లవ్ స్టోరి

Fri Sep 24 2021 GMT+0530 (IST)

లవ్ స్టోరి

చిత్రం : ‘లవ్ స్టోరి’

నటీనటులు: అక్కినేని నాగచైతన్య-సాయిపల్లవి-రాజీవ్ కనకాల-ఈశ్వరి రావు-దేవయాని-ఉత్తేజ్ తదితరులు
సంగీతం: పవన్.సిహెచ్
ఛాయాగ్రహణం: విజయ్.సి.కుమార్
నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్-పుష్కర్ రామ్మోహన్ రావు
రచన-దర్శకత్వం: శేఖర్ కమ్ముల

కరోనా సెకండ్ వేవ్ తర్వాత తెలుగు ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తూ వచ్చిన సినిమా ‘లవ్ స్టోరి’. ‘ఫిదా’ తర్వాత శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ చిత్రం అందమైన.. పాటలు ప్రోమోలతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తించింది. నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘లవ్ స్టోరి’ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

రేవంత్ (నాగచైతన్య) తెలంగాణలోని ఆర్మూర్ కు చెందిన ఒక పేదింటి కుర్రాడు. తండ్రి చిన్నపుడే చనిపోతే కష్టపడి పెంచిన తల్లికి చేదోదు వాదోడుగా ఉంటూ పెరిగిన అతను.. పెద్దయ్యాక ఒక ఫిట్నెస్ డ్యాన్స్ స్కూల్ పెట్టి జీవితంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుంటాడు. అతడి ఊరికే చెందిన మౌనిక (సాయిపల్లవి) చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసమని రేవంత్ ఉన్న చోటికే వస్తుంది. ఉద్యోగం సంపాదించలేక ఇబ్బంది పడుతున్న మౌనిక.. రేవంత్ తో పరిచయం పెరిగి అతడి డ్యాన్స్ స్కూల్లోనే మాస్టర్ గా చేరుతుంది. ఈ క్రమంలో రేవంత్.. మౌనిక నెమ్మదిగా ఒకరికొకరు దగ్గరవుతారు. ఐతే వీరి ప్రేమకు కులం పెద్ద అడ్డ గోడలా కనిపిస్తుంది. ఈ అడ్డంకిని దాటి వీళ్లిద్దరూ ఒక్కటయ్యారా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

మనం రోజూ చూసే మనుషుల్ని.. విషయాల్ని.. ఎంతో సహజంగా.. అందంగా.. హృదయాలకు హత్తుకునేలా తెరపై చూపించడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. శేఖర్ కమ్ముల ఇదే నైపుణ్యంతో ప్రేక్షకుల మనసులు దోస్తుంటాడు. ఆయన సినిమాల్లో హీరో అనగానే ఎక్కడి నుంచో ఊడిపడ్డట్లు అద్భుతాలు చేసేయడు. మనలో ఒకడిగా మామూలుగానే కనిపిస్తాడు. కథానాయిక పాటల కోసమో.. అందాల ఆరబోతకో పెట్టుకున్న మొక్కుబడి పాత్రలా ఉండదు. తనకో వ్యక్తిత్వం ఉంటుంది. కథలో ఆమె అత్యంత కీలకంగా ఉంటుంది. ఆయన సినిమాల్లో ప్రతినాయక పాత్రలు పోషించేది వ్యక్తులు కాదు.. పరిస్థితులు.  ‘లవ్ స్టోరి’ సైతం ఈ కోవలోని చిత్రమే. ఈ కథ.. ఇందులోని పాత్రలు.. సన్నివేశాలు మనం ఎప్పుడూ చూసేవే. కానీ వాటిని శేఖర్ కమ్ముల అందమైన విజన్లో అందంగా.. కొంచెం కొత్తగా కనిపిస్తాయి. మన పక్కింట్లోనో.. మన ఊరిలోనే కనిపించే ఒక మామూలు అబ్బాయి-అమ్మాయి అనుకోకుండా ఒక చోట కలిస్తే.. వారి మధ్య పరిచయం.. తర్వాత స్నేహం.. ఆపై ప్రేమ.. ఈ ప్రయాణాన్ని శేఖర్ తనదైన శైలిలో అందంగా తెరపై ప్రెజెంట్ చేసి మెప్పిస్తాడు శేఖర్. వీరి ప్రేమ ప్రయాణం వరకు ‘లవ్ స్టోరి’ శేఖర్ కమ్ముల మార్కుతో అలరిస్తుంది. ఇక్కడి వరకు కథ పరంగా కొత్తదనం లేకపోయినా సరే.. శేఖర్ ‘బ్యూటిఫుల్ మూమెంట్స్’తో ‘లవ్ స్టోరి’ ఆకట్టుకుంటుంది. కానీ ఆ తర్వాత వీరి పెళ్లికి ‘కులం’ రూపంలో ఒక అడ్డంకి ఎదురయ్యేసరికి.. ఒక రొటీన్ టెంప్లేట్లోకి వెళ్లిపోతుంది. ఈ పాయింట్ ను కమ్ముల తన స్టయిల్లో కొత్తగా డిస్కస్ చేస్తాడేమో.. తనదైన పరిష్కారం ఏమైనా చూపిస్తాడేమో.. అని ఆశిస్తే అలాంటిదేమీ జరగలేదు. ఆ పాయింట్ దగ్గరికి రాగానే ‘లవ్ స్టోరి’ సగటు సినిమాలా మారిపోయింది. కొత్తగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయిన శేఖర్.. చివరికి వేరే కొత్త ‘సమస్య’లోకి కథను మళ్లించి హడావుడిగా సినిమాను ముగించేశాడు. దీని వల్ల ‘లవ్ స్టోరి’ మరో స్థాయికి వెళ్లలేక ఓ మోస్తరు సినిమాగా మిగిలింది.

శేఖర్ కమ్ముల సినిమాల నుంచి ప్రేక్షకులు ప్రధానంగా ఆశించేది.. అతడి మార్కు ‘బ్యూటిఫుల్ మూమెంట్స్’నే. ‘లవ్ స్టోరి’లోనూ అలాంటి మూమెంట్స్ కు లోటు లేదు. తన స్థాయికి కథానాయిక చాలా ఎక్కువ అని భావించే హీరో.. ఆమె తనను బహిరంగ ప్రదేశంలో ముద్దు పెట్టుకుంటే హీరో కళ్ల వెంట నీళ్లు తిరగడం.. దానికి హీరోయిన్ ‘‘ముద్దు పెడితే ఏడుస్తావేందబ్బా’’ అని ప్రశ్నించడం.. చూసి హృదయం ఉప్పొంగని వాళ్లుండరు. అలాగే తనను కులం పేరు చెప్పి హర్ట్ చేసిన కథానాయిక పట్ల కోపం తెచ్చుకుని హీరో ఆమెను వేరు చేసి మాట్లాడుతుంటే.. ఆమె సారీ చెబుతూ ‘‘మీరు కాదు.. మనం’’ అంటూ హీరో మీద వాలిపోయే మరో సన్నివేశం కూడా కదిలించేదే. దీనికి తోడు హీరో హీరోయిన్లు ఒకరికొకరు దగ్గరవడానికి ముందు వాళ్ల మధ్య గిల్లికజ్జాల నేపథ్యంలో వచ్చే సరదా సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇటు హీరో.. అటు హీరోయిన్ ఇద్దరి నేపథ్యం.. వారి కష్టాలు.. సగటు ప్రేక్షకులు ఐడెంటిఫై చేసుకునేలా ఉండటంతో చాలా త్వరగా ఆ పాత్రలతో కనెక్టయిపోతారు. నాగచైతన్య.. సాయిపల్లవి కాకుండా రేవంత్.. మౌనిక మాత్రమే కనిపించేలా ఆ పాత్రలను చక్కగా తీర్చిదిద్దాడు కమ్ముల. చైతూ.. పల్లవి కూడా ఆ పాత్రల్లో ఒదిగిపోవడంతో.. ప్రేక్షకులు వాటితో పాటు ప్రయాణం చేస్తారు. హీరోయిన్ పాత్రకు ఒక వ్యక్తిత్వం ఉండేలా చూడటం.. ఎక్కువగా తన కోణంలో కథను చెప్పే ప్రయత్నం చేయడం శేఖర్ సినిమాల్లో కనిపించే అరుదైన లక్ష్యం. ‘లవ్ స్టోరి’ కూడా ఆ కోవలోనే సాగడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. సన్నివేశాలకు తోడు పాటలు కూడా చాలా ఆహ్లాదకరంగా.. ఉత్సాహంగా సాగిపోవడంతో ప్రథమార్ధంలో సమయం చాలా సులువుగా గడిచిపోతుంది. ఇంటర్వెల్ సమయానికి చాలా మంచి అనుభూతిని ఇస్తుంది ‘లవ్ స్టోరి’.

ఐతే శేఖర్ కమ్ముల గత సినిమాల్లో కనిపించిన సమస్యే ‘లవ్ స్టోరి’లోనూ పునరావృతం అయింది. ప్రథమార్ధంలో మంచి హై ఇచ్చి.. ద్వితీయార్ధంలో ఆ టెంపోను కొనసాగించలేక ఇబ్బంది పడుతుంటాడు శేఖర్. ‘ఫిదా’లోనూ ఇదే సమస్యను గమనించవచ్చు. కాకపోతే అక్కడ విలన్లు లేకుండా వ్యక్తిత్వాల మధ్య ఘర్షణ నేపథ్యంలో లైట్ హార్టెడ్ సన్నివేశాలతో నడిచిపోవడంతో చల్తా అనిపించింది. కానీ ఇక్కడ కులం సమస్య చుట్టూ ద్వితీయార్దాన్ని నడపాల్సి రావడం మామూలు సినిమాల్లో మాదిరే ఒక ‘విలన్’ను పెట్టడంతో వచ్చింది సమస్య. దీని వల్ల ఆటోమేటిగ్గా రొటీన్ సన్నివేశాలు పడిపోయాయి. కథ పరంగా ఆశ్చర్యకర మలుపులేమీ కనిపించవు. హీరో హీరోయిన్ల మధ్య కొన్ని సన్నివేశాలు ఎమోషనల్ గా అనిపించినా.. కథనం రొటీన్ గా ఉండటంతో ద్వితీయార్ధం భారంగానే అనిపిస్తుంది. శేఖర్ మార్కు ‘ఆహ్లాదం’ ద్వితీయార్ధంలో పూర్తిగా మిస్సయింది. నీ చిత్రం చూసి.. సారంగ దరియా పాటలు ఎంత బాగున్నప్పటికీ.. అవి సరైన సమయంలో రాకపోవడం వల్ల అనుకున్నంతగా ఎంజాయ్ చేయలేని పరిస్థితి నెలకొంది. ఒక దశలో ఈ కథ సాగే తీరు చూస్తే.. తమిళ చిత్రాల తరహాలో హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ ఉంటుందేమో అన్న సందేహం కలుగుతుంది. కులం సమస్య మీద చివరికొచ్చేసరికి ఒక అర్థవంతమైన చర్చ ఉంటుందని.. శేఖర్ ఎమోషనల్ గా కదిలించే ప్రయత్నం చేస్తాడని.. ఒక పరిష్కారం లాంటిదేమైనా చూపిస్తాడని ఆశిస్తే.. అతనా విషయంలో నిరాశ పరిచాడు. ఈ సమస్యను పక్కన పెట్టేసి ‘లైంగిక వేధింపులు’ అంటూ కొత్త పాయింట్ మీదికి కథను మళ్లించేశాడు. అది కీలకమైన విషయమే అయినప్పటికీ.. ఈ కథకు అది కరెక్టా అన్న సందేహాలు రేకెత్తిస్తుంది. ఈ డార్క్ థీమ్ అందరికీ అంతగా రుచించకపోవచ్చు. హడావుడిగా.. ఒక రొటీన్ క్లైమాక్స్ తో సినిమాను ముగించి నిరాశకు గురి చేశాడు శేఖర్. ఈ ప్రతికూలతల వల్ల ‘లవ్ స్టోరి’ ఒక స్పెషల్ మూవీ కాలేకపోయింది. అలాగని ఈ సినిమాను తక్కువ చేయడానికి వీల్లేదు. టికెట్ డబ్బులకు న్యాయం చేసే చాలా అంశాలు ఇందులో ఉన్నాయి. కానీ అంచనాలు మాత్రం ఎక్కువ పెట్టుకోకూడదు.

నటీనటులు:

శేఖర్ కమ్ముల సినిమాల్లో నటులు కనిపించరు. పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. ‘లవ్ స్టోరి’ కూడా అందుకు మినహాయింపు కాదు. నాగచైతన్య ఇమేజ్ గురించి ఏమాత్రం ఆలోచించకుండా రేవంత్ పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేశాడు. ఎక్కడా అతడిలోని స్టార్ ఈ పాత్రను డామినేట్ చేయకపోవడం తను బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చాడనడానికి సూచిక. ఇలాంటి పాత్రను ఎంచుకున్నందుకు అతడిని అభినందించాలి. ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా బాగా చేసిన చైతూ.. ఎక్కడా ఎబ్బెట్టుగా అనిపించలేదు. సాయిపల్లవి గురించి చెప్పేదేముంది? ఎప్పట్లాగే అదరగొట్టేసింది. భావోద్వేగాలను పండించడంలో.. ఆ తరహా సన్నివేశాల్లో హావభావాలు పలికించడంలో తనకు తానే సాటి అని ఆమె మరోసారి రుజువు చేసుకుంది. లోపలున్న అంతు లేని బాధను ఆమె కళ్లతో పలికించిన వైనం అద్భుతం. డ్యాన్సుల్లోనూ అదరగొట్టిన సాయిపల్లవి తన నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారో అన్నీ ఇచ్చిందీ చిత్రంలో. సాయిపల్లవి అభిమానులు తనకోసమే ఈ సినిమా చూడొచ్చు. ఈశ్వరీ రావు చాలా బాగా చేసింది. రాజీవ్ కనకాల.. ఉత్తేజ్..  దేవయాని కూడా తమ పాత్రల పరిధిలో బాగా చేశారు. నటీనటుల్లో ఎవరికీ వంక పెట్టడానికి లేదు.

సాంకేతిక వర్గం:

పాటలతో ఇప్పటికే ఒక ఊపు ఊపేసిన పవన్ సీహెచ్.. సినిమాలోనూ ఆకట్టుకున్నాడు. తెరపై అతడి పాటలు మరింత మంచి అనుభూతిని ఇస్తాయి. కాకపోతే ద్వితీయార్ధంలో రెండు మంచి పాటలకు సరైన ప్లేస్మెంట్ ఇవ్వకపోవడం కొంచెం నిరాశ కలిగిస్తుంది. పవన్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. విజయ్ సి.కుమార్ ఛాయాగ్రహణం మెప్పిస్తుంది. శేఖర్ కమ్ముల సినిమాలన్నింట్లో మాదిరే ఇందులోనూ విజువల్స్ ఆహ్లాదం పంచుతాయి. ముఖ్యంగా ప్రథమార్ధంలో కలర్ ఫుల్ విజువల్స్ సినిమాకు ఆకర్షణగా నిలిచాయి. నిర్మాణ విలువలు మంచి ప్రమాణాలతో సాగాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రథమార్ధం వరకు తన ముద్రను చూపించాడు. తన మార్కు పాత్రల చిత్రణతో.. అందమైన మూమెంట్స్ తో.. ఆహ్లాదకరమైన సన్నివేశాలతో శేఖర్ సగం వరకు అంచనాలను బాగానే అందుకున్నాడు. కానీ ఒక బాధ్యతతో ఇలాంటి కథను చెప్పే ప్రయత్నం చేయడం అభినందనీయమే. కానీ సమస్యను ఇంకా బాగా చర్చించి ఉండాల్సింది అనిపిస్తుంది. ముగింపు మరింత బాగుండాల్సింది. విలన్లు లేని.. వ్యక్తిత్వాల మధ్య ఘర్షణ మాత్రమే ఉండి ఆహ్లాదకర వాతావరణంలో సాగిపోయే సినిమాలే శేఖర్ నుంచి ప్రేక్షకులు ఎక్కువగా ఆశిస్తారన్నది గమనార్హం. ఈ చిత్రంలో సీరియస్నెస్ ఎక్కువ అయిపోవడం.. ద్వితీయార్ధంలో రొటీన్ బాట పట్టడం నిరాశ కలిగించే విషయాలు.

చివరగా: లవ్ స్టోరి.. కొంచెం అందంగా.. కొంచెం భారంగా!

రేటింగ్-2.5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS