‘నా పేరు సూర్య’

Fri May 04 2018 GMT+0530 (India Standard Time)

‘నా పేరు సూర్య’

చిత్రం : ‘నా పేరు సూర్య’

నటీనటులు: అల్లు అర్జున్ - అను ఇమ్మాన్యుయెల్ - అర్జున్ - శరత్ కుమార్ - అనూప్ సింగ్ ఠాకూర్ - నదియా - రావు రమేష్ - బొమన్ ఇరానీ - వెన్నెల కిషోర్ - ప్రదీప్ రావత్ - సాయికుమార్ - లగడపాటి విక్రమ్ - చారుహాసన్ తదితరులు
సంగీతం: విశాల్ - శేఖర్
ఛాయాగ్రహణం: రాజీవ్ రవి
నిర్మాతలు: లగడపాటి శిరీషా శ్రీధర్ - బన్నీ వాస్
రచన - దర్శకత్వం: వక్కంతం వంశీ

గత కొన్నేళ్లలో చాలా వేగంగా ఎదిగాడు అల్లు అర్జున్. ఐతే వరుస విజయాలతో ఊపుమీదున్న అతడికి గత ఏడాది ‘దువ్వాడ జగన్నాథం’ బ్రేక్ వేసింది. ఇప్పుడతను ‘నా పేరు సూర్య’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. రచయితగా స్టార్ స్టేటస్ సంపాదించిన వక్కంతం వంశీ దర్శకుడిగా మారి రూపొందించిన తొలి చిత్రమిది. ఆసక్తికర ప్రోమోలతో అంచనాలు పెంచిన ఈ చిత్రం.. ఆ అంచనాల్ని ఏమేరకు అందుకుందో చూద్దాం పదండి.

కథ:

సూర్య (అల్లు అర్జున్) ఒంటి నిండా దేశభక్తిని నింపుకున్న సైనికుడు. సరిహద్దుల్లో దేశం కోసం పని చేసి ప్రాణాలు వదిలేయాలన్నది అతడి కల. ఐతే అతడిలో దేశభక్తితో సమానంగా అంతే స్థాయిలో కోపం కూడా ఉంటుంది. తన కళ్ల ముందు తప్పు జరిగితే తట్టుకోలేడు. ఒళ్లు తెలీకుండా ప్రవర్తిస్తాడు. ఈ క్రమంలో పలుమార్లు పై అధికారుల ఆగ్రహానికి గురై క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటాడు. ఐతే ఒక సందర్భంలో సూర్య ప్రవర్తన పూర్తిగా అదుపు తప్పడంతో అతడిపై వేటు పడుతుంది. మళ్లీ సైన్యంలో చేరాలంటే.. సరిహద్దులకు వెళ్లాలంటే సైకాలజీ ప్రొఫెసర్ అయిన రామకృష్ణమరాజు (అర్జున్) అతడికి మద్దతుగా సంతకం చేయాలన్న షరతు విధిస్తాడు పై అధికారి. మరి సూర్య ఆ ప్రొఫెసర్ మెప్పు పొందాడా.. సరిహద్దులకు వెళ్లాడా.. అన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

‘నా పేరు సూర్య’ గురించి మొదట్నుంచి చిత్ర బృందం చెబుతున్న మాట.. ఇదొక సిన్సియర్ అండ్ హానెస్ట్ ఫిలిం అని. దీని టీజర్.. ట్రైలర్ చూసినా ఆ మాట నిజమే అనిపిస్తుంది. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోను నటించినప్పటికీ కమర్షియల్ హంగుల కోసం ప్రయత్నించకుండా కథే ప్రధానంగా సినిమాను నడిపించారేమో అనిపించింది. ఇదొక ఇంటెన్సిటీతో సాగేలా చిత్రంలా కనిపించింది. ‘నా పేరు సూర్య’ ఆరంభం ఆ అంచనాలకు తగ్గట్లే ఉంటుంది. కథను మొదలుపెట్టిన తీరులో..  హీరో పాత్రను పరిచయం చేసిన విధానంలో ఒక సిన్సియారిటీ.. ఇంటెన్సిటీ కనిపిస్తాయి. హీరో ఇంట్రడక్షన్ సీన్ కూడా కథలో భాగంగానే రావడంతో ఇది చాలా విభిన్నంగా సాగబోతున్న భావన కలిగిస్తుంది. ఐతే పైన చెప్పుకున్న.. సిన్సియారిటీ.. ఇంటెన్సిటీ.. వైవిధ్యం సినిమా అంతటా లేకపోవడం ప్రతికూలత. అరగంట వరకు ఒక తీవ్రతతో నడిచే సినిమా ఆ తర్వాత పడుతూ లేస్తూ సాగుతుంది.  అక్కడక్కడా కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నా.. అల్లు అర్జున్ తన కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించే పెర్ఫామెన్స్ తో శక్తివంచన లేకుండా సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేసినా.. చివరికి ‘నా పేరు సూర్య’ ఓ మోస్తరు చిత్రంగానే మిగులుతుంది.

యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ తో బాధపడే హీరో పాత్ర స్వభావమే ఈ చిత్రానికి ఆకర్షణ. ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’లో ఇలాంటి పాత్ర చూసినా.. ఇది కూడా ఆసక్తి రేకెత్తిస్తుంది. హీరో సహజ స్వభావం చుట్టూ నడిచే సన్నివేశాలే సినిమాకు బలంగా కనిపిస్తాయి. కానీ ఆ స్వభావాన్నే మార్చుకోవడం చుట్టూనే కథను నడిపించాల్సి రావడమే ‘నా పేరు సూర్య’కు ప్రతికూలంగా మారింది. హీరోలోని ఆ మార్పే సినిమా నడతను కూడా మార్చేస్తుంది. కథను ఆరంభించడంలో చూపించిన నేర్పును వక్కంతం వంశీ ఆ తర్వాత చూపించలేకపోయాడు. ఒక ఆసక్తికర సెటప్ రెడీ చేసుకుని కూడా దాని ఆధారంగా కథను ముందుకు తీసుకెళ్లలేకపోయాడు. ఆరంభంలో చూపించిన సిన్సియారిటీని విడిచిపెట్టి కమర్షియల్ హంగులన్నింటి మీద ఆధారపడాల్సిన స్థితిలో పడిపోయాడు. కథలో భాగంగానే అయినప్పటికీ హీరో పాత్రలోనే దూకుడు తగ్గి అతను నీరసపడిపోగానే సినిమా కూడా అలాగే తయారవుతుంది. ఎక్కడైతే హీరోలో దూకుడు కనిపిస్తుందో అప్పుడు మాత్రమే ఉత్సాహం వస్తుంది.

కేవలం హీరో పాత్ర.. దాని చిత్రణ చుట్టూ నడిచే సినిమాలు అప్పుడప్పుడూ వస్తుంటాయి. వక్కంతం వంశీకి రచయితగా మంచి పేరు తెచ్చిపెట్టిన ‘కిక్’.. ‘రేసుగుర్రం’.. ‘టెంపర్’ లాంటి సినిమాలు కూడా ఆ కోవకే చెందుతాయి. దర్శకుడిగా తన తొలి సినిమాలోనూ వంశీ అలాంటి ప్రయత్నమే చేశాడు. హీరో పాత్రనే ఆధారంగా చేసుకుని పలుచనైన కథను చెప్పే ప్రయత్నం చేశాడు. ఐతే కథ విషయంలో తనకు తాను బంధనాలు వేసుకోవడం వల్ల ఆ పాత్రను ఆద్యంతం ఒకే ఇంటెన్సిటీతో చూపించే అవకాశం లేకపోయింది. మిలిటరీ నేపథ్యంలో కథను ఎంచుకోవడం సినిమాకు ఒక కొత్తదనం తీసుకొచ్చింది. ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కూడా ఆసక్తికరంగా సాగుతాయి. కానీ ఎప్పుడైతే మిలిటరీ కాంపౌండ్ వదిలి.. హీరో బయటి ప్రపంచంలోకి వస్తాడో అక్కడి నుంచే ఆసక్తి సన్నగిల్లుతుంది. ఇది సగటు సినిమాలాగే అనిపిస్తుంది. మహా కోపిష్టి అయిన హీరో తన స్వభావాన్ని విడిచిపెట్టాల్సి రావడమే ఇందులో అతడికి ఎదురయ్యే టాస్క్. ఇలాంటి కాన్ఫ్లిక్ట్ పాయింట్ లెక్కలేనన్ని సినిమాల్లో చూశాం. దీంతో ద్వితీయార్ధంలో ఏం జరగబోయేది ముందే అవగాహన వచ్చేస్తుంది.

జరగబోయేదేంటో ముందే అంచనా ఉన్నప్పటికీ.. బలమైన.. ఆసక్తికర సన్నివేశాలు పడితే ప్రేక్షకులు మన్నిస్తారు. కానీ హీరో తన టాస్క్ పూర్తి చేసే క్రమంలో నడిచే ఎపిసోడ్ అంత ఆసక్తికరంగా సాగలేదు. హీరో విలన్ కొడుకుని చితకబాది.. ఆ తర్వాతి రోజు నుంచే వాళ్ల మధ్య తన కోపాన్ని అణచుకుని శాంత స్వభావిలా తిరగాల్సిన పరిస్థితి తలెత్తితే సంఘర్షణను చాలా బలంగా చూపించడానికి అవకాశముంది. కానీ విలన్ల వ్యవహారాన్ని తేల్చి పడేశారు. శరత్ కుమార్ పాత్రను పెద్ద బిల్డప్ తో మొదలుపెట్టి.. తర్వాత దాన్ని తుస్సుమనిపించడంతో.. అసలేమాత్రం స్కోప్ లేకుండా చేయడంతోనే ఆసక్తి తగ్గిపోతుంది. హీరో పాత్ర తిరిగి తన సహజ స్వభావంలోకి మారిపోయి దూకుడుగా ప్రవర్తించడంతో మళ్లీ ప్రేక్షకుల్లో ఉత్సాహం వస్తుంది. అలాంటి స్థితిలో వక్కంతం చేసిన ‘కమర్షియల్’ ఆలోచన అతడి అభిరుచిపై సందేహాలు రేకెత్తిస్తుంది.

హీరో ఉగ్రరూపం దాల్చి.. కదన రంగంలోకి దిగి చెలరేగిపోతున్నపుడు హీరోయిన్ అక్కడికి పరుగెత్తుకొచ్చి వాటేసుకుంటుంది. ఇప్పుడు హీరోయిన్ అక్కడికెందుకొచ్చిందబ్బా అని ఆశ్చర్యపోతుంటే.. వెంటనే ‘ఇరగ ఇరగ’ అంటూ మసాలా పాట మొదలవుతుంది. ‘సరైనోడు’లో డుడు సరైనోడు అంటూ పాటేసుకుంటే ఆ చిత్ర నడత ప్రకారం అదేమీ ఇబ్బందిగా అనిపించదు. కానీ ‘నా పేరు సూర్య’ లాంటి సీరియస్నెస్.. ఇంటెన్సిటీ ఉన్న సినిమాలో ఇలాంటి పాటేంటో.. డ్యాన్సులేంటో.. ఎవరిని మెప్పించడానికో అర్థం కాదు. సీరియస్ మూడ్లో ఉన్న ప్రేక్షకులు కాస్తా డిస్టర్బ్ అయి.. మళ్లీ కుదురుకోవడానికి కొంత సమయం పట్టేలా చేస్తుందీ పాట. పతాక సన్నివేశాలు కూడా మిశ్రమానుభూతిని కలిగిస్తాయి. సినిమాకు భిన్నమైన.. ఆలోచనాత్మక ముగింపు ఇవ్వాలనే ఉద్దేశంలో వంశీ చేసిన ప్రయత్నం అందరికీ రుచిస్తుందా లేదా అన్నది సందేహమే. ఓవరాల్ గా చూస్తే ‘నా పేరు సూర్య’లో చెప్పుకోదగ్గ  సానుకూలతలున్నాయి. అలాగే ప్రతికూలతలూ తక్కువ కాదు. హీరో పాత్ర.. దాని తాలూకు ఇంటెన్సిటీ.. అల్లు అర్జున్ పెర్ఫామెన్స్.. ఆకట్టుకుంటాయి. కానీ మిగతా అంశాలు అంత బాగా కుదరలేదు. ఒక మంచి సినిమా కావడానికి తగ్గ సెటప్ కుదిరినా.. పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయిన భావన కలిగిస్తుంది ‘నా పేరు సూర్య’.

నటీనటులు:

సందేహం లేదు.. పెర్ఫామెన్స్ పరంగా అల్లు అర్జున్ కు కెరీర్లోనే ఇది ఒకానొక ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది. సూర్య పాత్ర తాలూకు ఇంటెన్సిటీని అతను క్యారీ చేసిన విధానం.. అందుకు తగ్గట్లుగా తన రూపాన్ని.. బాడీ లాంగ్వేజ్ ను మార్చుకున్న తీరు మెప్పిస్తుంది. సినిమాను చాలా వరకు అతనే తన భుజాలపై మోశాడు. ఒకరకంగా బన్నీది వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. చాలా చోట్ల సూర్య పాత్ర ద్వారా ప్రేక్షకుల్లో ఉద్వేగం.. ఉద్రేకం తీసుకురావడంలో అతను విజయవంతమయ్యాడు. యాక్షన్ సన్నివేశాల్లో చెలరేగిపోయాడు. పాటల్లో డ్యాన్సులూ మెప్పిస్తాయి. తన లుక్ విషయంలోనూ తీసుకున్న బన్నీ తీసుకున్న కేర్ కూడా కనిపిస్తుంది. హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్ నటన గురించి చెప్పడానికేమీ లేదు. గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆమె పాత్ర మెప్పించదు. హీరో తండ్రిగా.. సైకాలజీ ప్రొఫెసర్ గా అర్జున్ చక్కగా నటించాడు. అతడిని ఇలాంటి పాత్రలో చూడటం కొత్తగా అనిపిస్తుంది. బొమన్ ఇరానీ.. రావు రమేష్ లవి చిన్న పాత్రలు. వాళ్ల ప్రత్యేకతను చాటుకునే అవకాశం పెద్దగా లేకపోయింది. విలన్లుగా శరత్ కుమార్.. అనూప్ సింగ్ ఠాకూర్ చాలా సాధారణంగా కనిపిస్తారు. నదియాకు కూడా పెద్దగా స్కోప్ లేదు.పోసాని.. వెన్నెల కిషోర్ కాస్త నవ్వించారు.

సాంకేతికవర్గం:

విశాల్-శేఖర్ సంగీతం ఓ మోస్తరుగా అనిపిస్తుంది. ‘సైనికా’ పాట ప్రత్యేకంగా ఉంటుంది. ఆ పాట చిత్రీకరణ.. టైమింగ్ కూడా బాగున్నాయి. మిగతా పాటలు పెద్దగా రిజిస్టర్ కావు. నేపథ్య సంగీతం బాగుంది. కానీ అన్ని చోట్లా మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సాగలేదు. రాజీవ్ రవి ఛాయాగ్రహణం సినిమాలో చెప్పుకోదగ్గ ఆకర్షణల్లో ఒకటి. ఈ సినిమా థీమ్ కు తగ్గట్లుగా ఉంది కెమెరా పనితనం. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. సినిమా అంతా రిచ్ గా కనిపిస్తుంది. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ.. దర్శకుడిగా తొలి ప్రయత్నంలో కొంచెం భిన్నమైన.. సిన్సియర్ సినిమానే తీసే ప్రయత్నం చేశాడు. కానీ రాతలో.. తీతలో నిలకడ చూపించలేకపోయాడు. హీరో పాత్రను తీర్చిదిద్దడంలో.. దాన్ని తెరమీద ప్రెజెంట్ చేయడంలో వంశీ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మిగతా పాత్రల పైనా శ్రద్ధ పెట్టాల్సింది. అలాగే కథనాన్ని మరింత బిగువు చూపించాల్సింది. దర్శకుడిగా వంశీకి పాస్ మార్కులు పడతాయి.

చివరగా: ‘సూర్య’ బాగున్నాడు కానీ..

రేటింగ్-2.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS