రివ్యూ : పిట్టకథలు

Sat Feb 20 2021 GMT+0530 (IST)

రివ్యూ : పిట్టకథలు

రివ్యూ : ‘పిట్టకథలు’

పిట్టకథలు.. కొన్ని రోజులుగా తెలుగు ప్రేక్షకుల నోళ్లలో నానుతున్న ఆంథాలజీ ఫిల్మ్. ప్రపంచ నంబర్ వన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ తెలుగులో తీసిన తొలి వెబ్ ఫిల్మ్ ఇది. ఇండియాలో కొన్నేళ్ల నుంచి వివిధ భాషల్లో ఒరిజినల్స్ తీసిన ఈ సంస్థ.. తెలుగులో అడుగు పెట్టడానికి చాలా సమయమే పట్టేసింది. హిందీలో సూపర్ హిట్టయిన ‘లస్ట్ స్టోరీస్’ తరహాలోనే ఈ ‘పిట్టకథలు’ను రూపొందించింది నెట్ ఫ్లిక్స్. చాన్నాళ్లు ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ వెబ్ మూవీ ఎట్టకేలకు మన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాలుగు ఉపకథలతో తెరకెక్కిన ఈ ఆంథాలజీ ఫిలింకి కావాల్సినంత హైప్ వచ్చింది. ఆ హైప్ కు తగ్గట్లు ‘పిట్టకథలు’ ఉందో లేదో.. ఈ నాలుగు ఉపకథల విశేషాలేంటో చూద్దాం పదండి.

1. రాములా: ‘పెళ్ళిచూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ రూపొందించిన ఎపిసోడ్ ఇది. మంచు లక్ష్మి రాజకీయ నాయకురాలిగా నటిస్తే.. ఒక పొలిటీషియన్ కొడుగ్గా అభయ్ బేతగంటి.. అతను ప్రేమించే అమ్మాయి రాములాగా కొత్తమ్మాయి సాన్వి కీలక పాత్రల్లో కనిపించారు. కథ విషయానికి వస్తే.. మాజీ ఎమ్మెల్యే కొడుకైన నవీన్ (అభయ్).. మధ్య తరగతి కుటుంబానికి చెందిన రాములా (సాన్వి)ని ప్రేమిస్తాడు. కానీ తాను ఆ అమ్మాయిని ప్రేమించానని అందరి ముందు చెప్పడానికి అతడికి భయం. అతడి పిరికితనం చూసి ఛీకొడుతుంది రాములా. దీంతో అతను బ్రేకప్ అంటాడు. విధిలేక ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడ్డ రాములాను వర్ధమాన రాజకీయ నాయకురాలైన స్వరూపక్క (మంచు లక్ష్మి) చేరదీస్తుంది. ఆమె రాజకీయంగా ఎదగడానికి మంచి అవకాశం కోసం చూస్తుంటుంది. మరి రాములా జీవితాన్ని స్వరూపక్క ఎలాంటి మలుపు తిప్పిందన్నది ఈ కథ. ‘పిట్ట కథలు’లో నాలుగు కథల్లో ‘ఫస్ట్’ వచ్చేదే ‘బెస్ట్’ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఈ కథకు ఇచ్చిన ముగింపు మాత్రమే కాదు.. ఇందులో సహజమైన ఇది మన కథ అనుకునే నేపథ్యం.. జీవం ఉన్న పాత్రలు.. ఆహ్లాదకరమైన నరేషన్.. అందమైన విజువల్స్.. వీనుల విందైన నేపథ్య సంగీతం.. ఇలా అన్నీ కూడా ఉత్తమంగా అనిపిస్తాయి ఇందులో. తెలంగాణ యాస మీదే కాక ఇక్కడి మనుషులు.. పరిస్థితుల మీద తరుణ్ భాస్కర్ కు ఉన్న పట్టు ‘రాములా’కు పెద్ద ప్లస్ అయింది. సింపుల్ అనిపిస్తూనే బ్యూటిఫుల్ గా సాగే సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ప్రతి సీన్లోనూ డైలాగ్స్ బుల్లెట్లలా పేలాయి. చాలా వరకు సరదాగా సాగిపోయే ఈ కథలో.. క్లైమాక్స్ హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది. ఈ కథకు అలాంటి ముగింపును ఊహించం. ఆ ముగింపులో కూడా మెలోడ్రామాకు ఛాన్సివ్వకుండా షార్ప్ గా ముగించి.. మిగతాదంతా ప్రేక్షకుల ఊహకు వదిలేయడం ఆకట్టుకుంటుంది. మంచు లక్ష్మిని సరిగ్గా ఉపయోగించుకుంటే ఆమె కొన్ని పాత్రలను ఎలా పండించగలదో ఈ సిరీస్ తో తెలుస్తుంది. అభయ్ బేతగంటి.. సాన్వి ఇద్దరూ కూడా చాలా బాగా చేశారు. సాంకేతికంగా కూడా ఉన్నతంగా అనిపించే ‘రాములా’ ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తుంది.

2. మీరా: హిందీ ‘లస్ట్ స్టోరీస్’కు తెలుగు వెర్షన్ అనగానే ‘పిట్టకథలు’ను చాలా బోల్డ్ గా ఊహించుకుంటాం కానీ.. నాలుగు కథల్లో ఆ ఊహలకు దగ్గరగా ఉండే ఎపిసోడ్ అంటే ‘మీరా’నే. కొన్నేళ్లుగా సినిమాల్లో బోల్డ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న అమలా పాల్.. ఈ ఎపిసోడ్ కు ప్రధాన ఆకర్షణ. మీరాగా లీడ్ రోల్ చేసింది ఆమే. తనకంటే 18 ఏళ్లు చిన్నదైన మీరా (అమల)ను పెళ్లి చేసుకున్న విశ్వ (జగపతిబాబు).. చాలా అందంగా ఉండే భార్యను చూసి నిరంతరం అభద్రతా భావానికి గురవుతూ ఆమెను శారీరకంగా మానసికంగా తీవ్ర క్షోభకు గురి చేస్తుంటాడు. ఆమెను ఒక పిల్లలు కనే యంత్రంగా మార్చేయడమే కాక.. తనతో సన్నిహితంగా మెలిగే ప్రతి వ్యక్తితోనూ సంబంధం అంటగట్టి తన పైశాచికత్వాన్ని చూపిస్తుంటాడు. ఒక దశ దాటాక ఈ అనుమానం పెనుభూతమై విశ్వ ఏం చేశాడనే కథాంశంతో ‘మీరా’ తెరకెక్కింది. ఈ ఎపిసోడ్లో పూర్తిగా అమలాదే డామినేషన్. ఆమె పాత్రకు తగ్గట్లుగా సూపర్ సెక్సీగా కనిపించి కుర్రాళ్లను కట్టి పడేస్తుంది. ఈ ఎపిసోడ్ డైరెక్టర్ నందిని రెడ్డి.. తనలోని మరో కోణాన్ని ఇక్కడ చూపించింది. వెబ్ సిరీస్ కావడం.. పైగా అమలా పాల్ లాంటి బోల్డ్ యాక్ట్రెస్ట్ దొరకడంతో పరిమితులేమీ పెట్టుకోకుండా బోల్డ్ సీన్లు తీసింది. తన భార్యతో కొంచెం సన్నిహితంగా మెలిగిన ప్రతి వ్యక్తితోనూ ఆమె శృంగారం నడుపుతున్నట్లు భర్త ఊహించుకునే సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. జగపతిబాబు పాత్ర ప్రవర్తన మరీ అతిగా అనిపించినప్పటికీ.. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ రేకెత్తించడంలో.. ప్రేక్షకులను టెన్షన్ పెట్టడంలో ‘మీరా’ విజయవంతమైంది. చివర్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులకు చిన్న సర్ప్రైజే. దర్శకురాలు నందిని మాత్రమే కాక.. రచయిత రాధికా ఆనంద్ కు కూడా మంచి మార్కులే పడతాయి.

3. ఎక్స్ లైఫ్: సాంకేతికత మనుషుల జీవితాల్ని ఎంతగా ప్రభావితం చేస్తోందో.. భవిష్యత్తులో పూర్తిగా వర్చువల్ రియాలిటీ మాయలో పడి మనిషి ప్రకృతికి.. సహజమైన చిన్న చిన్న ఆనందాలకు ఎలా దూరం కాబోతున్నాడో హెచ్చరించే కథాంశంతో తెరకెక్కిన ఎపిసోడ్ ‘ఎక్స్ లైఫ్’. త్వరలోనే ప్రభాస్ తో ‘ఆదిత్య 369’ తరహా సైన్స్ ఫిక్షన్ మూవీ తీయబోతున్న ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్.. ఆ చిత్రానికి ముందు ఇది శాంపిల్ అన్నట్లుగా ‘ఎక్స్ లైఫ్’ను తీశాడేమో అనిపిస్తుంది. జనాల నుంచి అనైతికంగా సేకరించిన డేటాను ఉపయోగించుకుని.. వాళ్లను ఓ అబద్ధపు ప్రపంచంలోనే ఉంచుతూ.. చుట్టూ ఉన్న ఆనందాలకు దూరం చేస్తూ తన వ్యాపారాన్ని విస్తరించే ఒక యంగ్ బిజినెస్ మ్యాన్.. అతణ్ని నియంత్రించి ఈ ప్రపంచాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఓ అమ్మాయి చేసే సాహసం.. ఈ నేపథ్యంలో ‘ఎక్స్ లైఫ్’ నడుస్తుంది. ఈ సిరీస్ తో మనకు భవిష్యత్ దర్శనం చేయిస్తాడు నాగ్ అశ్విన్. టెక్నాలజీ మాయలో కూరుకుపోతున్న జనాలకు ఒక హెచ్చరిక లాంటి ఈ కాన్సెప్ట్ బాగానే అనిపిస్తుంది కానీ.. దీన్ని లైటర్ వీన్ లో డీల్ చేయాలని చూడటంతో అంత సీరియస్ గా తీసుకోలేని పరిస్థితి తలెత్తుతుంది. ఈ ఎపిసోడ్ ను ఆరంభించిన తీరు గందరగోళంగా అనిపిస్తే.. మధ్యలో వచ్చే అనీష్ కురువిల్లా పాత్ర ఇంటెన్సిటీని దెబ్బ తీస్తుంది. సంచిత్ హెగ్డే కొత్త నటుడైనా బిలియనీర్ బిజినెస్ మ్యాన్ పాత్రకు బాగా సూటయ్యాడు. ఈ ఎపిసోడ్లో సర్ప్రైజ్ అంటే అతనే. శ్రుతి హాసన్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. ‘పిట్టకథలు’లో మిగతా వాటికంటే భారీ స్థాయిలో తెరకెక్కినా ఇందులో సోల్ మాత్రం మిస్సయింది. అసహజంగా అనిపించే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకోవు. ఐడియా ఓకే అనిపించినా.. చివరగా వచ్చే సందేశం బాగానే అనిపించినా.. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే కథనం ఇందులో మిస్సయింది.

4. పింకీ: ‘పిట్టకథలు’లో వీకెస్ట్ కాబట్టే ‘పింకీ’ని చివర్లో పెట్టారేమో అనిపిస్తుంది. భార్యా భర్తల సంబంధాల మీద నడిచే ఈ కథను ‘ఘాజి’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. ఒక రచయిత.. అతణ్ని ఎంతగానో ఇష్టపడే ఓ అమ్మాయి.. ఇద్దరికీ పొసగక విడిపోతారు. కానీ అయిష్టంగా వేరే అబ్బాయిని చేసుకున్న ఆ అమ్మాయి ఏ దశలోనూ అతడితో కనెక్ట్ కాలేకపోతుంది. అప్పటికే పెళ్లయి బిడ్డ ఉన్న మరో అమ్మాయిని మొదటి అబ్బాయి పెళ్లాడతాడు. ఆ అమ్మాయితోనూ అతడి జీవితం సవ్యంగా సాగదు. ఈ క్రమంలో అనుకోకుండా ఈ నలుగురూ ఒక చోట కలుస్తారు. అప్పుడు మొదటి అమ్మాయి ఓ సంచలన విషయాన్ని బయటపెడుతుంది. ఆ విషయం వల్ల ఎవరి జీవితాలు ఎలా ప్రభావితమై ఉంటాయో ప్రేక్షకుల ఊహకే వదిలేస్తాడు దర్శకుడు. ఆరంభ సన్నివేశం చూసి కొంత క్యూరియాసిటీ ఏర్పడినా.. ఆ తర్వాత గందరగోళంగా సాగే ‘పింకీ’ ప్రేక్షకులను ఏ దశలోనూ ఎంగేజ్ చేయదు. అసలు ఈ కథ ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడన్నది ఎంత ఆలోచించినా అర్థం కాదు. మొదటి జంట ఎందుకు విడిపోతుందో స్పష్టత లేదు. తర్వాత వాళ్లేం కోరుకుంటున్నారన్నదీ అర్థం కాదు. ఈ కథకు ఇచ్చిన ముగింపు మరింత గందరగోళానికి గురి చేస్తుంది. ఏ పాత్ర ఉద్దేశమేంటో.. కథ ఎటు పోతోందో అర్థం కాని గందరగోళంలో ప్రేక్షకులు ఉండగానే.. వారిని మరింత అయోమయానికి గురి చేస్తూ ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఈషా రెబ్బా.. సత్యదేవ్.. అవసరాల శ్రీనివాస్.. ఆషిమా నర్వాల్.. ఇలా ఆర్టిస్టులందరూ బాగానే చేసినా.. వారి పాత్రలు ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కావు. వెండితెరపై సైన్స్ ఫిక్షన్ సినిమాలు చేసిన సంకల్ప్ రెడ్డి.. ఫ్యామిలీ డ్రామాను డీల్ చేయడంలో తన బలహీనతను ఈ సిరీస్ తో బయటపెట్టుకున్నాడు. ‘పిట్టకథలు’లో పూర్తిగా అవాయిడ్ చేయదగ్గ ఎపిసోడ్ ‘పింకీ’ అనడంలో సందేహం లేదు.

రేటింగ్: 2.5/5

LATEST NEWS