'మిస్టర్ కేకే'

Fri Jul 19 2019 GMT+0530 (India Standard Time)

'మిస్టర్ కేకే'

చిత్రం : 'మిస్టర్ కేకే'

నటీనటులు: విక్రమ్ - అక్షర హాసన్ - అబి హసన్ తదితరులు
సంగీతం: జిబ్రాన్
ఛాయాగ్రహణం: శ్రీనివాస్ కె.గుత్తా
నిర్మాత: కమల్ హాసన్ - నరేష్ కుమార్ - శ్రీధర్
రచన- - దర్శకత్వం: రాజేష్ ఎం.సెల్వ

కమల్ హాసన్ నిర్మాణంలో విక్రమ్.. ఎంతో ఆసక్తి రేకెత్తించిన కలయిక ఇది. వీళ్ల కాంబినేషన్లో కమల్ శిష్యుడు రాజేష్ సెల్వ రూపొందించిన చిత్రం ‘మిస్టర్ కేకే’ ఆసక్తికర ట్రైలర్తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

వాసు (అబి హసన్) కౌలాలంపూర్ లొోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో డాక్టర్గా పని చేస్తుంటాడు. అతడి భార్య ఆద్య (అక్షర హాసన్) నిండు గర్భిణి. డెలివరీ కోసం ఎదురు చూస్తున్న వీళ్లిద్దరి జీవితాల్లో కేకే (విక్రమ్) అనే వ్యక్తి కారణంగా అల్లకల్లోలం మొదలవుతుంది. ఒకప్పటి సీక్రెట్ ఏజెంట్.. ఆ తర్వాత క్రిమినల్ గా మారిన కేకే కోసం చాలామంది వెతుకుతుంటారు. తన భార్యను కిడ్నాప్ చేసిన వాళ్ల డిమాండ్ మేరకు తాను పని చేసే ఆసుపత్రిలోనే ప్రాణాలతో పోరాడుతున్న కేకేను వాసు బయటికి తీసుకు రావాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అతను కేకేను ఎలా బయటికి తీసుకొచ్చాడు.. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి.. ఇంతకీ కేకే ఎవరు.. అతనేం చేశాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘మిస్టర్ కేకే’ సినిమా థియేటరులోకి వెళ్లి మొదట్లో ఒక పది నిమిషాలు కళ్లు మూసుకుని కూర్చుంటే.. మనకు వినిపించే నేపథ్య సంగీతాన్ని బట్టి తెరమీద అద్భుతాలు జరిగిపోతున్నాయేమో.. తీవ్ర ఉత్కంఠతో కూడిన సన్నివేశాలు నడుస్తున్నాయేమో.. సినిమా సూపర్ థ్రిల్లింగేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ కళ్లు తెరిచి సినిమా చూస్తే మాత్రం అక్కడ ఏ ఉత్కంఠా కనిపించదు. అతి సాధారణంగా సన్నివేశాలు నడిచిపోతుంటాయి. ట్రైలర్ చూసి ఇది పరుగులు పెడుతూ.. ఉత్కంఠభరితంగా సాగిపోయే థ్రిల్లర్ మూవీ అనుకుంటాం. కానీ ఇదంతా ఊరికే బిల్డప్ మాత్రమే అని సినిమా చూస్తున్నపుడే అర్థమవుతుంది. ట్రైలర్ను అదిరిపోయే రేంజిలో కట్ చేయించిన రాజేష్ సెల్వ.. ఆ నైపుణ్యాన్ని సినిమాలో ఎంతమాత్రం చూపించలేకపోయాడు. అవసరం లేని బిల్డప్.. గందరగోళంగా సాగే కథాకథనాలు ‘మిస్టర్ కేకే’ను నీరుగార్చేశాయి. దర్శకుడు ఈ సినిమాతో ఏం చెప్పాలనుకున్నాడన్నది ‘ఎండ్’ టైటిల్స్ పడ్డాక కూడా అర్థం కాదంటే ఎంత గందరగోళంగా సినిమాను నడిపించాడో అర్థం చేసుకోవచ్చు.

తీవ్ర గాయాలతో పోలీసుల చేతికి చిక్కిన హీరో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉంటాడు. అతడి ఫొటో తీసి.. తమ డేటా బేస్ లోని క్రిమినల్స్ ఫొటోలతో మ్యాచ్ చేసి చూస్తుంటారు. ఉన్నట్లుండి ఒక ఫొటోతోో మ్యాచ్ అవుతుంది. ఆ తర్వాత అతడి గురించి వివరాలు తెలుసుకుని పోలీసులు షాకైపోతారు. ఒకప్పుడు సీక్రెట్ ఏజెంట్ గా అతడి ఘనతలు.. ఆ తర్వాత క్రిమినల్ రికార్డ్స్.. రకరకాల వేషాలతో అతను చేసిన మోసాలు.. వగైరా అన్నీ చెబుతూ ‘హి ఈజ్ వెరీ డేంజరస్’ అంటూ చెమటలు తుడుచుకుంటూ బెంబేలెత్తిపోతారు పోలీసులు. ఆ సీన్ చూసి అబ్బబ్బా.. ఇలాంటోడి కథను చూడబోతున్నామా అని ఆ సమయానికి థ్రిల్లయిపోతాం. కానీ అప్పటికి మాటల్లో కనిపించిన బిల్డప్ కు తగ్గట్లుగా ఆ తర్వాత విక్రమ్ పాత్ర ఎంతమాత్రం నడవదు. ఒకరి తర్వాత ఒకరు రావడం.. హీరోను ఒకచోటి నుంచి ఇంకోచోటికి తీసుకెళ్లడం.. అతడి కోసం కొట్టేసుకోవడం.. చంపేసుకోవడం.. ఇలాగే సగం పుణ్య కాలం గడిచిపోతుంది. ఇంతలోనే ఇంటర్వెల్ కార్డ్ పడేసరికి.. అసలింతకీ ఎవడ్రా ఈ కేకే.. ఏంట్రా ఈ సస్పెన్స్.. ఎందుకు ఇంత బిల్డప్ అని ఫ్రస్టేట్ అయిపోతాం.

సెకండాఫ్ మొదలవ్వగానే సస్పెన్స్ రివీల్ చేయగానే.. బాబోయ్ ఈ మాత్రం దానికా ఈ బిల్డప్ అనిపిస్తుంది. మన ప్రేక్షకులకు అసలేమాత్రం కనెక్టవని పాయింట్ చుట్టూ కథను అల్లుకున్నాడు రాజేష్ సెల్వ. ఒక సినిమాగా తీయడానికి సరిపోయే పాయింట్ ఎంతమాత్రం కాదది. ప్రథమార్ధంలోని నత్తనడక..అనాసక్తికర సన్నివేశాలకు తోడ...సెకండాఫ్ లో సస్పెన్స్ వీడే సన్నివేశం కూడా తేలిపోవడంతో  సినిమాపై ఆసక్తి దాదాపుగా చచ్చిపోతుంది. ఐతే ఇక్కడి నుంచి ప్రేక్షకులు విక్రమ్ నుంచి హీరోయిజం.. యాక్షన్ ఎపిసోడ్లు.. ఛేజింగ్ సీన్లు పడటంతో ద్వితీయార్ధం కాస్త మెరుగ్గా నడుస్తుంది. కానీ పతాక సన్నివేశానికి వచ్చేసరికి మళ్లీ సినిమా గ్రాఫ్ పడిపోతుంది. గర్భిణి అయిన అక్షర హాసన్ ను అంతలా హింసించడం ఏంటో అర్థం కాదు. ఎప్పుడెప్పుడు ఈ సన్నివేశం ముగుస్తుందా అనుకుంటే.. దాన్ని సాగదీసి వదిలిపెట్టారు. అసలు అక్షర హాసన్.. ఆమె భర్తతో ముడిపడ్డ సన్నివేశాలతో కూడిన థ్రెడ్ ఈ సినిమాకు అవసరమే లేదనిపిస్తుంది. రెండు గంటలే నిడివి ఉన్నప్పటికీ.. ప్రేక్షకులకు కనెక్ట్ కాని కథ.. అనవసర సన్నివేశాలతో లేజీగా సాగే కథనం వల్ల ‘మిస్టర్ కేకే’ భారంగా అనిపిస్తుంది. సాంకేతిక హంగులు.. విక్రమ్ స్టైలిష్ పెర్ఫామెన్స్ మినహాయిస్తే చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు.

నటీనటులు:

కథల ఎంపికలోో పొరబాట్లు చేస్తాడు కానీ.. తనకు ఇచ్చిన పాత్ర ఏదైనా దానికి పూర్తి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాడు విక్రమ్. మరోసారి కథ విషయంలో ఆయన తప్పులో కాలేశాడు. కానీ కేకే పాత్రలో ఆయన పెర్ఫామెన్స్ అదుర్స్. విక్రమ్ లుక్.. బాడీ లాంగ్వేజ్.. ఫిజిక్ అన్నీ కూడా పాత్రకు భలేగా సెట్టయ్యాయి. కానీ పాత్ర లుక్ మీద పెట్టినంత శ్రద్ధ.. క్యారెక్టర్ డిజైనింగ్ లో లేకపోవడమే విచారకరం. అక్షర హాసన్ సినిమాలో ఉందంటే ఉంది. కొన్ని సన్నివేశాల్లో ఆమె అభినయం బాగుందనిపిస్తుంది కానీ.. ఈ పాత్ర సినిమాకు కానీ.. ఈ పాత్ర వల్ల ఆమె కెరీర్ కు కానీ పెద్దగా ఉపయోగం లేదు. ఆమె భర్త పాత్రలో చేసిన కొత్త కుర్రాడు అబి హసన్ బాగా చేశాడు. మిగతా నటీనటులందరూ దాదాపుగా మనకు పరిచయం లేని వాళ్లే. ఎవరి పెర్ఫామెన్స్ ప్రత్యేకంగా చెప్పుకునేలా లేదు.

సాంకేతికవర్గం:

సినిమా ఎలా ఉన్నా ‘మిస్టర్ కేకే’కు అసలైన హీరో మాత్రం జిబ్రానే. నేపథ్య సంగీతం మామూలుగా ఇవ్వలేదతను. తొలి సన్నివేశం నుంచి చివరి దాకా చాలా స్టైలిష్ గా.. గూస్ బంప్స్ ఇచ్చేలా బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. కానీ అతను ఎంత ఎలివేట్ చేయాలని చూసినా సన్నివేశాల్లో బలం లేక సినిమా తేలిపోయింది. శ్రీనివాస్ కె.గుత్తా ఛాయాగ్రహణం కూడా చాలా స్టైలిష్ గా.. రిచ్ గా సాగింది. విజువల్స్ హాలీవుడ్ సినిమాల్ని తలపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే. ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించాడు కమల్ హాసన్. ఐతే కమల్ శిష్యుడు రాజేష్ సెల్వనే దర్శకుడిగా నిరాశ పరిచాడు. ‘మిస్టర్ కేకే’తో పోలిస్తే అతను తీసిన తొలి సినిమా ‘చీకటి రాజ్యం’ ఎంతో మెరుగనిపిస్తుంది. సరైన కథ రాసుకోకుండా.. కథనంలో బిగి లేకుండా కేవలం టేకింగ్ తో నెట్టుకొచ్చేయాలని చూశాడతను.

చివరగా: మిస్టర్ కేకే.. బిల్డప్ ఎక్కువ విషయం తక్కువ

రేటింగ్-2/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre


LATEST NEWS