పైసా వసూల్

Fri Sep 01 2017 GMT+0530 (IST)

పైసా వసూల్

చిత్రం : ‘పైసా వసూల్’

నటీనటులు: నందమూరి బాలకృష్ణ - శ్రియ - ముస్కాన్ - కైరా దత్ - విక్రమ్ జీత్ మాలిక్ - ఆలీ - పృథ్వీ - శ్రీకాంత్ అయ్యంగార్ - పవిత్ర లోకేష్ తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం: ముకేష్
నిర్మాత: ఆనంద్ ప్రసాద్
కథ - స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: పూరి జగన్నాథ్

నందమూరి బాలకృష్ణ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందని కొన్ని నెలల కిందటి వరకు ఎవ్వరూ ఊహించలేదు. కానీ అనూహ్యంగా జత కట్టిన వీళ్లిద్దరూ చకచకా ‘పైసా వసూల్’ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చేశారు. ఆసక్తికర ప్రోమోలతో ఈ ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించిన ఈ చిత్రం ఇవాళే థియేటర్లలోకి దిగింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

తేడా సింగ్ (నందమూరి బాలకృష్ణ) ఒక రౌడీ. అతడికో ఇల్లుండదు. ఒక కుటుంబం ఉండదు. తనకు అడ్డొచ్చిన ప్రతి ఒక్కరినీ ఉతికారేసి వెళ్లిపోతుంటాడు. ఫారిన్లో ఉంటూ ఇండియాలో హత్యలు చేయిస్తూ.. శాంతిభద్రతల్ని దెబ్బ తీస్తున్న మాఫియా డాన్ బాబ్ మార్లే (విక్రమ్ జీత్ మాలిక్) పని పట్టడానికి ఈ తేడా సింగే సరైనోడని అతడికి డబ్బు ఆశ చూపించి ఆ బాధ్యతలు అప్పగిస్తారు పోలీసు అధికారులు. ఐతే తేడా సింగ్.. బాబ్ మార్లేను చంపుతానని పోలీసుల దగ్గర చెప్పి.. మరోవైపు బాబ్ మనుషులతోనే చేతులు కలుపుతాడు. ఈ క్రమంలోనే తేడా సింగ్ తన గురించి తమకు చెప్పిన మాటలన్నీ అబద్ధాలని పోలీసులకు తెలుస్తుంది. మరోవైపు తేడా సింగ్ అసలు అవతారమేంటన్నది బాబ్ మనుషులు కనిపెడతారు. ఇంతకీ ఈ తేడా సింగ్ ఎవరు.. అతడి అసలు స్వరూపమేంటి.. ఇంతకీ అతను బాబ్ మార్లే పని పట్టాడా లేదా అన్నది తెరమీదే చూడాలి.

కథనం - విశ్లేషణ:

స్టార్ హీరోతో సినిమా అనగానే ప్రతి దర్శకుడూ అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని వాళ్లకు ఎమోషనల్ హై ఇచ్చే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం మామూలే. కానీ కేవలం అభిమానుల్ని మాత్రమే దృష్టిలో ఉంచుకుని.. ఎంతసేపూ వాళ్లను అలరించడమే పనిగా పెట్టుకుంటే..? కథాకథనాలు.. లాజిక్కులు.. పాత్రల ఔచిత్యం గురించి పట్టించుకోకుండా కేవలం ఫ్యాన్ మూమెంట్ల కోసమే ప్రతి సన్నివేశాన్నీ తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే..? అలాంటి సినిమాను ‘పైసా వసూల్’ అనాలి. ఈ సినిమా ఇంటర్వెల్ దగ్గర.. క్లైమాక్సులో.. ‘‘అభిమానులకు మాత్రమే.. ఇతరులకు అనుమతి లేదు’’ అంటూ మొహమాటం లేకుండా తమ ఉద్దేశాన్ని చెప్పేశారు పూరి-బాలయ్య. ఈ సినిమా తీరు చూసినా.. ఆద్యంతం బాలయ్య అభిమానుల్ని అలరించే ప్రయత్నంలా కనిపిస్తుంది తప్ప.. అంతకుమించి ప్రత్యేకత కనిపించదు. బాలయ్యను నెవర్ బిఫోర్ అవతారంలో చూసి ఎంజాయ్ చేయడమే లక్ష్యమైతే ఆ మేరకు పైసా వసూల్ అయిపోతుంది కానీ.. అంతకుమించి ఆశిస్తే మాత్రం నిరాశే మిగులుతుంది.

టిపికల్ హీరో క్యారెక్టరైజేషన్లతో.. అదే ప్రధాన ఆకర్షణగా సినిమాలు తీసే దర్శకుడు పూరి జగన్నాథ్. ఒక ‘ఇడియట్’ అయినా.. ఒక ‘పోకిరి’ అయినా.. ఒక ‘దేశముదురు’ అయినా.. ఒక ‘టెంపర్’ అయినా.. అందులో హీరో పాత్ర చిత్రణ వైవిధ్యంగా అనిపిస్తుంది. ఈ పాత్రల్లో ఆ హీరోల్ని చాలా కొత్తగా చూపిస్తూ.. అంతకుముందు చూడని మేనరిజమ్స్.. డైలాగ్ డెలివరీ.. హావభావాలతో ఒక మేకోవర్ తీసుకురావడం.. ప్రేక్షకులకు కూడా ఒక కొత్త అనుభూతి పంచడం ద్వారా ఎంటర్టైన్ చేయడంలో పూరి తన ముద్ర చూపించాడు. ‘పైసా వసూల్’లో కూడా బాలయ్యను చూసి ఆశ్చర్యపోతాం. ఆయన లుక్.. బాడీ లాంగ్వేజ్.. డైలాగ్ డెలివరీ.. అన్నీ కూడా కొత్తగా అనిపిస్తాయి.  ఇక పూరి మార్కు యాటిట్యూడ్ కూడా చూపిస్తూ.. బాలయ్య తన వరకు ఎంత ఎంటర్టైన్ చేయాలో అంతా చేశాడు. హీరో పాత్ర వరకు కొన్ని సన్నివేశాల్లో పంచిన వినోదం స్టాండ్ ఔట్ గా నిలుస్తుంది. ఐతే పైన చెప్పుకున్న సినిమాల్లో హీరో పాత్ర పంచే వినోదానికి తోడు కథాకథనాలు కూడా బలంగా ఉండి.. ఆయా సమయాలకు అవి కొత్తగానూ అనిపించి ప్రేక్షకుల్ని సంతృప్తి పరిచాయి. కానీ ‘పైసా వసూల్’ ఈ ఆకర్షణలే లేకపోయాయి.

విలన్ పాత్రలు సృష్టించడానికి వేరే రెఫరెన్సులే లేనట్లుగా.. ప్రతిసారీ ఈ మాఫియా డాన్ల మీద పూరి ఎందుకంత మోజు చూపిస్తాడో అర్థం కాదు. ఇప్పటికే పూరి సినిమాల్లో మాఫియా డాన్ విలన్లను ఎంతమందిని చూశామో లెక్కలేదు. ఆ విలన్ పాత్రతోనే పూరి సినిమాలంటే ఒక మొనాటనీ వచ్చేస్తోంది. అతడి కథలు కూడా పరమ రొటీన్ అనిపిస్తుండటానికి విలన్ పాత్రే కారణమంటే ఆశ్చర్యం లేదు. ‘పైసా వసూల్’లోనూ అదే మాఫియా డాన్ విలన్ ఉంటాడు. అతను ఎక్కడో ఫారిన్లో ఉండి ఇండియాలో అరాచకాలకు పాల్పడుతుంటాడు. హీరో అతడి ఆట కట్టించడమే ‘పైసా వసూల్’ కథ. ఓవైపు బాలయ్యను కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తూ.. మరోవైపు ఇలాంటి ముతక కథను ఎంచుకోవడంతోనే ‘పైసా వసూల్’ డౌన్ అయిపోయింది.

‘పైసా వసూల్’ మొదలైన తీరుతోనే ఇది ఎలా సాగొచ్చు అనే విషయంలో ఒక అంచనా వచ్చేస్తుంది. కాకపోతే ప్రథమార్ధమంతా ప్రేక్షకుడు కథ గురించి పెద్దగా పట్టించుకోకుండా బాలయ్య పాత్ర మీదే దృష్టిపెట్టేలా.. ఆ పాత్ర ద్వారా వినోదం పండించే ప్రయత్నంలో పూరి సక్సెస్ అయ్యాడు. చాలా వరకు సీరియస్ క్యారెక్టర్లలోనే కనిపించే బాలయ్య.. అల్లరల్లరి చేస్తుంటే.. కొత్త కొత్త హావభావాలు ఇస్తుంటే.. పూరి మార్కు యాటిట్యూడ్ చూపిస్తుంటే.. ప్రేక్షకులకు అది కొత్తగా అనిపిస్తుంది. దీనికి తోడు డైలాగులు కూడా బాగా పేలడంతో ప్రథమార్ధం కొంచెం వేగంగానే సాగిపోతుంది. బాలయ్య అభిమానులే కాదు.. సామాన్య ప్రేక్షకులు కూడా కొంతమేర ఎంటర్టైన్ అయ్యేలా సాగుతుంది ఈ పాత్ర తీరు. బాలయ్య ఎన్టీఆర్ ను ఇమిటేట్ చేస్తూ డైలాగులు చెప్పడం.. ‘‘నాకు మాన్షన్ హౌస్ తప్ప ఇంకేమీ పట్టదు’’ లాంటి డైలాగ్ కూడా పేల్చడం ఆయన అభిమానులకు మంచి ‘కిక్కు’ ఇస్తుంది.

ఐతే హీరో పాత్రను ఎలివేట్ చేసే సన్నివేశాలు.. ఫ్యాన్ మూమెంట్లతోనే ఎంతసేపని పూరి మాత్రం కథను నడపగలడు? కాబట్టి ఒక దశ దాటాక ఇక కథ మీద దృష్టిపెట్టక తప్పలేదు. అక్కడి నుంచే ‘పైసా వసూల్’ గాడి తప్పుతుంది. ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాకు కొంత వరకు గుర్తు చేస్తూ.. చాలా సాదాసీదాగా సాగిపోయే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నిరాశ పరచడంతో ద్వితీయార్ధంలో ‘పైసా వసూల్’లో ఊపు తగ్గిపోతుంది. అప్పుడప్పుడూ బాలయ్య డ్రైవర్ సీట్లోకి వచ్చి ఆదుకునే ప్రయత్నం చేసినా.. దర్శకుడిగా పూరి మాత్రం పూర్తిగా నిరాశపరుస్తాడు. హీరో నిజ స్వరూపం తెలిసే సన్నివేశాలు ‘పోకిరి’ని గుర్తుకు తెస్తాయి కానీ.. ‘పోకిరి’ ఇచ్చిన థ్రిల్ మాత్రం ఇవ్వవు. రా ఏజెంటుకి ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో.. వాటికి ఎలాంటి సమాధానాలిచ్చి హీరో ఆ ఉద్యోగంలో చేరాడో చూపించే సన్నివేశం ఒకటి ‘పైసా వసూల్’లో ఉంటుంది. చాలా సీరియస్ గా అనిపించాల్సిన సన్నివేశాన్ని పిచ్చ కామెడీగా మార్చేసిన ఘనత పూరికే దక్కుతుంది. ఈ సన్నివేశం చూశాక క్లైమాక్స్ మీద కూడా ఆసక్తి పోతుంది. ముగింపు కూడా మామూలుగా ఉండటంతో ‘పైసా వసూల్’ మీద ఆరంభంలో కలిగిన ఇంప్రెషన్ చివరికి వచ్చేసరికి మరింత తగ్గిపోతుంది.

నటీనటులు:

‘పైసా వసూల్’కు అతి పెద్ద ఆకర్షణ బాలయ్యే. సినిమాలో బాలయ్యది వన్ మ్యాన్ షో. ముందే అన్నట్లు ఇంతకుముందెన్నడూ చూడని అవతారంలో బాలయ్య కొత్తగా కనిపిస్తాడు. అభిమానుల్ని ఉర్రూతలూగిస్తాడు. తన పాత మేనరిజమ్స్.. డైలాగ్ డెలివరీ స్టయిల్ పూర్తిగా పక్కన పెట్టేసి.. పూరి శైలికి తగ్గ పాత్రలో బాలయ్య ఒదిగిపోయిన తీరు అమోఘం. కొన్ని సన్నివేశాల్లో బాలయ్య హావభావాలు.. యాటిట్యూడ్ చూసి షాకైపోతామంటే అతిశయోక్తి కాదు. హీరోయిన్లలో ముస్కాన్ అందంగా కనిపించింది కానీ.. ఆమె పాత్రకు సినిమాలో అంత ప్రాధాన్యం లేదు. శ్రియ పాత్రకు ప్రాధాన్యం ఉంది కానీ.. ఆమె పాత్ర కొత్తగా లేదు. ఐతే శ్రియ కనిపించినంతసేపూ గ్లామర్ విందు చేసింది. కైరా దత్ మామూలే. విలన్ పాత్రలో విక్రమ్ జీత్ బాగున్నాడు కానీ.. అతడి పాత్రలోనూ విషయం లేదు. పూరి సినిమాల్లో ఎప్పుడూ కనిపించే మాఫియా డాన్ పాత్రే ఇది. కబీర్ బేడి కూడా చేసిందేమీ లేదు. ఆలీ సినిమాలో ఉన్న సంగతి థియేటర్ నుంచి బయటికొచ్చాక గుర్తే ఉండదంటే.. ఆ పాత్ర ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మంత్రి పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ పర్వాలేదు.

సాంకేతికవర్గం:

అనూప్ రూబెన్స్ సంగీతం పర్వాలేదు. పాటలు మరీ అంత వినసొంపుగా లేకపోయినప్పటికీ.. సినిమాలో బాగానే కుదిరాయి. టైటిల్ సాంగ్.. పదమరి.. మామా ఏక్ పెగ్ లా పాటలు సందర్భానుసారం రావడం.. వాటి చిత్రీకరణ కూడా బాగుండటంతో అవి ఆకట్టుకుంటాయి. ఐతే కన్ను కన్ను కలిసేను పాట మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది. అనూప్ వాయిస్ బాలయ్యకు సెట్ కాకపోగా.. ఈ పాట సందర్భం.. దాని చిత్రీకరణ ప్రేక్షకులకు అసహనం కలిగిస్తుంది. అనూప్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగానే అనిపిస్తుంది. ముకేష్ ఛాయాగ్రహణం పూరి జగన్నాథ్ టేస్టుకు తగ్గట్లుగా సాగింది. నిర్మాణ విలువలు పర్వాలేదు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరో పాత్ర వరకు తన ముద్ర చూపించాడు. బాలయ్యను చూస్తున్నంతసేపూ ఏ హీరోకైనా సరే.. ఇలా మేకోవర్ ఇవ్వడంలో పూరిని మించిన దర్శకుడు మరొకరు లేరు అనిపిస్తుంది. హీరో తలపై కొడితే.. బ్లర్ అవుతున్నట్లు చూపించి.. ఇటు మనిషిని.. అటు బ్లర్ ఇమేజ్ రెంటినీ టార్గెట్ చేసుకుని వెళ్లే సీన్లో పూరి మార్కు కనిపిస్తుంది. ఇలాంటి కొన్ని మూమెంట్స్ లో పూరి ప్రత్యేకత తెలుస్తుంది. అలాగే డైలాగుల్లోనూ తన మార్కు చూపించాడు పూరి. కానీ కథాకథనాల విషయంలో మాత్రం పూరి మరోసారి నిరాశ పరిచాడు. మాఫియా కథల మోజులోంచి బయటికి రాకపోవడంతో ‘పైసా వసూల్’ ఓవరాల్ గా సాదాసీదా సినిమాలా కనిపిస్తుంది. ఈ విషయంలో పూరి అసలు కసరత్తే చేయకపోవడం.. కొత్తగా ఆలోచించకపోవడం నిరాశ పరుస్తుంది.

చివరగా: అభిమానులకు మాత్రమే ‘పైసా వసూల్’

రేటింగ్- 2.5/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS