‘మేడ మీద అబ్బాయి’

Sat Sep 09 2017 GMT+0530 (IST)

‘మేడ మీద అబ్బాయి’

చిత్రం : ‘మేడ మీద అబ్బాయి’

నటీనటులు: అల్లరి నరేష్ - నిఖిల - అవసరాల శ్రీనివాస్ - హైపర్ ఆది - సత్యం రాజేష్ - జయప్రకాష్ - తులసి - రవిబాబు తదితరులు
సంగీతం: షాన్ రెహమాన్
ఛాయాగ్రహణం: కున్ జున్ని
కథ: వినీత్ శ్రీనివాసన్
నిర్మాత: బొప్పన చంద్రశేఖర్
దర్శకత్వం: ప్రజీత్

అల్లరి నరేష్ హిట్టు కొట్టి ఐదేళ్లు దాటిపోయింది. ఈ ఐదేళ్లలో రెండంకెల సంఖ్యలో సినిమాలు చేశాడు కానీ.. ఏదీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఐతే రొటీన్ కామెడీ సినిమాలతో పనవ్వట్లేదని ఈసారి కొంచెం భిన్నమైన సినిమాతో వచ్చాడు నరేష్. మలయాళంలో విజయవంతమైన ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ చిత్రం రీమేక్ లో నటించాడతను. అదే.. మేడ మీద అబ్బాయి. మరి ఈ చిత్రమైనా నరేష్ కు ఆశించిన ఫలితాన్నందించేలా ఉందా.. చూద్దాం పదండి.

కథ:

బీటెక్ లో ఉన్న 24 సబ్జెక్టులూ ఫెయిలై ఇంటి దగ్గర ఆవారాగా తిరుగుతుంటాడు శ్రీను (అల్లరి నరేష్). ఊళ్లో అందరూ అతణ్ని చులకనగా చూస్తుండటంతో ఏదో ఒకటి చేసి అందరికీ సమాధానం చెప్పాలనుకుంటుంటాడు. సినిమాల్లోకి వెళ్లి డైరెక్టర్ అయిపోవాలనుకున్న శ్రీను.. ముందు షార్ట్ ఫిలిం తీసే ప్రయత్నంలో పడతాడు. అది బెడిసికొడుతుంది. ఆ తర్వాత నేరుగా హైదరాబాద్ వెళ్లి సినిమా ప్రయత్నాలు మొదలుపెడతాడు. అవీ ఫలించవు. దీంతో తిరిగి ఇంటికి బయల్దేరతాడు. ఐతే హైదరాబాద్ ప్రయాణంలో భాగంగా శ్రీను తన పక్కింటి అమ్మాయి సింధు (నిఖిల)తో దిగిన ఫొటో అతణ్ని పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఇంటికి రాగానే తండ్రితో పాటు ఊళ్లో వాళ్లు అతడి మీద పడతారు. ఇంతకీ అతను తీసుకున్న సెల్ఫీ వల్ల ఏం జరిగింది.. దాని వల్ల శ్రీనుకు ఎదురైన ఇబ్బందులేంటి.. వాటి నుంచి అతను ఎలా బయటపడ్డాడు.. సింధు ఏమైంది అన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

గత కొన్నేళ్లలో అల్లరి నరేష్ సినిమాలు తేడా కొట్టాయంటే అతడి కామెడీ రొటీన్ గా ఉంటుండటం వల్ల.. చాలా వరకు స్పూఫులు.. పేరడీలతో ఆ సినిమాల్ని నింపేయడం వల్ల. అంతే తప్ప కేవలం కామెడీ వల్ల వచ్చిన ఇబ్బందంటూ ఏమీ లేదు. ఇప్పటికీ నరేష్ నుంచి ప్రధానంగా ఆశించేది కామెడీనే. ఐతే ‘మేడ మీద అబ్బాయి’లో నరేష్ పాత్ర నుంచి ఆ కామెడీ దాదాపుగా నిల్. అల్లరి నరేష్ సినిమాలో ఎంతమంది కమెడియన్లున్నా.. ప్రధానంగా అతను పండించే వినోదమే సినిమాకు ప్రధాన ఆకర్షణ అయ్యేది. అందరి కంటే ఎక్కువ అతనే నవ్వించేవాడు. కానీ ‘మేడ మీద అబ్బాయి’లో నరేష్ చేతులు కట్టేశారు.

తాను కామెడీ చేస్తేనే జనాలకు నచ్చట్లేదనుకున్నాడో ఏమో.. నరేష్ చాలా పరిమితుల్లో ఉండిపోయాడు. అసలు సినిమాలో కామెడీ పాళ్లే తక్కువ. కొంత వరకు కథనాన్ని సరదాగా నడిపించి.. ఆ తర్వాత వదిలేశారు. పోనీ సీరియస్ గా సాగే మిగతా కథ అయినా కొత్తగా... పకడ్బందీగా ఉందా.. ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తుందా అంటే అదీ లేదు. మొత్తానికి ‘మేడ మీద అబ్బాయి’ రెంటికీ చెడ్డ సినిమా. నరేష్ మార్కు కామెడీ లేదు. అంత కొత్తగానూ లేదు. ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ మలయాళంలో సూపర్ హిట్. ఐతే మాతృకకు దర్శకత్వం వహించిన ప్రజీతే తెలుగులోనూ దర్శకత్వం వహించినప్పటికీ.. అతను ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయాడు. తెలుగు నేటివిటీని పట్టుకోవడంలో.. సరైన టోన్లో ఈ కథను చెప్పడంలో.. ఒరిజినల్లో మాదిరి సహజత్వం తీసుకురావడంలో అతను విఫలమయ్యాడు.

‘జబర్దస్త్’లు.. ‘పటాస్’లు ఇచ్చే వినోదాన్నే సినిమాల్లోనూ ఇస్తే ప్రేక్షకులకు కొత్తగా ఏమీ అనిపించట్లేదు. ఇలాంటపుడు ప్రేక్షకులు ఆశించే సునిశితమైన హాస్యాన్ని వెండితెర మీద పండించడం సవాలుగా మారిపోయింది. నరేష్ సినిమాలు ఫెయిలవుతున్నది ఇక్కడే. ఐతే ఇంతకుముందు వరుసబెట్టి స్పూఫులు.. పేరడీలు చేస్తూ వచ్చిన నరేష్.. ‘మేడ మీద అబ్బాయి’లో అలాంటివి అస్సలు ట్రై చేయలేదు. అది రిలీఫే కానీ.. అసలతను కామెడీ చేయడానికి కూడా పెద్దగా ప్రయత్నించకపోవడం నిరాశ కలిగిస్తుంది. ఎప్పుడూ వేరే క్యారెక్టర్ల మీద పంచులు వేసే అతను.. ఈసారి తన మీద హైపర్ ఆది పంచులు పేల్చుతుంటే చూస్తుండిపోయాడు. ఐతే సినిమాలో చెప్పుకోదగ్గ వినోదం అంటే ఆ పంచులే.

‘జబర్దస్త్’లో తనకు అలవాటైన పంచుల్నే ఇక్కడా కొనసాగించాడు ఆది. ఐతే ‘జబర్దస్త్’లో అతడి ఎపిసోడ్లు చూస్తే పంచ్ వేయడం కోసం సీన్ క్రియేట్ చేసుకోవడం గమనించవచ్చు. ‘మేడ మీద అబ్బాయి’లో కూడా అలాగే చేశారు. సన్నివేశానికి ఎంత మేరకు అవసరం అని చూడకుండా పంచులు పేర్చారు. ఇలా చేయడం వల్ల సీన్ మధ్యలో పంచ్ అన్నట్లు కాకుండా.. చాలా చోట్ల పంచుల కోసం సన్నివేశాలు సాగుతున్నట్లే అనిపిస్తుంది. అంతే కాక దీని వల్ల ఒక కథతో ట్రావెల్ చేస్తున్నట్లుగా కూడా అనిపించదు. కానీ సినిమాలో సినిమాలో ఎంత మేరకు సింక్ అయ్యాయి అన్నది పక్కనబెడితే చెప్పుకోదగ్గ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఆది పంచుల కామెడీనే అనడంలో సందేహం లేదు.

ప్రథమార్ధం అంతా విలేజ్ సెటప్ లో నరేష్-ఆది-సత్యం రాజేష్ బ్యాచ్ చేసే కామెడీ మీద ఏదో అలా సోసోగా సాగిపోతుంది. ఇక ఇంటర్వెల్ ముందు నుంచి కథ సీరియస్ టర్న్ తీసుకుంటుంది. ఒక చిన్న సెల్ఫీ వల్ల హీరో చాలా పెద్ద ఇబ్బందుల్లో పడిపోతాడు. సరిగ్గా వివరిస్తే తేలిపోయే.. తేలిగ్గా పరిష్కరించడానికి అవకాశమున్న సమస్యను.. చాలా పెద్దది చేసి.. దాని చుట్టూ కథను నడిపించడం అసహజంగా అనిపిస్తుంది. ఇక్కడే కథ ట్రాక్ తప్పుతుంది. హీరోయిన్ కోసం హీరో.. అతడు స్నేహితుడు.. డిటెక్టివ్ కలిసి వేట సాగించే సన్నివేశాలు ఏమంత ఆసక్తి కలిగించవు. హీరోయిన్ దొరికాక ఆమె లవర్ని పట్టుకోవడానికి సాగించే ప్రయాణమూ అంతే.

ఇక్కడ సైబర్ క్రైమ్స్.. సోషల్ మీడియా వల్ల తలెత్తే దుష్పరిణామాలపై ఫోకస్ పెట్టారు. ఐతే ఇదేమంత కొత్తగా.. ఉత్కంఠభరితంగా అనిపించదు. హీరోయిన్ని మొదట్లో మెచ్యూర్డ్ అమ్మాయిలా చూపించి.. ఆమెను ఆన్ లైన్ ప్రేమతో బుట్టలో పడిపోయి లక్షలు మోసపోయిన అమాయకురాలిగా.. చూపించడం అంత కన్విన్సింగ్ గా అనిపించదు. హీరో-హీరోయిన్ మధ్య ప్రేమ బంధమే లేకపోవడం ఒక మైనస్ గా అనిపిస్తే.. అందులోనూ లీడ్ హీరోయిన్ని ఇలా చూపించడం అంత జీర్ణించుకోలేని విషయమే. దీని వల్ల ఎమోషనల్ కనెక్ట్ అన్నది మిస్సయిపోతుంది. చివరి 20 నిమిషాల్లో కొన్ని మలుపులతో.. సీరియస్ గా కథను చెప్పడం వల్ల కొంత ఎంగేజ్ చేసినప్పటికీ చివరికి ప్రత్యేకమైన అనుభూతి అయితే కలగదు. ప్రథమార్ధంలో ఉన్న వినోదం.. రెండో అర్ధంలో మిస్సయింది. నరేష్ ఓ దశ దాటాక సినిమాలో ప్యాసివ్ అయిపోవడమూ నిరాశ కలిగించేదే. ఓవరాల్ గా నరేష్ కొంచెం భిన్నంగా ప్రయత్నించే క్రమంలో మూలాలు మరిచిపోవడంతో ‘మేడ మీద అబ్బాయి’ ఎటూ కాని సినిమా అయిపోయింది.

నటీనటులు:

నరేష్ తన వంతుగా సిన్సియర్ ఎఫర్టే పెట్టాడు.. బాగానే నటించాడు కానీ.. అతడి నుంచి ఆశించే వినోదం లేకపోవడం నిరాశే. అతడి పాత్ర హీరోలా కాకుండా సపోర్టింగ్ తరహాలో కనిపించడం నిరాశ కలిగించేదే. నరేష్ ప్రత్యేకతను చాటిచెప్పే సన్నివేశాలు ఇందులో పెద్దగా లేవు. హీరోయిన్ నిఖిల్ చూడ్డానికి హోమ్లీగా బాగుంది. నటన ఓకే. కానీ ఆమె పాత్రను కూడా తేల్చేశారు. మెచ్యూర్డ్ అమ్మాయిలా కనిపించే నిఖిల.. ఈ పాత్రకు సూటవ్వలేదు. అవసరాల శ్రీనివాస్ తన పాత్రకు న్యాయం చేశాడు. హైపర్ ఆది వెండితెర మీదా తనదైన శైలిలో పంచులు పేల్చుతూ ఆకట్టుకున్నాడు. బిగ్ స్క్రీన్ మీద కూడా అతడి కాన్ఫిడెన్సేమీ తగ్గలేదు. జయప్రకాష్.. తులసి తమకు అలవాటైన తల్లిదండ్రుల పాత్రల్లో కనిపించారు. సత్యం రాజేష్ పర్వాలేదు.

సాంకేతికవర్గం:

‘మేడ మీద అబ్బాయి’ సాంకేతికంగా చాలా బలహీనంగా అనిపిస్తుంది. షాన్ రెహమాన్ పాటల్లో ఒకటి పర్వాలేదు. నేపథ్య సంగీతం మలయాళ సినిమాల తరహాల్లో ట్రై చేశాడు కానీ.. ఇక్కడ సినిమాను నడిపించిన తీరుకు అది సెట్టవ్వలేదు. ప్రథమార్ధంలో కథనం నడిచే తీరుకు.. అతడి నేపథ్య సంగీతం ఏమాత్రం సరిపోలేదు. ఓవరాల్ గా కూడా మ్యూజిక్ నిరాశ కలిగిస్తుంది. కున్ జున్ని ఛాయాగ్రహణం మామూలే. నిర్మాణ విలువలు చాలా సాదాసీదాగా అనిపిస్తాయి. దర్శకుడు ప్రజీత్ తన సినిమాను తెలుగులో తీసే ముందు ఇక్కడి నేటివిటీని కొంచెం స్టడీ చేయాల్సిందేమో. మలయాళంలో చాలా పెద్ద హిట్టయిన ఈ సినిమా తెలుగులోకి వచ్చేసరికి చాలా మామూలుగా అనిపించిందంటే అది దర్శకుడి వైఫల్యం కూడా.

చివరగా: మేడ మీద ‘మామూలు’ అబ్బాయి

రేటింగ్- 2/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS