లక్ష్య

Fri Dec 10 2021 GMT+0530 (India Standard Time)

లక్ష్య

చిత్రం : ‘లక్ష్య’

నటీనటులు: నాగశౌర్య-కేతిక శర్మ-జగపతిబాబు-సచిన్ ఖేద్కర్-సత్య-రవిప్రకాష్ తదితరులు
సంగీతం: కాలభైరవ
ఛాయాగ్రహణం: రామ్
మాటలు: సృజన మణి
నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్-పుస్కర్ రామ్మోహన్ రావు-శరత్ మరార్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సంతోష్ జాగర్లమూడి

హిట్టు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న యువ కథానాయకుడు నాగశౌర్య.. ఇప్పుడు ‘లక్ష్య’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగులో ఇప్పటిదాకా చూడని ఆర్చరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ఇది. ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

పార్థు (నాగశౌర్య) ఒక ఆర్చర్. తన తాత (సచిన్ ఖేద్కర్) ప్రోత్సాహంతో ఈ ఆటలో అంచెలంచెలుగా ఎదుగుతాడు. స్టేట్ ఛాంపియన్ కూడా అవుతాడు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలనుకుంటున్న సమయంలో తాత మరణంతో పార్థు కుంగిపోతాడు. అదే సమయంలో పార్థు అంటే గిట్టని సహచర ఆర్చర్ రాహుల్ (శత్రు).. కుట్ర పూరితంగా అతడికి డ్రగ్స్ అలవాటు చేసి తన కెరీర్ ను దెబ్బ కొడతాడు. ఒలింపిక్స్ ట్రయల్స్ లో ఫెయిలై.. డ్రగ్స్ తీసుకున్న విషయం బయటపడి మీడియాలో అన్ పాపులర్ అయి అన్ని రకాలుగా గాడి తప్పుతాడు పార్థు. ఇలా పాతాళానికి పడిపోయిన స్థితిలో ఓ వ్యక్తి కారణంగా అతడి జీవితం మళ్లీ కొత్త మలుపు తిరుగుతుంది. ఆ వ్యక్తి ఎవరు.. తన కారణంగా పార్థు మళ్లీ ఎలా పుంజుకోగలిగాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

‘లక్ష్య’ సినిమా చేయడానికి తనకు ‘సై’ చిత్రం స్ఫూర్తిగా నిలిచిందని ఈ సినిమా ప్రమోషన్లలో చెప్పుకొచ్చాడు నాగశౌర్య. ఐతే అతడికి స్ఫూర్తిగా నిలిచిన సినిమాలో చూపించిన రగ్బీ ఆట మనకు అస్సలు పరిచయం లేనిది. ఇండియాలో ఆ ఆట పెద్దగా ఆడరు కూడా. కానీ మనకు తెలియని ఆట అయినా సరే.. దాని గురించి లోతుగా పరిశోధించడమే కాదు.. ఆ ఆట చుట్టూ ఆసక్తికర కథనాన్ని అల్లి.. అదిరిపోయేలా డ్రామాను పండించాడు రాజమౌళి. జక్కన్న మిగతా సినిమాలతో పోలిస్తే ఓవరాల్ గా ఇది కొంచెం వీక్ అనిపించినా.. గేమ్ వరకు చూసుకుంటే ఎంతో ఉత్కంఠభరితంగా.. రసవత్తరంగా ఉంటుంది.

అంతగా పాపులర్ కాని క్రీడల నేపథ్యంలో సినిమాలు తీయాలనుకున్నపుడు ‘సై’ ఒక బెంచ్ మార్క్ అనడంలో సందేహం లేదు. ఐతే పార్థు పాత్ర చేయడానికి నాగశౌర్య ‘సై’ నుంచి స్ఫూర్తి పొందాడేమో కానీ.. దర్శకుడు సంతోష్ జాగర్లమూడి మాత్రం ‘సై’ని స్ఫూర్తిగా తీసుకున్నట్లు లేడు. బేసిగ్గానే ఆర్చరీకి ఆదరణ తక్కువ. అది మాస్ స్పోర్ట్ కాదు. పైగా దాని చుట్టూ ఆసక్తికర కథను అల్లుకోవడంలో కానీ.. గేమ్ చుట్టూ డ్రామాను పండించడంలో కానీ.. ఉత్కంఠ రేకెత్తించడంలో కానీ సంతోష్ సక్సెస్ కాలేకపోయాడు. సగటు స్పోర్ట్స్ డ్రామాల తరహాలో రొటీన్ గా సాగిపోయే ‘లక్ష్య’ గేమ్ పరంగానూ ఆసక్తి రేకెత్తించదు. అలాగే గేమ్ ను దాటి కూడా అంతగా మెప్పించదు.

స్క్రీన్ ప్లే పరంగా కథను ముందుకు వెనక్కి చెప్పొచ్చు కానీ.. బాలీవుడ్లో అయినా టాలీవుడ్లో అయినా చాలా వరకు స్పోర్ట్స్ డ్రామాల్లో కామన్ గా కనిపించే పాయింట్ చాలా వరకు ఒకటే. ప్రధాన పాత్రధారి ఆట మీద అమితాసక్తితో.. ఆ ఆటలో ప్రత్యేకమైన ప్రతిభతో ముందుకు దూసుకెళ్తుంటాడు. కానీ మధ్యలో ఒక బ్రేక్ పడుతుంది. ఒక బలమైన కారణంతో గాడి తప్పుతాడు. ఒక ఫెయిల్యూర్ గా మిగిలిపోతాడు. కానీ తర్వాత ఏదో ఒక స్ఫూర్తి రగిలి తిరిగి ఆటలోకి పునరాగమనం చేస్తాడు. చివరికి తన లక్ష్యాన్ని చేరుకుంటాడు. ‘లక్ష్య’ సైతం ఇదే ఫార్మాట్లో నడుస్తుంది. కాకపోతే ఇక్కడ సగటు ప్రేక్షకులకు పెద్దగా తెలియని ఆర్చరీ నేపథ్యంలో ఈ కథ నడవడం కొత్త విషయం.

ఐతే దర్శకుడు గేమ్ గురించి బాగానే స్టడీ చేసిన విషయం తెరపై కనిపిస్తుంది కానీ.. ఆ ఆటను ఆసక్తికరంగా తెరమీద ప్రెజెంట్ చేయడంలో.. దాని చుట్టూ నడిచే సన్నివేశాలతో ఉత్కంఠ రేకెత్తించడంలో విఫలమయ్యాడు. ఆర్చరీ చుట్టూ సీన్లు చాలా మామూలుగా నడిచిపోతుండటంతో ఆ ఆటతో కానీ.. అలాగే హీరో పాత్రతో కానీ ఎమోషనల్ కనెక్ట్ అనేది ఏర్పడదు. ప్రేక్షకుడికి ఆట పట్ల ఆసక్తి రేకెత్తించగలిగితే.. దాని చుట్టూ నడిచే సన్నివేశాల్లో ఎలివేషన్లకు అవకాశం ఉండేది. కానీ ‘లక్ష్య’లో అందుకు పెద్దగా అవకాశమే లేకపోయింది. ఇక హీరోకు.. అతడి తాతకు మధ్య ఎమోషనల్ బాండ్ బాగానే అనిపించినా.. హీరోయిన్ తో లవ్ ట్రాక్ తేలిపోవడంతో ఎంటర్టైన్మెంట్ కూడా మిస్సయిపోయింది.

హీరో తన కెరీర్లో పతనం కావడానికి దారి తీసే కారణాలు.. దాని చుట్టూ నడిపిన డ్రామా కూడా ఏమంత ఆసక్తికరంగా లేదు. తాత మరణంతో డిస్టర్బ్ అయి మద్యానికి అలవాటు పడ్డ హీరో.. ఆ మత్తులో వచ్చి వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడమేంటో.. ఆ తర్వాత ఏకాగ్రత కోసం డ్రగ్స్ తీసుకోవడమేంటో అర్థం కాదు. ఇందులో లాజిక్ కనిపించదు. ఇక ద్వితీయార్ధంలో అయితే కథ ఒక దశా దిశా లేకుండా సాగిపోతుంది. జగపతిబాబు పాత్ర ప్రవేశంతో కూడా పరిస్థితి ఏమీ మారదు. హీరోను దారిలో పెట్టే సేవియర్ తరహాలో ఆ పాత్రను కొంచెం కొత్తగా ప్రెజెంట్ చేయాలని దర్శకుడు ఏదో ప్రయత్నించాడు కానీ.. అదేమంత వర్కవుట్ కాలేదు. ఉన్నట్లుండి హీరో సిక్స్ ప్యాక్ చేసేసి సరికొత్త అవతారంలో కనిపిస్తాడు కానీ.. ఆ మేకోవర్ మరీ అతిగా.. కృత్రిమంగా అనిపిస్తుంది.

మళ్లీ ఆటలోకి పునరాగమనం చేయడం.. చివరికి విజేతగా నిలవడం అంతా రొటీన్ గా అనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లో కూడా ఆట పరంగా ఉత్కంఠకు అవకాశమే లేకపోయింది. చాలా మామూలుగా ఆ సన్నివేశాలను లాగించేసి సినిమాను ముగించాడు దర్శకుడు. ఓవరాల్ గా చూస్తే ‘లక్ష్య’ ఒక సాదాసీదా స్పోర్ట్స్ డ్రామాలా అనిపిస్తుంది తప్ప ఇందులో ప్రత్యేకతేమీ లేదు.

నటీనటులు:

నాగశౌర్య తన కెరీర్లో ఏ సినిమాకు పడనంత కష్టం పడ్డాడు. ఫిజిక్ పరంగానే కాక అన్ని రకాలుగా అతను పడ్డ కష్టమంతా తెరపై కనిపిస్తుంది. పార్థుగా సినిమా అంతటా ఇంటెన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు శౌర్య. తనను చూస్తే నిజంగా ఆర్చరే అన్న ఫీలింగ్ కలిగించాడు. ఎమోషనల్ సీన్లలో అతడి నటన ఆకట్టుకుంటుంది. ఐతే సెకండాప్ లో షాకింగ్ మేకోవర్ తో శౌర్య ఆకట్టుకున్నప్పటికీ.. అంత మేకోవర్ అవసరం లేదనిపిస్తుంది. హీరోయిన్ కేతిక శర్మ పర్వాలేదు. తొలి సినిమాలో గ్లామర్ పరంగా హైలైట్ అయిన ఆమె ఇందులో నటనతో మెప్పించడానికి ప్రయత్నించింది. జగపతిబాబు కీలక పాత్రలో పర్వాలేదనిపించాడు. సచిన్ ఖేద్కర్ బాగా చేశాడు. ఆసక్తి రేకెత్తించే ఆయన పాత్రను అర్ధంతరంగా ముగించేయడం నిరాశ పరుస్తుంది. శత్రు.. కిరీటి.. సత్య.. వీళ్లంతా తమ పాత్రల పరిధిలో బాగానే చేశారు.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గా ‘లక్ష్య’ జస్ట్ ఓకే అనిపిస్తుంది. కాలభైరవ పాటలు సోసోగా సాగిపోయాయి. ఏ పాటా రిజిస్టర్ అయ్యేలా లేదు. నేపథ్య సంగీతం బాగానే సాగింది. కెమెరామన్ రామ్ పనితనం పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ సంతోష్ జాగర్లమూడి.. ఇప్పటిదాకా తెలుగులో చూడని ఆర్చరీ బ్యాక్ డ్రాప్ లో కథను ఎంచుకోవడం బాగానే ఉంది. కానీ సగటు స్పోర్ట్స్ డ్రామాలకు భిన్నంగా ఇందులో కొత్తగా కనిపించిందేమీ లేదు. స్పోర్ట్స్ సినిమాల్లో ఉండాల్సినంత ఎమోషన్ ఇందులో లేదు. దర్శకుడు డ్రామాను సరిగా పండించలేకపోయాడు. కథాకథనాల విషయంలో సంతోష్ మరింత కసరత్తు చేయాల్సింది. దర్శకుడిగా అతడికి యావరేజ్ మార్కులు పడతాయి.

చివరగా: లక్ష్య.. గురి తప్పింది

రేటింగ్-2.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre


LATEST NEWS