'నిశ్శబ్దం'

Fri Oct 02 2020 GMT+0530 (IST)

'నిశ్శబ్దం'

చిత్రం : ‘నిశ్శబ్దం’

నటీనటులు: అనుష్క-మాధవన్-మైకేల్ మ్యాడ్సన్-అంజలి-సుబ్బరాజు-షాలిని పాండే-అవసరాల శ్రీనివాస్ తదితరులు
సంగీతం: గోపీసుందర్
నేపథ్య సంగీతం: గిరీష్ గోపాలకృష్ణన్
ఛాయాగ్రహణం: శనీల్ డియో
స్క్రీన్ ప్లే-మాటలు: కోన వెంకట్
నిర్మాత: విశ్వప్రసాద్
కథ-దర్శకత్వం: హేమంత్ మధుకర్

థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి మరో పేరున్న సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైపోయింది. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఆ చిత్రమే.. నిశ్శబ్దం. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీ అమేజాన్ ప్రైమ్లో అందుబాటులోకి వచ్చింది. ఆసక్తికర కాంబినేషన్లో తెరకెక్కి వైవిధ్యమైన ప్రోమోలతో ఆకర్షించిన ఈ చిత్రం.. అంచనాల్ని ఏమేర అందుకుందో చూద్దాం పదండి.
 
కథ:

సాక్షి (అనుష్క) తన తండ్రి స్థాపించిన అనాథాశ్రమంలో పెరిగిన ఓ బదిరురాలు. ఐతే మాటలు రాకున్నా వినిపించకున్నా తన చిత్ర కళతో గొప్ప పేరు సంపాదిస్తుంది. ప్రఖ్యాత వయొలెన్ కళాకారుడైన ఆంథోనీ (మాధవన్) ఆమె కళకు ముగ్ధుడవుతాడు. వీళ్ల మధ్య పరిచయం ప్రేమగానూ మారుతుంది. సాక్షితో నిశ్చితార్థం కూడా చేసుకుని పెళ్లికి కూడా సిద్ధమైన ఆంథోనీ.. తను వేయాలనుకున్న ఒక ఆర్టుకు సంబంధించిన మెటీరియల్ కోసమని ఎన్నో ఏళ్ల కిందట ఓ జంట అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఓ భవంతికి తీసుకెళ్తాడు. కానీ ఆ భవంతిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని ఆంథోనీ హత్యకు గురవుతాడు. సాక్షి తీవ్ర గాయాలతో బయటికొస్తుంది. మరి ఆంథోనీని చంపిందెవరు అన్న కోణంలో విచారణ మొదలవుతుంది. ఈ మిస్టరీ ఎలా వీడిందన్నదే మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘నిశ్శబ్దం’ దర్శకుడు హేమంత్ మధుకర్ ఇంతకుముందు ‘వస్తాడు నా రాజు’ అనే ఒక సాధారణ సినిమా తీశాడు. అది డిజాస్టర్ అయింది. అతడితో కలిసి ‘నిశ్శబ్దం’ కథలో పాలుపంచుకున్న కోన వెంకట్.. గోపీ మోహన్ గత కొన్నేళ్ల ట్రాక్ రికార్డు ఏంటో తెలిసిందే. మామూలుగా ఈ కాంబినేషన్ చూస్తే వీరి నుంచి అంతర్జాతీయ స్థాయి థ్రిల్లర్ ను ఆశించలేం. ఐతే ఏదో ఒక ప్రత్యేకత లేకుండా సినిమా చేయని అనుష్క.. ఏ భాషలో అయినా ఆచితూచి క్యారెక్టర్లు ఎంచుకునే మాధవన్.. వీళ్లిద్దరూ చాలదని హాలీవుడ్లో కిల్ బిల్.. రిజర్వాయర్ డాగ్స్ లాంటి ప్రఖ్యాత చిత్రాల్లో నటించిన మైకేల్ మ్యాడ్సన్ ‘నిశ్శబ్దం’ సినిమా చేయడానికి ముందుకొచ్చారంటే పైన చెప్పుకున్న టీం ఏదో అద్భుతమైన స్క్రిప్టును సిద్ధం చేసే ఉంటుందని.. అది చూసి అందరూ ఫిదా అయిపోయి ఉంటారని అనుకుంటాం. కానీ సినిమా మొదలైన కొన్ని నిమిషాల నుంచి అద్భుతాల కోసం నిరీక్షించి నిరీక్షించి చివరికి నిట్టూర్చడం తప్ప ఇంకేమీ చేయలేం.

అప్పుడెప్పుడో వచ్చిన ‘ఎర్రగులాబీలు’.. దాన్నే కొంచెం మోడర్నైజ్ చేసిన తీసిన ‘మన్మథ’ సినిమాల్లో హీరో పాత్రను తీసుకుని దాన్ని విలన్ గా మార్చి.. అదే కథను రివర్సులో చెబుతూ రివెంజ్ పార్ట్ కథానాయిక కోణంలోకి మారిస్తే అదే.. నిశ్శబ్దం. కథ లోతుల్లోకి వెళ్తే అంతా విప్పేసినట్లు అవుతుంది కాబట్టి ఇంతటితో ఆపేద్దాం. అమెరికా నేపథ్యంలో సినిమా తీసి.. హాలీవుడ్ స్థాయి థ్రిల్లర్ గా చిత్ర బృందం ప్రచారం చేసుకున్న ‘నిశ్శబ్దం’లో కొన్ని సిల్లీ సంగతుల గురించి చెప్పుకుందాం. ఒక అంతుబట్టని మర్డర్ కేసును ఇన్వెస్టిగేట్ చేపే క్రమంలో ఆ హత్య జరిగిన చోటుకు పెద్ద స్థాయిలో బలగాన్ని తీసుకుని వెళ్తారు పోలీసులు. ఆ పోలీసుల టీంను నడిపించే వ్యక్తే ఒక క్రిమినల్. అతడి టీంలోని ఒక వ్యక్తికి కీలక ఆధారం దొరికి దాన్ని తీసుకొచ్చి ఆయనకిస్తుంటే.. మేడ మీద ఉన్న వ్యక్తి కింద పదుల సంఖ్యలో పోలీసులు మీడియా వాళ్లు ఉండగా.. కేవలం ఒక అంతస్థు పైన అందరికీ కనిపించే అవకాశమున్న గ్లాస్ డోర్ దగ్గర నిలబడి అతణ్ని టైతో ఉరేసి చంపేస్తాడు. పైనుంచి కింద కార్ మీదికి తోసేయగానే అతను ప్రాణాలు వదులుతాడు.

ఆయన ఉన్నతాధికారి కావచ్చు. కానీ సంచలనం సృష్టించిన క్రైమ్ జరిగిన సీన్లో.. అంతమంది పోలీసులు మీడియా వాళ్లుండగా అలా చంపేయడం ఏంటో అర్థం కాదు. ఆయన చంపితే చంపాడు కానీ.. అక్కడున్న పదుల మంది పోలీసులు చుట్టూ చేరి దద్దమ్మల్లాగా ఏమైంది ఏమైంది అని చూస్తుంటారు తప్ప.. ఏం జరిగిందని కానీ.. అతణ్ని చంపిందెవరని కానీ తెలుసుకునే ప్రయత్నమే చేయరు. ఈ సినిమా మన దగ్గర ఏదైనా పల్లెటూరి నేపథ్యంలో సాగితే.. మన లోకల్ పోలీసులకు అంతగా పరిజ్ఞానం లేదని సరిపెట్టుకుందుమేమో. కానీ అక్కడున్నది అమెరికన్ పోలీసులాయె. పైన చంపేసిన వాడు.. వీళ్లందరూ శవం చుట్టూ మూగి ఉండగా ఇంకో పక్క నుంచి తాపీగా వచ్చి తన టీంలో ఒక వ్యక్తి చనిపోయాడన్న ఆందోళన కనిపించేలా కనీసం నటించే ప్రయత్నం కూడా చేయకుండా అక్కడేదో కుక్కో పిల్లో చచ్చినంత తేలిగ్గా మాట్లాడుతుంటాడు.

భర్తల్ని మోసం చేసే అమ్మాయిల్ని ఒక వ్యక్తి చంపుకుంటూ పోతుంటే ఈ పోలీసు దొరగారు అది తెగ నచ్చేసి కవరప్ చేసుకుంటూ పోతుంటాడట. మిగతా పోలీసులంతా కూడా ఇదేమీ పట్టకుండా చోద్యం చూస్తుంటారట. ఒక్కసారిగా ఒక సిటీలో పెద్ద సంఖ్యలో అమ్మాయిలు కనిపించకుండా పోతే.. వాళ్లందరూ కూడా అదే రోజు వాళ్లంతా కూడా ఒకే మ్యూజికల్ ఈవెంట్లో పాల్గొన్నారు అనే విషయం కూడా పోలీసులెవ్వరూ కనిపెట్టరు. చివర్లో మాత్రం కొన్ని దశాబ్దాల కిందట మన సినిమాల్లో క్లైమాక్స్ ఫైట్ అయ్యాక బెటాలియన్ దిగినట్లుగా ఈ సినిమాలోనూ చివర్లో వచ్చి హడావుడి చేస్తారో పోలీసులు. పాపం మైకేల్ మ్యాడ్సన్ కు ఏం చెప్పి ఒప్పించారో కానీ.. తమ దేశ పోలీసులను ఇంత దద్దమ్మల్లాగా చూపించారని తెలిస్తే ఆయన ఫీలింగ్ ఏంటో మరి.

ఎక్కడలేని బిల్డప్ తో మొదలయ్యే ఆరంభ సన్నివేశం చూశాక ఒక గ్రిప్పింగ్ హార్రర్ థ్రిల్లర్ ఏదో చూడబోతున్నామని ఆశలు రేకెత్తిస్తుంది ‘నిశ్శబ్దం’. కానీ అవి నీరుగారిపోవడానికి ఎంతో సమయం పట్టదు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా రంగంలోకి దిగిన అంజలితో రన్నింగ్ కామెంట్రీ ఇస్తున్నట్లుగా వాయిస్ ఓవర్ ఇచ్చినపుడే ‘నిశ్శబ్దం’ ఎలా సాగబోతోందో సంకేతాలు అందుతాయి. ఇన్వెస్టిగేషన్ పేరుతో ప్రథమార్ధాన్ని సాగతీసి.. తీసి.. ఇంటర్వెల్ ముంగిట మైకేల్ మ్యాడ్సన్ పాత్రకు సంబంధించిన ట్విస్టుతో కథ పట్ల కొంత ఆసక్తి రేకెత్తిస్తారు. కానీ ద్వితీయార్ధంలో అనుష్క-షాలినిల ఫ్లాష్ బ్యాక్ మొదలవడంతో మళ్లీ నీరసం వచ్చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్ చివర్లో కథ మలుపు తిరిగే దగ్గర మళ్లీ కొంచెం ఆసక్తి పుడుతుంది.

అసలేం జరిగి ఉంటుంది అనే ప్రశ్న కొంతసేపు ఉత్కంఠ రేకెత్తిస్తుంది. కానీ అసలు విషయం తెలిశాక ఈమాత్రం దానికే ‘నిశ్శబ్దం’ టీం ఇంత బిల్డప్ ఇచ్చిందనే ఫీలింగ్ కలుగుతుంది. అసలు ‘హాంటెడ్ హౌస్’గా పేరుబడ్డ భవంతిలో మొదట ఏం జరిగింది.. విలన్లు ఇద్దరూ తొలిసారి కలిసే దగ్గర ఆ గందరగోళం ఏంటి.. లాంటి ప్రశ్నలు వెంటాడుంటాయి కానీ.. వాటికి సమాధానం తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా చివరికొచ్చేసరికి కలగదు. ఎందుకంటే ఇలాంటి సినిమాను అనుష్క.. మాధవన్.. మైకేల్ మ్యాడ్సన్ ఏం నచ్చి చేశారు అనే అతి పెద్ద సందేహం అప్పటికి వేధిస్తూ ఉంటుంది. అమెరికా నేపథ్యంలో బాగా ఖర్చు పెట్టి సినిమా తీస్తే.. ప్రముఖ హాలీవుడ్ నటుణ్ని తీసుకుంటే ‘హాలీవుడ్ స్థాయి’ సినిమా తయారైపోదు అనడానికి ‘నిశ్శబ్దం’ ఉదాహరణ.

నటీనటులు:

అనుష్క పాత్ర - నటన మరీ గొప్పగా ఉందని చెప్పలేం. అలాగని తీసిపడేయలేం. తన వంతుగా అనుష్క సాక్షి పాత్రకు జీవం తేవడానికి ప్రయత్నించింది. ఆమె హావభావాలు ఆకట్టుకుంటాయి. కానీ ఈ పాత్రకు బిల్డప్ ఇచ్చిన స్థాయిలో అయితే తెరమీద కనిపించలేదు. సినిమాలో ఆమె పాత్రను బాగా అండర్ ప్లే చేశారని కూడా అనిపిస్తుంది. కథానాయికను బదిరురాలిగా చూపించినపుడు.. దాన్ని కథతో ముడిపెట్టి ఏదైనా సర్ప్రైజ్ చేస్తారేమో అనుకుంటే అలాంటిదేమీ లేకపోయింది. సినిమాలో కథానాయిక ప్రత్యేకంగా చేసేదేమీ ఉండదు. అనుష్క కంటే కూడా అంజలికి రన్ టైం ఎక్కువ కనిపిస్తుంది ఒక దశ వరకు. ఫ్లాష్ బ్యాక్ కలవడంతో ఆమె పాత్ర నిడివి కొంచెం పెరిగింది. అక్కడ కూడా ఆమె పెద్దగా చేసిందేమీ లేదు. అంజలి పాత్ర కూడా జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఆంథోనీ పాత్ర మాధవన్ చేయదగ్గది కాదు. ఆయన నటనలోనూ ఏ ప్రత్యేకతా కనిపించలేదు. మైకేల్ మ్యాడ్సన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆయన పాత్ర చిరాకు పెడుతుంది. పొరబాటున ఒప్పుకుని.. తర్వాత అయిష్టంగా ఈ పాత్ర చేశారేమో అనిపిస్తుంది ఆయన బాడీ లాంగ్వేజ్ అదీ చూస్తే. సుబ్బరాజు బాగానే చేశాడు. షాలిని పాండే ఓకే. అవసరాల శ్రీనివాస్ గురించి చెప్పడానికేమీ లేదు.

సాంకేతిక వర్గం:

గోపీసుందర్ ట్యూన్ చేసిన మూడు పాటల్లో మొదటిది వినసొంపుగా ఉంది. కానీ సినిమాలో పాటలు అనవసరం అనిపిస్తుంది. గిరీష్ గోపాలకృష్ణన్ నేపథ్య సంగీతం థ్రిల్లర్ సినిమాల శైలిలోనే సాగింది. ఆ శబ్దాలు అవీ మనకు అలవాటైనవే. శనీల్ డియో ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. విజువల్స్ రిచ్ గా అనిపిస్తాయి. నిర్మాణ విలువల విషయంలో వంక పెట్టడానికి ఏమీ లేదు. పూర్తిగా అమెరికాలో.. మంచి మంచి లొకేషన్లలో ఖర్చుకు వెనుకాడకుండా సినిమా తీశారు. కానీ ఆ ఖర్చుకు తగ్గ కంటెంట్ మాత్రం ‘నిశ్శబ్దం’లో లేకపోయింది. ఈ సినిమాకు అమెరికా నేపథ్యం బలం కంటే కూడా బలహీనత అని చెప్పొచ్చు. కథ నడిచే తీరు ప్రకారం చూస్తే అది ఏమాత్రం అవసరం లేదనిపిస్తుంది. ప్రధాన పాత్రలు ‘ఫలానా’ అని చెప్పుకోవడానికి గొప్పగా అనిపించడం తప్ప.. వాటిని తీర్చిదిద్దిన విధానంలో ఏ ప్రత్యేకతా లేకపోయింది. ఇక్కడే ‘నిశ్శబ్దం’ తేలిపోయింది. కొన్ని చోట్ల కొంత ఆసక్తి-ఉత్కంఠ రేకెత్తించడం మినహాయిస్తే కథాకథనాలు నిరాశను మిగులుస్తాయి. రచయిత కోన వెంకట్.. దర్శకుడు హేమంత్ మధుకర్ ల గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేకపోయింది.

చివరగా: నిశ్శబ్దం కాదు నీరసం

రేటింగ్: 2/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in TheatreLATEST NEWS