లవ్ టుడే

Fri Nov 25 2022 GMT+0530 (India Standard Time)

లవ్ టుడే

'లవ్ టుడే' మూవీ రివ్యూ
నటీనటులు: ప్రదీప్ రంగనాథన్-ఇవానా-సత్యరాజ్-రాధిక శరత్ కుమార్-యోగిబాబు-రవీనా రవి తదితరులు
సంగీతం: యువన్ శంకర్ రాజా
ఛాయాగ్రహణం: దినేశ్ పురుషోత్తమన్
నిర్మాతలు: కల్పతి అఘోరం-కల్పతి గణేష్-కల్పతి సురేష్
రచన-దర్శకత్వం: ప్రదీప్ రంగనాథన్

తమిళంలో ఈ నెల తొలి వారం నుంచి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సినిమా 'లవ్ టుడే'. ఈ సినిమా చూసి బాగా నచ్చేసి టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తెలుగులో అనువాదం చేసి తన బేనర్ మీద రిలీజ్ చేశాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో అంత ప్రత్యేకత ఏముంది..? తమిళంలో మాదిరే మన ప్రేక్షకులను కూడా అంతే స్థాయిలో అలరించేలా ఈ సినిమా ఉందా..? తెలుసుకుందాం పదండి.

కథ:

ప్రదీప్ (ప్రదీప్ రంగనాథన్) ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగి. మరో కంపెనీలో పని చేసే నిఖిత (ఇవానా)తో అతను ప్రేమలో పడతాడు. ఇద్దరి ప్రేమాయణం సాఫీగా సాగిపోతున్న టైంలో ప్రదీప్ అక్కకు పెళ్లి కుదురుతుంది. ఈ పెళ్లి అయ్యాక తమ ప్రేమ గురించి ఇరువురి ఇళ్లలో చెబుదాం అనుకుంటున్న సమయంలోనే .. నిఖిత తండ్రి వేణు శర్మ (సత్యరాజ్)కు విషయం తెలిసిపోతుంది. దీంతో ప్రదీప్ ఆయన్ని కలవాల్సి వస్తుంది. అప్పుడాయన మీ పెళ్లి చేయాలంటే మీ ఇద్దరూ ఒకరి ఫోన్ ఒకరు మార్చుకుని ఒక రోజంతా వాటిని వాడాల్సి ఉంటుందని కండిషన్ పెడతాడు. అందుకు ప్రదీప్-నిఖిత అంగీకరిస్తారు. అలా ఫోన్లు మార్చుకున్న తర్వాత ఒకరి గురించి ఒకరు ఏం తెలుసుకున్నారు.. దాని వల్ల ఎలాంటి పరిణామాలు తలెత్తాయి.. చివరికి ఇద్దరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

సెల్ ఫోన్.. ఇప్పుడిది లేని జీవితాలను ఊహించలేం. అమెరికా నుంచి అనకాపల్లి దాకా ఎవ్వరైనా ఈ పరికరాన్ని వాడాల్సిందే. నిద్ర లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు ఇది లేకుండా సమయం గడవదు. ఏ పనీ జరగదు. ఇక యువతకు అయితే మొబైల్ తో ఉండే కనెక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి మనిషిలోనూ ఎవ్వరికీ తెలియని ఒక అంతర్ముఖుడు ఉంటాడని అనుకుంటే.. ఆ వ్యక్తి ఎవరన్నది అతడి మనసుతో పాటు తన మొబైల్ కు కూడా తెలుసు అంటే అతిశయోక్తి కాదు. అంతగా మొబైల్ తో కనెక్ట్ అయి ఉంటున్నారు ఇప్పటి జనాలు. యువత అత్యంత పర్సనల్ గా భావించే మొబైల్ మరో వ్యక్తి దగ్గరికి చేరితే.. అది తనకు కాబోయే జీవిత భాగస్వామే అయితే..  ఒక ముసుగుతో ఉన్న తన వ్యక్తిత్వాన్ని ఆ మొబైల్ బట్టబయలు చేస్తే.. ఈ క్రమంలో ఎదురయ్యే పరిణామాలతో కడుపు చెక్కలయ్యేలా నవ్వించడమే కాదు.. చివర్లో హృదయ్యాన్ని మెలిపెట్టడంలోనూ 'లవ్ టుడే' విజయవంతం అయింది. చిన్న పెద్ద అని తేడా లేకుండా మొబైల్ వాడే ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే కంటెంపరరీ కాన్సెప్ట్ తో తెరకెక్కడం 'లవ్ టుడే'లో అతి పెద్ద ప్లస్ కాగా.. యువత అయితే  ఈ సినిమా చూస్తూ కుదురుగా కూర్చోవడం కష్టం. రెండున్నర గంటల నిడివిలో దాదాపు రెండు గంటలు నవ్వుల్లో ముంచెత్తే ఈ చిత్రం.. చివరి అరగంటలో హృద్యమైన సన్నివేశాలతో ఆలోచన రేకెత్తించడంలో.. ఎమోషన్లతో కదిలించడంలోనూ విజయవంతం అయింది. పేరుకు తమిళ అనువాదం అనే కానీ.. ఇది భాషా భేదం లేకుండా ఎవరికైనా కనెక్ట్ అయ్యే యూనివర్శల్ మూవీ.

'లవ్ టుడే' పోస్టర్ల మీద లీడ్ రోల్ చేసిన కుర్రాడి ఫొటో చూసి ఇతనేం హీరో.. ఈ సినిమా ఏం చేస్తాం అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇలాంటి అభిప్రాయంతో ఎవరైనా థియేటర్లో అడుగు పెడితే.. శుభం కార్డు పడేసరికి ఆ కుర్రాడికి సెల్యూట్ కొట్టి బయటికి వస్తారు. మనకు ఏమాత్రం పరిచయం లేని ఆ కుర్రాడి పేరు.. ప్రదీప్ రంగనాథన్. ఇతను 'లవ్ టుడే'కు కేవలం హీరో మాత్రమే కాదు.. రైటర్ కమ్ డైరెక్టర్ కూడా. తమిళంలో అతను ఈ చిత్రానికి మాటలు పాటలు కూడా తనే రాసుకున్నాడు. త్వరలో పెళ్లి చేసుకోబోయే జంట తమ ఫోన్లను మార్చుకోవడం వల్ల తలెత్తే విపరీత పరిణామాాలను ప్రదీప్ ఎంత బాగా తెర మీద ప్రెజెంట్ చేశాడంటే.. ఓ సినిమా చూస్తూ ఇంతగా మనం ఎప్పుడు నవ్వుకున్నాం అని సినిమా అయ్యాక ప్రేక్షకులంతా ఒకసారి కచ్చితంగా రీకాల్ చేసుకుంటారు. ఏదో ఒక్క మూమెంట్ అని కాకుండా పగలబడి నవ్వుకునేలా చేసే సన్నివేశాలు ఇందులో చాాలానే ఉన్నాయి. అలా అని ఆ సన్నివేశాలు మరీ కొత్తగా.. బ్రహ్మాండం బద్దలైపోయేలా ఉంటాయా అంటే అదేమీ లేదు. చాలా సింపుల్ గా అనిపిస్తాయి. కానీ నవ్విస్తాయి. ఆరంభ సన్నివేశాలు కొంచెం నెమ్మదిగా అనిపించినా. హీరోయిన్ తండ్రి ఈ ఫోన్ ఎక్స్ చేంజ్ ఐడియాను అమలు చేయడం మొదలైన దగ్గర్నుంచి 'లవ్ టుడే' ఎక్స్ ప్రెస్ వేగాన్ని అందుకుంటుంది.

ముందు హీరోకు హీరోయిన్ దొరికిపోవడం.. ఆమెతో హీరో ఆటాడుకోవడం.. ఆ తర్వాత హీరో గుట్టు హీరోయిన్ కు తెలిసి ఆమె రివర్స్ ఎటాక్ చేయడం.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు హిలేరియస్ గా అనిపిస్తాయి. యూత్ అయితే ఈ సీన్లతో బాగా కనెక్ట్ అయిపోతారు. గ్యాప్ లేని ఎంటర్టైన్మెంట్ తో 'లవ్ టుడే' ఫుల్ మార్కులు కొట్టేస్తుంది. ఐతే చివరి వరకు కామెడీ మీదే సినిమాను నడిపించి ఉంటే.. 'లవ్ టుడే' అంత ప్రత్యేకమైన సినిమా అయ్యేది కాదు. చివరి గంటలో సీరియస్ టర్న్ తీసుకోవడం వల్ల కథ పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి.. ఉత్కంఠ పెరుగుతాయి. అప్పటిదాకా నవ్వి నవ్వి అలసిపోయిన ప్రేక్షకులు.. ఆ తర్వాత సీరియస్ గా కథలో ఇన్వాల్వ్ అవుతారు. జస్ట్ ఒక కామెడీ సినిమాలా మిగిలిపోకుండా.. అర్థవంతమైన చిత్రంగా పరిణామం చెందుతుంది 'లవ్ టుడే'. మొబైల్-టెక్నాలజీకి సంబంధించిన రెండో కోణాన్ని చూపిస్తూ యువతకు ఒక హెచ్చరిక జారీ చేసేలా సన్నివేశాలను నడిపించాడు ప్రదీప్. చివర్లో హీరో అక్కకు సంబంధించిన ట్రాక్ ఆకట్టుకుంటుంది. యోగిబాబు పాత్రను కథకు ముడిపెట్టి ఎమోషన్ పండించిన విధానం కదిలిస్తుంది. మానవ సంబంధాల్లో 'నమ్మకం' అనేది అత్యంత కీలకమైన విషయం అనే విషయాన్ని బలంగా చెబుతూ తీర్చిదిద్దిన పతాక సన్నివేశాలు సినిమాకు మేజర్ హైలైట్. ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎమోషన్ రెండూ సమపాళ్లలో కుదిరిన 'లవ్ టుడే' యువతకు ఫుల్ కిక్కునిస్తే.. మిగతా ప్రేక్షకులు కూడా దీంతో బాగానే కనెక్టవుతారు.

నటీనటులు:

ముందే అన్నట్లు ప్రదీప్ రంగనాథన్ ను పోస్టర్ల మీద చూసి ఏదో అనుకున్న వాళ్లంతా కూడా సినిమా అయ్యేసరికి అతడి అభిమానులుగా మారిపోతారు. దిల్ రాజు ఈ సినిమాను రీమేక్ చేయకుండా అనువాదం చేయాలని నిర్ణయించుకోవడానికి కూడా ప్రదీపే కారణం కావచ్చు. ఒక మామూలు కుర్రాడిగా ప్రదీప్ తన పాత్రను పోషించినట్లు ఇంకెవ్వరూ చేయలేరేమో అనిపిస్తుంది. లుక్స్ పరంగా చాలా యావరేజ్ అయినా సరే.. ఆ పాత్రతో కనెక్ట్ అయ్యి తన నటనకు ఫిదా అయ్యేలా చేశాడు ప్రదీప్. సత్యరాజ్ కాంబినేషన్లో వచ్చే సీన్లలో అయితే అతను అదరగొట్టేశాడు కామెడీ సీన్లలోనే కాక.. ఎమోషనల్ సీన్లలోనూ అతను మెప్పించాడు. హీరోయిన్ ఇవానా కూడా తన పాత్రను చక్కగా పోషించింది. హీరోలో ఇంకో యాంగిల్ తెలిసి తీవ్రంగా స్పందించే సన్నివేశంలో ఆమె చాలా బాగా నటించింది. ప్రదీప్ లాగే ఆమె కూడా ఒక హీరోయిన్ లాగా కాకుండా పాత్రకు నప్పే మామూలు అమ్మాయిలా బాగా సెట్ అయింది. సత్యరాజ్.. రాధిక శరత్ కుమార్ తక్కువ సన్నివేశాల్లోనే తమ ప్రత్యేకతను చాటుకున్నారు. యోగిబాబు తనదైన కామెడీ టైమింగ్ తో మెప్పించాడు. అలాగే చివర్లో అతడి నటన హార్ట్ టచింగ్ గా అనిపిస్తుంది. హీరో అక్కగా రవీనా రవి కూడా ఆకట్టుకుంది.

సాంకేతిక వర్గం:

యువన్ శంకర్ రాజా సినిమాకు తగ్గట్లే ట్రెండీ సంగీతాన్ని అందించాడు. అతడి నేపథ్య సంగీతం చాలా హుషారుగా సాగింది. కామెడీ.. అలాగే ఎమోషన్ ఎలివేట్ కావడంలో ఆర్ఆర్ కీలక పాత్ర పోషించింది. బుజ్జి కన్నా డీజే పాటను భలే ఫన్నీగా తీర్చిదిద్దాడు యువన్. దినేశ్ పురుషోత్తమన్ చాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. తెలుగు డబ్బింగ్ శ్రద్ధ పెట్టి చేశారు. మంచి క్వాలిటీ కనిపిస్తుంది. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ గురించి ఏం చెప్పాలి? సినిమా చూస్తున్నంతసేపూ ఈ కుర్రాడు ఇలాంటి సినిమా ఎలా తీశాడబ్బా అని ఆశ్చర్యపోయేలా సాగింది అతడి పనితనం. అతడి సెన్సాఫ్ హ్యూమర్ కి చాలా చోట్ల ఫిదా అయిపోతాం. ఐడియాగా వినడానికి భలేగా అనిపించినా.. ఇలాంటి కాన్సెప్ట్ తో రెండున్నర గంటలు సినిమా తీసి మెప్పించడం ఆషామాషీ విషయం కాదు. కానీ ప్రదీప్ చాలా ఆసక్తిరమైన సన్నివేశాలు.. స్క్రీన్ ప్లేతో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. అలాగే ఎమోషన్లను పండించడంలోనూ తన పనితనాన్ని చాటాడు.

చివరగా: లవ్ టుడే.. యువతకు ఫుల్ కిక్కు

రేటింగ్-3/5

LATEST NEWS