'మజిలీ'

Fri Apr 05 2019 GMT+0530 (IST)

'మజిలీ'

చిత్రం : 'మజిలీ'

నటీనటులు: అక్కినేని నాగచైతన్య-సమంత-దివ్యాంశ కౌశిక్-రావు రమేష్-పోసాని కృష్ణమురళి-సుహాస్-సుబ్బరాజు-రవిప్రకాష్-అతుల్ కులకర్ణి తదితరులు
సంగీతం: గోపీసుందర్
నేపథ్య సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: విష్ణు శర్మ
నిర్మాతలు: సాహు గారపాటి-హరీష్ పెద్ది

ప్రేమకథలతో అనేక విజయాలందుకున్న కథానాయకుడు అక్కినేని నాగచైతన్య. వరుసగా మూడు ఫ్లాపుల తర్వాత తనకు అచ్చొచ్చిన జానర్లో అతను చేసిన సినిమా ‘మజిలీ’. చైతూ భార్య సమంత మళ్లీ అతడితో జతకట్టిన చిత్రమిది. ‘నిన్ను కోరి’తో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే మెప్పించిన శివ నిర్వాణ రూపొందించిన చిత్రమిది. మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

పూర్ణ (నాగచైతన్య) విశాఖపట్నంలో ఐటీఐ చదువుకుంటూ క్రికెట్లో ఎదగాలని ప్రయత్నిస్తున్న కుర్రాడు. అతడికి అనుకోకుండా అన్షు (దివ్యాంశ కౌశిక్) పరిచయమవుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ అనూహ్య పరిస్థిితుల్లో అన్షు.. పూర్ణకు దూరమవుతుంది. దీంతో అతను పిచ్చోడైపోతాడు. తాగుడుకు బానిసవుతాడు. ఈ స్థితిలో అతడికి శ్రావణి (సమంత)తో పెళ్లవుతుంది. కానీ శ్రావణిని పట్టించుకోకుండా తన శైలిలో తాను బతుకుతుంటాడు పూర్ణ. ఇంతకీ అన్షు అతడికెందుకు దూరమైంది.. ఆమె ఏమైంది.. పూర్ణ కోసం శ్రావణి ఏం చేసినా.. అతను మామూలు మనిషయ్యాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

ప్రేమకథ.. అత్యంత విజయవంతమైన జానర్లలో ఒకటి. సినిమాకు మహరాజ పోషకులైన యువతను బాగా ఆకట్టుకోవడానికి అవకాశమున్న జానర్ ఇది. ఈ రోజుల్లో సమాజంలో ప్రేమకు నిర్వచనం మారిపోతున్న నేపథ్యంలో ఒక ప్రేమకథ ద్వారా ప్రేక్షకుల్లో ఫీల్ తీసుకురావడం అన్నది చాలా కష్టమైన విషయం అయిపోయింది. దీనికి తోడు ప్రేమకథలన్నీ కూడా చాలా వరకు ఒకేలా ఉంటాయి. కొత్తదనం చూపడానికి అవకాశం తక్కువ. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రేమకథలు తెలుగులో అరుదైపోతున్నాయి. ఐతే ప్రేక్షకులు రిలేట్ చేసుకునే పాత్రల్ని రాసుకుని.. వాటిలో జీవం నింపితే.. మన కథనో.. మన పక్కవాళ్ల కథనో చూస్తున్నాం అనిపించే భావన ప్రేక్షకుల్లో తీసుకురాగలిగితే ఆ ప్రేమకథలు మంచి విజయం సాధించడానికి అవకాశముంటుంది. ‘నిన్ను కోరి’తో ఈ విషయాన్నే రుజువు చేసిన కొత్త దర్శకుడు శివ నిర్వాణ.. ‘మజిలీ’తో మరోసారి మ్యాజిక్ చేశాడు.

కథ పరంగా కొత్తదనం ఏమీ లేకపోయినా.. క్యారెక్టర్లను ఓన్ చేసుకుని వాటి తాలూకు భావోద్వేగాల్ని ప్రేక్షకులు ఫీలయ్యేలా చేయడంలోనే ‘మజిలీ’ ప్రత్యేకత దాగుంది. పూర్ణ.. శ్రావణి.. ఈ పాత్రలు రెండింటితోనూ బాగా కనెక్టయ్యేలా చేయగలిగాడు దర్శకుడు శివ నిర్వాణ. ప్రేమలో విఫలమై పూర్ణ పడుతున్న బాధను మనమూ అనుభవిస్తాం. అదే సమయంలో అతడి ప్రేమకు నోచుకోలేక శ్రావణి పడే వేదనా మనకు అర్థమవుతుంది. ఈ రెండు పాత్రల్ని తీర్చిదిద్దిన వైనం ఒకెత్తయితే.. వాటిని చైతూ-సమంత పెర్ఫామ్ చేసిన తీరు మరో ఎత్తు. కాబట్టే ఈ రెండు పాత్రలూ ప్రేక్షకుడితో పాటే బయటికి వస్తాయి. కథ ఎక్కడా కొత్తగా అనిపించకపోయినా.. సినిమా మొత్తంలో తెలిసిన.. చూసిన సన్నివేశాలే ఉన్నప్పటికీ.. ప్రధాన పాత్రలతో కనెక్టయిపోవడం.. ఎక్కడా ‘ఫీల్’కు లోటు లేకపోవడంతో ‘మజిలీ’తో ప్రేక్షకుల మజిలీ సాఫీగా సాగిపోతుంది.

‘నిన్ను కోరి’లో పెళ్లికి ముందు ప్రేమలోని తియ్యదనాన్ని.. పెళ్లి తర్వాత ప్రేమలోని గొప్పదనాన్ని చాలా బ్యాలెన్సింగ్ గా చెప్పి ప్రేక్షకుల్ని మెప్పించాడు శివ నిర్వాణ. దాదాపుగా మళ్లీ అలాంటి కథనే చెప్పాడతను. కానీ ఇక్కడ అతను ఎంచుకున్న నేపథ్యం.. పాత్రలు భిన్నమైనవి. కానీ ‘మజిలీ’లో సైతం అతను పాటించిన సమతూకం మెప్పిస్తుంది. ప్రథమార్ధం చూస్తున్నంతసేపూ తొలి ప్రేమలోని మాధుర్యం ఎలాంటిదో తెలుస్తుంది. ద్వితీయార్ధమంతా పెళ్లి తర్వాత ప్రేమలోని గాఢత అర్థమవుతుంది. క్రికెట్ నేపథ్యాన్ని ఎంచుకోవడం.. ఆహ్లాదకరమైన ప్రేమ సన్నివేశాల వల్ల ‘మజిలీ’ ప్రథమార్దం కొంచెం కొత్తగా అనిపిస్తుంది. వేగంగా సాగుతుంది. కొత్తమ్మాయి దివ్యాంశ వల్ల కూడా లవ్ స్టోరీలో ఒక తాజాదనం కనిపిస్తుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా సరదాగా సాగిపోవడంతో ప్రథమార్ధం వేగంగా ముగిసిన భావన కలుగుతుంది.

ఐతే ఇంటర్వెల్ సమయానికి ద్వితీయార్దంలో కథ ఎలా సాగొచ్చో ఒక అంచనా వచ్చేయడం పూర్తిగా సీరియస్నెస్ సంతరించుకోవడం సెంటిమెంట్ డోస్ పెరగడం వల్ల ద్వితీయార్ధం నెమ్మదిగా సాగిన ఫీలింగ్ వస్తుంది. రొటీన్ సీన్స్ కొంచెం ఇబ్బంది పెడతాయి. కానీ భావోద్వేగాలకు మాత్రం లోటు లేదు. చాలా లవబుల్ గా అనిపించే సమంత పాత్ర.. ఆమె పెర్ఫామెన్స్ రెండో అర్ధానికి ప్రధాన ఆకర్షణ. తాగుడుకు బానిసైన భర్తను తండ్రి తిడుతుంటే.. భర్త అతడిని వెనకేసుకురావడం అన్నది చూడ్డానికి చమత్కారంగా అనిపించే విషయం. ఇలాంటి సన్నివేశాలే ద్వితీయార్ధానికి బలమయ్యాయి. ‘‘మీరు ఆయన తాగుడు మానేయాలని కోరుకుంటున్నారు. కానీ నేను ఆయన మనసుకు తగిలిన గాయం మానాలని కోరుకుంటున్నాను’’ అనే డైలాగ్ ద్వితీయార్ధం తాలూకు ఎసెన్స్ ను తెలియజేస్తుంది.

సినిమాను కన్వీనియెంట్ గా ముగించడానికి దర్శకుడు కొంచెం సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నాడు. మొదట్నుంచి సినిమాలో ఉన్న సహజత్వం ఒక దశ తర్వాత లోపించినట్లు అనిపిస్తుంది. నాటకీయత కొంచెం ఎక్కువైందనిపిస్తుంది. అయినప్పటికీ పాత్రలతో సాగే ప్రయాణంలో కొంచెం పెద్ద మనసు చేసుకోవచ్చు. ప్రి క్లైమాక్స్ దగ్గర ‘మజిలీ’ కొంచెం బలహీన పడ్డట్లు అనిపించినా.. సింపుల్ గా ఉంటూనే ఎమోషనల్ గా అనిపించే క్లైమాక్స్.. మంచి డైలాగులు.. చైతూ-సమంతల పరిణతితో కూడిన నటన అంతకుముందు దొర్లిన లోపాల్ని కవర్ చేసేస్తాయి. పతాక సన్నివేశం తెలియకుండానే కన్నీళ్లు తెప్పించి.. మంచి ఫీల్ తో.. ఎమోషన్ తో థియేటర్ నుంచి బయటికి అడుగులు వేసేలా చేస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే తెలిసిన కథనే.. ప్రేక్షకులు మెచ్చే పాత్రలు.. బలమైన ఎమోషన్లతో అందంగా చెప్పిన సినిమా ‘మజిలీ’. అక్కడక్కడా కథనం కొంచెం నెమ్మదించడం.. ద్వితీయార్దంతో నాటకీయత ఎక్కువవడం మినహా ఇందులో చెప్పుకోదగ్గ లోపాలేమీ లేవు.

నటీనటులు:

అక్కినేని నాగచైతన్య కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రల్లో ఒకటి పూర్ణ. అతను చేసిన అత్యంత కష్టమైన పాత్రల్లో ఇదొకటి. రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో అతను చూపించిన వైవిధ్యం మెప్పిస్తుంది. 20 ఏళ్ల కుర్రాడు ఆ వయసులో ఎలా ఉంటాడో అలా కనిపించిన చైతూ.. ప్రేమలో విఫలమై తాగుడుకు బానిసైన వ్యక్తిగా కూడా అతికినట్లు సరిపోయాడు. రెండు పాత్రల్లోనూ మెప్పించాడు. ముఖ్యంగా ద్వితీయార్దంలో.. పతాక సన్నివేశంలో అతడి నటన కట్టి పడేస్తుంది. ప్రేమకథలతో మెప్పించడంలో తన బలాన్ని చైతూ మరోసారి చాటుకున్నాడు. ఇక శ్రావణి పాత్రలో సమంత నటన కూడా అమోఘం. ఆమె కనిపించేది సగం సినిమాలోనే అయినా బలమైన ముద్ర వేసింది. ఆమెకు కూడా ఇది వన్ ఆఫ్ ద కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్సెస్ అనడంలో సందేహం లేదు. కొత్తమ్మాయి దివ్యాంశ కూడా మెప్పించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్..చలాకీ నటన ఆకట్టుకుంటాయి. ఆమె వల్ల సినిమాకు ఒక తాజాదనం వచ్చింది. రావురమేష్ తన అనుభవాన్ని మరోసారి చూపించారు. పోసాని తనదైన శైలిలో వినోదం పంచాడు. హీరో ఫ్రెండుగా చేసిన కొత్త కుర్రాడు సుహాస్ గుర్తుండిపోతాడు. అతను సహజమైన నటనతో మెప్పించాడు. మీరా పాత్రలో చేసిన చిన్నమ్మాయి అదరగొట్టింది. సుబ్బరాజు.. అతుల్ కులకర్ణి పాత్రలకు తగ్గట్లు నటించారు.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గా ‘మజిలీ’ ఉన్నతంగా అనిపిస్తుంది. ‘నిన్నుకోరి’ స్థాయిలో కాదు కానీ.. గోపీసుందర్ పాటలు బాగానే ఉన్నాయి. ఏడు మల్లెలెత్తు.. ప్రియతమా ప్రియతమా పాటలు వెంటాడుతాయి. మిగతా పాటలూ ఈ స్థాయిలో ఉంటే బాగుండేది. తమన్ నేపథ్య సంగీతం కూడా చక్కగా కుదిరింది. సన్నివేశాల్ని ఎలివేట్ చేసేందుకు ఉపయోగపడింది. ద్వితీయార్ధమంతా మంచి ఫీల్ తో సాగింది ఆర్ఆర్. విష్ణు శర్మ ఛాయాగ్రహణం ఆహ్లాదంగా అనిపిస్తుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. సినిమా అవసరమైన మేర ఖర్చు పెట్టారు. ఇక రచయిత.. దర్శకుడు శివ నిర్వాణ తన తొలి సినిమాకు దీటుగా ‘మజిలీ’ని నిలబెట్టాడు. ప్రేమకథల్ని డీల్ చేయడంలో అతడి నైపుణ్యం మరోసారి తెరపై కనిపించింది. తెలిసిన కథనే అతను అందంగా చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రధాన పాత్రల్ని తీర్చిదిద్దిన తీరుతోనే అతను ప్రేక్షకుల మనసు గెలిచాడు. శివ చాలా చోట్ల తన పెన్ పవర్ చూపించాడు. ‘‘ఆమె షిప్.. నువ్వు బోట్.. ఎక్కడ మ్యాచ్ అవుతుందిరా’’ అంటే.. ‘‘రెండూ వెళ్లేది నీళ్ల మీదే కదరా’’ అంటాడు హీరో. ఇలాంటి సింపుల్ అండ్ బ్యూటిఫుల్ డైలాగ్స్ సినిమాలో చాలా ఉన్నాయి. నరేషన్ కొంచెం స్లో అన్నది తప్పితే శివ దర్శకత్వంపై కంప్లైంట్స్ ఏమీ లేవు.

చివరగా: మజిలీ.. గుర్తుండిపోయే ప్రేమ ప్రయాణం

రేటింగ్-2.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in TheatreLATEST NEWS