నేను మీకు బాగా కావాల్సిన వాడిని

Fri Sep 16 2022 GMT+0530 (India Standard Time)

నేను మీకు బాగా కావాల్సిన వాడిని

'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' రివ్యూ

నటీనటులు:
కిరణ్ అబ్బవరం-సంజన-సోను ఠాకూర్-ఎస్వీ కృష్ణారెడ్డి-బాబా భాస్కర్-సమీర్ తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: రాజ్ నల్లి
నిర్మాత: కోడి దివ్య దీప్తి
స్క్రీన్ ప్లే-మాటలు: కిరణ్ అబ్బవరం
దర్శకత్వం: శ్రీధర్ గాదె

రాజావారు రాణివారుతో మంచి పేరు సంపాదించి వరుసగా అవకాశాలు అందుకుంటున్న యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి వచ్చిన తాజా సినిమా.. నేను మీకు బాగా కావాల్సిన వాడిని. ఎస్ఆర్ కళ్యాణమండపం దర్శకుడు శ్రీధర్ గాదె రూపొందించిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

వివేక్ (కిరణ్ అబ్బవరం) ఒక క్యాబ్ డ్రైవర్. అతను రోజూ తేజు (సంజన ఆనంద్) ఒక అమ్మాయిని క్యాబ్ లో తీసుకెళ్లి ఇంట్లో వదిలిపెడుతుంటాడు. ఐతే ప్రతి రోజూ రాత్రి ఆమె ఫుల్లుగా మందుకొట్టి తన క్యాబ్ ఎక్కుతుంటుంది. దీంతో ఆమె బాధ ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు వివేక్. ఆమె పెద్దలు కుదిర్చిన పెళ్లిని కాదనుకుని ప్రేమలో ఎలా మోసపోయింది వివరిస్తుంది. ఆ తర్వాత విఫల ప్రేమకథను వివేక్ చెబుతాడు. ఈ క్రమంలో వివేక్ మీద తేజుకు సానుకూల అభిప్రాయం ఏర్పడుతుంది. వివేక్ సూచనతో ఆమె తిరిగి తన ఇంటికి కూడా వెళ్తుంది. కుటుంబంతో ఒక్కటవుతుంది. ఇక వివేక్ మీద తన ప్రేమను చెప్పాలనుకుంటున్న సమయంలో అతడి గురించి అసలు విషయం తెలుస్తుంది. అదేంటి.. వాళ్లిద్దరూ ఒక్కటయ్యారా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

కిరణ్ అబ్బవరం.. బ్యాగ్రౌండ్ ఉన్న హీరో ఏమీ కాదు. అతడి తొలి చిత్రం రాజా వారు రాణి వారు థియేటర్లలో రిలీజైన విషయం కూడా తెలియకుండానే వెళ్లిపోయింది. ఐతే ఆశ్చర్యకరంగా ఓటీటీలో ఆ సినిమాకు మంచి స్పందన వచ్చింది. కిరణ్ కు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఫలితంగా అతడి తర్వాతి చిత్రం ఎస్ఆర్ కళ్యాణమండపంకి చిన్న స్థాయి స్టార్ హీరో సినిమాకు వచ్చినంత క్రేజ్ వచ్చింది. ఆ సినిమాలో పెద్దగా కంటెంట్ లేకపోయినా.. కిరణ్ పెర్ఫామెన్స్.. కొన్ని ఎలివేషన్లు.. ఎంటర్టైన్మెంట్ ప్లస్ అయి సినిమా బాగానే ఆడింది. కిరణ్ చివరి సినిమా సమ్మతమేలో సైతం కంటెంట్ వీకే అయినా కూడా దానికి ఓపెనింగ్స్ వచ్చాయంటే అందుక్కారణం అతడి పట్ల ప్రేక్షకుల్లో ఉన్న సానుకూలాభిప్రాయం.. అతడి మేనరిజమ్స్.. డైలాగ్ డెలివరీ.. స్టైల్ యువతకు నచ్చుతుండడమే. ప్రేక్షకుల నుంచి ఇలాంటి ప్రోత్సాహం లభిస్తున్నపుడు కొంచెం కథల మీద కసరత్తు చేసి.. మంచి సినిమాలు చేయాల్సిన బాధ్యత అతడి మీద ఉంది. కానీ సినిమా సినిమాకూ క్వాలిటీ దెబ్బ తీసుకుంటూ.. తాజాగా నేను మీకు బాగా కావాల్సిన వాడిని అనే సాధారణమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కిరణ్.

ఎస్ఆర్ కళ్యాణమండపం తరహాలోనే కిరణ్ అబ్బవరం తనే సొంతంగా స్క్రీన్ ప్లే.. మాటలు సమకూర్చిన నేను మీకు బాగా కావాల్సినవాడిని చిత్రంలో అతణ్ని ఏం ఎగ్జైట్ చేసిందన్నది అర్థం కాని విషయం. ఎప్పట్లాగే కిరణ్ తన వరకు ఎంటర్టైన్ చేసినా కథాకథనాల్లో ఏమాత్రం మెరుపుల్లేకపోవడం.. సన్నివేశాలు అతి సాధారణంగా.. బోరింగ్ గా సాగడంతో నేను మీకు బాగా కావాల్సిన వాడిని నిరాశకు గురి చేస్తుంది. ఒక అమ్మాయి పెళ్లి పీటల మీది నుంచి లేచి వెళ్ళిపోతే ఆమె కోణంలోనే ఆలోచిస్తారు కానీ... ఆ పెళ్లి ఆగిపోవడంతో అబ్బాయి పరిస్థితి ఏంటన్న ఆలోచనే రాదు. ఈ పాయింట్ మీద గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన కథతో తెరకెక్కిన చిరునవ్వుతో మంచి ఫలితాన్నందుకుంది. ఇదే పాయింట్ ను కొంచెం మార్చి వేరే స్క్రీన్ ప్లేతో కథ చెప్పాలని చూసింది కిరణ్-శ్రీధర్ గాదె జోడీ. కానీ పాయింట్ బాగున్నా.. దీని చుట్టూ అల్లుకున్న కథ.. కథనాలు మాత్రం ఏమాత్రం ఆసక్తికరంగా లేవు.

హీరో ఇంట్రో సీన్ అవ్వంగానే పాట మొదలవ్వబోతున్న సంకేతాలు  కనిపిస్తాయి. వెంటనే ఏంటి ఐటెం సాంగా.. షర్టు మార్చుకుని వచ్చేస్తా అని రెడీ అయిపోతాడు మన హీరో కిరణ్ అబ్బవరం. ఇక ద్వితీయార్ధంలో ఇంకో పాటకు సిచువేషన్ సిద్ధం కాగానే తన పక్కన కమెడియన్ రోల్ చేసిన డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ ను ఉద్దేశించి.. సింపుల్ స్టెప్స్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తాడు హీరో. ఇంకో సీన్లో ఏదో క్యారెక్టర్ ఇరిటేట్ చేస్తుంటే.. మెలోడీ బ్రహ్మ అంత మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇస్తుంటే ఇదేంటి అంటూ చిరాకు పడతాడు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్నందించిన నేపథ్యంలో వచ్చే డైలాగ్ ఇది. ఈ సినిమాకు హీరో మాత్రమే కాక స్క్రీన్ ప్లే-డైలాగ్ రైటర్ కూడా అయిన కిరణ్ అబ్బవరం ఇలాంటి డైలాగులు రాస్తూ తాను చాలా ట్రెండీగా.. ఫన్నీగా ఏదో చేస్తున్నానని అనుకుని ఉండొచ్చు. కానీ ఎప్పుడో 80లు 90ల్లోనే ఈవీవీ సత్యనారాయణ సినిమాల్లో క్యారెక్టర్లు ఇలా మాట్లాడేసేవి. ఇక పక్కన లేస్ చిప్స్ తింటున్న కామెడీ క్యారెక్టర్ని హీరో ''లేస్ తింటున్నావా అన్నా'' అంటే.. ''లేదు కూర్చునే తింటున్నా'' అని బదులిచ్చే టైపు డైలాగులు జబర్దస్త్ షోలో ఎప్పడూ చూసేవే. ఇలాంటి సీన్లు.. డైలాగులతో ఈ రోజుల్లో సినిమా తీసి మెప్పించాలనుకోవడం అత్యాశే అవుతుంది.

మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాలో సగం వరకు హీరోయిన్ తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ చెబుతుంది. ఇంకో సగంలో హీరో తన స్టోరీ చెబుతాడు. ముందుగా హీరోయిన్ కథ విన్నాక.. హీరో మరో పాత్రతో ఓ మాట అంటాడు.. ఆ బ్రేకప్ స్టోరీ వింటే ఫ్యూజులు ఎగిరిపోతాయి అని. ఆ కథేంటో ఒకసారి చూడండి. హీరోయిన్ అక్క తన కోసం ఇంటి నుంచి వచ్చేస్తానని మాట ఇచ్చి అలా చేయకుండా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుందని ఆమె తండ్రి మీద పగబట్టిన కుర్రాడు.. హీరోయిన్ని ముగ్గులోకి దింపి ఆమెను పెళ్లి పీటల మీది నుంచి లేచి వచ్చేలా చేయడం.. నేను అప్పుడు అనుభవించిన బాధ ఇప్పుడు నువ్వు మీ నాన్న అనుభవించు అంటూ వికటాట్టహాసం చేయడం చూశాక కచ్చితంగా ప్రేక్షకులకు ఫ్యూజులు కొట్టేస్తాయి. ఇక హీరో లవ్ స్టోరీ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. ముందు చూసిన హీరోయిన్ స్టోరీనే బెటర్ అనిపిస్తుంది. ఆఖర్లో ట్విస్టు కూడా ప్రేక్షకులు మరీ షాకయ్యే రేంజిలో ఏమీ లేదు. కిరణ్ పెర్ఫామెన్స్.. అక్కడక్కడా కొన్ని సీన్లు మినహాయిస్తే సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు.

నటీనటులు:

కిరణ్ అబ్బరంలో మంచి ఈజ్ ఉంది. మంచి కథ పడితే అతను మెరుపులు మెరిపించగలడు అనిపిస్తుంది. కానీ పేలవమైన కథల్లో రొటీన్ పాత్రలు చేస్తూ వెళ్లడంతో అప్పుడే అతను మొహం మొత్తేస్తున్నాడు. నటన పరంగా అతను కొత్తగా చేసిందేమీ లేదు. ఎస్ఆర్ కళ్యామండపం.. సమ్మతమే సినిమాలకు కొనసాగింపులా అనిపిస్తుంది అతడి క్యారెక్టర్. హీరోయిన్లలో సంజన ఆనంద్ కొంచెం పర్వాలేదు. ఇంకో అమ్మాయి సోను ఠాకూర్ గురించైతే మాట్లాడడానికి ఏమీ లేదు. సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి హీరోయిన్ తండ్రిగా కీలక పాత్ర చేశాడు కానీ.. ఆయనకు నటన నప్పలేదు. బాబా భాస్కర్ కామెడీ పేరుతో ఏదో ట్రై చేశాడు కానీ వర్కవుట్ కాలేదు.

సాంకేతిక వర్గం:

కిరణ్ గత సినిమాల్లో మంచి మంచి పాటలు పడ్డాయి. కానీ ఇందులో పాటలు చాలా మామూలుగా ఉన్నాయి. మణిశర్మ ఎంత ఫాంలో లేకపోయినా సరే.. మరీ ఇంత సాధారణ సంగీతం అందిస్తాడని ఊహించలేం. నిజంగా ఆయన ఈ సినిమాకు పని చేశాడని అంటే నమ్మడం కష్టమే. పాటల్లో.. నేపథ్య సంగీతంలో ఎక్కడా ఆయన ముద్ర లేదు. రాజ్ నల్లి ఛాయాగ్రహణం మామూలుగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. కిరణ్ అబ్బవరం  కిరణ్ అబ్బవరం స్క్రిప్టులో మెరుపులేమీ లేవు. స్క్రిప్టు దగ్గరే పూర్తిగా తేలిపోయిన సినిమాను దర్శకుడు శ్రీధర్ గాదె తన టేకింగ్ తోనూ మెరుగు పరచలేకపోయాడు.

చివరగా: నేను మీకు బాగా కావాల్సిన వాడిని.. బోరింగ్ బొమ్మ

రేటింగ్ - 2/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS