పరాన్నజీవి

Sat Jul 25 2020 GMT+0530 (IST)

పరాన్నజీవి

చిత్రం: పరాన్నజీవి

నటీనటులు: షకలక శంకర్ - కత్తి మహేష్ - లక్షణ్ - లహరి - జాస్మిన్ తదితరులు

బ్యానర్: 99 థియేటర్

నిర్మాత: సిఎస్

రచన - దర్శకత్వం: డాక్టర్ నూతన్ నాయుడు

తెలుగు బిగ్ బాస్ సీసన్ 2 కంటెస్టెంట్ నూతన్ నాయుడు దర్శకుడుగా మారి రూపొందించిన మూవీనే ఈ పరాన్నజీవి. మొన్నటి వరకు ఎలాంటి ఊసు లేని నూతన్ నాయుడు ఒక్కసారిగా ఫిల్మ్ డైరెక్టర్ అనేసరికి అంత షాక్ తిన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీ మూవీ తీసాడని.. పవన్  కళ్యాణ్ పై అభిమానంతో నూతన్ నాయుడు టీమ్ ఈ పరాన్నజీవి తీసినట్లు తెలుస్తుంది. ట్రైలర్ పెద్దగా ఆకట్టుకోలేదు కానీ వర్మ పై సినిమా అనేసరికి జనాలలో కాస్త ఇంటరెస్ట్ మొదలైంది. ఈ మూవీ అందరూ చూస్తారని గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే ఆర్జీవీ అంటే అందరికి పడదు. ఆయన ఎవరిమీద పడితే వారిమీద సెటైరికల్ మూవీస్ తీస్తూనే ఉంటాడు. ఎదుటివారి మనోభావాలు లెక్కచేయడని అంటుంటారు. మరి ఈరోజు ఆర్జీవీ పై తీసిన పరాన్నజీవి మూవీ 99 థియేటర్ శ్రేయాస్ ఈటి ఓటిటిలో 100రూపాయల టికెట్ రేట్ తో విడుదలైంది. మరి ఈ పరాన్నజీవి సంగతులు ఏంటో చూద్దాం!

కథ:

ఇండస్ట్రీలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని అందమైన అమ్మాయిలను ఆర్జీవీ ఎలా ట్రాప్ చేస్తున్నాడనేది కథాంశం. ఎలాంటి సినిమా తీయాలో క్లారిటీ లేకుండా.. ఎవరి మీదైనా ఎలా అయినా సినిమా తీయడానికి ఆర్జీవీ కథ. అలాంటి మైండ్ సెట్ ఉన్న దర్శకుడికి పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా ద్వారా ఎలా బుద్ధి చెప్పారు అనేదే ప్రధానాంశం.

కథనం - విశ్లేషణ:

జనాలను పిచ్చోళ్లను చేసి వివాదాలు సృష్టించే ప్రముఖ దర్శకుడు ఫేమస్ స్టార్ల పై.. అభిమాన నాయకుల పై సినిమాలు తీస్తుంటే అలాంటి దర్శకుడికి సెటైర్ వేసేందుకే ఈ సినిమా రూపొందించారని అర్ధమవుతుంది. సగటు ప్రేక్షకులు చూడాల్సిన మూవీ కాదు. ఆర్జీవీ మీద కోపం ఉన్నవాళ్లు.. పవర్ స్టార్ మీద అభిమానం ఉన్నవాళ్లకు బాగా నచ్చుతుంది. ఈ సినిమా ఓ మరో సినిమా పై వార్ లాగా రూపొందింది తప్ప ఎక్కడ కూడా సగటు ప్రేక్షకులకు నచ్చే అంశాలు లేవు. 40 నిమిషాల నిడివి గల ఈ సినిమాలో దాదాపు చాలావరకు సన్నివేశాలు ఆర్జీవీ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ వోడ్కా తాగేవే. ఇక సినిమా ప్రారంభమే.. ఓ వార్నింగ్ లాగా.. "ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు సంఘటనలు కల్పితం అని మీరు అనుకుంటే.. అది నూటికి నూరుపాళ్లూ మీ పొరపాటే గాని.. మరోటి కాదు. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఏ దర్శకుడైనా గొర్తొస్తే - అతని తిక్క చేష్టలు కళ్ల ముందు కదిలితే అతని వెకిలి వేషాలతో దగ్గరి పోలికలు ఉంటే - ఖచ్చితంగా అది నిజమేనని ఇందు మూలముగా తెలియజేస్తున్నాము. వోడ్కా తాగడం ఆ మత్తులో నిర్ణయాలు తీసుకోవడం స్టేట్మెంట్లు ఇవ్వడం ఆరోగ్యానికి హానికరం. ఈ సినిమాలో ఏ మూగ జీవినీ హింసించలేదు ఒక్క ఆర్జీవీని తప్ప" అంటూ మార్కులు కొట్టేసారు.

ఈ సినిమాకి ప్రాణం డైలాగ్స్. డైరెక్టర్ నూతన్ నాయుడు బాగా దృష్టి పెట్టి రాసాడని చూస్తుంటే అర్ధమవుతుంది. "ఈ ప్రపంచంలో ఏ జీవి అయినా తన మీద తానే ఆధారపడి.. తన ఆహారం తానే సంపాదించుకుంటుంది. పాపం ఒక్క జీవి మాత్రం పరాయి వాళ్ల మీదే ఆధారపడి బతుకుతుంది. ఎదుటి వాడి నెత్తురే దానికి అత్తరు. పక్కవాడి కష్టమే దానికి ప్రాణ వాయువు. ఉచ్చం నీచం లేదు. మానం అభిమానం లేదు. ఆత్మ విమర్శకు అర్థం లేదు. శరీరాల మీద సంస్కారాల మీదే వ్యాపారం. శవాన్ని కూడా వదిలే ప్రసక్తి లేదు. ఆత్మలు అయితే అడిగే అవసరమే లేదు. నాలుగు డబ్బులు వస్తే చాలు నడిరోడ్డులో నగ్నంగా నిలబడతాడు. నన్ను నిన్నే కాదు ఆదమరిస్తే అయినవాళ్లను కూడా అలాగే నిలబెడతాడు. నూన్యతకు నిలువుటద్దం అహంకారానికి అసలైన అర్థం వృత్తి ముసుగులో వ్యక్తిత్వాలను దిగజార్చే ఒక దిగజారిన సాంకేతిక నిపుణుడు.. పేరు చెప్పకపోయినా ప్రతివారికీ తెలిసిన జీవి.. వెర్రితలలు వేస్తున్న ఒక చిత్ర విచిత్ర సినీ జీవి.. ఈ పరాన్నజీవి - ఆర్జీవీ’’ అనే పవర్ఫుల్ వాయిస్ ఓవర్‌తో సినిమా ప్రారంభించాడు డైరెక్టర్.

ఇక మొదట్లోనే బెడ్ రూంలో ఆర్జీవీ.. అమ్మాయి.. వోడ్కా గ్లాసుతో మొదలైంది. ‘‘నాకు ఇప్పటికీ అర్థం కాదు బంగారం.. కిక్కు ఈ వోడ్కాలో ఉందా లేక నీ బాడీలో ఉందా? ఎన్ని రౌండ్లు వేసినా సరే ఇంకో రౌండ్ వేయాలనిపిస్తుంది. ఎందుకంటావ్’’ అనే డైలాగ్‌తో ఆర్జీవీ పాత్రను పరిచయం చేసాడు. ఆర్జీవీ వ్యక్తిత్వం ఇదే అనే విధంగా చాలా డైలాగ్ ఇలాంటివే రాసారు. సినీనిర్మాత శేఖర్ కు వర్మతో ఒక మంచి సినిమా తీయాలన్నది ఆశ. వర్మతో సినిమా తీస్తే అడ్రస్ లేకుండా పోతావ్ అని స్నేహితులు చెబుతున్నా వినడు. మొత్తానికి ఆయనతో ఒక సినిమా ప్లాన్ చేస్తాడు. కానీ స్క్రిప్ట్ ఏంటో వర్మ చెప్పడు. అడిగితే నీకు అనవసరం నువ్వు ఫైనాన్స్ చూసుకో అంటాడు. మొత్తం మీద శేఖర్ ముందు మూడు ఆప్షన్లు పెడతాడు వర్మ. మొదటిది అమృత మీద సినిమా.. భర్త పోయి బాధలో ఉంటే ఆమెపై సినిమా ఏంటి సార్ అంటాడు శేఖర్. అయితే దిశ మీద తీద్దాం అంటాడు. చనిపోయిన అమ్మాయి మీద సినిమా ఏంటిసార్ అని మళ్లీ అంటాడు.

చివరగా.. పీకే మీద సినిమా అంటాడు. అబ్బో.. పీకే బయోపిక్ అదిరిపోతుంది అంటాడు శేఖర్. కానీ నెగటివ్ యాంగిల్ అని షాక్ ఇస్తాడు వర్మ. శేఖర్‌కు ఏం చేయాలో తోచదు. శేఖర్ ఏం చేసాడు.. పీకే ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి.. వర్మలో మార్పు ఎలా వచ్చింది అనేది సినిమా.

సాంకేతిక వర్గం:

సినిమా అంతా ఆర్జీవీ పైనే కాబట్టి ఆ పాత్రలో కమెడియన్ షకలక శంకర్ జీవించాడు. అదే మ్యానరిజం బాడీ లాంగ్వేజ్‌ను లాస్ట్ వరకు మెయింటైన్ చేసాడు. ఇక ఆర్జీవీ అసిస్టెంట్‌గా RX100 ఫేమ్ లక్ష్మణ్ నటించాడు. ఈ సినిమాకు ఈ పాత్ర మరో హైలైట్. ఆర్జీవీ అసిస్టెంట్ మహేష్ పాత్రలో లక్ష్మణ్ కనిపించాడు. లక్ష్మణ్ డైలాగులు నవ్వు తెప్పించేలా ఉన్నాయి. "చూశారుగా మావోడి పనితనం.. తుపాకీ పేల్చడం రాకపోయినా తూటాలు మాత్రం పక్కనుండాలి. ఏదో ఒక రోజు వీడి కల నిజమవ్వాలి. ఇండస్ట్రీకి పట్టిన దరిద్రం ఒదిలిపోద్ది" అంటూ కామెడీతో మెప్పించాడు. డైరెక్టర్ నూతన్ నాయుడు సెటైరికల్ డైలాగులు బాగా రాశాడు. సినిమా క్వాలిటీ అంతంత మాత్రంగానే ఉంది. కథలో బలం లేదు. కేవలం ఆర్జీవీని నెగటివ్ చూపించడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇందులో చూపించింది కల్పితం కాదని మేకర్స్ అంటున్నారు. సినిమా చూసాక ఆర్జీవీ పై కాస్త నెగటివ్ ఫీలింగ్ రావడం పక్కా అనేలా ఉంది.

చివరిగా: ఆర్జీవీ! మీద కోపం ఉంటె చూడండి!!

రేటింగ్: 1.5/5

LATEST NEWS