'ఓ బేబీ'

Fri Jul 05 2019 GMT+0530 (IST)

'ఓ బేబీ'

చిత్రం :‘ఓ బేబీ’

నటీనటులు: సమంత - లక్ష్మి - నాగశౌర్య - రాజేంద్ర ప్రసాద్ - రావు రమేష్ - ప్రగతి - ఊర్వశి తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
ఛాయాగ్రహణం: రిచర్డ్ ప్రసాద్
మాటలు: లక్ష్మీభూపాల్
నిర్మాత: సురేష్ బాబు
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: నందిని రెడ్డి

కథానాయికగా తిరుగులేని స్థాయిని అందుకున్న సమంత ‘యుటర్న్’తో తొలిసారి లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసింది. అది ఆశించిన ఫలితాన్నివ్వకపోయినా నిరాశ చెందకుండా ఇప్పుడు ‘ఓ బేబీ’లో లీడ్ రోల్ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి ఇది రీమేక్. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో నందినిరెడ్డి రూపొందించిన ఈ చిత్రం మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ‘ఓ బేబీ’ అంచనాల్ని ఏ మేరకు అందుకుందో చూద్దాం పదండి.

కథ:

బేబీ (లక్ష్మి) 70 ఏళ్ల వయసున్న పెద్దావిడ. చిన్నప్పట్నుంచి ఆమె ఎన్నో కష్టాలు చూసి ఉంటుంది. పెళ్లయిన ఏడాదికే భర్తను కోల్పోయినా.. ఎంతో కష్టపడి తన బిడ్డను పెంచి పెద్దవాడిని చేసి.. ఆ తర్వాత కూడా కష్టపడుతూ జీవితాన్ని నెట్టుకొస్తుంటుంది. కొడుకంటే అపారమైన ప్రేమ ఉన్న బేబీ.. కొంత చాదస్తమూ ప్రదర్శిస్తుంటుంది. దీంతో కోడలు ఆమెను అసహ్యించుకుంటుంది. తన వల్ల కోడలు అనారోగ్యం పాలైందని తెలిసి ఇల్లు వదిలి వెళ్లిపోయిన బేబీ..అనూహ్య పరిస్థితుల్లో పాతికేళ్ల పడుచులా మారిపోతుంది. తాను యుక్త వయసులో కోల్పోయిన ఆనందాల్ని అనుభవించాలని నిర్ణయించుకున్న ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. తర్వాత ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘ఓ బేబీ’ సోషియా ఫాంటసీ టచ్ తో మానవ సంబంధాల్లోని మాధుర్యాన్ని చెప్పే ఒక ప్రయత్నం. జీవితమంతా అనేక కష్టాలు అనుభవించి.. తన బిడ్డను తీర్చిదిద్ది.. కుటుంబాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చిన ఒక తల్లి.. ఆ కుటుంబానికి తనే భారంగా మారిపోయిన స్థితిలో.. తిరిగి యవ్వనాన్ని పొంది.. తాను కోల్పోయిన ఆనందాలన్నీ తిరిగి పొందాలని ప్రయత్నించే క్రమంలో జీవిత పరమార్థాన్ని ఆమె ఎలా అర్థం చేసుకుందో భావోద్వేగాలతో చెప్పాలని చూసింది దర్శకురాలు నందిని రెడ్డి. ఇది కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ అయినప్పటికీ.. ఎవ్వరికైనా కనెక్ట్ అయ్యే కథాంశమే. ఎక్కడా మనది కాని కథ అనే భావన కలగదు. మనం ఎప్పుడూ చూసే మనుషులు.. పరిస్థితులే తెరమీద దర్శనమివ్వడంతో ‘ఓ బేబీ’తో ఈజీగానే కనెక్టవుతాం.

కథాంశం చూస్తే చాలా సీరియస్ గా అనిపించినా.. ప్రధానంగా భావోద్వేగాల్ని తట్టి లేపడమే సినిమా ఉద్దేశం అయినా.. వినోదానికి ఢోకా లేకుండా చూసుకోవడం ‘ఓ బేబీ’లో ఉన్న పెద్ద ప్లస్ పాయింట్. పాతికేళ్ల పడుచులా మారిన 70 ఏళ్ల వృద్ధురాలి పాత్రకు సమంతను ఎంచుకోవడం అతి పెద్ద సానుకూలాంశం. స్వతహాగానే చాలా చిలిపిగా - సరదా మనిషిలా కనిపించే సమంత.. ఈ పాత్రను తనదైన శైలిలో పండించి మెప్పించింది. మిగతా పాత్రలకు కూడా సరైన కాస్టింగ్ ఎంచుకోవడం కలిసొచ్చింది. కథాకథనాల్లో లోపాలు కనిపించినా.. ద్వితీయార్ధంలో సెంటిమెంట్ డోస్ ఎక్కువై సాగతీతగా అనిపించినా.. కథ ఉద్దేశాన్ని చెప్పడంలో - భావోద్వేగాల్ని పండించడంలో అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోయినా.. సమంత - ఇతర ప్రధాన పాత్రధారుల పెర్ఫామెన్స్ - వినోదపు పూత ఈ లోపాల్ని కప్పిపుచ్చుతాయి. చిత్ర బృందం ప్రచారం చేసుకున్నట్లుగా కామెడీ మరీ కడుపు చెక్కలు చేసేలా లేదు అలాగే హృదయాల్ని మెలిపెట్టేసే స్థాయిలో భావోద్వేగాలు పండలేదు. కానీ ప్రేక్షకుల్ని ఓ మోస్తరుగా ఎంగేేజ్ చేసే స్థాయిలో కామెడీ ఎమోషన్స్ పండాయి.

బేబీ పాత్రను ఎస్టాబ్లిష్ చేయడం కోసం కొంత సమయం తీసుకోవడంతో ‘ఓ బేబీ’ చాలా నెమ్మదిగా ఆరంభమవుతుంది. కథ పరంగా ముఖ్యమైనవేే అయినప్పటికీ ఆరంభ సన్నివేశాలు కొంత అసహనాన్ని కలిగిస్తాయి. సమంత ఇంకెప్పుడు వేంచేస్తుందా అని ఎదురు చూసే పరిస్థితి తలెత్తతుంది. ఐతే తన ఆగమనంతోనే సమంత ప్రేక్షకుల్లోని అసహనాన్నంతా పోగొట్టేసి ఒక్కసారిగా ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. 70 ఏళ్ల వృద్ధురాలు ఉన్నట్లుండి పడుచుపిల్లగా మారిపోయినా.. ఆమె ఆహార్యం - భాష - యాస - మనస్తత్వం అన్నీ తన అసలు వయసుకు తగ్గట్లే ఉంటే ఎలా ఉంటుందో సమంత అద్భుతంగా అభినయించి చూపించింది. ఈ సన్నివేశాలు చాలా హిలేరియస్‌గా ఉండి ప్రేక్షకులకు చక్కటి వినోదం పంచుతాయి. ముందే అన్నట్లు స్వతహాగా సమంతలో ఉండే చిలిపితనం బేబీ పాత్రకు బాగా కలిసొచ్చింది. మరే నటి ఈ పాత్రలో చేసినా ఇంత ఎంటర్ టైనింగ్ గా ఉండేది కాదేమో అనిపించేలా సమంత తన పెర్ఫామెన్స్ తో సినిమాను ముందుకు తీసుకెళ్లింది. సమంత రంగ ప్రవేశం చేసిన దగ్గర్నుంచి ఇంటర్వెల్ వరకు సన్నివేశాలు సరదాగా సాగిపోతాయి.

ఐతే కథానాయిక వయసు తగ్గాక మొదట్లో ఆమెకు ఎదురయ్యే చిత్రమైన అనుభవాల నేపథ్యంలో ప్రథమార్ధం సాగిపోతే.. ఆమె ఇలా తయారవడం వెనుక ఉద్దేశమేంటి.. తన గమ్యమేంటి అనే అంశాల మీద ద్వితీయార్ధంలో ఫోకస్ పెట్టారు. ఇక్కడ కొంచెం స్పష్టత లోపించింది. ఒక దశ దాటాక బేబీని యవ్వనస్థురాలిగా మార్చడంలో ఉద్దేశమేంటో అర్థం కాదు. ఆమెలో రియలైజేషన్ రావడానికి తగ్గ బలమైన సన్నివేశాలే పడలేదు. వృద్ధురాలిగానే తన జీవితం బాగుందని ఆమె ఫీలయ్యేలా చేసే ఒక్క ఎఫెక్టివ్ సీన్ కూడా ద్వితీయార్ధంలో లేకపోయింది. అదే సమయంలో బేబీని అసహ్యించుకున్న వాళ్లకు ఆమె విలువ తెలిసొచ్చేలా చేసే సన్నివేశాలు కూడా లేకపోవడం ఆశ్చర్యకరం. ఈ కోణంలో సరైన పేఆఫ్ ఇవ్వడంలో దర్శకురాలు విఫలమైంది.

సబ్ ప్లాట్‌గా పెట్టుకున్న మ్యూజిక్ ఎఎపిసోడ్ ఎఫెక్టివ్ గా  లేకపోవడం వల్ల కూడా ‘ఓ బేబీ’ ద్వితీయార్ధంలో పక్కదారి పట్టింది. మ్యూజిక్ చుట్టూ కథను నడిపించినపుడు మంచి పాటలు - బ్యాగ్రౌండ్ స్కోర్ ఆశిస్తాం. సంగీత పోటీల్లో పాడి గెలిచే క్రమంలో పాడే పాటలు చాలా సాధారణంగా అనిపించడంతో ఆ ఎపిసోడే చాలా వరకు నీరుగారిపోయింది. దీన్ని పక్కన పెడితే సమంత-రాజేంద్ర ప్రసాద్ - సమంత-రావు రమేష్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాల్లో భావోద్వేగాలు పండటం వల్ల అవి బాగానే ఎంగేజ్ చేస్తాయి. ముఖ్యంగా పతాక సన్నివేశంలో రావు రమేష్ తన తల్లి కష్టం గురించి చెప్పే డైలాగులు కన్నీళ్లు పెట్టించేస్తాయి. అమ్మ మనసు ఎలాంటిదో చెప్పే సన్నివేశాలు సినిమాకు బలంగా నిలిచాయి. వాటితో ప్రేక్షకులు బాగా కనెక్టయ్యే అవకాశముంది. మ్యూజిక్ ఎపిసోడ్ ఎఫెక్టివ్ గా ఉండి.. పాత్రల్లో పరివర్తనకు దారి తీసే సన్నివేశాల్ని బలంగా తీర్చిదిద్దుకుని ఉంటే ‘ఓ బేబీ’ చాలా ప్రత్యేకమైన సినిమానే అయ్యుండేది. అయినప్పటికీ.. ప్రేక్షకులకు పైసా వసూల్ వినోదాన్నందించే అంశాలు ‘ఓ బేబీ’లో ఉన్నాయి. కుటుంబ ప్రేక్షకులకు ఇది మంచి కాలక్షేపమే.

నటీనటులు:

సమంతకు తన కెరీర్లోనే చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ పాత్రల్లో ఇదొకడనంలో సందేహం లేదు. ఇలాంటి పాత్రలు సినిమాలు అందరికీ దొరకవు. దొరికినా అందరూ సమంతలా రాణించలేరు. పాతికేళ్ల వయసులోకి మారిన 70 ఏళ్ల వృద్ధురాలిగా హావభావాలు పలికించడం - బాడీ లాంగ్వేజ్ చూపించడంలో సమంత ఎంత కాన్షియస్ గా ఉందనే విషయం చాలా సన్నివేశాల్లో కనిపిస్తుంది. కామెడీ విషయంలో ఎలా మెప్పించిందో.. భావోద్వేగాలు పండించడంలోనూ అంతే ఆకట్టుకుంది సమంత. బేబీ పాత్రలో ఆమె అభినయానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సీనియర్ నటి లక్ష్మి ప్రతి సన్నివేశంలోనూ తన అనుభవాన్ని చూపించారు. రాజేంద్ర ప్రసాద్ నటన కొన్ని సన్నివేశాల్లో కొంత అతిగా అనిపిస్తుంది కానీ.. ఓవరాల్ గా ఆయన కూడా ఆకట్టుకున్నారు. రావు రమేష్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. పతాక సన్నివేశంలో ఆయన నటన చాలా హృద్యంగా సాగింది. నాగశౌర్య చాలా కూల్ గా కనిపించాడు. అతడి లుక్ - యాక్టింగ్ సింపుల్ గా ఉండి ఆకట్టుకుంటాయి. ఒకప్పటి బాలనటుడు.. ఇందులో యువకుడిగా కనిపించిన తేజ ఏ తడబాటూ లేకుండా మంచి ఈజ్‌తో నటించాడు. ఊర్వశి - ప్రగతి పాత్రలకు తగ్గట్లు నటించారు.

సాంకేతికవర్గం:

కథకు తగ్గట్లు మంచి ఫీల్ తో సంగీతం అందించే మిక్కీ జే మేయర్ ‘ఓ బేబీ’లో నిరాశ పరిచాడు. పాటలు అతడి స్థాయికి తగ్గట్లు లేవు. మ్యూజిక్ చుట్టూ తిరిగే కథలో అతడిచ్చిన పాటలు తీవ్ర నిరాశకు గురి చేస్తాయి. ‘చాంగుభళా’ను మినహాయిస్తే పాటలు సాధారణంగా అనిపిస్తాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా మామూలే. రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రహణం బాగుంది. సినిమా థీమ్ కు తగ్గ విజువల్స్ తో అతను ఆకట్టుకున్నాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. లక్ష్మీభూపాల్ డైలాగులు సినిమాకు ప్లస్. నా వయసు 45 మాత్రమే అంటే.. ‘మోకాలి వరకు చెబితే సరిపోతుందా.. మిగతాది’ అంటుంది హీరోయిన్ పాత్ర. ఇలాంటి చమక్కులు కొన్ని భలే మెరిశాయి. సెంటిమెంట్ సీన్లలో కూడా డైలాగులు బాగున్నాయి. ఇక దర్శకురాలు నందిని రెడ్డి ఎప్పట్లాగే కామెడీని డీల్ చేయడంలో తన పట్టు చూపించింది. చాలా వరకు సినిమాను ఆహ్లాదకరంగా నడిపించింది. ఎమోషన్లు పండించడంలో మాత్రం తడబడింది. ఓవరాల్‌గా ఆమె పనితీరు ఓకే.

చివరగా: ఓ బేబీ.. ఓకే బేబీ

రేటింగ్-2.75/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre