నవరస (ఓటిటి)

Sat Aug 07 2021 GMT+0530 (IST)

నవరస (ఓటిటి)

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం నిర్మాణం.. ప్రియదర్శన్- గౌతమ్ మీనన్- కార్తీక్ సుబ్బరాజ్- కార్తీక్ నరేన్ లాంటి పేరున్న ఫిలిం మేకర్ల దర్శకత్వం.. సూర్య-ప్రకాష్ రాజ్-విజయ్ సేతుపతి-రేవతి లాంటి గ్రేట్ ఆర్టిస్టుల నటన.. ఎ.ఆర్.రెహమాన్-సంతోష్ శివన్ లాంటి ప్రపంచ స్థాయి టెక్నీషియన్ల సాంకేతిక సహకారం. ఇలా ఆంథాలజీ ఫిలిం ‘నవరస’లో ఆకర్షణలు అన్నీ ఇన్నీ కావు. మొత్తం దేశం దృష్టిని ఆకర్షించిన ఈ నెట్ ఫ్లిక్స్ ఆంథాలజీ ఫిలిం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. నవరసాల్లోని ఒక్కో రసం నేపథ్యంలో నడిచే తొమ్మితి కథల సమాహారం విశేషాలేంటో చూద్దాం పదండి.

1. ఎదిరి (కరుణ)

విజయ్ సేతుపతి.. ప్రకాష్ రాజ్.. రేవతి ప్రధాన పాత్రలు పోషించిన ఎపిసోడ్ ఇది. తన అన్న మరణానికి కారణమయ్యాడన్న కోపంతో ఓ పెద్ద మనిషిని చంపేసే ఓ వ్యక్తి.. తన కళ్ల ముందే భర్త హత్య జరిగినా స్పందించకుండా ఉండిపోయే ఆ పెద్ద మనిషి భార్య మధ్య నడిచే కథ ఇది. మధ్యలో ప్రకాష్ రాజ్-విజయ్ సేతుపతి మధ్య వచ్చే ఓ సన్నివేశం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ముగింపు మీద అంచనాలు పెంచుతుంది. కానీ చాలా సాధారణంగా అనిపించే క్లైమాక్స్ దీనికి పెద్ద మైనస్. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషన్ సరిగా లేని ‘ఎదిరి’ని.. కేవలం సేతుపతి-రేవతిల నటన కోసం మాత్రమే గుర్తుంచుకోగలం. దర్శకుడు బిజోయ్ నంబియార్ నిరాశ పరిచాడు.

2. సమ్మర్ ఆఫ్ 1992 (హాస్య)

లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ డైరెక్ట్ చేసిన సెగ్మెంట్ ఇది. కమెడియన్ యోగిబాబు ఇందులో లీడ్ రోల్ చేశాడు. మొత్తం తొమ్మిది ఎపిసోడ్లలో సరదాగా నడిచే ఎపిసోడ్ ఇది. యోగిబాబు కంటే కూడా అతడి చిన్నప్పటి పాత్రను పోషించిన కుర్రాడు ఇందులో బాగా హైలైట్ అయ్యాడు. అతడి చుట్టూ నడిచే సన్నివేశాలు ఫన్నీగా అనిపిస్తాయి. మరీ ప్రియదర్శన్ స్థాయికి తగ్గ ఎపిసోడ్ కాదు కానీ.. కాన్సెప్ట్.. ఎగ్జిక్యూషన్ పరంగా ఇది ఓకే అనిపిస్తుంది. ఎక్కువగా ఫ్లాష్ బ్యాకే ఆకట్టుకునే ఈ ఎపిసోడ్లో ముగింపు కూడా పర్వాలేదనిపిస్తుంది. యోగిబాబు వెరైటీ లుక్.. అతడి స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటాయి. రమ్య నంబీశన్ కూడా బాగానే చేసింది.

3. ప్రాజెక్ట్ అగ్ని (అద్భుత)

ఆ మధ్య తెలుగులో వచ్చిన ‘పిట్టకథలు’లో వచ్చిన ‘ప్రాజెక్ట్ ఎక్స్’ స్టయిల్లో సాగే సైన్స్ ఫిక్షన్ కథ ఇది. యువ దర్శకుడు కార్తీక్ నరేన్ డైరెక్ట్ చేసిన ఈ ఎపిసోడ్లో అరవింద్ స్వామి.. ప్రసన్న ప్రధాన పాత్రలు పోషించారు. క్రిస్టోఫర్ నోలన్ సినిమాలతో పాటు కొన్ని ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ ల స్ఫూర్తి ఇందులో కనిపిస్తుంది. ఇద్దరు శాస్త్రవేత్తలు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడం గురించి చర్చించుకునే నేపథ్యంలో ఈ సిరీస్ నడుస్తుంది. చాలా వరకు ఇద్దరు వ్యక్తుల సంభాషణ నేపథ్యంలోనే ఎపిసోడ్ నడవడంతో మధ్యలోకి వచ్చేసరికి బోర్ కొడుతుంది. ఐతే చివరి 10 నిమిషాలు కొంత ఉత్కంఠభరితంగా సాగి.. చివర్లో ఇచ్చిన ట్విస్టు ఆకట్టుకుంటుంది. ఓ వర్గం ప్రేక్షకులను ఈ సెగ్మెంట్ ఆకట్టుకుంటుంది. ఇంటర్నేషనల్ సైన్స్ సినిమాలు.. వెబ్ సిరీస్ లు అలవాటు లేని వాళ్లు థ్రిల్ అవుతారు కానీ అవి బాగా చూసేవాళ్లకు ఇది మామూలుగానే అనిపించొచ్చు. అరవింద్.. ప్రసన్న ఇద్దరూ మెప్పించారు.

4. పాయసం (బీభత్స)

బీభత్స రసం అనగానే ఇదేదో వయొలెంట్ గా సాగే ఎపిసోడ్ అనుకుంటాం. కానీ ఒక వ్యక్తిలో అసూయ పెరిగిపోతే అది ఎలా దహించి వేస్తుందనే నేపథ్యంలో సాధారణ సన్నివేశాలతోనే నడుస్తుందీ సిరీస్. ఇందులో లీడ్ రోల్ చేసిన ఢిల్లీ గణేష్ షో స్టీలర్ అనడంలో సందేహం లేదు. 1965 ప్రాంతంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పెళ్లి నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. నిజానికి ఈ ఎపిసోడ్ చివర్లోకి వచ్చేసరికి ఫన్నీగా ఉండి ఇది ‘హాస్య’ రస పరిధిలోకి వస్తుందనిపిస్తుంది. బీభత్స రసాన్ని అయితే ఫీలవ్వలేం. వసంత్ సాయి రూపొందించిన ఈ ఎపిసోడ్ ఓవరాల్ గా యావరేజ్ అనిపిస్తుంది తప్ప.. అంతకుమించిన ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఇందులో మిగతా ముఖ్య పాత్రలు పోషించిన రోహిణి.. అదితి బాలన్ మెప్పించారు.

5. పీస్ (శాంతి)

దర్శకుడిగా కెరీర్ ఆరంభంలో పిజ్జా.. జిగర్ తండ లాంటి చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కార్తీక్ సుబ్బరాజ్.. ఆ తర్వాతి నుంచి అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఇటీవలే ‘జగమే తంత్రం’తో తీవ్ర నిరాశకు గురి చేసిన కార్తీక్.. ఇప్పుడు ‘నవసర’లో శాంతి రసం నేపథ్యంలో తీసిన ‘పీస్’ ఎపిసోడ్ తోనూ అంతగా మెప్పించలేకపోయాడు. ‘జగమే తంత్రం’లో మాదిరే ఇక్కడా శ్రీలంక తమిళుల బాధల చుట్టూ కథ నడుస్తుంది. కానీ ఈ ఎపిసోడ్ అనుకున్నంత ఎమోషనల్ గా సాగలేదు. కార్తీక్ ఈ ఎపిసోడ్ ను మనసు పెట్టి చేసినట్లుగా అనిపించదు. ఏదో పైపైన అలా లాగించేశాడే తప్ప డెప్త్ లేదు. కుక్కపిల్ల చుట్టూ నడిచే సన్నివేశాలు బాగున్నప్పటికీ.. ఓవరాల్ గా ‘పీస్’ డిజప్పాయింట్మెంటే. ముగింపు కూడా ఆకట్టుకునేలా లేదు. బాబీ సింహా పెర్ఫామెన్స్ మాత్రం బాగుంది. గౌతమ్ మీనన్ ఓకే అనిపించాడు.

6. రౌద్రం (రౌద్ర)

‘నవరస’ పేరున్న దర్శకులు నిరాశకు గురి చేస్తే.. తొలిసారి మెగా ఫోన్ పట్టిన అరవింద్ స్వామి మాత్రం అంచనాల్ని మించి ఔట్ పుట్ ఇచ్చాడు. అతను దర్శకత్వం వహించిన ‘రౌద్రం’ ఎపిసోడ్ అన్నింట్లోకి అగ్ర భాగంలో నిలుస్తుంది. తాను ఎంచుకున్న రసాన్ని పండించడంలో అరవింద్ విజయవంతం అయ్యాడు. ఇందుకు సంతోష్ శివన్ కెమెరా పనితనం కూడా బాగా ఉపయోగపడింది. ప్రతి సన్నివేశంలోనూ విజువల్స్ వావ్ అనిపిస్తాయి. కాన్సెప్ట్ ను కూడా బిగితో చెప్పడం.. చివర్లో వచ్చే ట్విస్టు.. ఆర్టిస్టుల పెర్ఫామెన్స్.. ఇలా అన్నీ బాగా కుదరడంతో ‘రౌద్రం’ ఇంపాక్ట్ బలంగానే వేస్తుంది. ‘ప్రాజెక్ట్ అగ్ని’లో నటుడిగా మెప్పించిన ‘రౌద్రం’లో దర్శకుడిగా మరింత ఆకట్టుకున్నాడు అరవింద్. ఇందులో కీలక పాత్ర చేసిన కుర్రాడి పెర్ఫామెన్స్ మెప్పిస్తుంది.

7. ఇన్మై (భయ)

సిద్దార్థ్-పార్వతి ముఖ్య పాత్రలు పోషించిన ఈ ఎపిసోడ్ ను రథీంద్రన్ ప్రసాద్ డైరెక్ట్ చేశాడు. ‘భయం’ రసం నేపథ్యంలో నడిచే కథ కాబట్టి హార్రర్ స్టోరీ ఏమైనా చూపిస్తారేమో అనుకుంటాం. కానీ ఇది మామూలు కథే. ఐతే కొన్ని సన్నివేశాల ద్వారా భయం పుట్టించే ప్రయత్నం జరిగింది. కానీ అనుకున్నంత మేర ఈ రసం పండలేదు. కథ పరంగా ట్విస్టులున్నాయి కానీ.. అవి ఊహించలేనివేమీ కావు. ఒక తప్పు చేశాక అపరాధ భావంతో కలిగే భయం చూపించే ప్రభావం ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఈ సెగ్మెంట్ నడుస్తుంది. సిద్దార్థ్ స్క్రీన్ టైం తక్కువే కానీ.. కనిపించినంతసేపూ ఆకట్టుకున్నాడు.  ఐతే తాను టీనేజీలో ఉన్నప్పటి పాత్రను సిద్దార్థే చేసి మెప్పించడం విశేషం. కానీ ఆశ్చర్యకరంగా పార్వతి యుక్త వయసు పాత్రను అమ్ము అభిరామితో చేయించారు. ఇది చిత్రంగా అనిపిస్తుంది. పెర్ఫామెన్స్ పరంగా పార్వతి.. అమ్ములిద్దరూ ఓకే అనిపించారు.

8. తునిద పిన్ (వీరం)

మణిరత్నం కథతో సర్జున్ రూపొందించిన ఈ ఎపిసోడ్లో అధ్వర్వ మురళి ముఖ్య పాత్ర పోషించాడు. నక్సల్స్ వెర్సస్ పోలీస్.. నేపథ్యంలో నడిచే కథ ఇది. కొత్తగా పోలీస్ సర్వీస్ లో చేరిన ఓ కుర్రాడు.. ట్రైనింగ్ ముగించుకోగానే అడవిలో నక్సల్ ఆపరేషన్లో పాల్గొనడం.. నక్సల్స్ దాడిలో సహచరులను కోల్పోయాక నక్సల్ నాయకుడిని పట్టుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగడం.. ఈ క్రమంలో తన వీరత్వాన్ని చూపించడం.. ఈ క్రమంలో కథ నడుస్తుంది. కథ పరంగా ఇందులో కొత్తదనం ఏమీ లేదు. అధ్వర్వ పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటుంది. అతడి ప్రెగ్నెంట్ వైఫ్ పాత్రలో అంజలి మెప్పించింది. వీరి మధ్య ఎమోషన్ ఆకట్టుకుంటుంది. ఓవరాల్ గా అయితే ఇదంత మెప్పించే ఎపిసోడ్ కాదు.

9. టగింగ్ అట్ మై గిటార్ స్ట్రింగ్స్ (శృంగార)

ఒక్కో ఎపిసోడ్ నిరాశ పరుస్తున్నా.. గౌతమ్ మీనన్-సూర్య కాంబినేషన్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తే చివర్లో వచ్చే వీరి సెగ్మెంట్ అంచనాలను అందుకోలేకోయింది. అందుక్కారణం.. ఇందులో కొత్తదనం లేకపోవడమే. గౌతమ్ మీనన్ లవ్ స్టోరీలు ప్రేక్షకులపై ఎంత ఇంపాక్ట్ వేశాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే ఆయన సినిమాలనే గుర్తుకు చేసేలా సాగుతుంది ఈ సెగ్మెంట్. ముఖ్యంగా ఏమాయ చేసావె.. సూర్య సన్నాఫ్ కృష్ణన్.. లాంటి సినిమాలు కళ్ల ముందు కదలాడుతాయి. వాటిలో మాదిరే ఫ్లాష్ బ్యాక్ రూపంలో ఈ స్టోరీని నరేట్ చేశాడు గౌతమ్. కొత్తదనం లేకపోవడం నిరాశ కలిగిస్తుంది కానీ.. కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఆకట్టుకుంటాయి. సూర్య తనదైన శైలి నటన.. స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు. ప్రయాగ మార్టిన్ కూడా బాగా చేసింది. మ్యూజిజ్ దీనికి ప్లస్. కానీ ఓవరాల్ గా ఇది కూడా నిరాశ పరిచే ఎపిసోడే.

చివరగా: ‘నవరస’కు కుదిరిన కాంబినేషన్ చూసి దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్న వారికి కచ్చితంగా నిరాశ తప్పదు. రెండు మూడు ఎపిసోడ్లు మాత్రమే అంచనాలకు తగ్గట్లు ఉన్నాయి. మిగతావి మిశ్రమానుభూతుల్ని మిగులుస్తాయి. కరోనా టైంలో కొంచెం హడావుడిగా చేసేశారో ఏమో.. ఇంకాస్త కసరత్తు జరిగి ఉండాల్సిందనిపిస్తుంది. ఒక ఎపిక్ ఆంథాలజీ ఫిలిం ఆశిస్తే.. చాలా వరకు ఆ స్థాయికి తగ్గట్లు లేని ఎపిసోడ్లు ప్రేక్షకులను నిరాశ పరుస్తాయి. ఆర్టిస్టుల పెర్ఫామెన్స్.. సాంకేతిక హంగుల విషయంలో మాత్రం ‘నవరస’ టాప్ నాచ్ అనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా ఈ ఫిలిం అనుకున్నంత ఇంపాక్ట్ మాత్రం వేయలేకపోయింది. కొన్ని ఆకర్షణల కోసం ఈ ఫిలింపై ఓ లుక్ వేయొచ్చు.

రేటింగ్: 2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in OTT

LATEST NEWS