'మా వింత గాథ వినుమా'

Sat Nov 14 2020 GMT+0530 (IST)

'మా వింత గాథ వినుమా'

చిత్రం : ‘మా వింత గాథ వినుమా’


నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ-సీరత్ కపూర్-తనికెళ్ల భరణి-కమల్ కామరాజు-కల్పిక- శిశిర్ శర్మ-ప్రగతి-వైవా హర్ష-ఫిష్ వెంకట్ తదితరులు
సంగీతం: శ్రీ చరణ్ పాకాల-రోహిత్-జాయ్
ఛాయాగ్రహణం: సాయిప్రకాష్
నిర్మాతలు: సంజయ్ రెడ్డి-కృతి చిలుకూరి-అనిల్ పల్లాల-సునీత
రచన-సిద్ధు జొన్నలగడ్డ
దర్శకత్వం: ఆదిత్య మందల

‘కృష్ణ అండ్ హిజ్ లీల’తో అందరినీ ఆశ్చర్యపరిచిన నటుడు సిద్ధు జొన్నలగడ్డ. పెద్దగా అంచనాల్లేకుండా నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాలో నటుడిగానే కాక రచయితగానూ సిద్ధు ఆకట్టుకున్నాడు. ఆ ఉత్సాహంలో శరవేగంగా అతను మరో సినిమా చేశాడు. అదే.. మా వింత గాథ వినుమా. ‘ఆహా’ ద్వారా దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

సిద్ధు (సిద్ధు జొన్నలగడ్డ) ఇంజినీరింగ్ చదువుతున్న కుర్రాడు. తనతో పాటే చదివే వినీత (సీరత్ కపూర్)ను తనతో పాటు ర్యాగింగ్ కు గురవుతుండగా తొలిసారి చూసి ప్రేమలో పడిపోతాడు. రెండేళ్లకు పైగా ప్రేమించాక ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. ముందు ఏమీ చెప్పని వినీత.. తర్వాత అతడి ప్రేమను అంగీకరిస్తుంది. విచిత్రమైన పరిస్థితుల్లో ఇద్దరూ హఠాత్తుగా పెళ్లి కూడా చేసేసుకుంటారు. కానీ ఆ హఠాత్పరిణామమే వారితో పాటు వాళ్ల కుటుంబాలనూ ఇబ్బందుల్లోకి నెడుతుంది. ఇంతకీ వారి పెళ్లికి దారి తీసిన పరిస్థితులేంటి.. ఆ పెళ్లి సందర్భంగా ఏం జరిగింది.. తర్వాతి పరిణామాలేంటి అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

మెరిసేవన్నీ బంగారం కాదు అనడానికి ‘మా వింత గాథ వినుమా’ ఉదాహరణ. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’తో నటుడిగానే కాక రచయితగానూ ఆశ్చర్యపరిచిన సిద్ధు జొన్నలగడ్డ ఈసారి ఒక్కడే పూర్తిగా రచన బాధ్యతలు తీసుకున్న చిత్రమిది. ముందు సినిమా తాలూకు ఇంప్రెషన్ కు తోడు.. ‘మా వింత గాథ వినుమా’ ట్రైలర్ సైతం చాలా ట్రెండీగా.. ఫన్నీగా ఉండి ఈ సినిమాపై అంచనాలు పెంచింది. కానీ ఈ సినిమాకు ఎడిటర్ కూడా అయిన సిద్ధు.. సినిమాలో ఉన్న కొన్ని మెరుపులేంటో.. ట్రైలర్లో ఏం చూపిస్తే యూత్ అట్రాక్ట్ అవుతారో బాగానే తెలుసుకున్నాడు. వాటితో ట్రైలర్ ను హిట్ చేయగలిగాడు. కానీ షార్ట్ ఫిలిం స్థాయి కంటెంట్ తో సినిమాగా మెప్పించడంలో మాత్రం విఫలమయ్యాడు. రైటింగ్ దగ్గరే తేలిపోయిన ‘మా వింత గాథ వినుమా’ను కాపాడేందుకు కొత్త దర్శకుడు ఆదిత్య మందల కూడా ఏమీ చేయలేకపోయాడు. సిద్ధు స్టయిల్లో ‘ట్రెండీ’గా ఈ కథను నరేట్ చేయడానికి అతను చేసిన ప్రయత్నం ఫలితాన్నివ్వలేదు.

సిద్ధు నుంచి ఇంతకుముందు వచ్చిన ‘కృష్ణ అండ్ హిజ్’ లీల థియేటర్ల కోసం సిద్ధం చేసి.. అందుకు అవకాశం లేకపోవడంతో ఓటీటీలో రిలీజైంది. ఐతే ఈసారి ఓటీటీనే టార్గెట్ చేసుకుని లాక్ డౌన్ టైంలో చాలా సింపుల్ గా ‘మా వింత గాథ వినుమా’ను లాగించేసినట్లున్నారు. ఐతే విషయం బలంగా ఉంటే ఎలా తీసినా ఇబ్బంది లేదు. కానీ మరీ పలుచనైన.. షార్ట్ ఫిలిం స్థాయి కాన్సెప్ట్ తీసుకుని దాన్ని సినిమా స్థాయికి ‘లాగడానికి’ చేసిన ప్రయత్నం ఎంతమాత్రం మెప్పించలేదు. ఈ సోషల్ మీడియా కాలంలో అనుకోకుండా తీసుకున్న ప్రైవేట్ వీడియో వైరల్ అయితే దాని వల్ల అందులో భాగమైన వ్యక్తుల జీవితాలు ఎలా తల్లకిందులవుతాయనేది చెప్పాలన్నది ఈ సినిమా కాన్సెప్ట్. ఐతే ఆ పాయింట్ బాగానే అనిపించినా.. దాన్ని ఎఫెక్టివ్ గా తెరపై ప్రెజెంట్ చేయడంలో ‘మా వింత గాథ వినుమా’ టీం ఫెయిలైంది.

అప్పటిదాకా కథ నడిచిన తీరు వల్ల కావచ్చు.. పైన చెప్పుకున్న వైరల్ వీడియో ఎపిసోడ్ సైతం ‘లైట్’గానే అనిపిస్తుంది. చాలా సీరియస్ గా ప్రెజెంట్ చేయాల్సిన ఈ విషయాన్ని ‘లైట్’గా చూపించడానికి ప్రయత్నించి.. ఆ తర్వాత విపరిణామాల్ని సీరియస్ గా డిస్కస్ చేస్తూ ఎమోషన్ తేవడానికి ప్రయత్నించారు కానీ.. ఏ దశలోనూ ఎమోషనల్ కనెక్ట్ అన్నదే లేకపోయింది. అంత పెద్ద సమస్య తర్వాత క్లైమాక్సులో ఉండాల్సిన ఇంటెన్సిటీ లేకపోయింది. సింపుల్ గా ఒక వీడియోతో ఆ సమస్యకు పరిష్కారం చూపించేశారు. ఆ వీడియో హీరో చెప్పే విషయాలు బాగున్నా సరే.. అది సరైన క్లైమాక్స్ అనిపించదు. సినిమా మొదలై.. ముగియడానికి పట్టే సమయం గంటా 40 నిమిషాలే అయినా సరే.. చివరికొచ్చేసరికి ఒక సాగీతత ఫీలింగ్ కలిగుతుందంటే‘మా వింత గాథ వినుమా’ ఎంత భారంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

కథ ఎంత లైట్ గా అనిపించినా కూడా.. కనీసం కామెడీ అయినా పండి ఉంటే టైంపాస్ అయ్యేది కానీ.. సిద్ధు-తనికెళ్ల భరణి మధ్య వచ్చే కొన్ని కాన్వర్జేషన్లలో మినహాయిస్తే ఫన్ జనరేట్ కాలేదు. వైవా హర్షను సైతం సరిగా ఉపయోగించుకోలేదు. తన పాత్ర డైలాగుల నుంచే కామెడీ పండించాలని సిద్ధు చూశాడు కానీ అదంతగా వర్కవుట్ కాలేదు. కస్ వర్డ్స్ ను బాగా వాడి ఇది ‘ట్రెండీ’ మూవీ అనిపించే ప్రయత్నం జరిగిందే తప్ప.. ఈ తరం యూత్ ను ఎంటర్టైన్ చేసే సన్నివేశాలు కూడా పెద్దగా లేవు. హీరోయిన్ పెద్ద మైనస్ కావడం.. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీనే లేకపోవడంతో ప్రేమకథ పూర్తిగా తేలిపోయింది. దీని వల్ల తొలి అరగంటలోనే బాగా బోర్ కొట్టించేయడంతో కథ ఎప్పుడు మలుపు తిరుగుతుందా అని చూస్తాం. ఆ మలుపు తర్వాత కూడా కథనం ఊపందుకోదు. ఇంకా నీరసం వచ్చేస్తుంది. చివరికి ‘మా వింత గాథ వినుమా’ ఏ ప్రత్యేకతా లేని మామూలు సినిమాగా ముగుస్తుంది.

నటీనటులు:

సిద్ధు జొన్నలగడ్డ మరోసారి ఈ తరం యూత్ కు కనెక్టయ్యే తరహాలో నటించాడు. ఈ తరహా పాత్రలకు అతను ఫిట్ అనిపించాడు. అతడి నటన ట్రెండీగా అనిపిస్తుంది. హీరోయిన్ సీరత్ కపూర్ మాత్రం సినిమాకు పెద్ద మైనస్. తనకు అలవాటైన మోడర్న్ లుక్స్ కు ఆమె పరిమితమైతే మంచిది అనిపిస్తుంది. ట్రెడిషనల్ లుక్.. ఆ తరహా నటన ఆమెకు ఎంతమాత్రం సూటవ్వలేదు. ఇలాంటి సినిమాల్లో హీరోయిన్ని చూసినపుడు కలగాల్సిన స్పెషల్ ఫీలింగ్ ను సీరత్ కలిగించలేకపోయింది. లుక్స్ పరంగానే కాక నటనలోనూ ఆమె తేలిపోయింది. కమల్ కామరాజు బాగా చేశాడు. శిశిర్ శర్మ.. జయప్రకాష్ ఓకే. ప్రగతి నటన అతిగా అనిపిస్తుంది. కల్పిక గురించి చెప్పడానికేమీ లేదు. తనికెళ్ల భరణి తనదైన శైలిలో మెరిశారు. సినిమాలో అంతో ఇంతో రిలీఫ్ ఆయన పాత్రే. ఫిష్ వెంకట్ కూడా కొంత ఎంటర్టైన్ చేశాడు. వైవా హర్ష పాత్ర పరిమితం.

సాంకేతికవర్గం:

ఈ సినిమాకు ముగ్గురు సంగీత దర్శకులు పని చేశారు. నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్. సినిమాలో ‘చాలా బాగుంది’ అనిపించేది అదొక్కటే. పాత పాటల హమ్మింగ్స్ వాడుతూ.. ఆసక్తికరంగా సాగే తెలుగు ర్యాప్ తో సంగీత పరంగా మంచి ప్రయత్నమే జరిగింది. కానీ అవి ఉన్నంత క్లాస్ గా సినిమా లేకపోయింది. వాటి వెయిట్ ముందు సినిమా తేలిపోయింది. సాయిప్రకాష్ ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు ఈ సినిమా స్థాయికి తగ్గట్లుగా కుదిరాయి. ఇక సినిమాకు అన్నీ తానై అన్నట్లు వ్యవహరించిన సిద్ధు.. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’తో వచ్చిన మంచి పేరును క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించాడనిపిస్తుంది. ఆ సినిమా విషయంలో జరిగిన కసరత్తు ఇందులో కనిపించలేదు. పూర్తిగా స్క్రిప్టు బాధ్యత తీసుకున్న అతణ్ని కరెక్ట్ చేయడానికి కూడా ఎవరూ లేకపోయారనిపిస్తుంది. దర్శకుడు ఆదిత్య అతను రాసింది తీయడం తప్ప ఏమీ చేసినట్లుగా తెరపై కనిపించదు.

చివరగా: మా ‘బోరింగ్’ గాథ వినుమా!

రేటింగ్-2/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS