పెద్దన్న

Thu Nov 04 2021 GMT+0530 (IST)

పెద్దన్న

చిత్రం :   ‘పెద్దన్న’

నటీనటులు: రజినీకాంత్-నయనతార-కీర్తి సురేష్-మీనా-ఖుష్బు-జగపతిబాబు-అభిమన్యు సింగ్-ప్రకాష్ రాజ్-సూరి తదితరులు
సంగీతం: డి.ఇమాన్
ఛాయాగ్రహణం: వెట్రి
నిర్మాణం సన్ పిక్చర్స్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శివ

కొన్నేళ్లుగా తన స్థాయికి తగని సినిమాలతో నిరాశ పరుస్తూ వస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్.. ఇప్పుడు ‘పెద్దన్న’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తెలుగులో ‘శౌర్యం’ లాంటి సూపర్ హిట్ తో పాటు పాటు తమిళంలో కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన భారీ చిత్రమిది. మంచి మాస్ ఎంటర్టైనర్ లాగా కనిపించిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినిచ్చిందో తెలుసుకుందాం పదండి.

కథ:

వీరన్న (రజినీకాంత్) ఒక పంచాయితీలోని పది గ్రామాలకు ప్రెసిడెంట్. అందరూ పెద్దన్న అని పిలుచుకునే వీరన్నకు చుట్టు పక్కల గ్రామాలన్నింట్లో మంచి పేరుంటుంది. ఆయనకు తన చెల్లెలు కనక మహాలక్ష్మి (కీర్తి సురేష్) అంటే ప్రాణం. తన మాట ఎప్పుడూ జవదాటని చెల్లెలికి అనేక సంబంధాలు చూసి చివరికి ఓ అబ్బాయితో పెళ్లికి నిశ్చయిస్తాడు వీరన్న. ఐతే తీరా పెళ్లి జరిగే సమయానికి మహాలక్ష్మి కనిపించదు. ఆమె తనకు నచ్చిన వ్యక్తితో వెళ్లిపోయిందని వీరన్నకు తర్వాత తెలుస్తుంది. చెల్లెలి క్షేమ సమాచారం తెలుసుకుందామని వెళ్లిన వీరన్నకు.. ఆమె కోల్ కతాలో పీకల్లోతు కష్టాల్లో ఉందని తెలుస్తుంది. ఇంతకీ ఆమెకు అంత కష్టం తెచ్చిపెట్టిందెవరు.. తన కష్టాన్ని వీరన్న ఎలా తీర్చాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

‘వీరన్న’ సినిమాలో చెల్లెలంటే పంచ ప్రాణాలైన హీరో.. ఆమెకు పెళ్లీడొచ్చిందని.. వరుణ్ని చూడాలని అనుకుంటాడు. ఆ విషయంలో ఏదో వేడుకలో అందరి ముందు చెప్పగానే ఒక పెద్ద మనిషి ఎక్కడో ఒక సిటీలో ఉద్యోగం చేసే కుర్రాడి గురించి చెప్తాడు. ఆయన చెంప చెల్లుమంటుంది. ఇంకో పెద్ద మనిషొచ్చి అమెరికా అబ్బాయి గురించి చెప్తాడు. ఆయన చెంప కూడా పగిలిపోతుంది. ఇదేం విడ్డూరమయ్యా అంటే.. మన ఊర్లో తాటి చెట్టెక్కి చూస్తే నా చెల్లెలి అత్తారిల్లు కనిపించాలి. మన ఊరి మైక్ సెట్లో పాట వినిపించేంత దూరంలో ఆ ఇల్లుండాలి అంటూ ఏదో లాజిక్ చెబుతాడు. ఈ మాత్రం దానికి కొట్టడం ఎందుకబ్బా అనుకుంటాం. ఆ తర్వాత సంబంధాల కోసమని ఒక్కో ఇంటికి వెళ్తుంటాడు హీరో. ఒక అబ్బాయి తండ్రేమో.. రేప్పొద్దున మీరు మా ఇంటికొచ్చినపుడు మావాడికిష్టమని మీ చెల్లెలు సాంబార్ చేయడానికి ఉల్లిపాయలు తరుగుతుండగా కళ్లల్లో నీళ్లు పెట్టుకుంటే మీరు మావాణ్ని ఏం చేస్తారో అంటాడు. వెంటనే అబ్బాయిని పట్టుకుని చితకబాదేస్తాడు హీరో. ఇంకో ఇంటికెళ్తే అక్కడ కూడా అబ్బాయి తండ్రి.. రేప్పొద్దున్న మీరొచ్చే సమయానికి దొంగాపోలీస్ ఆడుతూ మా అబ్బాయి మీ చెల్లెలి మీద చెయ్యేస్తే అంటూ భయపడతాడు. అంతే.. ఆ అబ్బాయిని కూడా పట్టుకుని చితకబాదేసి అక్కణ్నుంచి బయల్దేరతాడు హీరో. మున్ముందు మన ‘పెద్దన్న’ బాదుడు ఏ స్థాయిలో ఉండబోతోందో చెప్పడానికి ఇవి శాంపిల్స్ అన్నమాట. ఆ తర్వాత బాదు బాదు బాదు.. అన్నట్లు సూపర్ స్టార్ బాదుతూ పోతుంటే అటు విలన్లకే కాదు.. ప్రేక్షకులకు కూడా బ్యాండైపోతుంది.

కబాలి కాలా పేట దర్బార్ లాంటి సినిమాల్లో రజినీకాంత్ పెద్దగా ఫైట్లు చేయకపోవడం వల్లే ఆ సినిమాలు ఆడలేదేమో అని.. ఆ సినిమాలన్నింట్లో ఉండాల్సినన్ని యాక్షన్ సీక్వెన్సులన్నీ కలిపి ఇందులో దట్టించినట్లున్నాడు దర్శకుడు శివ. ఇంటర్వెల్ ముందు మొదలయ్యే ఈ బాదుడు.. ఎండ్ టైటిల్స్ పడే వరకు ఆగదు. హీరో ఫైట్ చేయాలి అంటే ఆ దిశగా ఎంతో కొంత బిల్డప్ చేయాలి కదా. ఇప్పుడు హీరో కొడితే బాగుండు అని ప్రేక్షకులకు అనిపించాలి కదా. యాక్షన్ కు ముందు ఎమోషన్ ఉండాలి కదా. అదేమీ లేదు. చేతిలో ఏదో ఒక ఆయుధం పట్టుకుని కనిపించినవాడినల్లా కొట్టడం.. లేదంటే ఏదో ఒకటి తగలెట్టేయడం.. ఇదే హీరో పని. ఒక కారణం ఉండదు.. ఒక లాజిక్ కనిపించదు.. ప్రతి పది నిమిషాలకూ ఒక యాక్షన్ సీక్వెన్స్ మాత్రం రెడీగా ఉంటుంది. ఆ ఆరుపులకు.. ఆ సౌండ్లకు.. ఆ బీభత్సానికి బుర్ర బద్దలైపోయి థియేటర్ల నుంచి హాహాకారాలు చేసుకుంటూ బయటికి రావడమే తప్ప ప్రేక్షకులు చేయగలిగిందేమీ లేదు. పైన చెప్పుకున్న యాక్షన్ కాకుండా ‘పెద్దన్న’ సినిమాలో హైలైట్ అయింది సిస్టర్ సెంటిమెంట్ మాత్రమే. ఆ సెంటిమెంటు చూస్తే 30-40 ఏళ్ల ముందు వచ్చిన సినిమాల్లో అయినా ఇంత మూస.. ముతక సన్నివేశాలుంటాయా అనిపిస్తుంది.

దర్శకుడు శివ మొదట్నుంచి తీస్తున్నవి రొటీన్ మాస్ మసాలా సినిమాలే. అతడి చిత్రాల్లో కొత్తగా ఏదో ఉంటుందని ఆశించలేం. కానీ రొటీన్ గా తీసినా.. ఎమోషన్.. సెంటిమెంట్.. యాక్షన్ లాంటి అంశాలు సరైన మీటర్లో ఉండేలా చూసుకుంటాడు. కానీ ‘పెద్దన్న’లో మాత్రం ఆ మీటర్ పూర్తిగా పక్కదారి పట్టేసింది. మాస్ ప్రేక్షకులు సైతం ఏమాత్రం కనెక్ట్ కాలేని విధంగా.. మరీ నాటకీయంగా.. కృతకంగా ఉన్న సిస్టర్ సెంటిమెంట్ సీన్లు ఆరంభంలోనే ప్రేక్షకులు సినిమాతో డిస్కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. తన అన్న కర్కోటకుడైతే ఆయనకు భయపడి చెల్లెలు పెళ్లి సమయానికి నచ్చినవాడితో లేచిపోతే ఒక అర్థం ఉంది. కానీ తన అన్న మనసు వెన్న అని తెలిసి ఆయనతో ‘నీ ఇష్టమే నా ఇష్టం’ అని పదే పదే చెప్ప చెల్లెలు.. ఇలా చేయడంలో లాజిక్ ఏంటో అర్థం కాదు. ఇక చెల్లెలి కోసం వెతుక్కుంటూ వెళ్లిన అన్నయ్య ఆమెకు కనిపించకుండా తన సమస్యలన్నీ తీర్చడంలోనూ లాజిక్ కనిపించదు.

ఇదే విడ్డూరమంటే తనను చుట్టుముట్టిన సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తీరిపోతుంటే.. విలన్ల మీద హీరో చేస్తున్న దండయాత్ర గురించి పేపర్లలో కూడా పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టి వార్తలిస్తుంటే.. చెల్లెలు మాత్రం ఏమీ తెలియనట్లు ఉండిపోవడం.. ఎవరు నాకు సాయం చేస్తోందని వాళ్లను వీళ్లనూ అడగడం ఇంకా విడ్డూరం. ఇక విలన్ల ట్రాక్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ముఖ్యంగా జగపతిబాబును అత్యంత క్రూరుడిగా చూపించబోతే అది పెద్ద కామెడీగా మారడం ఒక ట్రాజెడీ. రజినీకాంత్ ఇంతకుముందు కూడా కొన్ని పేలవమైన సినిమాలు చేశాడు. కానీ వాటిలో ఏవో కొన్ని ఆకర్షణలుండేవి. కొంత వరకు బాగుండి.. కొంత నిరాశ కలిగేది. కానీ ఇందులో బాగుంది అని చెప్పడానికి ఒక్కటంటే ఒక్క సీన్ కానీ.. ఒక్క అంశం కానీ లేకపోవడం విడ్డూరం. 20-30 ఏళ్ల ముందు ఇలాంటి సినిమాలు వస్తే.. అప్పటి ట్రెండును అనుసరించి వెళ్లిపోయారు అనుకోవచ్చు. కానీ ఇప్పటి ప్రేక్షకుల అభిరుచి ఏమాత్రం పట్టని విధంగా ఇంత మూసగా.. ముతకగా సినిమా తీయడమేంటో.. ఏం చూసి ఈ సినిమాకు రజినీ ఓకే చెప్పారో.. ఏ లక్ష్యంతో శివ ఈ సినిమా తీశాడో.. దీని మీద సన్ పిక్చర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఎలా అన్ని కోట్లు పోసిందో అర్థం కాదు. ‘బాషా’తో తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఓన్ చేసుకున్నాక రజినీ కెరీర్లో అత్యంత పేలవమైన సినిమా ఏది అనే విషయంలో ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే.. ‘పెద్దన్న’తో సమాధానం దొరికినట్లే.

నటీనటులు:

సినిమాలో కాస్తో కూస్తో ప్రేక్షకులను ఎంగేజ్ చేసేదంటే ఒక్క రజినీకాంత్ మాత్రమే. ఆయన అభిమానులు నచ్చేలా కనిపించారు. వయసు ప్రభావం బాగానే కనిపిస్తున్నా.. ఏడు పదుల ఏళ్ల వయసులో ఈ మాత్రం హుషారుగా కనిపించడం విశేషమే. తన మార్కు మేనరిజమ్స్ తో అలరించారు. ఎలివేషన్ సీన్లలోనూ ఆకట్టుకున్నారు. నయనతారకు సినిమాలో పెద్దగా స్కోప్ లేదు. కానీ కనిపించినంతసేపూ ఆకట్టుకుంది. కీర్తి సురేష్ పాత్ర.. తన అప్పీయరెన్స్ నిరాశపరుస్తాయి. ఇలాంటి ఏడుపుగొట్టు పాత్రలకు ఆమె దూరంగా ఉంటే మంచిది. మీనా.. ఖుష్బు తమ స్థాయికి తగని పాత్రల్లో కనిపించారు. జగపతిబాబు కెరీర్లోనే వరస్ట్ రోల్స్ లో ఇదొకటిగా నిలుస్తుంది. ఆయన లుక్స్ మరీ కామెడీగా ఉన్నాయి. తన పాత్రను చూసినపుడు ఈ సినిమా తీసిన వాళ్లు ఏ కాలంలో ఉన్నారు అనిపిస్తుంది. ప్రకాష్ రాజ్.. అభిమన్యు సింగ్ కూడా పెద్దగా చేసిందేమీ లేదు.

సాంకేతిక వర్గం:

శివ చివరి సినిమా ‘విశ్వాసం’కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్న డి.ఇమాన్.. ‘పెద్దన్న’లో పాటల పరంగా ఆకట్టుకోలేకపోయాడు. ఒక్క పాట కూడా ప్రేక్షకుల మనసుల్లో రిజిస్టర్ కాదు. నేపథ్య సంగీతంతో మాత్రం అతను మెప్పించాడు. ముఖ్యంగా యాక్షన్.. ఎలివేషన్ సీన్లలో ఇమాన్ ఆర్ఆర్ ఆకట్టుకుంటుంది. వెట్రి ఛాయాగ్రహణం శివ శైలికి తగ్గట్లుగా సాగింది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు.  సినిమా అంతటా భారీతనం కనిపిస్తుంది. భారీగానే ఖర్చు పెట్ారు. కానీ ఆ ఖర్చులో మేజర్ షేర్ యాక్షన్ ఘట్టాలదే. దర్శకుడు శివ అన్ని రకాలుగా తీవ్రంగా నిరాశ పరిచాడు. ఇంతకుముందు చేసిన మాస్ సినిమాలు బాగా ఆడేశాయని.. తాను ఏం తీసినా చూస్తారనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఈ సినిమా తీసినట్లు అనిపిస్తుంది. కనీస కసరత్తు లేకుండా మరీ రొటీన్ గా సినిమాను లాగించేశాడు.

చివరగా: పెద్దన్న.. బాదుడే బాదుడు

రేటింగ్-1.5/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS