ఒరేయ్ బుజ్జిగా

Thu Oct 01 2020 GMT+0530 (IST)

ఒరేయ్ బుజ్జిగా

చిత్రం : ‘ఒరేయ్ బుజ్జిగా’

నటీనటులు: రాజ్ తరుణ్-మాళవిక నాయర్-హెబ్బా పటేల్-వాణి విశ్వనాథ్-నరేష్-పోసాని కృష్ణమురళి-మధునందన్-సత్య-సప్తగిరి-అనీష్ కురువిల్లా తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం: ఆండ్రూ
మాటలు: నంద్యాల రవి
నిర్మాత: కె.కె.రాధామోహన్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విజయ్ కుమార్ కొండా

ఈ ఏడాది ఉగాది కానుకగా విడుదలకు సిద్ధమై - లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డ ‘ఒరేయ్ బుజ్జి’ ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రాజ్ తరుణ్.. మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

తన ఇంట్లో - ఊరిలో బుజ్జి అనే ముద్దు పేరుతో పాపులర్ అయిన శ్రీనివాస్ (రాజ్ తరుణ్) తనకు నచ్చని పెళ్లి చూపుల నుంచి తప్పించుకునేందుకు తల్లిదండ్రులకు చెప్పకుండా సిటీకి బయల్దేరతాడు. అదే ఊరికి చెందిన కృష్ణవేణి (మాళవిక నాయర్) సైతం ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక తమ ఊరి విడిచి వెళ్లిపోతుంది. ఐతే శ్రీనివాస్-బుజ్జి ప్రేమించుకున్నారని.. వాళ్లిద్దరూ కలిసి లేచిపోయారిన ఊర్లో ప్రచారం జరగడంతో ఇద్దరూ ఇబ్బందుల్లో పడతారు. అయితే బుజ్జి.. కృష్ణవేణి తామిద్దరం ఒకే ఊరి వాళ్లమని - తామిద్దరం లేచిపోయామని ఊరి జనాలు అనుకుంటున్నారని తెలియకుండా రైల్లో కలిసి ప్రయాణం చేస్తారు. వాళ్లిద్దరికీ పరిచయం అయి స్నేహితులుగా మారతారు. కొంత కాలానికి ఇద్దరి మధ్య ప్రేమ కూడా పుడుతుంది. ఈ లోపు ఊరిలో పరిణామాలు తీవ్ర రూపం దాలుస్తాయి. బుజ్జి మీద కృష్ణవేణికి విపరీతమైన కోపం వస్తుంది. అదే సమయంలో తాను ప్రేమలో ఉన్న అమ్మాయే కృష్ణవేణి అని బుజ్జికి తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో అతనేం చేశాడు.. వీళ్లిద్దరి ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు విజయ్ కుమార్ కొండా. అతడి తొలి సినిమా కామెడీ ఆఫ్ ఎర్రర్స్ నుంచి పుట్టిన వినోదం నేపథ్యంలో సరదాగా సాగిపోతుంది. దాన్ని చక్కగా డీల్ చేసి ప్రేక్షకులకు మంచి వినోదం పంచి మార్కులు కొట్టేశాడు విజయ్. దాంతో పాటుగా ప్రేమ సన్నివేశాలు సైతం పండాయి. ఐతే రెండో సినిమాకు వచ్చేసరికి మళ్లీ ఈ ‘ఎర్రర్స్’ మీదే ఆధారపడ్డాడతను. కాకపోతే ఈసారి కామెడీ తగ్గించి ప్రేమకథకు ప్రాధాన్యం పెంచాడు. కానీ అది వర్కవుట్ కాలేదు. ఇప్పుడు విజయ్ నుంచి వచ్చిన మూడో సినిమా ‘ఒరేయ్ బుజ్జి’గాకు సైతం బేసిక్ కాన్సెప్ట్ పెద్దగా మారలేదు. తొలి సినిమాలో మాదిరి మళ్లీ అతను కామెడీ డోస్ పెంచి.. కామెడీ ఆఫ్ ఎర్రర్స్ మీదే సినిమాను వినోదాత్మకంగా నడిపించాలని చూశాడు. అలాగే ప్రేమకథనూ పండించాలని ప్రయత్నించాడు. కానీ రెండు విషయాల్లోనూ ఫెయిలై.. ‘ఒరేయ్ బుజ్జిగా’ను బోరింగ్ గా మార్చేశాడు.

‘ఒరేయ్ బుజ్జిగా’ను చూస్తున్నంతసేపూ ‘గుండెజారి గల్లంతయ్యిందే’కు నకలులా అనిపిస్తుంది. కానీ ఆ సినిమాలో కనిపించే తాజాదనం - హిలేరియస్ సిచువేషనల్ కామెడీ ఇందులో పూర్తిగా మిస్సయ్యాయి. ‘గుండెజారి..’కి ముందు - ఆ తర్వాత ఆ తరహా కన్ఫ్యూజింగ్ కామెడీస్ చాలా చూశాం. ఇప్పుడు ఆ ఫార్ములా బాగా అరిగిపోయింది. ఇలాంటి సినిమాల్లో ప్రేక్షకులు లాజిక్ గురించి పెద్దగా ఆలోచించని స్థాయిలో కామెడీ ఉండి వాళ్లను డైవర్ట్ చేస్తుండాలి. కానీ అక్కడ విజయ్ పట్టు కోల్పోవడం.. కామెడీ కోసం పెట్టిన సన్నివేశాలు విసుగు పుట్టించేలా తయారవడంతో ప్రేక్షకుల ఆలోచనలు లాజిక్ వైపు వెళ్తాయి. ఒకే ఊరిలో ఉంటూ ఒక అమ్మాయికి - అబ్బాయికి ఒకరి గురించి ఒకరికి తెలియకపోవడం - ఒక్కసారి కూడా వాళ్లిద్దరూ చూసుకోకపోవడమే ఆశ్చర్యం కలిగించే విషయం అయితే.. వీళ్లిద్దరూ కలిసి లేచిపోయారని ఊరి జనాలు అనుకుంటుంటే.. అది అబద్ధమని హీరో హీరోయిన్లిద్దరూ రుజువు చేయలేకపోవడం విడ్డూరంగా కనిపిస్తుంది. సంబంధిత సన్నివేశాల్ని ఏమాత్రం కన్విన్సింగ్ గా చూపించలేకపోయాడు విజయ్.

హీరోయిన్ని తాను తీసుకురాలేదని హీరో ఆమెకు సంబంధించిన వాళ్లకు క్లారిఫై చేయడం క్షణాల్లో పని. ఆ పని అతను చేయలేకపోయే అనివార్యతను దర్శకుడు చూపించలేకపోయాడు. మరీ సిల్లీగా సీన్లు రాసుకోవడంతో ఈ సన్నివేశాలన్నీ పేలవంగా తయారయ్యాయి. కన్ఫ్యూజింగ్ కామెడీతో నడిచే సన్నివేశాలన్నీ కూడా చాలా సినిమాల్లో చూసినట్లే ఉంటాయి. ఎక్కడా మనస్ఫూర్తిగా నవ్వుకునే సన్నివేశాలు లేకపోవడంతో సమయం గడవడం కష్టమవుతుంది. ఆరంభం ఆసక్తికరంగా అనిపించినా.. తర్వాత నెమ్మదిగా ట్రాక్ తప్పే ‘ఒరేయ్ బుజ్జిగా’ ఎక్కడా మళ్లీ ట్రాక్ ఎక్క లేదు. ద్వితీయార్ధం అయితే మరీ బోరింగ్ గా తయారైపోయింది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టే పెరిగే సన్నివేశాలు కానీ.. తర్వాత వాళ్ల మధ్య సంఘర్షణ తలెత్తి విడిపోయే సీన్లు కూడా ఎఫెక్టివ్ గా లేవు. ఎన్నో సినిమాల్లో చూసినట్లే హీరో తనను హీరోయిన్ ఎక్కడ అపార్థం చేసుకుంటుందో అని తన గురించి నిజం దాచడం.. సరిగ్గా ప్రి క్లైమాక్స్ టైంకి ఆమెకు అనుకోకుండా నిజం తెలిసి అతణ్ని అసహ్యించుకోవడం.. చివరికి హీరో మంచితనాన్ని అర్థం చేసుకుని అతడికి దగ్గరవడం.. ఇలా ఒక ఫార్మాట్లో నడిచిపోతుంది ‘ఒరేయ్ బుజ్జిగా’.

‘ఒరేయ్ బుజ్జిగా’లో కామెడీ ఎంతగా తేడా కొట్టిందనడానికి  ఆసుపత్రి నేపథ్యంలో వచ్చే ఒక సన్నివేశం ఉదాహరణ. హీరోయిన్ దృష్టిలో బుజ్జి ఒకరైతే - ఆమె తండ్రి దృష్టిలో బుజ్జి ఇంకొకరు. ఆ బుజ్జి ఆసుపత్రిలో ఉన్నాడని ఆ ఇద్దరూ చూసేందుకు వెళ్తారు. అప్పుడక్కడ వీళ్ల దృష్టిలో ‘బుజ్జి’లు ఇద్దరూ ఉంటారు. పదుల సంఖ్యలో తెలుగు సినిమాల్లో చూసిన కన్ఫ్యూజింగ్ కామెడీని ఇక్కడ వడ్డించారు. ఈ ఎపిసోడ్ మొదలైన రెండు మూడు నిమిషాలకే భరించలేని విధంగా ఉంటుంది పరిస్థితి. అలాంటిది అక్కడేదో గొప్పగా కామెడీ పండిపోతున్నట్లుగా.. దాన్ని పది నిమిషాలకు పైగా సాగదీశారు. ఇదంతా అయ్యేసరికి అప్పటిదాకా సినిమా మీద ఉన్న కాస్త ఇంప్రెషన్ కూడా పోతుంది. అంతగా విసిగిస్తుందా ఎపిసోడ్. కథాకథనాలు వినడానికి కొంచెం ఫన్నీగా అనిపిస్తే అనిపించొచ్చు కానీ.. అవి తెరమీద మాత్రం పూర్తిగా తేలిపోయాయి. ఆసక్తికరంగా అనిపించే ఇంట్రో ఎపిసోడ్.. ఒకటీ అరా కామెడీ సీన్లు.. రెండు మంచి పాటలు మినహాయిస్తే ‘ఒరేయ్ బుజ్జిగా’లో విశేషాలేమీ లేవు. ఓటీటీ రిలీజ్ కాబట్టి ఫాస్ట్ ఫార్వార్డ్ చేసుకునే అవకాశముండటం ఒక్కటే ఈ సినిమాలో ఉన్న సౌలభ్యం.

నటీనటులు:

రాజ్ తరుణ్ బాగా రొటీన్ అయిపోయాడనిపిస్తుంది సినిమా చూస్తుంటే. అతను కొత్తగా చేసిందేమీ లేదు. అతను పెర్ ఫామ్ చేయడానికి కూడా ఇందులో పెద్దగా స్కోప్ లేదు. కొన్ని చోట్ల కామెడీ పండించడానికి తన వంతుగా గట్టి ప్రయత్నమే చేశాడు కానీ.. సన్నివేశాల్లో బలం లేకపోయింది. సినిమాలు - పాత్రల ఎంపికలో మంచి అభిరుచి ఉన్నట్లు కనిపించే మాళవిక నాయర్.. ఈ సినిమాతో ఆ పేరును కొంత దెబ్బ తీసుకున్నట్లే. ఆమె చేయదగ్గ పాత్ర కాదిది. మాళవిక నుంచి ప్రధానంగా ఆశించేది నటన. అందుకు ఇందులో స్కోప్ లేదు. లుక్స్ పరంగా ఆమె మామూలుగా కనిపిస్తుంది. పాత్ర కూడా ఆ దిశగా డిమాండ్ చేసిందేమీ లేదు. హెబ్బా పాత్ర విషయంలో కుర్రాళ్లు ఏమైనా ఆశలు పెట్టుకుంటే నిరాశ తప్పదు. ఆమె పాత్రను సినిమాలో మరీ తేల్చేశారు. కనిపించిన కాసేపు కొంచెం గ్లామర్ విందు చేస్తుంది కానీ.. ఆమెది సినిమాలో వ్యర్థ పాత్రే. సప్తగిరి.. సత్య.. పోసాని.. నరేష్ లాంటి వాళ్లున్నా సరే..  కామెడీ పండలేదంటే అది రచయిత - దర్శకుడి వైఫల్యమే. చాన్నాళ్ల తర్వాత స్క్రీన్ మీద కనిపించిన వాణీ విశ్వనాథ్ ను కూడా ఉపయోగించుకోలేకపోయారు. మిగతా ఆర్టిస్టుల గురించి చెప్పడానికేమీ లేదు.

సాంకేతికవర్గం:

అనూప్ రూబెన్స్ ఒకప్పటి ఫాంలో లేకపోయినా.. రెండు మంచి మెలోడీలతో తన బాధ్యతను బాగానే నిర్వర్తించాడు. ఐతే మంచి ఫీల్ ఉన్న ఆ పాటలు ఏదైనా మంచి ప్రేమకథలో అయితే బాగుండేదనిపిస్తుంది. ఈ సినిమాలో అవి పెద్దగా సింక్ అవ్వలేదు. మిగతా పాటలు - నేపథ్య సంగీతం మామూలుగా అనిపిస్తాయి. ఛాయాగ్రాహకుడు ఆండ్రూ పనితనం మామూలే. అతను తన ప్రత్యేకతను చాటుకునే అవకాశం లేకపోయింది. నిర్మాణ విలువలు ఓకే. నంద్యాల రవి మాటలు అక్కడక్కడా బాగున్నాయి. కొన్ని కామెడీ పంచులు పేలాయి. దర్శకుడు విజయ్ కుమార్ కొండా కథను ఆరంభించిన తీరు బాగుంది కానీ.. ఆ తర్వాత ఆసక్తిని నిలబెట్టేలా కథను విస్తరించడంలో - ఆసక్తికర కథనాన్ని తీర్చిదిద్దుకోవడంలో విఫలమయ్యాడు. స్క్రీన్ ప్లేలో కానీ.. కామెడీ సన్నివేశాల్లో కానీ కొత్తదనం కనిపించదు. తనకు అలవాటైన ఫార్ములాలో వెళ్లిపోయిన అతను.. ‘గుండెజారి..’ తర్వాత తనపై పెట్టుకున్న అంచనాల్ని మరింత తగ్గించేశాడు.

చివరగా: ఒరేయ్ బుజ్జిగా.. బోర్ కొట్టించేశావురా

రేటింగ్: 2/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
LATEST NEWS