పాగల్

Sat Aug 14 2021 GMT+0530 (IST)

పాగల్

చిత్రం : పాగల్ మూవీ

నటీనటులు: విశ్వక్సేన్-నివేథా పేతురాజ్-సిమ్రన్ చౌదరి-మేఘ లేఖ-మురళీ శర్మ-భూమిక-రాహుల్ రామకృష్ణ-రామ్ ప్రసాద్-మహేష్ తదితరులు
సంగీతం: రధన్
నేపథ్య సంగీతం: జేమ్స్ లియోన్
ఛాయాగ్రహణం: మణికందన్
నిర్మాత: బెక్కెం వేణుగోపాల్
రచన-దర్శకత్వం: నరేష్ కుప్పిలి

ఈ నగరానికి ఏమైంది.. ఫలక్ నుమా దాస్.. హిట్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యువ కథానాయకుడు విశ్వక్సేన్ నటించిన కొత్త సినిమా ‘పాగల్’. క్రేజీ టీజర్.. ట్రైలర్లతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంచనాలను ‘పాగల్’ ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

ప్రేమ్ (విశ్వక్సేన్)కు తన తల్లంటే చాలా ఇష్టం. ఐతే అతను స్కూల్లో చదువుకునే వయసులోనే క్యాన్సర్ కారణంగా తల్లి మరణిస్తుంది. మనం ఎంత ప్రేమిస్తే.. ఎదుటి వాళ్లు మనల్ని తిరిగి అంత ప్రేమిస్తారు అని తల్లి చెప్పిన మాటను అనుసరించి.. కనిపించిన ప్రతి అమ్మాయిలోనూ ప్రేమను వెతుక్కుంటూ.. ఐలవ్యూ చెప్పడం మొదలుపెడతాడు ప్రేమ్. అతడి ప్రయత్నాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి రకరకాల కారణాలతో బెడిసికొడతాయి. అలాంటి సమయంలోనే తీర (నివేథా పేతురాజ్) అనే అమ్మాయితో ప్రేమ్ ప్రేమలో పడతాడు. తనూ అతణ్ని ప్రేమిస్తుంది. కానీ వీళ్లిద్దరూ కలిసి జీవించలేని పరిస్థితులు తలెత్తుతాయి. అవేంటి.. వాటిని అధిగమించి ప్రేమ్-తీర ఒక్కటయ్యారా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

ఓ అబ్బాయి కనిపించిన ప్రతి అమ్మాయికీ ఐలవ్యూ చెప్పేస్తుంటే.. ఒకరు నో అనగానే పక్కన కనిపించిన ఇంకో అమ్మాయికి ప్రపోజ్ చేస్తే.. ఓ అబ్బాయి తన ప్రేమను రిజెక్ట్ చేశాడని బాధ పడుతున్న అమ్మాయిని ఓదారుస్తూ నీకు నేనున్నా అని తనకూ ఐలవ్యూ చెబితే.. తనకు జాబ్ లేదని ఆ అమ్మాయి ‘నో’ అందని ఏడేళ్ల తర్వాత జాబ్ తెచ్చుకుని మళ్లీ వెళ్లి అదే అమ్మాయి ఇంటికెళ్లి ప్రపోజ్ చేస్తే.. తన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాక అందంగా లేని అమ్మాయిలైతే ఈజీగా లవ్ చేస్తారని ఓ లావుపాటి అమ్మాయికి ఐలవ్యూ చెబితే.. వినడానికి చాలా క్రేజీగా ఉంది కదా? ఈ క్రేజీ ఐడియా చుట్టూనే తిరుగుతుంది ‘పాగల్’. ఐతే హీరో ఇంత క్రేజీగా ఉండటానికి కారణమేంటి అనే ప్రశ్న ఉదయిస్తుంది ఆటోమేటిగ్గా. ‘పాగల్’ ప్రి రిలీజ్ ఈవెంట్లోనే ఈ ప్రశ్నకు జవాబిచ్చేశాడు హీరో విశ్వక్సేన్. తన తల్లి చనిపోతూ మనం ఎంత ప్రేమిస్తే అవతలి వాళ్లు తిరిగి అంత ప్రేమనిస్తారు అని చెప్పిన మాటతో హీరో ఇలా కనిపించిన ప్రతి అమ్మాయిలోనూ తాను కోల్పోయిన తల్లి ప్రేమను వెతుక్కుంటాడు.

ఐతే హీరో ఇలా తనకు కావాల్సిన ప్రేమను అమ్మాయిల్లోనే వెతుక్కోవడమేంటి.. ఇలా అమ్మాయి కనిపించగానే ఐలవ్యూ చెప్పేస్తే ఆ అమ్మాయి నుంచి అతను కోరుకున్నంత ప్రేమ ఎలా తిరిగొచ్చేస్తుంది.. ఇదేం లాజిక్ అనిపించడం సహజం. ఐతే ‘పాగల్’ లక్ష్యం కేవలం ఎంటర్టైన్మెంట్ పండించడమే అయినప్పుడు.. ఈ లాజిక్ గురించి చర్చే ఉండదు. సినిమా పేరే ‘పాగల్’ అని పెట్టుకున్నాక.. హీరో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడాన్ని అర్థం చేసుకోవచ్చు. దాని ద్వారా వినోదం పండుతుంటే సర్దుకుపోవచ్చు. కానీ ఈ పాయింట్ మీద ఎమోషనల్ గా కథ నడిపించాలనుకున్నపుడే వస్తుంది సమస్య. ‘పాగల్’ ఇక్కడే తేడా కొట్టేసింది. హీరో అల్లరి వేషాలు వేస్తున్నంతసేపూ సరదాగా అనిపించే ‘పాగల్’.. కథ ఎమోషనల్ టర్న్ తీసుకోగానే భారంగా మారుతుంది. ఇదేం లాజిక్ అనే ప్రశ్నలు రేకెత్తిస్తుంది. ఎమోషనల్ కనెక్ట్ పూర్తిగా మిస్ అయి ప్రేక్షకులకు ఎలాంటి ప్రత్యేకమైన అనుభూతి మిగల్చకుండా ఒక సాధారణ సినిమాలా ముగుస్తుంది.

హీరో పాత్రను చిత్రమైన ప్రవర్తనతో చూపించి.. ఆ తర్వాత అతడి ప్రవర్తనకు ఇదీ కారణం అని ట్విస్ట్ ఇవ్వకుండా.. హీరో కనిపించిన ప్రతి అమ్మాయి వెనుకా పడి ఐలవ్యూ చెప్పడానికి కారణమేంటో మొదట్లోనే చూపించేస్తారు ‘పాగల్’లో. పైన చెప్పుకున్నట్లే ఈ పాయింట్ లాజిక్ లెస్ గా అనిపించినా.. తాను కోరుకున్న నిజమైన ప్రేమను వెతుక్కునే క్రమంలో హీరో పడే పాట్లు సరదాగా అనిపిస్తాయి. చాలా వరకు నవ్విస్తాయి. తాను స్కూల్లో ఉండగా ఉద్యోగం లేదని తన ప్రేమను రిజెక్ట్ చేసిందని ఏడేళ్ల తర్వాత ఉద్యోగం సంపాదించి అదే అమ్మాయి ముందుకెళ్లి పువ్వుతో నిలబడ్డం.. ఆ అమ్మాయి బిడ్డకు తల్లై ఉండటం ఫన్నీగా అనిపిస్తుంది. హైదరాబాద్ లో అమ్మాయిలు సెట్ అవ్వగా.. వైజాగ్ అమ్మాయిలు ఈజీగా పడిపోతారని తెలిసి అక్కడికి వెళ్లి ప్రేమ ప్రయత్నాలు సాగించడం.. ఈ క్రమంలో ఒక్కో అమ్మాయితో ప్రేమాయణం.. ప్రతి లవ్ స్టోరీలోనూ ఒక ట్విస్ట్.. ఇలా ప్రథమార్ధంలో కాలక్షేపానికైతే ‘పాగల్’లో ఢోకాల లేదు. ముఖ్యంగా రాహుల్ రామకృష్ణ బ్యాచ్.. హీరోకు మధ్య వచ్చే కామెడీ ట్రాక్ ప్రథమార్ధానికి హైలైట్ గా నిలిచింది. ఈ లవ్ ఎపిసోడ్లలో పెద్దగా విషయం ఏమీ లేకపోయినా.. సిల్లీ రీజన్స్ ఒక్కో ప్రేమకథకు ముగింపు పడుతున్నా.. అదేమీ ఇబ్బందిగా అనిపించదు. అమ్మాయిలతో కట్ అయి ఓ పెద్ద మనిషి చుట్టూ ఐలవ్యూ అంటూ తిరగడం ఎబ్బెట్టుగా అనిపించినప్పటికీ.. అందులోనూ కొంతమేర ఎంటర్టైన్ చేయడంతో ‘జాతిరత్నాలు’ తరహాలో లాజిక్స్ అన్నీ పక్కన పెట్టి ఎంజాయ్ చేయడం మొదలుపెడతారు ప్రేక్షకులు. కానీ మధ్యలోకి వచ్చేసరికి ఒక ట్విస్టుతో ఈ కథ ఉన్నట్లుండి ఎమోషనల్ టర్న్ తీసుకోవడం మలుపు.

ద్వితీయార్ధంలో కట్ చేయగానే ఫ్లాష్ బ్యాక్.. అందులో హీరో సీరియస్ గా ఓ అమ్మాయి ప్రేమలోకి దిగడం.. ఆ అమ్మాయి కూడా అంతే సీరియస్ గా ఇతణ్ని ప్రేమించడం.. ఈ నేపథ్యంలో నడిచే కథ మాత్రం ప్రేక్షకుడి కొత్త ‘సినిమా’ చూపిస్తుంది. ఈ ప్రేమకథ మొదలయ్యాక ఎంటర్టైన్మెంట్ పూర్తిగా పక్కకు వెళ్లిపోగా.. ఎమోషన్లు పిండటానికి జరిగిన ప్రయత్నమూ ఫలించలేదు. లవ్ స్టోరీలో ఎక్కడా ఫీల్ అన్నదే లేకపోవడంతో కథ ముందుకు సాగేకొద్దీ భారంగా తయారవుతుంది. హీరోకు తెలియకుండా హీరోయిన్ ముందు నుంచే అతణ్ని ప్రేమిస్తున్నట్లు చూపించడం.. హీరో నుంచి ఆమె ఎడబాటు.. ఇదంతా కూడా ఫోర్స్డ్ వ్యవహారంలా అనిపిస్తుంది తప్ప ఎమోషనల్ కనెక్ట్ అన్నదే లేదు. మొత్తంగా ద్వితీయార్ధానికి వచ్చేసరికి ‘పాగల్’ ఎటూ కాకుండా తయారైంది. హీరోయిన్-తండ్రి మధ్య వచ్చే ట్రాక్ అయితే ప్రేక్షకులు పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. సినిమాకు ఇచ్చిన ముగింపు కూడా ఏమంత ఆకట్టుకునేలా లేదు. పాజిటివ్ నోట్ తో మొదలయ్యే ‘పాగల్’.. తొలి గంట ఎంటర్టైన్ చేసినా.. మధ్యలో మధ్యలో దారి తప్పింది. అక్కడి నుంచి ట్రాక్ ఎక్కనే లేదు.

నటీనటులు:

విశ్వక్సేన్ ప్రేమ్ పాత్రను బాగానే పండించాడు. స్టైలింగ్ దగ్గర్నుంచి ఈ పాత్ర మీద అతను పెట్టిన శ్రద్ధ తెరమీద కనిపిస్తుంది. అయాయకత్వంతో కూడిన అల్లరితో అతను కొన్ని సన్నివేశాల్లో బాగానే ఎంటర్టైన్ చేశాడు. ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగానే చేశాడు.. ఆ సన్నివేశాల్లోనే బలం లేకపోయింది. లుక్ పరంగా విశ్వక్ కొంచెం జాగ్రత్త పడాలి. ఫిజిక్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. హీరోయిన్ నివేథా పేతురాజ్ అందంతో.. అభినయంతో ఆకట్టుకుంది. ఆమెకు చిన్మయి చెప్పిన డబ్బింగ్ అంతగా కుదరలేదు. సిమ్రన్ చౌదరి.. మేఘ లేఖల గురించి పెద్దగా చెప్పుకోవడానికేమీ లేదు. వాళ్లవి మరీ నామమాత్రమైన పాత్రలు. హీరో ప్రేమించే లావుపాటిగా అమ్మాయిగా నటించిన నటి పర్వాలేదు. మురళీ శర్మ ఒక క్రేజీ క్యారెక్టర్లో కొంతసేపు ఎంటర్టైన్ చేశాడు. రాహుల్ రామకృష్ణ.. మహేష్.. రామ్ ప్రసాద్ తమ వంతుగా బాగానే నవ్వించారు. భూమిక ఓకే.

సాంకేతిక వర్గం:

రధన్ సంగీత దర్శకుడిగా ఒక్క పాటలో అయినా తన ముద్రను చూపిస్తాడు. ఇందులో రెండు మూడు పాటల్లో అతడి ప్రత్యేకత కనిపిస్తుంది. గూగుల్ గూగుల్.. ఈ సింపుల్ చిన్నోడే పాటలు ఆకట్టుకుంటాయి. మిగతా పాటలు కూడా పర్వాలేదు. లియోన్ జేమ్స్ నేపథ్య సంగీతం కూడా బాగుంది. కెమెరామన్ మణికందన్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. సినిమాకు అవసరమైన మేర నిర్మాణ విలువలున్నాయి. ఇక కొత్త దర్శకుడి నుంచి నుంచి ఆశించే భిన్నమైన కథనే నరేష్ కుప్పిలి ఎంచుకున్నాడు. ఆరంభంలోనే సినిమా పట్ల ఒక క్యూరియాసిటీని తీసుకురావడంలో అతను విజయవంతం అయ్యాడు. ప్రథమార్ధంలో కామెడీని బాగానే డీల్ చేశాడు. కానీ ఎంచుకున్న పాయింట్ ను ఎఫెక్టివ్ గా ప్రెజెంట్ చేయడంలో మాత్రం తడబడ్డాడు. ఈ కథను ఎలా ముందుకు తీసుకెళ్లాలో.. ఎలా ముగించాలో తెలియని అయోమయంలో సినిమాను ట్రాక్ తప్పించేశాడు. ముందుకు సాగే కొద్దీ సినిమా గ్రాఫ్.. అలాగే దర్శకుడి పనితనం పడిపోతూ వెళ్లాయి.
 
చివరగా: పాగల్.. మధ్యలో దారి తప్పాడు

రేటింగ్-2.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS