నేత్రికన్

Fri Aug 13 2021 GMT+0530 (India Standard Time)

నేత్రికన్

చిత్రం : నేత్రికన్ (తెలుగు)

నటీనటులు: నయనతార-అజ్మల్-మణికందన్-శరణ్ తదితరులు
సంగీతం: గిరీష్ గోపాలకృష్ణన్
ఛాయాగ్రహణం: ఆర్.డి.రాజశేఖర్
నిర్మాత: విఘ్నేష్ శివన్
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: మిలింద్ రావు

దక్షిణాదిన హీరోలతో సమానంగా సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించిన కథానాయిక నయనతార. ఇప్పటికే ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సత్తా చాటిన ఆమె.. తాజాగా ‘నేత్రికన్’ అనే థ్రిల్లర్ మూవీలో నటించింది. ‘గృహం’ దర్శకుడు మిలింద్ రావు రూపొందించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ హాట్ స్టార్ ఓటీటీలో ఈ రోజే రిలీజైంది. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

దుర్గ (నయనతార) ఒక సీబీఐ ఆఫీసర్. అనాథ అయిన ఆమె.. తనతో పాటే ఆశ్రమంలో పెరిగిన ఆదిత్యను తమ్ముడిలా చూసుకుంటూ ఉంటుంది. కానీ అనుకోని పరిస్థితుల్లో జరిగిన ఓ ప్రమాదంలో ఆదిత్య చనిపోతాడు. ఆ ప్రమాదంలోనే దుర్గ చూపు కోల్పోతుంది. తన తమ్ముడి చావుకు తానే కారణమయ్యానని కుమిలిపోతున్న ఆమె.. కంటి చూపు లేకుండా జీవనానికి అలవాటు పడే ప్రయత్నంలో ఉంటుంది. అప్పుడు తనుండే నగరంలో వరుసగా అమ్మాయిలు అదృశ్యం అవుతుంటారు. వాళ్లను దిన అనే వ్యక్తి (అజ్మల్) సైకో కిడ్నాప్ చేసి దారుణంగా హింసించి అనుభవిస్తుంటాడు. దుర్గను కూడా దిననే కిడ్నాప్ చేయబోతే.. అతణ్నుంచి తప్పించుకుంటుంది. అక్నణ్నుంచి దుర్గను చంపడమే లక్ష్యంగా దిన.. దినను పట్టుకోవడమే టార్గెట్ గా దుర్గ అడుగులేస్తారు. తర్వాత ఏం జరిగిందన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

సొసైటీలో అందరిలో ఒకడిలా మామూలుగా కనిపించే ఓ వ్యక్తిలో బయటికి కనిపించని సైకో లక్షణాలుండటం.. అతను వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి వారిని హింసించడం.. అనుభవించడం.. లేదా చంపేయడం.. ఈ దారుణాలకు సంబంధించిన మిస్టరీ ఏంటో అంతుబట్టక పోలీస్ విభాగం తలలు పట్టుకోవడం.. అప్పుడు హీరో ఎంట్రీ ఇచ్చి నెమ్మదిగా తీగ లాగి ఆ సైకో కిల్లర్ గుట్టు రట్టు చేయడం.. అతని పని పట్టడం.. ఈ కోవలో వివిధ భాషల్లో చాలా సినిమాలే వచ్చాయి ఇప్పటిదాకా. కొన్నేళ్ల కిందట రామ్ గోపాల్ వర్మ ‘అనుక్షణం’ పేరుతో ఇలాంటి సినిమానే తీశాడు. నాగశౌర్య నటించిన ‘అశ్వత్థామ’ కూడా ఈ తరహా చిత్రమే. తమిళం నుంచి తెలుగులోకి రీమేక్ అయిన ‘రాక్షసుడు’ ఇందుకు మరో ఉదాహరణ. తమిళంలో సైకో రాక్షసన్ సహా ఈ జానర్లో కొన్ని సినిమాలు వచ్చాయి. ‘నేత్రికన్’ సైతం ఈ టైపు సినిమానే కాకపోతే ఇందులో అందరి దృష్టినీ ఆకర్షించిన భిన్నమైన విషయం ఏంటంటే.. ఇక్కడ సైకో కిల్లర్ పని పట్టేది హీరో కాదు. హీరోయిన్. పైగా ఆమె ఒక అంధురాలు. కళ్లు లేని అమ్మాయికి సైకో కిల్లర్ కు మధ్య పోరు అనగానే కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. ఈ కోణంలో ‘నేత్రికన్’ కొంచెం భిన్నమైన అనుభూతినే పంచుతుంది కానీ.. సైకో కిల్లర్ నేపథ్యం.. అతడి చుట్టూ అల్లుకున్న కథాకథనాలన్నీ మాత్రం చాలా మామూలుగా అనిపిస్తాయి ‘నేత్రికన్’లో. సైకో కిల్లర్ చుట్టూ నడిచే కథల్లో విలన్ పాత్ర ఎంత బలంగా ఉంటే సినిమా అంత బాగా పండుతుంది. ‘రాక్షసుడు’ లాంటి చిత్రాలు అందుకు నిదర్శనం. ఐతే ‘నేత్రికన్’లో మాత్రం ఆ క్యారెక్టర్ సాధారణంగా అనిపిస్తుంది. ఆ పాత్రకు ఆరంభంలో ఇచ్చిన బిల్డప్ అదీ చూసి చాలా ఊహించుకుంటాం. కానీ పోను పోనూ ఆ పాత్రను తేలిపోవడంతో ప్రేక్షకులు ఎగ్జైట్మెంట్ కోల్పోతారు. మరోవైపు అంధురాలైనప్పటికీ ఆత్మవిశ్వాసానికి లోటు లేని పాత్రలో నయనతార గొప్పగా నటించినా.. తన పాత్ర ఆకట్టుకున్నా.. ఓవరాల్ గా  ‘నేత్రికన్’ ఒకింత నిరాశకే గురి చేస్తుంది.

సైకో కిల్లర్ల పాత్రల విషయంలో ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తే వేరు. ఈ పాత్రలు తెరపై కనిపించేటపుడు ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూస్తారు. కేవలం ఆ పాత్రలతో అఘాయిత్యాలు చేయిస్తే సరిపోదు.. వాటిని ప్రెజెంట్ చేసే తీరులో ఉత్కంఠ ఉండాలి. ఆ పాత్రలు ఆ దారుణాలు చేయడం వెనుక కారణాలు బలంగా.. కొంచెం కొత్తగా అనిపించాలి. ఈ పాత్రల్లో సస్పెన్స్.. ట్విస్టులు ఉంటే అవి మరింతగా పండుతాయి. ఐతే ‘నేత్రికన్’లో అజ్మల్ చేసిన సైకో క్యారెక్టర్లో ఈ లక్షణాలు తక్కువే. అసలు ఈ సైకో ఎవరు అనే సస్పెన్స్ లేకుండా ముందే ఆ పాత్రను రివీల్ చేసేశారు. స్ట్రెయిట్ నరేషన్ తో సినిమాను ఓపెన్ చేశారు. దీని వల్ల స్క్రీన్ ప్లే పరంగా ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తించడానికి అవకాశం లేకుండా పోయింది. థ్రిల్లర్ సినిమాల్లో ఇలా నేరుగా కథను చెప్పేటపుడు కథనం ఎంతో పకడ్బందీగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ‘నేత్రికన్’ అంత బిగితో కనిపించదు. ప్రథమార్ధంలో ఒక దశ వరకు కథ అంతగా ముందుకు కదలదు.

అంధురాలైనప్పటికీ కథానాయిక చాలా తెలివైంది అని చెప్పడానికి కొన్ని ఎలివేషన్లు సీన్లు పెట్టారు. అవి చాలా వరకు బోర్ కొట్టిస్తాయి. తన మీద ఎటాక్ చేసిన విలన్ మీద కథానాయికకు సందేహాలు కలగడం.. పోలీసులు ఆమె వాదనల్ని కొట్టి పారేయడం.. స్టేషన్లో అసమర్థుడిగా పేరున్న పోలీస్ తో కలిసి కథానాయిక పరిశోధన ఆరంభించడం.. ఇలా ఒక టెంప్లేట్లో సాగిపోతుంది ‘నేత్రికన్’. తొలి ముప్పావుగంటలో కథలో కొత్తదనం కనిపించదు. అదే సమయంలో కథనంలో ఉత్కంఠా ఉండదు.

ఐతే విలన్.. కథానాయికను టార్గెట్ చేసి ఆమెను వెంబడించే దగ్గర్నుంచి కథనంలో కొంచెం వేగం వస్తుంది. మధ్యలోకి వచ్చేసరికి ఒక ఊపు వస్తుంది. అలాగే ద్వితీయార్ధంలో విలన్ని కథానాయిక టార్గెట్ చేసి అతడి గుట్టు రట్టు చేసే ఎపిసోడ్ ‘నేత్రికన్’ మొత్తంలో ఎక్కువ ఆసక్తి రేకెత్తిస్తుంది. పోలీసులకు విలన్ పట్టుబడిపోయినపుడు అతడి బ్యాక్ స్టోరీ ఏంటా అనే విషయంలో ఉత్కంఠ రేగుతుంది. ఐతే అతడి కథేంటో తెలిశాక మాత్రం నిట్టూర్పులు ఖాయం. విలన్ ఫ్లాష్ బ్యాక్ ను తేల్చిపడేసినట్లు అనిపిస్తుంది. అందులో కొంత విషయం ఉన్నప్పటికీ దాన్ని పకడ్బందీగా.. ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయలేకపోయాడు దర్శకుడు. ఇంకొంత డీటైలింగ్ ఉండాల్సింది. కన్విన్సింగ్ గా ఆ ఎపిసోడ్ ను తీర్చిదిద్దాల్సింది. అరకొరగా చూపించడం వల్ల ప్రేక్షకులు అందులోని ఉద్వేగాన్ని  ఫీలవ్వలేని పరిస్థితి. ఆ ఎపిసోడ్ ను హడావుడిగా ముగించేసి.. మళ్లీ ప్రి క్లైమాక్స్.. క్లైమాక్స్ ను అవసరానికి మించి సాగదీశారు. సినిమా ఎలా ముగుస్తుందన్న అంచనా ముందే వచ్చేయగా.. దాదాపు 20 నిమిషాల పాటు క్లైమాక్స్ ను సాగతదీయడంలో ఔచిత్యమేంటో దర్శకుడికే తెలియాలి. థ్రిల్లర్ సినిమాల్లో ఇంత సాగతీతను భరించడం కష్టం. సినిమా నిడివి రెండున్నర గంటలు ఉండటం కూడా ఆమోదయోగ్యం కాదు. మధ్యలో ఓ ముప్పావు గంటను మినహాయిస్తే.. దానికి ముందు వెనుక ‘నేత్రికన్’ సాగతీతగా అనిపిస్తుంది. విలన్ పాత్రే ఈ సినిమాకు మైనస్. థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవాళ్లు ఒక లుక్ వేద్దాం అనుకుంటే ‘నేత్రికన్’ ఓకే కానీ.. అంతకుమించి ప్రత్యేకమైన అనుభూతిని ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు.

నటీనటులు:

దుర్గ పాత్రలో నయనతార ఆకట్టుకుంది. అంధురాలిగా చక్కగా నటించింది. ఎమోషనల్ సీన్లలో ఆమె నటన హృద్యంగా సాగింది. నయన్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు హైలైట్. సైకో కిల్లర్ పాత్రలో అజ్మల్ కూడా బాగా చేశాడు. ఆ పాత్రకు అతను పర్ఫెక్ట్ అనిపించాడు. కానీ క్యారెక్టర్లో అనుకున్నంత బలం లేకపోవడంతో అజ్మల్ కష్టం అంత ఫలితాన్నివ్వలేదు. డెలివరీ బాయ్ గా చేసిన కుర్రాడు ఆకట్టుకున్నాడు. ఎస్ఐ పాత్రలో చేసిన మణికందన్ ఓకే. అతడి పాత్ర చాలా వరకు చికాకు పెడుతుంది. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గా ‘నేత్రికన్’ ఉన్నంతగానే అనిపిస్తుంది. గిరీష్ గోపాలకృష్ణన్ నేపథ్య సంగీతం సినిమాకు అతి పెద్ద బలం. పాటలేమీ అంతగా రిజిస్టర్ కావు. అసలు ఈ చిత్రంలో పాటలే అవసరం లేదు. ఆర్.డి.రాజశేఖర్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ‘గృహం’తో ఆకట్టుకున్న దర్శకుడు మిలింద్ రావు.. ఈసారి అనుకున్నంతగా పనితనం చూపించలేకపోయాడు. గతంలో వచ్చిన సైకో కిల్లర్ సినిమాలకు ‘నేత్రికన్’ ఏమంత భిన్నంగా అనిపించదు. కథానాయికను అంధురాలిగా చూపించడం కొత్త పాయింట్ అనుకుందామనుకున్నా.. మిస్కిన్ తీసిన ‘సైకో’ సినిమాతో పోలికలు కనిపిస్తాయి. అందులో ఉన్న ఉత్కంఠ ఇందులో లేదు. స్క్రీన్ ప్లే పరంగా ఇందులో పెద్దగా మెరుపులు లేవు. ట్రైలర్లో చూపించినంత షార్ప్ గా సినిమా లేకపోవడం మైనస్.

చివరగా: నేత్రికన్.. థ్రిల్స్ తగ్గాయ్!

రేటింగ్-2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in OTT

LATEST NEWS