'ప్రతి రోజూ పండగే'

Fri Dec 20 2019 GMT+0530 (IST)

'ప్రతి రోజూ పండగే'

చిత్రం : ‘ప్రతి రోజూ పండగే’

నటీనటులు: సాయిధరమ్ తేజ్ - రాశి ఖన్నా - సత్యరాజ్ - రావు రమేష్ - విజయ్ కుమార్ - ప్రభ - ప్రవీణ్ - హరితేజ-సుహాస్-మహేష్ తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: జయకుమార్ సంపత్
నిర్మాత: బన్నీ వాసు
రచన-దర్శకత్వం: మారుతి

‘చిత్రలహరి’తో కాస్త కుదురుకున్న సాయిధరమ్ తేజ్.. ‘శైలజారెడ్డి అల్లుడు’ తర్వాత మళ్లీ హిట్టు కొట్టాలనే కసితో ఉన్న మారుతి కలిసి.. ‘గీతా ఆర్ట్స్’ లాంటి పెద్ద బేనర్లో చేసిన సినిమా ‘ప్రతి రోజూ పండగే’. పాటలు - టీజర్ - ట్రైలర్లతో మెప్పించి మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చూడబోతున్న భావన కలిగించిన ఈ సినిమా క్రిస్ మస్ కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

రఘురామయ్య (సత్యరాజ్) పిల్లలందరూ విదేశాల్లో స్థిరపడిపోతే పల్లెటూరిలో ఒంటరిగా మిగిలిపోయిన పెద్ద మనిషి. ఆయనకు ఊపిరితిత్తుల క్యాన్సర్ అని.. ఇంకో ఐదు వారాల్లో చనిపోతాడని డాక్టర్లు చెప్పడంతో ఆయన జీవితపు చివరి మజిలీని సంతోషమయం చేయడం కోసం మనవడు అమెరికా నుంచి దిగుతాడు. తాతయ్య సంతోషం కోసమని తన తండ్రి సహా కుటుంబ సభ్యులందరినీ రప్పిస్తాడు. మరి ఈ ఐదు వారాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వీళ్లంతా కలిసి రఘురామయ్యకు ఎలాంటి వీడ్కోలు పలికారు.. చివరికి ఆయన జీవితం ఎలా ముగిసింది అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

ఇంకొన్ని రోజుల్లో చనిబోతున్న తండ్రిని చివరి రోజుల్లో చూసుకోవడం కోసం తమ కమిట్మెంట్లన్నీ పక్కన పెట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన కొడుకులకు.. ఆయన పోయేముందు తమకేదో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి వెళ్లబోతున్నాడని తెలుస్తుంది. దాని మీద ఆశతో ఒకరి తర్వాత ఒకరు ఆయన్ని ఇంప్రెస్ చేసే పనిలో పడతారు. ఈ క్రమంలో ఒక కొడుకు నేరుగా తండ్రిని తీసుకెళ్లి ఆయన కోసం తాను డిజైన్ చేసిన సమాధి చూపిస్తాడు. అక్కడే కొన్ని డిజైన్లు చూపించి నీకేది కావాలో కోరుకో నాన్నా అంటాడు. ఇంకో కొడుకేమో.. ఆయన తండ్రి తద్దినానికి రెడీ చేసిన మెనూ కార్డు తీసుకొచ్చి నువ్వు పోయాక జనాలకు ఎన్ని వెరైటీలతో ఫుడ్డు పెట్టబోతున్నానో చూడు నాన్నా అంటాడు. అంతటితో ఆగకుండా ఆయన అంతిమ యాత్ర కోసం సిద్ధం చేసిన వాహనాన్ని కూడా చూపిస్తాడు. వీటికే వామ్మో అనుకుంటుంటే.. ఆయన గారి భార్య ఏకంగా పోయే ముందు గొంతులో పోసే తులసి నీళ్లు కూడా రెడీ చేసి పెడుతుంది. వీటి టేస్టెలా ఉందో చెబితే.. తర్వాత ఇలాగే కలిపి పెడతాం అంటుంది. ఇవీ ‘ప్రతి రోజూ పండగే’ సినిమాలోని విడ్డూరాలు.

చనిపోయే వ్యక్తిని సంతోషంగా సాగనంపడం అనే కాన్సెప్టులో భాగంగా.. సినిమాను సరదాగా నడిపించాలనుకోవడం ఓకే.. కానీ దానికి ఒక హద్దు పద్దూ ఉండొద్దా? కానీ కామెడీనే తన బలంగా నడిపించే మారుతి అవేమీ పట్టించుకోలేదు. అలాగని సినిమాలో కామెడీ పండలేదా అంటే.. అదేం కాదు. పండింది. కానీ ఈ కథకు అవసరమైన ఎమోషనల్ కనెక్ట్ మాత్రం మిస్ అయిపోయింది. కామెడీ విషయంలో కాస్త హద్దుల్లో ఉండి.. ఎమోషన్ల మీద కూడా కొంచెం దృష్టిపెట్టి ఉంటే ‘ప్రతి రోజూ పండగే’ ఒక మరపురాని సినిమాగా నిలిచే అవకాశముండేది. కానీ మారుతి లాజిక్ ను పూర్తిగా పక్కన పెట్టేసి కామెడీ విషయంలో ఎక్స్ ట్రీమ్ కు వెళ్లిపోవడంతో ఇదొక మామూలు టైంపాస్ ఎంటర్టైనర్ గా మిగిలిపోయింది.

‘ప్రతి రోజూ పండగే’ చాలా చిన్న పాయింట్ చుట్టూ తిరిగే కథ. ఆ పాయింట్ ఏంటన్నది ట్రైలర్లోనే విప్పేశారు. థియేటర్లోకి అడుగుపెట్టాక ఆ పాయింట్ ను మించి మనకు కొత్తగా కనిపించేదేమీ లేదు. ప్రోమోల్లో చూసిన సన్నివేశాలకు పాటలకు ముందు వెనుక ఫిల్లింగ్స్ లా అనిపించే ఎపిసోడ్లతో ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లే సాగిపోతుందీ చిత్రం. ఇంకొన్ని రోజుల్లో తండ్రి చనిపోతాడని తెలిసి కొడుకులు ఆయన దగ్గరకి రావడానికి తటపటాయిస్తే.. మనవడు మాత్రం వెంటనే ఇక్కడికి వాలిపోయి ఆయన చివరి రోజుల్ని సంతోషంగా గడిపేలా చేస్తాడు. ఆయనకు దూరమైన మనుషుల్ని దగ్గర చేస్తాడు. చేయలేని పనుల్ని పూర్తి చేస్తాడు. సమస్యల్ని పరిష్కరిస్తాడు. ఇవేవీ కూడా ప్రేక్షకుడిలో అంత ఎగ్జైట్మెంట్ కలిగించవు. టిక్ టాక్ స్టార్ గా హీరోయిన్ పాత్రను ఆరంభించిన విధానం.. ఆ పాత్ర పంచే వినోదం ఆకట్టుకుంటాయి. రొమాంటిక్ ట్రాక్ లో డెప్త్ లేకపోయినా.. సరదాగానే సాగిపోతుంది. రావు రమేష్ పాత్ర పూర్తి స్థాయిలో రంగంలోకి దిగేవరకు కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది కానీ.. ఆయన వచ్చాక ఇక నవ్వులే నవ్వులు. తనదైన మేనరిజంలతో.. కామెడీ టైమింగ్ తో.. మాట విరుపులతో కొన్ని సీన్లలో కడుపు చెక్కలయ్యేలా నవ్వించాడు రావు రమేష్. కొన్ని సన్నివేశాల్లో కొసమెరుపుల్లా అనిపించే రావు రమేష్ డైలాగ్స్.. ఆయన హావభావాలు భలేగా పేలాయి. ఓ బావా.. ప్రతి రోజు పండగే పాటలు కూడా ఆహ్లాదంగా సాగడంతో ప్రథమార్ధం సరదాగా సాగిపోతుంది.

పెద్ద కథేమీ లేకపోవడం.. సన్నివేశాలు రిపిటీటివ్ గా తయారవడం.. మొదట్లో చెప్పుకున్న తరహాలో కామెడీ కోసమని మరీ హద్దులు దాటిపోవడంతో ‘ప్రతి రోజూ పండగే’ గ్రాఫ్ ద్వితీయార్ధంలో పడిపోతూ వెళ్తుంది. ప్రథమార్ధంలో ఎంత టైంపాస్ చేయించినా.. ద్వితీయార్ధంలో కథంటూ లేకుండా  సినిమాను నడిపిస్తే ప్రేక్షకుడికి విసుగు పుడుతుంది. అసలేమాత్రం మలుపుల్లేకపోవడం నిరాశ పరుస్తుంది. ఎన్నారైల పాత్రల్ని ఇందులో మరీ నెగెటివ్ గా.. కృత్రిమంగా తయారు చేసి పెట్టారీ సినిమాలో. అయితే లాజిక్ గురించి పట్టించుకోకుంటే రెండో అర్ధంలోనూ కొన్ని సన్నివేశాలు బాగానే నవ్విస్తాయి. కాకపోతే ఎమోషనల్ కనెక్ట్ మిస్సవడంతో సినిమా సరైన ముగింపు దిశగా సాగదు. ‘‘నాన్నా నీకు నిజంగా అనారోగ్యమేనా.. మిమ్మల్ని చూస్తే అలాంటి ఫీలింగే కలగట్లేదు’’ అని.. సత్యరాజ్ ను రావు రమేష్ ఓ సన్నివేశంలో అడుగుతాడు. దాదాపుగా ప్రేక్షకులకు కూడా అలాంటి భావన వచ్చేస్తుంది. కథను నడిపించిన తీరే అందుక్కారణం. ముందే పూర్తిగా సీరియస్నెస్ తగ్గిపోవడంతో ప్రి క్లైమాక్స్.. క్లైమాక్సులో భారమైన సన్నివేశాలు పెట్టినా కూడా ప్రేక్షకుడి హృదయం బరువెక్కదు. కామెడీ డోస్ కాస్త తగ్గించి ప్రధాన పాత్రతో ముందే కొంచెం ఎమోషనల్ కనెక్ట్ ఉండేలా చూసుకుని ఉంటే.. ‘ప్రతి రోజూ పండగే’ మిగిల్చే అనుభూతే వేరుగా ఉండేది. ఓవరాల్ గా చూస్తే ‘ప్రతి రోజూ పండగే’లో ప్లాట్ పాయింట్ ఎగ్జైటింగ్ గా అనిపించినా.. దాన్ని ట్రీట్ చేసిన విధానం బాగా లేదు. కామెడీ కోసమైతే ఒకసారి ‘ప్రతి రోజూ పండగే’ను చూడొచ్చు. అంతకుమించి ఆశిస్తే కష్టం.

నటీనటులు:

నటన విషయానికి వస్తే ప్రతి సినిమాకూ హీరోతో మొదలుపెట్టాలి కానీ.. ‘ప్రతి రోజూ పండగే’లో మాత్రం పాత్ర ప్రాధాన్యం పెర్ఫామెన్స్ విషయంలో రావు రమేష్ నుంచే ఆరంభించాలి. ఆయన ఎంత విలక్షణ నటుడో.. ఏ రసమైనా ఎలా పండించగలడో చెప్పడానికి ఈ సినిమా మరో రుజువుగా నిలుస్తుంది. ఇందులో ఆయన పాత్ర నవ్విస్తుంది. కోపం తెప్పిస్తుంది. ఫ్రస్టేట్ చేస్తుంది. కానీ వినోదం పంచుతుంది. సినిమాలో కామెడీ పరంగా ప్రధాన బాధ్యత ఆయనే తీసుకున్నారు. హీరో సాయిధరమ్ తేజ్ పాత్రను మారుతి అండర్ ప్లే చేశాడు. పెర్ఫామెన్స్ ఓకే అనిపిస్తుంది కానీ.. అతను తన ప్రత్యేకతను చాటుకునే అవకాశం ఈ పాత్ర పెద్దగా ఇవ్వలేదు. పతాక సన్నివేశంలో మినహా తేజు మామూలుగా అనిపిస్తాడు. సత్యరాజ్ పాత్రకు అవసరమైన హుందాతనాన్ని పెద్దరికాన్ని తన స్క్రీన్ ప్రెజెన్స్ తో తీసుకొచ్చాడు. కానీ ఆయన హావభావాలు చాలా మామూలుగా అనిపిస్తాయి. చాలా చోట్ల ఎక్స్ ప్రెషన్స్ పలకలేదు. టిక్ టాక్ స్టార్ ఏంజెల్ ఆర్ణగా రాశి ఖన్నా ఆకట్టుకుంది. కానీ బాగా ఆరంభమయ్యే ఆమె పాత్రను దర్శకుడు మధ్యలో వదిలేశాడు. దాన్ని ఇంకా బాగా ఉపయోగించుకుని ఉండాల్సింది. రాశి పాత్రకు తగ్గట్లుగా కనిపించి మెప్పించింది. సత్యరాజ్ రెండో కొడుకు పాత్రలో చేసిన నటుడు ఓవరాక్షన్ తో విసిగించేశాడు. హరిప్రియ ఆకట్టుకుంది. విజయ్ కుమార్.. ప్రవీణ్.. జబర్దస్త్ మహేష్.. వీళ్లంతా బాగా చేశారు.

సాంకేతికవర్గం:

మారుతి సినిమాల్లో సాంకేతిక ఆకర్షణలకు లోటుండదు. ఈ సినిమా కూడా అందుకు మినహాయింపు కాదు. తమన్ సంగీతం సినిమాకున్న ఆకర్షణల్లో ఒకటి. ఓ బావా.. ప్రతి రోజు పండగే పాటలు ప్రత్యేకంగా అనిపిస్తాయి. వాటి చిత్రీకరణ కూడా బాగుంది. మిగతా పాటలు కూడా ఓకే. నేపథ్య సంగీతం కూడా హుషారు పుట్టిస్తుంది. జయకుమార్ సంపత్ ఛాయాగ్రహణమూ ఆకట్టుకుంటుంది. విజువల్స్ చాలా కలర్ఫుల్ గా ఉండి.. ప్రేక్షకుల్లో ఒక పాజిటివ్ ఫీల్ తీసుకొస్తాయి. పాటల్లో కెమెరా పనితనం మరింత బాగా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు గీతా ఆర్ట్స్.. యువి క్రియేషన్స్ స్థాయికి తగ్గట్లుగా రిచ్ గా ఉన్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ మారుతి విషయానికి వస్తే.. అతను ఎంచుకున్న పాయింట్ మంచిదే. కానీ దాన్ని అనుకున్నంత ప్రభావవంతంగా డీల్ చేయలేకపోయాడు. ‘శతమానం భవతి’ ఫ్లేవర్ కనిపించడంపై తనకు తాను సెటైర్ వేసుకున్నా సరే.. ఆ ఛాయలు చాలా ఈ సినిమాలో కనిపిస్తాయి. కామెడీ వరకు వస్తే మారుతి  సెన్సాఫ్ హ్యూమర్ ఎలా ఉంటుందో.. అతనెంత ట్రెండీగా ఆలోచిస్తాడో ఈ సినిమాలో కొన్ని చోట్ల కనిపిస్తుంది. రావు రమేష్ పాత్రను అతను భలేగా ఉపయోగించుకున్నాడు. సత్యరాజ్ క్యారెక్టర్ కూడా ఓకే. కానీ మిగతా పాత్రల్ని అంత బాగా తీర్చిదిద్దలేదు. కామెడీని ఎమోషన్లను బ్యాలెన్స్ చేయడంలో మారుతి విఫలమయ్యాడు.

చివరగా: ప్రతి రోజూ పండగే.. నవ్వులు ఓకే.. ఎమోషన్ వీకే

రేటింగ్-2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in TheatreLATEST NEWS