మీకు మాత్రమే చెప్తా

Fri Nov 01 2019 GMT+0530 (IST)

మీకు మాత్రమే చెప్తా

చిత్రం : 'మీకు మాత్రమే చెప్తా’

నటీనటులు: తరుణ్ భాస్కర్ - అభినవ్ గోమఠం - వాణి భోజన్ - అనసూయ భరద్వాజ్ - అవంతిక - నవీన్ జార్జ్ థామస్ - పావని గంగిరెడ్డి - వినయ్ వర్మ తదితరులు

సంగీతం: శివకుమార్

ఛాయాగ్రహణం: మదన్ గుణాదేవా

మాటలు: షమ్మీర్ సుల్తాన్ - తరుణ్ భాస్కర్

నిర్మాత: విజయ్ దేవరకొండ - వర్ధన్ దేవరకొండ

కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: షమ్మీర్ సుల్తాన్

‘పెళ్ళిచూపులు’తో దర్శకుడిగా - హీరోగా నిలదొక్కుకున్న తరుణ్ భాస్కర్ - విజయ్ దేవరకొండ.. ఇప్పుడు కొత్త అవతారాలెత్తి తీసిన సినిమా ‘మీకు మాత్రమే చెప్తా’. ఇందులో తరుణ్ హీరో అయితే.. విజయ్ నిర్మాత. షమ్మీర్ సుల్తాన్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం.. ఆసక్తికర టీజర్ - ట్రైలర్లతో యువ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. ఈ రోజే విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాల్ని ఏమేరకు అందుకుందో చూద్దాం పదండి.

కథ:

రాకేష్ (తరుణ్ భాస్కర్) ఒక టీవీ ఛానెల్లో వీడియో జాకీ కమ్ ప్రోగ్రాం డైరెక్టర్. తాను ప్రేమించిన డాక్టర్ స్టెఫీ (వాణి భోజన్)తో పెళ్లికి రెడీ అవుతున్న తరుణంలో గతంలో ఓ సినిమా కోసం షూట్ చేసిన అతడి ఇంటిమేట్ వీడియో ఒకటి బయట పడుతుంది. అది ఇంటర్నెట్లో ప్రత్యక్షం కావడంతో రాకేష్ టెన్షన్ పడిపోతాడు. అప్పటికే పలుమార్లు స్టెఫీ దగ్గర అబద్ధాలు చెప్పి దొరికిపోయిన రాకేష్.. ఈ వీడియో సంగతి దాచి పెట్టే ప్రయత్నం చేస్తాడు. దాన్ని ఇంటర్నెట్ నుంచి తొలగించడానికి అతను ఎలాంటి ప్రయత్నాలు చేశాడు.. ఈ లోపు వీడియో ఎలా వైరల్ అయింది.. చివరికి స్టెఫీకి నిజం తెలిసిందా లేదా.. తదుపరి పర్యవసానాలేంటి అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

నిజ జీవితంలో మనల్ని అతలాకుతలం చేసే సమస్యలే తెరపై ప్రధాన పాత్రధారులకు ఎదురై వాళ్లు కిందా మీద అయిపోతున్నపుడు మనకు భలే సరదాగా అనిపిస్తుంది. ఓవైపు ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందన్న ఉత్కంఠను అనుభవిస్తూనే.. ఆ సమస్య వల్ల పాత్రధారులు విలవిలలాడిపోతున్న వైనాన్ని సరదాగా డీల్ చేస్తే ఎంజాయ్ చేస్తాం. ఇలాంటి కోవలో నడిచే సినిమానే ‘మీకు మాత్రమే చెప్తా’. ఒక సీరియస్ సమస్యను ఫన్నీగా డీల్ చేస్తూ వినోదాన్ని పంచే చిత్రమిది. పోర్న్ వెబ్ సైట్లో మన వీడియో ఒకటి అప్ లోడ్ అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచనే కంపించిపోయేలా చేస్తుంది. ‘మీకు మాత్రమే చెప్తా’లో కథానాయకుడు ఇదే సమస్యతో షేక్ అయిపోతుంటే సరదాగా ఉంటుంది. కంటెంపరరీగా అనిపించే కథను ఎంచుకుని దాన్ని పూర్తిగా సిచువేషనల్ కామెడీతో నడిపించి యువ ప్రేక్షకుల్ని ఓ మోస్తరుగా ఎంటర్టైన్ చేశాడు కొత్త దర్శకుడు షమ్మీర్ సుల్తాన్. కాకపోతే  ఆ సమయానికి ఏదో అలా టైంపాస్ చేయించేసినా.. ప్రేక్షకుల మనసులపై బలమైన ముద్ర వేయలేకపోవడం ‘మీకు మాత్రమే చెప్తా’లో పెద్ద బలహీనత.

‘మీకు మాత్రమే చెప్తా’లో చెప్పుకోదగ్గ కథేమీ లేదు. ప్లాట్ పాయింట్ ఏంటన్నది కాసేపటికే తెలిసిపోతుంది. తన వీడియో బయటపడ్డాక దాన్ని డెలీట్ ేచేయించడానికి హీరో ఎలాంటి పాట్లు పడ్డాడు.. దాని పర్యవసనాలేంటి అనే లైన్ మీదే కథంతా నడుస్తుంది. ఎప్పుడూ మనం చూసే ‘సినిమా’ డైలాగుల్లాగా కాకుండా నిజంగా ఇలాంటి సమస్యను డీల్ చేస్తున్న ఇద్దరు మిత్రులు ఫ్రస్టేషన్లో ఏం మాట్లాడుకుంటారు అనే ఆలోచన నుంచి పుట్టిన సహజమైన డైలాగులు సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి. ప్రతి డైలాగ్ వినోదాత్మకంగా ఉండటం.. ప్రధాన పాత్రధారులైన తరుణ్ భాస్కర్.. అభినవ్ గోమఠం ఇద్దరూ కూడా మంచి టైమింగ్ తో వాటిని పలకడం.. వాళ్ల హావభావాలు కూడా ఈ కథకు చక్కగా సరిపోవడంతో సినిమా అంతటా కామెడీకి ఢోకా లేకపోయింది. బడ్డీ ఫిలిమ్స్ ను ఇష్టపడే కుర్రకారుకు ‘మీకు మాత్రమే చెప్తా’ బాగానే వినోదం పంచుతుంది. సినిమా ఆద్యంతం సిచువేషనల్ కామెడీ మీదే నడుస్తుంది తప్ప.. ప్రత్యేకమైన సెటప్ అంటూ ఏమీ లేదు.

ఐతే కథలో పెద్దగా లోతు లేకపోవడం.. సింగిల్ లైన్లో అయిపోయే కథ కావడంతో ఒక దశ దాటాక కథనాన్ని నడిపించడం దర్శకుడికి కష్టమైంది. మొదట్లో కొత్తగా అనిపించే సన్నివేశాలు.. డైలాగులు ఒక దశ దాటాక రిపిటీటివ్ గా అనిపించి ప్రేక్షకులు బోర్ ఫీలవుతారు. ద్వితీయార్దంలో కామెడీ తగ్గి గందరగోళం పెరగడం వల్ల కూడా ప్రేక్షకుల దృష్టి మళ్లుతుంది. ఈ కథను మరీ సింపుల్ గా ముగించేస్తే బాగుండదని.. చివర్లో ఒకదాని తర్వాత ఒకటి రెండు ట్విస్టులిచ్చారు. అందులో అభినవ్ పాత్రకు సంబంధించిన ట్విస్టు సదరాగా అనిపిస్తుంది కానీ.. అనసూయ క్యారెక్టర్ ట్విస్ట్ కృత్రిమంగా అనిపిస్తుంది. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం నిడివి తక్కువే అయినా.. అది సినిమా మీద అప్పటిదాకా ఉన్న ఇంప్రెషన్ ను పెంచకపోగా తగ్గిస్తుంది. కథాకథనాలు.. ప్రొడక్షన్ డిజైన్ షార్ట్ ఫిలిమ్స్ కు ఎక్కువ.. సినిమాకు తక్కువ అనే తరహాలో ఉండటంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని సీరియస్ గా తీసుకోవడం కూడా కష్టమే. బడ్డీ ఫిలిమ్స్ ను ఎంజాయ్ చేసే మల్టీప్లెక్స్ యూత్ కు ఈజీగా టైంపాస్ చేయించే ఈ చిత్రం మిగతా వాళ్లకు అంతగా రుచించకపోవచ్చు.

నటీనటులు:

తరుణ్ భాస్కర్ మంచి నటుడనే విషయం ‘ఫలక్ నుమా దాస్’తోనే రుజువైంది. ఆ చిత్రంలో తక్కువ సన్నివేశాల్లోనే తన ప్రత్యేకతను చాటుకున్న తరుణ్.. ఈసారి ఫుల్ లెంగ్త్ హీరో పాత్రలో భలేగా చేశాడు. టెన్షన్ తో అల్లాడిపోయే పాత్రలో అతడి హావభావాలు భలే ఫన్నీగా అనిపిస్తాయి. అతను డైలాగులు పలికిన తీరు కూడా ఆకట్టుకుంది. రాకేష్ పాత్రకు అతను పూర్తిగా న్యాయం చేశాడు. ఈ సినిమాతో తరుణ్ తనకంటూ ఒక స్టయిల్ క్రియేట్ చేసుకోవడం విశేషం. అభినవ్ గోమఠం హీరోకు దీటైన పాత్రలో అదరగొట్టాడు. సినిమాలో కామెడీ క్రెడిట్లో ఎక్కువ శాతం అతడికే చెందుతుంది. అభినవ్ కామెడీ టైమింగ్ బాగుంది. వాయిస్ కూడా ఎసెట్. మంచి పాత్రలు పడితే అతను వెన్నెల కిషోర్ లాగా మంచి రేంజికి వెళ్లే అవకాశముంది. సినిమాలో అల్లరంతా తరుణ్.. అభినవ్ లదే. మిగతా వాళ్లకు పెద్దగా స్కోప్ దొరకలేదు. హీరోయిన్ వాణి భోజన్ పర్వాలేదు. ఆమె పాత్ర సాధారణంగా అనిపిస్తుంది. పెర్ఫామెన్స్ కు పెద్దగా స్కోప్ లేదు. అవంతిక.. పావనిల గురించి చెప్పుకునే స్థాయిలో వాళ్ల పాత్రలు లేవు. వినయ్ వర్మ ఉన్నంతసేపూ ఆకట్టుకున్నాడు. పాపా పాత్రలో చేసిన కుర్రాడు ఆకట్టుకున్నాడు. అనసూయ ఓకే.

సాంకేతిక వర్గం:

శివకుమార్ దర్శకుడి అభిరుచికి తగ్గట్లు.. సినిమా నడతకు సరిపోయేట్లు నేపథ్య సంగీతం సమకూర్చాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఉత్సాహభరితంగా.. సరదాగా అనిపిస్తుంది. సినిమాలో ఒకటీ అరా బిట్ సాంగ్స్ వస్తాయంతే. అవి పర్వాలేదు. మదన్ ఛాయాగ్రహణం కూడా సినిమాకు తగ్గట్లుగా సాగింది. విజయ్ దేవరకొండ నుంచి ఆశించే స్థాయిలో నిర్మాణ విలువలు లేవు. చాలా ఖర్చు పెట్టేసినట్లు అతను కలరింగ్ ఇచ్చాడు కానీ.. ప్రొడక్షన్ వాల్యూస్ ఏమీ కనిపించలేదు సినిమాలో. మరీ తక్కువ ఖర్చుతో చుట్టేసినట్లు అనిపిస్తుంది. ‘మీకు మాత్రమే చెప్తా’ ఒక సినిమా చూసిన ఫీలింగ్ కలిగించకపోవడానికి నిర్మాణ విలువలు కూడా ఒక కారణమే. ఇక రచయిత దర్శకుడు షమ్మీర్ సుల్తాన్.. తరుణ్ భాస్కర్ శైలిని అనుసరించాడు. ‘ఈ నగరానికి ఏమైంది తరహా’లో బడ్డీ ఫిలింను లైట్ హ్యూమర్ తో నడిపించాడు. అర్బన్ యూత్ కనెక్టయ్యేలా కామెడీ పండించడంలో విజయవంతం అయినా.. బలమైన కథ రాసుకోకపోవడం.. కథనంలో బిగి లేకపోవడంతో అతడికి యావరేజ్ మార్కులు పడతాయి.

చివరగా: మీకు మాత్రమే చెప్తా.. కాలక్షేపానికి మాత్రమే

రేటింగ్-2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS