‘మహానుభావుడు’

Fri Sep 29 2017 GMT+0530 (India Standard Time)

‘మహానుభావుడు’

చిత్రం: ‘మహానుభావుడు’
నటీనటులు: శర్వానంద్ - మెహ్రీన్ కౌర్ - వెన్నెల కిషోర్ - నాజర్ - కళ్యాణి నటరాజన్ - ఆనంద్ - జబర్దస్త్ వేణు - భద్రం తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: నిజార్ షఫి
నిర్మాతలు: వంశీ - ప్రమోద్
కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: మారుతి

మొదట్లో ఎక్కువగా సీరియస్ సినిమాలు చేసి.. ఆ తర్వాత ఎంటర్టైనర్ల బాట పట్టిన కథానాయకుడు శర్వానంద్. ఇక మారుతి మొదట్నుంచి ఎంటర్టైనర్లతోనే అలరిస్తున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘మహానుభావుడు’ ఆసక్తికర ప్రోమోలతో జనాల్ని బాగానే ఆకర్షించింది. మరి సినిమాగా ఇది ఏమేరకు మెప్పించిందో చూద్దాం పదండి.

కథ:

ఆనంద్ (శర్వానంద్) అతి శుభ్రత అనేది బలహీనత మారిపోయే ఓసీడీ అనే డిజార్టర్ తో బాధపడే కుర్రాడు. కానీ అతడి డిజార్టర్ అవతలి వాళ్లకు ఇబ్బంది కానీ.. అతను మాత్రం దాన్నో క్వాలిఫికేషన్ లాగా భావిస్తుంటాడు. అలాంటి కుర్రాడు.. తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న మేఘన (మెహ్రీన్ కౌర్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతణ్ని ప్రేమించి తన తండ్రికి విషయం చెబుతుంది. ఆయన కూడా వీళ్ల పెళ్లికి సరే అంటాడు. ఐతే ముందు ఆనంద్ బలహీనతను తేలిగ్గానే తీసుకున్న మేఘనకు తర్వాత దాని తీవ్రత అర్థమవుతుంది. దీంతో అతణ్ని అసహ్యించుకుని దూరంగా వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఈ పరిస్థితుల్లో తన ప్రేమను గెలిపించుకోవడానికి ఆనంద్ ఏం చేశాడన్నదే మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

మారుతి తీసిన ‘భలే భలే మగాడివోయ్’ యునీక్ గా అనిపించే సినిమా. మతిమరుపు అనే బలహీనత మీద ఒక పూర్తి స్థాయి సినిమాను నడిపించడం అన్నది పెద్ద సవాలే. కానీ మారుతి ఆ సవాలును తేలిగ్గా ఛేదించాడు. ‘మతిమరుపు’ అనే అంశం చుట్టూ వినోదంతో పాటు రొమాన్స్.. ఎమోషన్లను కూడా నడిపించడం.. ప్రేక్షకులకు కనెక్ట్ చేయడం అందులోని ప్రత్యేకత. ఐతే ముందే అన్నట్లు ఇది యునీక్ సినిమా. అలాంటి వాటిని అనుకరించే ప్రయత్నం చేసినా.. మళ్లీ ఆ ఫార్మాట్లో కథలు నడిపించే ప్రయత్నం చేసినా బెడిసికొట్టేందుకు మెండుగా అవకాశాలుంటాయి. వేరే దర్శకులే కాదు.. మారుతి కూడా అదే తరహా ప్రయత్నం చేస్తాడని అనుకోం. ఐతే మారుతి మాత్రం అదే పని చేశాడు. ‘మహానుభావుడు’ కథను చిన్న చిన్న మార్పులతో దాదాపుగా ‘భలే భలే..’ స్టయిల్లోనే నడిపించాడు.

అక్కడ మతిమరుపు బలహీనత అయితే.. ఇక్కడ అతిశుభ్రత అనేది సమస్య. అక్కడి లాగే ఇక్కడా ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. అందులో అమ్మాయి ప్రేమిస్తుంటే తండ్రి అసహ్యించుకుంటుంటాడు. ఇక్కడ అమ్మాయి తండ్రి అతణ్ని ఇష్టపడుతుంటే అమ్మాయి అతణ్ని అసహ్యించుకుంటుంది. ఇక ‘మతిమరుపు’ లాగే ‘అతిశుభ్రత’ కాన్సెప్ట్ ఎలాగూ ఉంది. ఆరంభం నుంచి చివరి దాకా దాని చుట్టూ కామెడీ పండించేందుకు ప్రయత్నం చేశాడు మారుతి. ఐతే ‘భలే భలే..’తో పోలిక కారణంగా.. టీజర్లోనే ‘ఓసీడీ’ గురించి విప్పేయడం వల్ల ‘మహానుభావుడు’ కొత్తగా అయితే ఏమీ అనిపించదు. కానీ అంచనాలకు తగ్గట్లుగా కథను నడిపిస్తూనే.. ప్రేక్షకులకు వినోదం పంచడంలో మాత్రం మారుతి విజయవంతమయ్యాడు. కీలకమైన కొన్ని సందర్భాల్లో కథ లాజిక్కులకు అందకుండా సాగినప్పటికీ.. ఎంటర్టైన్మెంట్ వరకు ఢోకా ఉండదు. చక్కటి లీడ్ పెయిర్.. వాళ్ల మధ్య మంచి కెమిస్ట్రీ.. వినసొంపైన సంగీతం.. ప్లెజెంట్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాలోని లోపాల్ని కవర్ చేస్తాయి.

ఓసీడీ డిజార్డర్ అంటే ఏదో మొదట్లో అలా చూపించేసి.. తర్వాత వేరే వ్యవహారాల్లోకి వెళ్లిపోకుండా.. ఆరంభం నుంచి చివరి దాకా ఆ థ్రెడ్ చుట్టూనే కథాన్ని నడిపించాడు మారుతి. హీరో పాత్ర పరిచయం.. అతడి ప్రేమ.. అతడి ఎమోషన్లు.. అతడి సమస్యలు అన్నీ కూడా ఓసీడీ చుట్టూనే ముడిపడి ఉంటాయి. ఒక అమ్మాయిని ప్రేమించడానికి కూడా ఆమె శుభ్రతే అతడికి కారణంగా కనిపిస్తుంది. ఓసీడీతో ముడిపడ్డ సన్నివేశాలన్నింటిలోనూ మారుతి మార్కు చమత్కారం అడుగడుగునా కనిపిస్తుంది. ప్రత్యేకంగా కామెడీ ట్రాక్స్ అంటూ ఏమీ లేకుండా.. హీరో క్యారెక్టరైజేషన్ చుట్టూ సిచువేషనల్ కామెడీ పండిచడంలో మారుతి విజయవంతమయ్యాడు. తనకు కొరియర్ ఇవ్వడానికి వచ్చిన కుర్రాడి బైక్ కు బురద అంటిందని కడిగేయడంతో మొదలుపెడితే.. హీరో అతిశుభ్రతతో ముడిపడ్డ సన్నివేశాలన్నీ సరదాగా సాగిపోతాయి. హీరోయిన్ తో రొమాంటిక్ ట్రాక్ సైతం సరదాగా సాగిపోవడం.. మంచి పాటలు.. విజువల్స్ తోడవడంతో ప్రథమార్ధం హాయిగా.. వేగంగా గడిచిపోతుంది.

ద్వితీయార్ధంలో పల్లెటూరి నేపథ్యంలో సాగే వ్యవహారం రొటీన్ గా అనిపిస్తుంది. కుస్తీ పోటీల్లో ఏ ఊరు గెలిస్తే ఆ ఊరి పెద్దే సర్పంచ్ అంటూ ఒక కాన్సెప్ట్ ఏదో చూపించారు. ఈ వ్యవహారమంతా మనల్ని 80ల్లోకి తీసుకెళ్తుంది. సినిమాలో అది ఏమాత్రం సింక్ అవ్వలేదు. దీంతో సెకండాఫ్ లో కథనం కొంచెం ఎగుడుదిగుడుగా సాగుతుంది. ఐతే ప్రథమార్ధంలో క్యామియోలా కనిపించే వెన్నెల కిషోర్ ను ద్వితీయార్ధంలో మారుతి చాలా బాగా వాడుకున్నాడు. శర్వాకు  కిషోర్ తోడవడంతో వినోదానికి ఢోకా లేకపోయింది. గ్రాఫ్ కొంచెం డౌన్ అయినపుడల్లా శర్వా-కిషోర్ కలిసి నిలబెడతారు. వాళ్లిద్దరి కామెడీ కెమిస్ట్రీ అదిరిపోతుంది. ఈ ఇద్దరి మధ్య ‘గుసగుసల’ పంచులు భలేగా పేలాయి. పరస్పరం కాంప్లిమెంట్ చేసుకుంటూ వీళ్లిద్దరూ కావాల్సినన్ని నవ్వులు పండించారు. మళ్లీ ముగింపు దశకు వచ్చే సరికి ఆ కుస్తీ పోటీల వ్యవహారం రొటీన్ గా సాగి కొంచెం ఇబ్బంది పెడుతుంది. సినిమా ముగింపులో ఇచ్చిన కొసమెరుపు మాత్రం ఆకట్టుకుంటుంది.

హీరో జబ్బు పడిందని తన తల్లిని కూడా దగ్గరికి రానివ్వకపోవడం.. ఒక మనిషి ప్రాణాలు పోతున్నా ఓసీడీ అతడిని డామినేట్ చేయడం.. చివర్లో హీరోయిన్ వచ్చి కసి రగల్చగానే ఎన్నో ఏళ్లుగా సాధన చేస్తున్న మల్లయోధుడిని హీరో మట్టికరిపించేయడం.. ఇవన్నీ ‘మహానుభావుడు’లో లాజికల్ గా అనిపించని విషయాలు. మామూలుగా అయితే వీటిని జీర్ణించుకోవడం కష్టం కానీ.. మారుతి ఆద్యంతం వినోదానికి ఢోకా లేకుండా చూసుకున్నాడు కాబట్టి ఈ లోపాల్ని ప్రేక్షకులు కొంచెం లైట్ తీసుకునే అవకాశముంది. ఓసీడీ కాన్సెప్టే చుట్టూ పండించిన కామెడీ ‘మహానుభావుడు’కు పెద్ద బలం కాగా.. దీనికి తోడు అన్ని రకాలుగా మెప్పించే హీరో హీరోయిన్లు.. వాళ్ల రొమాన్స్.. మంచి సంగీతం.. ఛాయాగ్రహణం కూడా సినిమాను ప్లెజెంట్ గా మార్చే అంశాలు. క్లీన్ ఎంటర్టైన్మెంట్ తో యువ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా మెప్పించే అంశాలుండటం దసరా సీజన్లో ‘మహానుభావుడు’కు కలిసొచ్చే విషయం.

నటీనటులు:

శర్వానంద్ మరోసారి తానెంతటి విలక్షణ నటుడో రుజువు చేశాడు. ఓసీడీ డిజార్డర్ ఉన్న కుర్రాడిగా అతను జీవించేశాడు. ఆ పాత్రకు తగ్గ బాడీ లాంగ్వేజ్.. మేనరిజమ్స్.. నటనతో శర్వా అదరగొట్టేశాడు. నిజంగానే ఓసీడీ ఉన్న వ్యక్తిలాగా కనిపించాడు శర్వా. అతడి కామెడీ టైమింగ్ ఈ సినిమాలో మరింత మెరుగైంది. హీరోయిన్ మెహ్రీన్ కౌర్ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో పోలిస్తే కొంచెం నాజూగ్గా.. మరింత అందంగా తయారైన మెహ్రీన్.. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. తెరమీద హీరోయిన్ కనిపించినపుడల్లా ఒక ప్లెజెంట్ ఫీలింగ్ కలుగుతుంది. కుర్రాళ్లకు ఈ అమ్మాయి భలేగా నచ్చేస్తుందనడంలో సందేహం లేదు. ఆమె నటన కూడా బాగానే సాగింది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఆకట్టుకుంటాయి. హీరో హీరోయిన్ల తర్వాత ఎక్కువ స్కోర్ చేసేది వెన్నెల కిషోరే. తనదైన కామెడీ టైమింగ్ తో.. హావభావాలతో అలరించాడు కిషోర్. నాజర్ తనకు అలవాటైన తండ్రి పాత్రలో ఓకే అనిపించాడు. మిగతా వాళ్లంతా మామూలే.

సాంకేతికవర్గం:

తమన్ చాన్నాళ్ల తర్వాత మంచి ఫీల్ ఉన్న మ్యూజిక్ ఇచ్చాడు. అతడి సంగీతం సినిమాకు పెద్ద బలం. పాటలన్నీ బాగున్నాయి. వాటి చిత్రీకరణ.. ప్లేస్మెంట్ కూడా బాగుండటంతో సినిమాకు సాంగ్స్ ఆకర్షణగా మారాయి. తమన్ నేపథ్య సంగీతం పర్వాలేదు. నిజార్ షఫి ఛాయాగ్రహణం కూడా బాగుంది. విజువల్స్ ఆద్యంతం రిచ్ గా... ప్లెజెంట్ గా అనిపిస్తాయి. యువి క్రియేషన్స్ వాళ్ల నిర్మాణ విలువలకు ఢోకా లేదు. ఇక ‘బాబు బంగారం’తో నిరాశ పరిచిన మారుతి.. ఈసారి మళ్లీ తన మార్కు చూపించాడు. ఈ తరం ప్రేక్షకుల అభిరుచిపై తనకు మంచి అవగాహన ఉందని అతను మరోసారి రుజువు చేశాడు. కొన్ని చోట్ల ఎక్స్ ట్రీమ్ కు వెళ్లిపోయినప్పటికీ ఓసీడీ డిజార్డర్ చుట్టూ పండించిన వినోదంలో మారుతి ప్రత్యేకత కనిపిస్తుంది. ఐతే ఓసీడీ డిజార్డర్ అనే పాయింట్ మినహాయిస్తే ఇందులో కొత్తదనం లేదు. నిజానికి ఆ డిజార్డర్ మీద తెలుగులో ఇది తొలి సినిమానే కానీ.. హాలీవుడ్లో దీనిపై చాలా సినిమాలొచ్చాయి. మలయాళంలోనూ ఈ మధ్యే ఓ సినిమా వచ్చింది. వాటి స్ఫూర్తితోనే తనదైన వినోదం కలబోసి ‘మహానుభావుడు’ను తీర్చిదిద్దాడు మారుతి. కథ విషయంలో అతను కొత్తగా చేసిందేమీ లేదు. లాజిక్కుల గురించి కూడా పట్టించుకోవాల్సింది. ఓవరాల్ గా మారుతి ఈజ్ బ్యాక్ అనే చెప్పాలి.

చివరగా: మహానుభావుడు.. అలరిస్తాడు

రేటింగ్- 3/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS