మాస్ట్రో

Fri Sep 17 2021 GMT+0530 (IST)

మాస్ట్రో

చిత్రం : మాస్ట్రో

నటీనటులు: నితిన్-తమన్నా-నభా నటేష్-నరేష్-జిష్ణుసేన్ గుప్తా-శ్రీముఖి-శ్రీనివాసరెడ్డి-మంగ్లీ-రచ్చ రవి-హర్షవర్ధన్ తదితరులు
సంగీతం: మహతి స్వర సాగర్
ఛాయాగ్రహణం: యువరాజ్
మూలకథ: శ్రీరామ్ రాఘవన్-అరిజీత్ బిశ్వాస్-పూజ సుర్తి-యోగీష్ చందేకర్-హేమంత్ రావు
అడిషనల్ స్క్రీన్ ప్లే: మేర్లపాక గాంధీ-షేక్ దావూద్
నిర్మాతలు: సుధాకర్ రెడ్డి-నిఖితా రెడ్డి
రచన-దర్శకత్వం: మేర్లపాక గాంధీ

కరోనా కాలంలో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీ బాట పట్టిన మరో క్రేజీ మూవీ.. మాస్ట్రో. బాలీవుడ్ హిట్ మూవీ ‘అంధాదున్’కు రీమేక్గా నితిన్ ప్రధాన పాత్రలో యువ దర్శకుడు మేర్లపాక గాంధీ రూపొందించిన ఈ చిత్రం హాట్ స్టార్ ద్వారా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

అరుణ్ (నితిన్) ఒక పియానో ప్లేయర్. ప్రపంచానికి అతను ఒక అంధుడి లాగా కనిపిస్తాడు. కానీ నిజానికి అతడికి కళ్లు కనిపిస్తాయి. ఓ ప్రమాదంలో తనకు కళ్లు పోయినట్లు చెప్పుకుంటూ పియానో క్లాసులు చెబుతూ వీలు దొరికిన చోట కన్సర్ట్స్ చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో అతడికి సోఫీ (నభా నటేష్) పరిచయం అవుతుంది. అమ్మకానికి సిద్ధమైన ఆమె రెస్టారెంట్.. అరుణ్ రోజూ చేసే పియానో షో కారణంగా మళ్లీ పుంజుకుంటుంది. అక్కడే అరుణ్ పెర్ఫామెన్స్ చూసి ఇంప్రెస్ అయిన ఒకప్పటి సినీ నటుడు మోహన్ (నరేష్).. తన రెండో భార్య (సిమ్రన్)తో తన వివాహ వార్షికోత్సవానికి ఇంటికొచ్చి ప్రైవేట్ కన్సర్ట్ చేయాల్సిందిగా అతణ్ని కోరతాడు. చెప్పినట్లే మోహన్-సిమ్రన్ ల వెడ్డింగ్ డే రోజు వాళ్ల ఇంటికి వెళ్లిన అరుణ్ కు అక్కడ అనూహ్య పరిణామాలు ఎదురవుతాయి. అవేంటి.. వాటి వల్ల అరుణ్ జీవితం ఎలా మలుపులు తిరిగింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

‘‘రీమేక్ చేయడం చాలా కష్టం. ఉన్నదున్నట్లు తీస్తే కాపీ పేస్ట్ అంటారు. మార్పులు చేర్పులు చేస్తే మాతృకను చెడగొట్టారు అంటారు’’.. ‘మాస్ట్రో’ ప్రమోషన్లలో దర్శకుడు మేర్లపాక గాంధీ.. హీరో నితిన్ అన్న మాటలివి. రీమేక్ సినిమాల విషయంలో చాలామంది చెప్పే రొటీన్ మాటలే ఇవి. ఓ భాషలో ఘనవిజయం సాధించిన సినిమాలోని ఆత్మను పట్టుకోవడం.. అందులోని మ్యాజిక్ ను రీక్రియేట్ చేయడం అంత తేలికైన విషయం కాదు. చాలా వరకు ఉన్నదున్నట్లుగా తీసినా.. ఒరిజినల్లో ఉన్న ఫీల్ ఇక్కడ కనిపించవు. ఎక్కడ తేడా జరిగిందో.. ఏం మిస్ అయిందో చెప్పడం కూడా కష్టమవుతుంది. ‘మాస్ట్రో’ సైతం ఈ కోవలోని సినిమానే. హిందీలో సెన్సేషనల్ హిట్టయిన థ్రిల్లర్ మూవీ ‘అంధాదున్’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఫెయిత్ ఫుల్ రీమేక్ లాగే కనిపించినా.. మాతృకలో ఉన్నంత బిగి.. ఉత్కంఠ మాత్రం ఇక్కడ మిస్సయ్యాయి. కనిపించదు. కాస్టింగ్ పరంగా ఎవరికి వారు బాగానే చేసినట్లు కనిపించినా.. ఒరిజినల్లోని ముఖ్య పాత్రధారుల్లా ఇంపాక్ట్ వేయడంలో వాళ్లు విఫలమయ్యారు. ఒరిజినల్లోని లోపాలను సవరించకుండా.. ఇల్లాజికల్ అనిపించేలా ఈ సినిమాను తీర్చిదిద్దడం లోపం. ‘అంధాదున్’తో పోలికలను పక్కన పెట్టి మామూలుగా చూసినా ఇందులో ఏదో మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది.

‘మాస్ట్రో’లో కథకు అత్యంత కీలకమైన ఓ సన్నివేశంలో ఎలా లాజిక్ మిస్సయి సినిమా మీద ఇంప్రెషన్ ఎలా తగ్గించేసిందో ఒకసారి చూద్దాం. ఈ రోజుల్లో చిన్న చిన్న టౌన్లలో కూడా ప్రతి చోటా సీసీ టీవీ కెమెరాలు వచ్చేశాయి. తిరుపతి లాంటి సిటీలో ఒక వ్యక్తి భార్యను చంపేసి తన శవం ఆనవాళ్లు లేకుండా కాల్చేయగా.. అతను ఆమెను చంపేశాక సూట్ కేసులో పెట్టి బయటికి తీసుకెళ్తున్న దృశ్యం సీసీటీవీ ఫుటేజ్ లో బయటపడటంతో అతను దొరికిపోవడం పత్రికల్లో జనాలు చూశారు. అలాంటిది ప్రస్తుతం గోవా లాంటి సిటీలో ఒక పోష్ అపార్ట్ మెంట్లో సీసీటీవీ కెమెరాలు ఉండవా? ఆ అపార్ట్ మెంట్లో ఒక పేరు మోసిన సినీ నటుడిని పట్టపగలు అతడి భార్య.. ప్రియుడు కలిసి చంపేసి సూట్ కేసులో శవాన్ని సర్దేసి బయటికి తీసుకెళ్లిపోతే అది బయటపడకుండా ఉంటుందా? చంపినోడు ఎంత పోలీస్ అయినా సరే.. దీన్ని మేనేజ్ చేయడం అంత తేలికా? కథకు ఎంతో కీలకమైన సన్నివేశంలో ఇలా లాజిక్ మిస్సయిపోవడంతో ‘మాస్ట్రో’లో ఎంతో ఉత్కంఠకు గురి కావాల్సిన చోట ప్రేక్షకుడి ఫీలింగ్ మారిపోతుంది. అలాగే హీరో ఒక అంధుడిలా నటించడానికి కూడా సరైన రీజన్ కనిపించదు. సంగీతంలో ఫోకస్ కోసం అంధుడిగా నటిస్తున్నా అని అతను చెప్పడంలో లాజిక్ కనిపించదు. ఈ విషయాన్ని కన్విన్సింగ్ గా చెప్పడంలో దర్శకుడు విఫలమయ్యాడు.

ఈ లాజిక్కుల గురించి.. మాతృకతో పోలికల సంగతి.. పక్కన పెడితే ‘మాస్ట్రో’లో మలుపులకైతే లోటు లేదు. కథ తొలిసారి మలుపు తిరిగాక ప్రతి 10-15 నిమిషాలకూ ఒక ట్విస్ట్ తో థ్రిల్లర్ ప్రియులను ఎంగేజ్ చేయడానికి ప్రయత్నించారు. మర్డర్ తర్వాత వచ్చే సన్నివేశాల్లో లాజిక్ సంగతి పక్కన పెడితే.. ఒక అంధుడైన పియానో ప్లేయర్ ను ఇంట్లో పెట్టుకుని మర్డర్ విషయంలో తమన్నా మేనేజ్ చేసే సన్నివేశాలు బాగానే ఎంటర్టైన్ చేస్తాయి. హీరో మర్డర్ రిపోర్ట్ చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లడం.. అక్కడ హత్య చేసిన పోలీసే ఉండటం.. అతను ఇతణ్ని టార్గెట్ చేయడం.. తర్వాతి పరిణామాలు ఉత్కంఠ రేకెత్తిస్తాయి. స్టన్నింగ్ గా సాగే తమన్నా పాత్ర షాకుల మీద షాకులు ఇస్తూ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. ప్రథమార్ధం వరకు అయితే ‘మాస్ట్రో’ ఎక్కడా ఆగకుండా సాగిపోతుంది. కొన్ని లోపాలున్నప్పటికీ ఓకే అనిపిస్తుంది. కానీ ద్వితీయార్ధంలో మాత్రం ‘మాస్ట్రో’ బిగి సడలింది. హీరోను తమన్నా పాత్ర దారుణమైన దెబ్బ కొట్టే సన్నివేశంలో ఎమోషనల్ గా కదిలించడానికి అవకాశం ఉన్నప్పటికీ దాన్ని సరిగా ఉపయోగించుకోలేదు. ఇక్కడ హీరో బాధను ప్రభావవంతంగా చూపించడంలో.. ప్రేక్షకుల్లో ఎమోషన్ తీసుకురావడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఇక ఆ తర్వాత చాలా వరకు సన్నివేశాలు ప్రేక్షకులను ఎంగేజ్ చేయలేకపోయాయి. హీరో కిడ్నీ రాకెట్ మాఫియాలో చిక్కుకోవడం... దాని చుట్టూ వచ్చే సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. ద్వితీయార్ధంలో కూడా ట్విస్టులకు లోటు లేకపోయినా.. అవి ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తించలేకపోయాయి. చాలా వరకు సన్నివేశాలు కూడా కృత్రిమంగా అనిపించి చివరికొచ్చేసరికి ‘మాస్ట్రో’ ఎఫెక్ట్ బాగా తగ్గిపోయినట్లు అనిపిస్తుంది. ‘అంధాదున్’ చూసిన వాళ్లకు కాస్టింగ్ దగ్గర్నుంచి చాలా విషయాలు సమస్యగా అనిపిస్తాయి. మాతృకతో పోలిక పక్కన పెట్టి మామూలుగా చూస్తే.. ఇది మన నేటివిటీకి తగ్గ సినిమాలా కనిపించదు. కీలకమైన సన్నివేశాల్లో లాజిక్ లేకపోవడం.. సహజత్వం కొరవడటం ‘మాస్ట్రో’కు సమస్యగా మారాయి. ఓటీటీ మూవీ కాబట్టి ఒక లుక్ వేయడానికైతే ఓకే కానీ.. అంతకుమించి ఆశిస్తే మాత్రం నిరాశే.

నటీనటులు:

ఉపాధి కోసమని అంధుడిగా నటించే పియానో ప్లేయర్ పాత్రలో నితిన్ జస్ట్ ఓకే అనిపిస్తాడు. పెర్ఫామెన్స్ పరంగా మంచి స్కోప్ ఉన్నప్పటికీ నితిన్ ఈ పాత్రను సరిగా ఉపయోగించుకోలేదు. పాత్రకు తగ్గ లుక్ తో కనిపించాడు కానీ.. కీలకమైన సన్నివేశాల్లో అతను తన పాత్ర ద్వారా అనుకున్నంత ఎఫెక్ట్ తీసుకురాలేకపోయాడు. నటుడిగా అతడికున్న పరిమితులు ఈ పాత్రలో బయటపడ్డాయి. తనకు దారుణమైన నష్టం జరిగి.. తన జీవితంలో కల్లోలం రేగినపుడు తీవ్రంగా స్పందించే సన్నివేశాల్లో నితిన్ సాధారణంగా కనిపించాడు. ఆయుష్మాన్ ఖురానతో పోల్చుకుంటే మాత్రం నితిన్ నిలవలేకపోయాడనే చెప్పాలి. తమన్నా తన వరకు బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చే ప్రయత్నం చేసినా హిందీలో టబులా ఈ పాత్రకు వెయిట్ తీసుకురాలేకపోయింది. అక్కడితో పోలిస్తే హైలైట్ అయ్యేది యువతను ఆకర్షించేది తమన్నా గ్లామరే. ప్రతి సన్నివేశంలోనూ చాలా సెక్సీగా కనిపించే ప్రయత్నం చేసింది తమన్నా. ఈ రకంగా కుర్రాళ్లకు ఆమె పాత్ర కనువిందే. ఇప్పటిదాకా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేయకపోయినా.. తమన్నా ఉన్నంతలో బాగానే మేనేజ్ చేసింది. తమన్నా కంటే ఇంకాస్త వయసు ఎక్కువ ఉన్న అమ్మాయి అయితే ఈ పాత్రకు బాగుండేదనిపిస్తుంది. నరేష్ పక్కన ఆమె మరీ ఆడ్ గా కనిపించింది. నభా నటేష్ పర్వాలేదు. ఆమె పాత్రకు స్కోప్ తక్కువే. విలన్ పాత్రలో జిష్ణు సేన్ రాణించాడు. తక్కువ సేపే కనిపించినా హర్షవర్ధన్.. మంగ్లీ.. రచ్చ రవి.. శ్రీముఖి పాత్రలకు తగ్గట్లు బాగా నటించారు. శ్రీనివాసరెడ్డి కూడా ఓకే.

సాంకేతిక వర్గం:

మహతి స్వర సాగర్ పాటల విషయంలో నిరాశ పరిచాడు. ఈ సినిమాలో అసలు పాటలే అనవసరం అనిపిస్తుంది. ఉన్నవి తక్కువ పాటలే అయినా అవేమంత వినసొంపుగా లేవు. అవి స్పీడు బ్రేకుల్లా మారాయి. ఐతే నేపథ్య సంగీతం విషయంలో మహతి ఆకట్టుకున్నాడు. సినిమాకు నప్పేలా స్టైలిష్ గా.. ఉత్కంఠభరితంగా అతనిచ్చిన ఆర్ఆర్ మెప్పిస్తుంది. యువరాజ్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువల పరంగా మంచి ప్రమాణాలు కనిపిస్తాయి. రాజీ లేకుండా సినిమాను నిర్మించారు. ఇక దర్శకుడు మేర్లపాక గాంధీ.. 90 శాతం ‘అంధాదున్’ను ఫాలో అయిపోయాడు. మూల కథ వరకు క్రెడిట్ ఇచ్చి ‘రచన’ క్రెడిట్ తీసుకునే స్థాయిలో అతను మార్పులేమీ చేయలేదు. నరేష్ కూతురి పాత్రను జోడించి తన కోసం కొన్ని సన్నివేశాలు పెంచడం మినహా అతను చేసిన మార్పులు ఎక్కువ లేవు. ఒరిజినల్ ను చాలా వరకు ఫాలో అయినప్పటికీ.. అందులో ఉన్న బిగి.. ఫీల్ ఇక్కడ తీసుకురావడంలో గాంధీ విజయవంతం కాలేకపోయాడు. సినిమాను స్టైలిష్ గా ప్రెజెంట్ చేయగలిగాడే తప్ప.. ఉత్కంఠ రేకెత్తించలేకపోయాడు.

చివరగా: మాస్ట్రో.. బిగి సడలింది

రేటింగ్-2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in HOTSTAR OTT

LATEST NEWS