడం.. లేదా పెళ్లి తర్వాత భర్తకు హ్యాండిచ్చి వెళ్లిపోవడం లాంటి దృశ్యాలు తెరమీద చాలా చూసి ఉంటాం. అలా పెళ్లి వద్దనుకుని హీరో కోసం హీరోయిన్ వచ్చేస్తుంటే సరదాగా.. క్రేజీగా ఉంటుంది. ఐతే ఇలా అమ్మాయి పారిపోయి వచ్చేస్తే.. అవతల పెళ్లికొడుకు పరిస్థితి ఏంటి అన్న ఆలోచన ఎప్పుడూ కలగదు. అతడి కోణంలో చూస్తే అది మామూలు శిక్ష కాదు. సమాజం ఆ వ్యక్తిని ఎలా చూస్తుంది.. ఆ వ్యక్తి మానసిక స్థితి ఎలా ఉంటుందనే ఆలోచనతో రెండు దశాబ్దాల కిందట త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘చిరునవ్వుతో’ అనే కథ రాసి ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చాడు. మళ్లీ ఇన్నేళ్లకు దామోదర అనే కొత్త దర్శకుడు ‘పుష్పక విమానం’లో ఈ కాన్సెప్ట్ టచ్ చేశాడు. ఐతే త్రివిక్రమ్ కొంచెం ఫన్ జోడించి చాలా వరకు సీరియస్గా ఈ ఇష్యూను డిస్కస్ చేస్తే.. దామోదర ఈ పాయింట్ ను వినోదానికి వాడుకోవాలని చూశాడు. అలాగే కొంచెం ఉత్కంఠ రేకెత్తించాలనీ ప్రయత్నించాడు. ఐతే ట్రైలర్లో ఒక హిలేరియస్ రైడ్ లాగా అనిపించిన ‘పుష్పక విమానం’ ఆశించినన్ని నవ్వులు పంచలేక.. అలాగని అనుకున్నంతగా థ్రిల్ కూడా చేయలేక రెంటికీ చెడ్డట్లు తయారైంది. కాన్సెప్ట్ బాగున్నా.. ఎగ్జిక్యూషన్లో తేడా కొట్టడంతో ‘పుష్పక విమానం’ ఒక మామూలు సినిమాలా మిగిలిపోయింది.

పెళ్లయిన కొన్ని రోజులకే భార్య లేచిపోతే భర్త పడే కష్టాలు అనే పాయింట్ మీద సినిమా తీయాలనుకోవడం ఎగ్జైటింగ్ ఐడియానే. ఈ పాయింట్ తీసుకోవడం కాకుండా దర్శకుడు దామోదర అత్యుత్తమ ప్రతిభ చూపించిందంటే.. ఈ సినిమాకు ట్రైలర్ కట్ చేయడంలోనే. ఈ సినిమా వినోదంలో ముంచెత్తబోతోంది అన్న ఆశలు కలిగేలా.. అంచనాలు పెరిగేలా అతను ట్రైలర్ మాత్రం భలే కట్ చేశాడు. అది చూసి నవ్వులే నవ్వులన్న అంచనాతో సీట్లో కూర్చుంటే.. ట్రైలర్లో చూపించిన కొన్ని ఫన్నీ షాట్లు.. డైలాగులు ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి. భార్య లేచిపోయిన విషయాన్ని కవర్ చేయడానికి హీరో పడే ఈ కష్టాల చుట్టూ నడిపించిన కొన్ని సన్నివేశాలు ఓ మోస్తరుగా టైంపాస్ చేయిస్తాయి. ముఖ్యంగా తన ఇంటికొచ్చిన కలీగ్స్ ముందు.. షార్ట్ ఫిలిం హీరోయిన్ని తీసుకొచ్చి తన భార్య స్థానంలో పెట్టి మేనేజ్ చేయడానికి ప్రయత్నించే సన్నివేశాలు బాగానే నవ్విస్తాయి. హీరో భార్యగా నటించే అమ్మాయిగా శాన్వి మేఘన చురుకుదనం వల్ల ఆ సన్నివేశాలు బాగానే పాసైపోయాయి. ఐతే ఇంతకుమించి సినిమాలో ఏముంటుందా అని చూస్తే.. తీవ్ర నిరాశ తప్పదు. మరీ స్లోగా సాగే నరేషన్ వల్ల ఎక్కడా చురుకు పుట్టదు. కథలో కూడా తొలి గంటలో చెప్పుకోదగ్గ మలుపులేమీ లేవు. కేవలం పాత్రల మధ్య కాన్వర్జేషన్లతో సిచువేషనల్ కామెడీ పండించడానికి ప్రయత్నం జరిగింది తప్ప.. కథ పరంగా అయితే ఏ కదలికా కనిపించదు. ఇంటర్వెల్ దగ్గర హీరో భార్య హత్యకు గురైనట్లు తెలిసే దగ్గర సినిమా కొత్త టర్న్ తీసుకుంటుంది.

ప్రథమార్ధం వరకు కామెడీ సినిమాలా కనిపించే ‘పుష్పక విమానం’ సెకండాఫ్ నుంచి థ్రిల్లర్ మోడ్ లోకి వెళ్తుంది. కానీ ఈ కొత్త జానర్ కంటే అప్పటిదాకా చూసిన జానరే చాలా నయం అనిపించేలా నడుస్తుంది ద్వితీయార్ధం. సినిమా నడత పూర్తిగా మారిపోవడంతో దీనికి అడ్జస్ట్ కావడానికి ప్రేక్షకులకు టైం పడుతుంది. కామెడీలో కొంత మేర పట్టు చూపించిన దర్శకుడు.. మర్డర్ మిస్టరీ చుట్టూ థ్రిల్లర్ సినిమాను నడిపించడంలో తేలిపోయాడు. ఎన్నో సినిమాల్లో చూసిన రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ సీన్లతో సాధారణంగా సాగిపోతుంది ద్వితీయార్ధం. ఎస్ఐగా సునీల్ పాత్రతో వినోదం పండించడానికి చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. ప్రథమార్ధంలో కొంత ఎంటర్టైన్ చేసిన శాన్వి ద్వితీయార్ధంలో రీఎంట్రీ ఇచ్చి ఒకట్రెండు సన్నివేశాలను నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఆ సన్నివేశాలను మినహాయిస్తే మిగతా అంతా చాలా భారంగా నడుస్తుంది. కథ పరంగానే కాక.. ఎలా చూసినా హీరో హీరోయిన్ల మధ్య ఎక్కడా కెమిస్ట్రీ అన్నది పెద్దగా వర్కవుట్ కాకపోవడం వల్ల హీరోయిన్ హత్య విషయంలో ఎక్కడా ఎమోషన్ కలగదు. దీనికి తోడు ఇన్వెస్టిగేషన్ సీన్లు తేలిపోవడంతో ఇక హత్య చేసిందెవరో తెలుసుకోవడం కోసం ఓపిగ్గా చివరి వరకు ఎదురు చూడ్డం తప్ప చేయగలిగిందేమీ లేదు. హంతుకుడెవరు అనే విషయంలో ఉత్కంఠ రేకెత్తించేలా స్క్రీన్ ప్లే సెట్ చేసుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడు. కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే హంతకుడెవరన్నది గెస్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ముగింపులోకి వచ్చేసరికి మొదట్లో ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోతుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ‘పుష్పక విమానం’ కాన్సెప్ట్ బాగున్నా.. ఆరంభంలో కొన్ని నవ్వులు పండినా.. ఆ తర్వాత ఇటు కామెడీ పండక.. అటు ఉత్కంఠ రేపలేక ప్రేక్షకులకు నిరాశే మిగులుతుంది.

నటీనటులు:

ఆనంద్ దేవరకొండను ముందుగా ఇలాంటి కథలో నటించడానికి ముందుకొచ్చినందుకు అభినందించాలి. భార్య లేచిపోయిన భర్త పాత్రలో నటించడానికి అందరు యంగ్ హీరోలూ ముందుకు రారు. సుందర్ పాత్రకు అతను ఉన్నంతలో బాగానే న్యాయం చేశాడు. ఆ పాత్రకు సరిపోయాడు అనిపించాడు. ఆనంద్ నటన ఎక్కడా ఎబ్బెట్టుగా లేదు. సహజంగా అనిపించాడు. కాకపోతే కథలో.. పాత్రల్లో.. సన్నివేశాల్లో బలం ఉంటే తప్ప ఆనంద్ తనకు తానుగా హైలైట్ కాలేని బలహీనత మాత్రం తెరపై కనిపిస్తుంది. ఇక్కడే ఆనంద్ కు.. అతడి అన్నయ్యకు ఉన్న తేడా తెలుస్తుంది. హీరోయిన్లలో శాన్వి మేఘన ఆకట్టుకుంటుంది. సినిమాలో మేజర్ హైలైట్ అంటే శాన్వి పాత్ర.. ఆమె నటనే. ఈ పాత్రను ఇంకొంచెం పొడిగించి ఉంటే బాగుండన్న ఫీలింగ్ కలిగించేలా చేసింది శాన్వి. తను కనిపించే ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటుంది. మరో కథానాయిక గీతా సైని జస్ట్ ఓకే అనిపిస్తుంది. నరేష్ స్థాయికి తగ్గ పాత్ర పడలేదు. ఆయన కొంతమేర నవ్వించారు. ఎస్ఐ పాత్రలో సునీల్ మామూలుగానే అనిపిస్తాడు. అతను సినిమాకేమీ ప్లస్ కాలేకపోయాడు. కిరీటి.. గిరి పర్వాలేదు.

సాంకేతిక వర్గం:

‘పుష్పక విమానం’లో సాంకేతిక హంగులు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. నలుగురు సంగీత దర్శకులు కలిసి అందించిన పాటల్లో ఏవీ గుర్తుంచుకునేలా లేవు. సినిమాకు మూడ్ కు తగ్గ పాటలు పడలేదు. మార్క్ కె.రాబిన్ నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకుంటుంది. జోసెఫ్ ఛాయాగ్రహణం బాగుంది. సినిమా శైలికి తగ్గ విజువల్స్ పడ్డాయి. నిర్మాణ విలువల విషయంలో 'మీకు మాత్రమే చెప్తా' తరహాలోనే మరీ పరిమిత వనరులతో సినిమా తీసేసినట్లున్నారు. షార్ట్ ఫిలిమ్స్ కూడా మంచి క్వాలిటీతో తెరకెక్కతున్న ఈ రోజుల్లో.. ఈ సినిమాలో నిర్మాణ విలువలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ దామోదర విషయానికి వస్తే.. కాన్సెప్ట్ వరక అతణ్ని అభినందించవచ్చు. కానీ మంచి కాన్సెప్ట్ తీసుకుని.. దాన్ని సరిగ్గా ప్రెజెంట్ చేసే కథాకథనాలు అతను తీర్చిదిద్దుకోలేదు. ప్రథమార్ధంలో కొన్ని చోట్ల అతను ప్రతిభ చాటుకున్నా.. ఓవరాల్ గా మెప్పించలేకపోయాడు. అతను సినిమాను పూర్తిగా కామెడీ కోణంలోనే నడిపించి ఉంటే బాగుంటుందనిపిస్తుంది. థ్రిల్లర్ కోణంలో కథను నడిపించాల్సినపుడు దర్శకుడు తేలిపోయాడు.
 
చివరగా: పుష్పక విమానం.. గుడ్ కాన్సెప్ట్ బ్యాడ్ ఎగ్జిక్యూషన్

రేటింగ్-2.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS