మాచర్ల నియోజకవర్గం

Fri Aug 12 2022 GMT+0530 (IST)

మాచర్ల నియోజకవర్గం

చిత్రం : మాచర్ల నియోజకవర్గం
నటీనటులు: నితిన్-కృతి శెట్టి-కేథరిన్ థ్రెసా-సముద్రఖని-వెన్నెల కిషోర్-రాజేంద్ర ప్రసాద్-మురళీ శర్మ-ఇంద్రజ-జయప్రకాష్ తదితరులు
సంగీతం: మహతి స్వర సాగర్
ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ళ
మాటలు: మామిడాల తిరుపతి
నిర్మాతలు: సుధాకర్ రెడ్డి-నిఖిత రెడ్డి
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి

చెక్.. రంగ్ దె చిత్రాలు నిరాశ పరిచాక కొంచెం రూటు మార్చి పక్కా మాస్ మసాలా సినిమా చేశాడు యంగ్ హీరో నితిన్. అదే.. 'మాచర్ల నియోజకవర్గం'. ఎడిటర్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా మారి రూపొందించిన తొలి చిత్రమిది. ప్రోమోల్లో మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా కనిపించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

సిద్దార్థ్ (నితిన్) కాలేజీ చదువు పూర్తి చేసి ఆడుతూ పాడుతూ జీవితాన్ని సాగిస్తున్న కుర్రాడు. తర్వాత అతను సివిల్ సర్వీసెస్ పాసై గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో కలెక్టరుగా అడుగు పెడతాడు. ఆ ప్రాంతాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని ఏలుతున్న ఎమ్మెల్యే రాజప్ప.. ప్రతిసారీ పోటీయే లేకుండా ఏకగ్రీవంగా ఎమ్మెల్యేగా గెలుస్తుంటాడు. రాజప్పకు సిద్దార్థ్ ఎదురు వెళ్లడమే కాక ఆ నియోజకవర్గంలో ఎన్నికలు జరిపించాలని కంకణం కట్టుకుంటాడు. దీంతో ఇద్దరి మధ్య పోరు పతాక స్థాయికి చేరుకుంటుంది. మరి ఈ పోరాటంలో ఎవరు గెలిచారన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:


వైజాగ్ బీచ్ లో అమ్మాయి తన స్నేహితులతో నడుస్తుంటుంది. అక్కడున్న పోకిరి బ్యాచ్ ఆమెను ఆటపట్టిస్తుంది. వెంటనే ఆమె మీకుందిరా.. ఒకడొస్తాడు.. మీ బెండు తీస్తాడు అంటుంది. వాళ్లేమో ఎవడే వాడు.. రమ్మను అని వాళ్లు సవాల్ చేస్తారు. ఈ మాండేటరీ బిల్డప్ పూర్తవగానే హీరో ఎంట్రీ ఇస్తాడు. ఆ వెంటనే మాండేటరీ ఫైట్ కూడా లాగించేస్తాడు. ఆ తర్వాత ఆటోమేటిగ్గా హీరో స్టెప్పులు ఇరగదీస్తూ యూత్ కు ఒక మెసేజ్ ఇస్తూ సాంగ్ అందుకోవాలి కదా? ఆ తంతు కూడా ముగుస్తుంది. పైన చెప్పుకున్న అమ్మాయి మినిస్టర్ కూతురు. హీరో అంటే పడిచచ్చిపోతుంటుంది. కానీ మాస్ మసాలా సినిమా రూల్ ప్రకారం ఇలాంటి బ్యాగ్రౌండ్ ఉన్న సెకండ్ హీరోయిన్ని హీరో ఆమెను అస్సలు పట్టించుకోకూడదు కదా. పట్టించుకోడు. నా మనసుకు నచ్చిన అమ్మాయి ఎక్కడుందో ఏంటో అంటూ ఊహల్లోకి వెళ్లడం ఆలస్యం.. ఎదురుగా అందాల రాశి అయిన హీరోయిన్ ప్రత్యక్షం. తొలి చూపులోనే ఆమెతో ప్రేమతో.. ఆమె వెంట పడుతూ అల్లరి.. ఈ రొమాన్స్ మధ్యలో బకరా అవ్వడానికి ఒక కమెడియన్ కావాలి కదా? వెన్నెల కిషోర్ రెడీ. కథానాయికతో ఒక వైపు రొమాన్స్.. కమెడియన్ తో కలిసి ఇంకోవైపు కామెడీ.. మధ్య మధ్యలో పాటలు.. హీరో ఎలివేషన్ కోసం అప్పుడప్పుడూ ఒక ఫైట్.. ఈ కథ ముదిరి పాకాన పడుతుండగా.. విలన్ తో హీరోకు డిష్యుం డిష్యుం. అక్కడి నుంచి నువ్వా నేనా అంటూ ఇద్దరి మధ్య పోరు.. చివరికి హీరో పైచేయి. ఇదండీ పరమ రొటీన్ మాచర్ల నియోజకవర్గం వ్యవహారం.

కొత్త దర్శకుడంటే ఎంతో కొంత కొత్తదనం కోసం ప్రయత్నించి ఉంటాడని.. ఏదో ఒక ప్రత్యేకత చూపించి ఉంటాడని అనుకుంటాం. కానీ ఎడిటర్ టర్న్డ్ డైరెక్టర్ ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి మాత్రం ఒక్క ఫ్రేమ్ లో కూడా పొరపాటున కూడా కొత్తదనం ఛాయలు కనిపించకుండా చాలా జాగ్రత్తగా తీశాడు మాచర్ల నియోజక వర్గం సినిమాని. ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా కథ పరంగా ఏదైనా ప్రయత్నిస్తే.. వాళ్ల ఊహలకు భిన్నంగా ఏదైనా సీన్ తీస్తే వాళ్లెక్కడ హర్టవుతారో అన్నట్లు సాగింది అతడి రాత..తీత. ఎన్నో సినిమాలకు ఎడిటర్ ఆ పని చేసిన అతను.. ప్రేక్షకుల అభిరుచిని ఏం అర్థం చేసుకున్నాడో ఏమో కానీ.. పదేళ్ల కిందట తీసినా కూడా పరమ రొటీన్ గా అనిపించే సినిమా ఇది. తన బేనర్ ద్వారా రిలీజ్ చేసిన విక్రమ్ సినిమాను విడుదలకు ముందు చూసి తనకు కొన్ని రోజుల పాటు నిద్ర పట్టలేదని.. సినిమా అంటే ఇలా కదా తీయాలి అనిపించింది అని చెప్పిన నితిన్ కు.. మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ కాపీ చూశాక ఈ రోజుల్లో ఇలాంటి సినిమా తీశామేంటి అని ఎందుకు అనిపించలేదో ఏమో?  విడ్డూరమైన విషయం ఏంటంటే.. ఈ పరమ రొటీన్ సినిమాలో ఒక చోట విక్రమ్ మూవీలో కమల్ డైలాగ్ ఒకటి చెప్పడం.. యాజిటీజ్ విక్రమ్ విక్రమ్ అంటూ ఆ సినిమాలోని బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా దానికి వాడేయడం గమనార్హం. ఈ రొడ్డకొట్టుడు మాస్ సినిమాకు ఇలా విక్రమ్ టచ్ ఇవ్వడం చూసి నవ్వాలో ఏడవాలో తెలియదు.

అనగనగా ఒక టౌన్.. అందులో ఓ విలన్.. అక్కడంతా అతడి గుప్పెట్లోనే ఉంటుంది. 30 ఏళ్ల నుంచి ఆ ఊర్లో ఎలక్షనే లేదు. ప్రతిసారీ విలనే ఎమ్మెల్యే. పోటీగా నామినేషన్ కూడా ఎవ్వరూ వేయరు. అప్పుడు అనుకోకుండా హీరో ఆ ప్రాంతంలో అడుగు పెడతాడు. విలన్ని ఢీకొడతాడు. నేనెవరో తెలుసా అంటూ విలన్ ఎగిరెగిరి పడడం.. నువ్వెవరైతే నాకేంటి అంటూ హీరో అతడి మీద పడిపోవడం.. ఈ ఫార్మాట్లో ఎన్ని వందల సినిమాలు రాలేదు తెలుగులో? కాకపోతే ఎప్పుడూ హీరో పోలీస్ అవతారమో.. ఇంకోటో ఎత్తుతాడు. ఇక్కడ మాత్రం హీరో కలెక్టర్. ఐఏఎస్ అధికారి కదా.. బుర్ర వాడి విలన్ని దెబ్బ కొడతాడేమో.. డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుందేమో అనుకుంటే అలాంటిదేమీ ఆశించడానికి వీల్లేదు. సూటూ బూటు వేసుకుని కనిపిస్తాడు తప్ప చేసేవన్నీ మాస్ ఫైట్లే. ఈ మాత్రం దానికి హీరో కలెక్టరే ఎందుకవ్వాలి కలెక్టర్ గా చూపించడం వల్ల సినిమాకు వచ్చిన కొత్త కలరేంటి అనే ప్రశ్నలకు సమాధానం ఉండదు. నితిన్ స్టైలింగ్ ఇంకొంచెం బెటర్ గా ఉండడానికి తప్ప ఈ పాత్ర వల్ల ప్రత్యేకంగా ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదు.

ప్రథమార్ధంలో ఇగో గుర్నాథంగా వెన్నెల కిషోర్ చేసిన కామెడీ సినిమా మొత్తంలో కొంచెం రిలీఫ్. కాకపోతే అది కూడా ఒక దశ దాటాక శ్రుతి మించింది. 10-15 నిమిషాల్లో ముగించాల్సిన ఆ ఎపిసోడ్ ను ముప్పావు గంట దాకా సాగదీయడంతో ఇక చాలు మహాప్రభో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర్నుంచి మాస్ ప్రేక్షకులను అలరించే యాక్షన్ బ్లాక్స్ పడ్డాయి. వాటికి కొంత మంది కనెక్ట్ కావచ్చేమో. అలాగే రారా రెడ్డి పాట ఒకటి సినిమాలో కొంచెం ఎంగేజ్ చేస్తుంది. ఇవి తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఇంకేమీ లేదు. కథ పరంగా.. పాత్రల పరంగా కానీ రవ్వంత కూడా కొత్తదనం.. ఆసక్తి కనిపించదు. కథాకథనాల్లో ఎక్కడా కూడా తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీకి అవకాశం లేకుండా పరమ రొటీన్ గా లాగించేశారు. మాస్ ప్రేక్షకులు కూడా మొనాటనీ ఫీలయ్యే స్థాయి రొటీన్ సినిమా ఇది. ఒక కొత్త దర్శకుడి నుంచి ఇంత రొటీన్ సినిమాను ఊహించలేం.

నటీనటులు:

నితిన్ ఈ సినిమాలో చూడ్డానికి చాలా బాగున్నాడు. అతడి కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అనదగ్గ లుక్స్ లో అతను కనిపించాడు. స్టైలింగ్ అదీ కూడా బాగుంది. కానీ అంతకుమించి తన గురించి పాజిటివ్ గా చెప్పడానికి ఏమీ లేదు. తన పాత్ర.. పెర్ఫామెన్స్ అంత రొటీన్ గా ఉన్నాయి మరి. హీరోయిన్ కృతి శెట్టి చాలా తక్కువ సినిమాలతోనే బోర్ కొట్టించేస్తోంది. కొన్ని వారాల కిందటే ది వారియర్ మూవీలో మామూలు పాత్రలో కనిపించిన కృతి.. ఇందులో అలాంటి నామమత్రపు పాత్రనే చేసింది. వీక్ క్యారెక్టర్ని నిలబెట్టే స్క్రీన్ ప్రెజెన్స్.. యాక్టింగ్ టాలెంట్ కూడా తనలో ఉన్నట్లు కనిపించదు. కేథరిన్ థ్రెసా ఇలాంటి పాత్రలు చాలానే చేసింది. ఆమె పూర్తిగా ఔట్ ఆఫ్ షేప్ లో కనిపించింది. సముద్రఖని ఖాతాలో మరో రొటీన్ విలన్ పాత్ర పడింది. ద్విపాత్రాభినయం చేసినా వైవిధ్యం ఏమీ లేకపోయింది. వెన్నెల కిషోర్ కామెడీ పర్వాలేదు. అతడికి స్క్రీన్ టైం బాగానే దొరికింది. కాసేపు నవ్వించిన కిషోర్ కూడా.. క్యారెక్టర్లో.. సన్నివేశాల్లో విషయం లేక తర్వాత చేతులెత్తేశాడు. రాజేంద్ర ప్రసాద్.. మురళీ శర్మ తమ స్థాయికి తగని పాత్రల్లో కనిపించారు. జయప్రకాష్.. బ్రహ్మాజీ.. ఇంద్రజ.. వీళ్లంతా పెద్దగా చేసిందేమీ లేదు.

సాంకేతిక వర్గం:

మహతి స్వర సాగర్ పాటల్లో రారా రెడ్డి పాటతో మాస్ ను ఆకట్టుకోగలిగాడు. ఇంకే పాటలూ ఎంగేజింగ్ గా లేవు. వాటిని తెరపై ప్లేస్ చేసిన.. ప్రెజెంట్ చేసిన విధానం కూడా రొటీన్ గా అనిపిస్తుంది. నేపథ్య సంగీతం మరీ లౌడ్ అనిపిస్తుంది. ప్రసాద్ మూరెళ్ళ ఛాయాగ్రహణం సినిమా శైలికి తగ్గట్లు సాగింది. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. మామిడాల తిరుపతి డైలాగులు ఈ కథకు తగ్గట్లు రొటీన్ గా సాగిపోయాయి. ఇక కథా రచయిత.. దర్శకుడు ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఏ రకంగానూ ఆకట్టుకోలేకపోయాడు. ఇంత రొటీన్ కథతో అతను మెప్పించి సినిమా చేయగలిగినందుకు మాత్రమే అభినందించగలం. రైటింగ్.. టేకింగ్ అన్నింట్లోనూ అతనూ మూస పద్ధతులను ఫాలో అయ్యాడు.

చివరగా: మాచర్ల నియోజకవర్గం.. పరమ రొటీన్

రేటింగ్-2/5

LATEST NEWS