'యన్.టి.ఆర్-మహానాయకుడు'

Fri Feb 22 2019 GMT+0530 (IST)

'యన్.టి.ఆర్-మహానాయకుడు'

చిత్రం : 'యన్.టి.ఆర్-మహానాయకుడు'

నటీనటులు: నందమూరి బాలకృష్ణ - విద్యా బాలన్ - రానా దగ్గుబాటి - సచిన్ ఖేద్కర్ - కళ్యాణ్ రామ్ - దగ్గుబాటి రాజా - శ్రీతేజ్ - సుమంత్ తదితరులు
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్
మాటలు: సాయిమాధవ్ బుర్రా
కథా సహకారం: శ్రీనాథ్
నిర్మాతలు: నందమూరి వసుంధర - నందమూరి బాలకృష్ణ
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: క్రిష్

నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘యన్.టి.ఆర్’ సినిమాలో తొలి భాగం ‘కథానాయకుడు’ సంక్రాంతికి విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ పరీక్షకు నిలవలేకపోయింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘యన్.టి.ఆర్-మహానాయకుడు’ వచ్చింది. దీని విశేషాలేంటో.. తొలి భాగానికి భిన్నంగా ఇది ప్రేక్షకుల్ని అలరించే అవకాశాలున్నాయో లేదో చూద్దాం పదండి.

కథ:

‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ సినిమా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ప్రకటించడంతో ముగుస్తుంది. ‘మహానాయకుడు’ అక్కడి నుంచి మొదలై.. ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లడం.. అద్భుతమైన జనాదరణతో ముఖ్యమంత్రి పదవి చేపట్టడం.. ఎన్నడూ కనని - వినని రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేయడం.. ఇలా కథ నడుస్తుంది. ఐతే ఎన్టీఆర్ ను గద్దె దించి నాదెండ్ల భాస్కర రావు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తే.. ఎన్టీఆర్ ఎలా తిరిగి ఆ పదవిని దక్కించుకున్నాడన్నదే మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల విషయంలో ఆయా చిత్ర బృందాల నుంచి ఒక మాట వినిపిస్తుంటుంది. తమ సినిమాను రాజకీయ కోణంలో చూడొద్దని.. రాజకీయాల్ని పక్కన పెట్టి సినిమా చూడాలి అని. ఐతే కల్పిత కథలైతే ఓకే కానీ.. ఒక నిజ జీవిత కథనే సినిమాగా తీసినపుడు.. అందులో పూర్తిగా రాజకీయాలే కథాంశం అయినపుడు.. అందులోనూ ఆ సినిమా తీసిందే రాజకీయ ఉద్దేశాలతో అయినపుడు రాజకీయ కోణంలో చూడకుండా ఎలా ఉంటాం? ‘యన్.టి.ఆర్-మహానాయకుడు’ సినిమా ఈ కోవకే చెందుతుంది. ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ సిినిమాలో ప్రధానంగా ఎన్టీఆర్ సినీ జీవితాన్నే చూపించారు. చివర్లో కొద్దిగా రాజకీయాల ప్రస్తావన తెచ్చారు. ఐతే నటుడిగా - వ్యక్తిగా ఎన్టీఆర్ ను ఎంత గొప్పగా చూపించినా.. ఎన్ని ఎగ్జాజరేషన్లు ఉన్నా ఎవరికీ ఇబ్బంది లేదు.

కానీ రాజకీయాలే ప్రధానంగా సినిమా తీసేటపుడు మరీ అతిశయోక్తులు జోడిస్తే.. ముఖ్యమైన అంశాల్ని దాచేసి.. తమకు అనుకూలమైన విషయాల్నే హైలైట్ చేస్తూ సినిమా తీస్తే జనాలకు కచ్చితంగా అభ్యంతరాలు వస్తాయి. తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు.. దాని వ్యతిరేకుల సంగతి వదిలేద్దాం. తటస్థంగా ఉండే సగటు ప్రేక్షకుడికి కచ్చితంగా ఇది అంత రుచించే విషయం కాదు. ‘యన్.టి.ఆర్-మహానాయకుడు’ సినిమా ఇక్కడే ప్రేక్షకుల్ని ఇబ్బంది పెడుతుంది. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో అతి పెద్ద విలన్ చంద్రబాబు నాయుడే అనేది ఎవ్వరైనా అంగీకరించే విషయం. ఎన్టీఆర్ జీవిత చరమాంకంలో ఏం జరిగిందో.. అందులో చంద్రబాబు పాత్ర ఏంటో అందరికీ తెలుసు. కానీ ఈ అంకం మొత్తం పక్కన పెట్టేసి.. చాలా కన్వీనియెంట్ గా.. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం మరణం వరకు మాత్రమే కథను చెప్పడం ద్వారా.. చంద్రబాబులోని ప్రతికూల కోణాన్ని పూర్తిగా అవాయిడ్ చేశారు ‘మహానాయకుడు’లో. ఐతే కనీసం చంద్రబాబు పాత్రే సినిమాలో లేకపోయినా ఓకే అనుకోవచ్చు. కానీ ఆ పాత్ర సినిమాలో కీలకం. పైగా చాలా పాజిటివ్ గా చూపించారు. నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటుతో ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన ఎన్టీఆర్.. తిరిగి ఆ పదవిలో కూర్చోవడంలో చంద్రబాబుదే అత్యంత కీలక పాత్ర అన్నట్లు చూపించారు. చంద్రబాబును అడుగడుగునా హీరోలా చూపించారు. అప్పటికి చంద్రబాబు.. ఎన్టీఆర్ కు సాయమే చేసి ఉండొచ్చు గాక.. కానీ తర్వాత జరిగిన పరిణామాలు జనాలకు తెలియనివి కావు. అలాంటపుడు సినిమాలో చంద్రబాబును అంత సానుకూలంగా చూపిస్తుంటే అంగీకరించడానికి మనసొప్పదు. ‘యన్.టి.ఆర్-మహానాయకుడు’కున్న అతి పెద్ద బలహీనత ఇదే.

‘యన్.టి.ఆర్’ సినిమాను మిగతా సినిమాల్లాగా ఎంత మాత్రం చూడలేం. ఒక సినిమాగా ఇదేమంత ఆసక్తి రేకెత్తించేది కాదు. ఎన్టీఆర్ రాజకీయారంగేట్రం.. ఆపై నాదెండ్ల వెన్నుపోటు.. ఎన్టీఆర్ పోరాటంతో తిరిగి ముఖ్యమంత్రిని దక్కించుకోవడం.. ఇదీ స్థూలంగా ‘యన్.టి.ఆర్’ కథ. రాజకీయాలపై ఆసక్తి ఉన్నవాళ్లే ఈ కథతో కనెక్ట్ కాగలరు. కానీ ఆ రకమైన ఆసక్తి ఉన్నవాళ్లలో ఎంతమందికి సినిమాలో చూపించిన అంశాలు రుచిస్తాయన్నదే సందేహం. నిజానికి చంద్రబాబు వెన్నుపోటు తదనంతర పరిణామాలతో పోలిస్తే నాదెండ్ల పోటు.. అప్పటి పరిణామాలు చిన్నవే అని చెప్పాలి. కానీ ‘మహానాయకుడు’లో వాటినే చాలా పెద్దవిగా చేసి చూపించారు. ఈ ఎపిసోడ్ ను సినిమాలో మరీ సాగదీశారు. అక్కడక్కడా కొన్ని సీన్లు బాగానే ఉన్నా.. ఓవరాల్ గా ఇది సగటు ప్రేక్షకుడిలో అంత ఉత్తేజం కలిగించేదైతే కాదు. తెలుగుదేశం పార్టీని ప్రకటించాక ఎన్టీఆర్ జనాల్లోకి వెళ్లడం.. ప్రచారం చేయడం.. ఎన్నికల్లో అద్భుత విజయం సాధించడం.. దీనికి సంబంధించి ఓ ముప్పావు గంట కథ నడుస్తుంది. అది బాగానే ఉంటుంది కానీ.. ఇంకా బాగా.. ఉత్తేజభరితంగా ఈ సన్నివేశాల్ని తీర్చిదిద్ది ఉండొచ్చనిపిస్తోంది. 37 ఏళ్ల కిందటి వాతావరణాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకురావడం కష్టమని.. ఔట్ డోర్ లోనే చాలా వరకు సన్నివేశాలు లాగించేయడంతో.. సన్నివేశాలు అంత సహజంగా.. నోస్టాల్జిక్ గా అనిపించవు. ‘కథానాయకుడు’లో కృష్ణుడి సన్నివేశం లాగా.. ఇందులో ఎన్టీఆర్ విజయాన్ని క్రిష్ గూస్ బంప్స్ మూమెంట్ గా మార్చలేకపోయాడు. అయినప్పటికీ ప్రథమార్ధం వరకు ‘మహానాయకుడు’ ఓకే అనిపిస్తుంది. కథ పరంగా మలుపులుండటంతో ఫస్టాఫ్ కొంచెం వేగంగానే సాగుతుంది.

కానీ ద్వితీయార్ధానికి వచ్చేసరికి ‘మహానాయకుడు’ సాగతీతగా అనిపిస్తుంది. నాదెండ్ల వెన్నుపోటు తదనంతర పరిణామాల్ని మరీ లెంగ్తీగా చూపించారు. కొన్ని సన్నివేశాలు పూర్తిగా అనవసరం అనిపిస్తాయి. దీనికి తోడు ఎన్టీఆర్ జీవితంలో తర్వాత జరిగిన పరిణామాలు గుర్తుకొచ్చి.. దీన్ని ఇంత పెద్దది చేసి చూపిస్తుండటంతో ఈ సినిమాను అంగీకరించడానికే మనసొప్పదు. ఈ రకంగా ‘మహానాయకుడు’ నిరాశకే గురి చేస్తుంది. మరోవైపు ఎన్టీఆర్ ను మహాత్ముడిగా చూపించే క్రమంలో ‘కథానాయకుడు’లో మాదిరే ఇందులోనూ అతిశయోక్తులకు లెక్కే లేదు. తెలుగుదేశం పార్టీ ఘనవిజయానికి సంబంధించి  మేజర్ క్రెడిట్ ఎన్టీఆర్ దే కావచ్చు. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన మంచి కార్యక్రమాలు చేసి ఉండొచ్చు. కానీ ప్రతిదీ ఆయనే చేసినట్లు.. ప్రతి విషయాన్నీ సానుకూలంగా చూపిస్తూ ఎన్టీఆర్ కు ఎలివేషన్ ఇవ్వడం చికాకు పెడుతుంది. కథ పరంగా అభ్యంతరాలు ఏమీ లేని ‘కథానాయకుడు’నే జనాదరణకు నోచుకోని నేపథ్యంలో అనేక అభ్యంతరాలతో ముడిపడ్డ ‘మహానాయకుడు’ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది సందేహం.

నటీనటులు:

‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ యువ ఎన్టీఆర్ గా చాలా ఎబ్బెట్టుగా కనిపించిన బాలయ్య వయసు మీద పడ్డ ఎన్టీఆర్ గా మాత్రం బాగా కుదిరాడు. ‘మహానాయకుడు’లో పూర్తిగా పెద్ద వయస్కుడిగానే  కనిపించాల్సి రావడంతో బాలయ్య ఇబ్బంది పడలేదు. ప్రేక్షకులనూ ఇబ్బంది పెట్టలేదు. లుక్ పరంగా మెప్పించడంతో పాటు నటన పరంగానూ ఓకే అనిపించాడు. కానీ ఫలానా చోట పెర్ఫామెన్స్ అదిరిపోయింది అనిపించే సన్నివేశాలేమీ ఇందులో లేవు. బసవతారకంగా విద్యాబాలన్ మరోసారి మెప్పించింది. మరీ ఎక్కువ సన్నివేశాలు లేకపోయినా సినిమాలో ది బెస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్.. యాక్టింగ్ ఎవరిదంటే విద్య పేరే చెప్పాలి. ‘మహానాయకుడు’కు విలన్ అయిన నాదెండ్ల భాస్కర రావు పాత్రలో సచిన్ ఖేద్కర్ మెప్పించాడు. చంద్రబాబుగా రానా కూడా బాగానే చేశాడు. కళ్యాణ్ రామ్.. భరత్.. వెన్నెల కిషోర్.. దగ్గుబాటి రాజా.. వీళ్లంతా ఓకే.

సాంకేతిక వర్గం:
సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ‘కథానాయకుడు’లో మాదిరే ‘మహానాయకుడు’లోనూ తన వంతుగా మంచి ఔట్ పుట్ పాటలు అంత రిజిస్టర్ అయ్యేలా లేవు కానీ.. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. కొన్నిచోట్ల బ్యాగ్రౌండ్ స్కో్ర్ తో అవసరానికి మించి ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. జ్నానశేఖర్ ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. నాటి ఎన్టీఆర్ ప్రభంజనాన్ని.. ఆయనకు దక్కిన జనాదరణాన్ని భారీ స్థాయిలో కళ్లకు కట్టినట్లు చూపించడంలో క్రిష్ టీం చూపించలేకపోయింది. చాలా వరకు స్టూడియోల్లో చుట్టేయడం వల్ల సరైన ఫీల్ రాలేదు. ఇక్కడే షూట్ చేసి అమెరికా అని కలరింగ్ ఇవ్వడం ఈ స్థాయి సినిమాకు తగదు. ఇక కథాకథనాలు.. దర్శకత్వం విషయానికి వస్తే.. చాలా పరిమితుల మధ్య క్రిష్ పని చేసిన విషయం సినిమా అంతా తెలుస్తూనే ఉంటుంది. ఏం చెప్పాలి.. ఏం చూపించాలనే విషయంలో ఒక పరిధి గీసుకోవడంతో ‘మహానాయకుడు’ కథ కూడా అంత ఆసక్తికరంగా అనిపించదు. ఉన్న కంటెంట్ ను క్రిష్ బాగా తీశాడు కానీ.. అతను చెప్పిన కథ మాత్రం అంత ఆసక్తికరమైంది కాదు. ఎన్టీఆర్ పాత్ర విషయంలో చాలా చోట్ల అతిశయోక్తులతో నింపేశాడు క్రిష్.

చివరగా: యన్.టి.ఆర్-మహానాయకుడు.. బాలయ్యకు నచ్చినట్లు.. చంద్రబాబు మెచ్చేట్లు!

రేటింగ్-2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre


LATEST NEWS