పిట్టగోడ

Sat Dec 24 2016 GMT+0530 (India Standard Time)

పిట్టగోడ

చిత్రం : ‘పిట్టగోడ’

నటీనటులు: విశ్వదేవ్ రాచకొండ - పునర్ణవి - జబర్దస్త్ రాజు - ఉయ్యాల జంపాల రాజు - శివ ఆర్.ఎస్ - శ్రీకాంత్ ఆర్.ఎన్ తదితరులు
సంగీతం: ప్రాణం కమలాకర్
ఛాయాగ్రహణం: ఉదయి
స్క్రీన్ ప్లే: రామ్మోహన్
నిర్మాత: రామ్మోహన్
కథ - మాటలు - దర్శకత్వం: అనుదీప్

అష్టాచెమ్మా.. గోల్కొండ హైస్కూల్.. ఉయ్యాల జంపాల లాంటి వైవిధ్యమైన సినిమాలతో నిర్మాతగా తన అభిరుచిని చాటుకున్నాడు రామ్మోహన్. కొత్త టాలెంటుని ప్రోత్సహించడానికి ముందుండే రామ్మోహన్.. ఈసారి కూడా అదే బాటలో ‘పిట్టగోడ’ అనే సినిమాను నిర్మించాడు. అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రోమోలతో బాగానే ఆసక్తి రేకెత్తించింది. మరి సినిమా ఆ ఆసక్తిని నిలబెట్టిందో లేదో చూద్దాం పదండి.

కథ:

టిప్పు (విశ్వదేవ్ రాచకొండ) ఇంటర్లో ఆరు సబ్జెక్టులు పెండింగ్ పెట్టుకుని.. తన స్నేహితులతో కలిసి పనీ పాటా లేకుండా జీవితాన్ని గడిపేస్తుంటాడు. ఎప్పుడూ పిట్టగోడ మీద కూర్చుని కబుర్లు చెబుతూ కాలం గడిపేసే ఈ బ్యాచ్ అంటే వాళ్ల ఇంట్లో వాళ్లతో పాటు అందరికీ చులకనే. ఇలాంటి తరుణంలో వీళ్లుండే కాలనీకి దివ్య (పునర్ణవి) తన ఫ్యామిలీతో కలిసి వస్తుంది. ఆమెను చూడగానే ప్రేమలో పడిపోతాడు టిప్పు. దివ్య తండ్రి.. టిప్పు తండ్రికి పై అధికారి కావడంతో వాళ్లింట్లో పనులన్నీ టిప్పు దగ్గరుండి చూసుకుంటుంటాడు. ఈ క్రమంలో ఆమెకు టిప్పు ప్రపోజ్ చేయబోతే ఛీకొడుతుంది. తర్వాత అతడి మంచి తనం తెలుసుకుని ఫ్రెండుగా అంగీకరిస్తుంది. తర్వాత దవ్య కోసం చేసిన ఓ పని వల్ల టిప్పుతో పాటు అతడి స్నేహితులంతా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంతకీ టిప్పు చేసిన ఆ పనేంటి.. దాని పర్యవసనాలేంటి.. చివరికి టిప్పుకు దివ్య దగ్గరైందా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

రామ్మోహన్ నిర్మాణంలో ఇంతకుముందు వచ్చిన సినిమాలన్నీ చాలా సింపుల్ గా ఉండే కథాంశాలతో తెరకెక్కినవే. రియలిస్టిగ్గా.. మన చుట్టుపక్కల ఉండే మనుషుల జీవితాల్ని స్పృశిస్తూ.. సున్నితమైన అంశాలతో తెరకెక్కిన ఆ సినిమాలు మన ప్రేక్షకులకు ఈజీగా కనెక్టయ్యాయి. ఐతే ఎంత సింపుల్ స్టోరీలు ఎంచుకున్నా వాటిలో ఏదో ఒక బలమైన పాయింట్ ఉండేది. దాని వల్ల ఎమోషన్ మిస్సయ్యేది కాదు. కానీ రామ్మోహన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘తను నేను’లో అలాంటి పాయింట్ లేక తేలిపోయింది.

ఇప్పుడు ‘పిట్టగోడ’ దాంతో పోలిస్తే మెరుగ్గా అనిపిస్తుంది కానీ.. ఇందులో కూడా బలమైన పాయింట్ ఏమీ లేకపోయింది. సిచువేషనల్ కామెడీతో.. రియలిస్టిక్ సన్నివేశాలతో పండించిన వినోదం అక్కడక్కడా మెప్పిస్తుంది.. ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతుంది కానీ.. రెండు గంటల సినిమాగా రూపుదిద్దుకునేంత బలమైన కంటెంట్ ఇందులో లేదు. ముఖ్యంగా ఎమోషనల్ హైస్ లేకపోవడం.. లవ్ స్టోరీలో అనుకున్నంత ఫీల్ కొరవడటం వల్ల కూడా ‘పిట్టగోడ’ మామూలు సినిమాలా కనిపిస్తుంది. కథను మలుపు తిప్పే అంశాలేవీ కూడా బలంగా.. పెద్ద స్థాయిలో లేకపోవడం వల్ల సీరియస్ గా ప్రేక్షకులు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేకపోయింది.

‘పిట్టగోడ’ను మొదలుపెట్టిన తీరు చూస్తే ఇందులో ఏదో ప్రత్యేకత ఉందనే అనిపిస్తుంది. హీరో స్నేహితుల పరిచయాలు భలే ఆసక్తికరంగా అనిపిస్తాయి. వీళ్ల పిట్టగోడ కబుర్లు కూడా బాగానే అనిపిస్తాయి. హీరోయిన్ తో హీరో పరిచయ సన్నివేశాలు కూడా పర్వాలేదనిపిస్తాయి. ఐతే ఈ పరిచయాలయ్యాక కథ మలుపు తిరిగాల్సిన చోటే వీక్ అయిపోయింది. క్రికెట్ టోర్నీకి సంబంధించిన ఎపిసోడ్ మీద అరగంటకు పైగా కథనాన్ని సాగదీయడంతో ఆసక్తి సన్నగిల్లిపోతుంది. ద్వితీయార్ధంలో హీరోకు హీరోయిన్ దగ్గరయ్యే సన్నివేశాలు దానికి ముందు వ్యవహారాలతో పోలిస్తే కొంచెం పర్వాలేదు కానీ.. ఆ ట్రాక్ కూడా మరీ ఆసక్తికరంగా ఏమీ ఉండదు. హీరోయిన్ గతానికి సంబంధించి ఇచ్చిన బిల్డప్ కు తగ్గట్లు.. ఫ్లాష్ బ్యాక్ ఉండదు. ఇక క్లైమాక్సులో సినిమాకు కొంచెం సినిమాటిక్ ముగింపునిచ్చారు.

పంచ్ డైలాగులు లేకుండా.. సిచువేషనల్ కామెడీతో పండించిన వినోదం ‘పిట్టగోడ’కు ప్లస్ పాయింట్. హీరో అతడి స్నేహితుల మధ్య వచ్చే సన్నివేశాల్లో కొన్ని చోట్ల బాగానే నవ్వులు పండాయి. సహజమైన తెలంగాణ యాసతో కొన్ని పాత్రలు ఆకట్టుకుంటాయి. కానీ పాత్రధారులందరితోనూ ఒకే యాసను మాట్లాడించడంలో శ్రద్ధ పెట్టాల్సింది. ప్రధాన పాత్రధారుల సహజ నటన ఆకట్టుకుంటుంది. సాంకేతిక హంగులు కూడా బాగానే కుదిరాయి కానీ.. కథ మరీ సింపుల్ గా ఉండటం.. కథను ముందుకు నడిపించే బలమైన పాయింట్ ఏదీ కూడా సినిమాలో లేకపోవడం మైనస్. ఓవరాల్ గా ‘పిట్టగోడ’ అక్కడక్కడా కొంచెం ఆహ్లాదం పంచినా.. ప్రత్యేకమైన ముద్ర అయితే వేయదు.

నటీనటులు:

విశ్వదేవ్ రాచకొండ.. పునర్ణవి హీరో హీరోయిన్లలా అనిపించరు. వాళ్లలో ఆ ఫీచర్లూ లేవు. అలాంటి బిల్డప్పులూ ఇవ్వలేదు. కథలో వాళ్లూ మామూలు పాత్రధారుల్లా కనిపిస్తారు. ఇద్దరూ సహజ నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పునర్ణవి హావభావాలు మెప్పిస్తాయి. కొత్త కుర్రాడు విశ్వదేవ్ రాచకొండ బాడీ లాంగ్వేజ్.. నటన అన్నీ కూడా క్యాజువల్ గా అనిపిస్తాయి. హీరో స్నేహితులుగా ముగ్గురూ బాగా చేశారు. నవ్వించే బాధ్యతను పంచుకున్నారు. విలన్ పాత్రధారి ఓకే. ఆ పాత్రకు బిల్డప్ మరీ ఎక్కువైంది. మిగతా నటీనటుల్లో చాలామంది కొత్తవాళ్లే. పర్వాలేదనిపించారు.

సాంకేతికవర్గం:

ప్రాణం కమలాకర్ పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఏమిటో ఇలా పాట వెంటాడుతుంది. పాటలు చాలా వరకు సందర్భానుసారంగా ఉంటాయి. నేపథ్య సంగీతం మాత్రం సినిమాకు తగ్గట్లుగా లేదు. కొన్ని చోట్ల ఫీల్ గుడ్ అనిపించినా.. కొన్నిచోట్ల లౌడ్ నెస్ ఎక్కువైపోయింది. ముఖ్యంగా విలన్ పాత్రకు ఇచ్చిన ఆర్ఆర్ అతిగా అనిపిస్తుంది. ఉదయి ఛాయాగ్రహణం బాగుంది. సినిమాకు ఆకర్షణగా నిలిచింది. మాటలు సహజంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు ఓకే. సహజమైన లొకేషన్లలో తక్కువ ఖర్చులో సినిమాను పూర్తి చేసిన సంగతి కనిపిస్తుంది. ఇక కొత్త దర్శకుడు అనుదీప్ నరేషన్ ఆకట్టుకుంది కానీ.. అతను ఎంచుకున్న కథలోనే బలం లేదు. రామ్మోహన్ స్క్రీన్ ప్లే కూడా ఏమంత ఆసక్తికరంగా లేదు.

చివరగా: పిట్టగోడ.. మామూలు ముచ్చట్లే!

రేటింగ్ - 2.5/5

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS