‘క్రాక్’

Sun Jan 10 2021 GMT+0530 (IST)

 ‘క్రాక్’

చిత్రం : ‘క్రాక్’

నటీనటులు: రవితేజ-శ్రుతి హాసన్-సముద్రఖని-వరలక్ష్మి శరత్ కుమార్-రవిశంకర్-జీవా తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: జీకే విష్ణు
మాటలు: సాయిమాధవ్ బుర్రా
నిర్మాత: ఠాగూర్ మధు
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: గోపీచంద్ మలినేని

2020ని కరోనా మహమ్మారి కమ్మేయగా.. ఎన్నో ఆశలతో 2021ను మొదలు పెడుతోంది సినీ పరిశ్రమ. కొత్త ఏడాదిలో రిలీజవుతున్న తొలి సినిమా.. క్రాక్. ఐదు రోజుల ముందే సంక్రాంతి సందడికి తెరలేపుతూ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. మంచి అంచనాల మధ్య విడుదలైన ‘క్రాక్’ ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

పోతురాజు వీర శంకర్ (రవితేజ) పవర్ ఫుల్ పోలీసాఫీసర్. అనాథగా పెరిగి పోలీస్ అయిన అతను.. ఎవరైనా తన ముందుకొచ్చి బ్యాగ్రౌండ్ గురించి మాట్లాడితే శివాలెత్తిపోతాడు. ఇలా ముందు బిల్డప్ ఇచ్చిన వాళ్లందరి తాట తీసేస్తుంటాడు. చిన్న రౌడీగా మొదలుపెట్టి పోలీసుల్ని రాజకీయ నాయకుల్ని తన గుప్పెట్లో ఉంచుకుని ఒంగోలు ప్రాంతాన్ని ఏలుతున్న కఠారి కృష్ణ (సముద్రఖని) ఇలాగే అనుకోకుండా వీర శంకర్ ను కెలుకుతాడు. అతడి ఇగో హర్ట్ అయి.. కృష్ణను టార్గెట్ చేస్తాడు. ఈ ఇద్దరి మధ్య మొదలైన వైరం ఎక్కడిదాకా వెళ్లింది.. చివరికి ఎవరు పైచేయి సాధించారు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

‘క్రాక్’ సినిమా తమిళ హిట్ మూవీ ‘సేతుపతి’కి రీమేక్ అంటూ కొంత ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. సినిమా చూస్తే ఇది దానికి రీమేక్ అనిపించదు కానీ.. కొన్ని సన్నివేశాల్లో ‘సేతుపతి’తో ‘క్రాక్’కు పోలీక కనిపిస్తుంది. ముఖ్యంగా ‘సేతుపతి’లో మాదిరకే ఇక్కడా పోలీస్ అయిన హీరోను దెబ్బ తీయడానికి అతడి కుటుంబం జోలికి వెళ్తుంది విలన్ బ్యాచ్. ‘సేతుపతి’లో హీరో ఫోన్లో అలెర్ట్ చేస్తుంటే.. అతడి పిల్లలే తమను తాము రౌడీల నుంచి కాపాడుకున్నట్లు చూపిస్తారు. అది చాలా రియలిస్టిగ్గా అనిపిస్తుంది. కానీ ‘క్రాక్’లోకి వచ్చేసరికి.. విలన్ ‘‘నీ భార్యా పిల్లల్ని చంపడానికి మా వాళ్లు వెళ్లారు’’ అనగానే.. హీరో ముందు భయపడ్డట్లు నటించి ఆ తర్వాత గట్టిగా నవ్వుతాడు. అదే సమయంలో రౌడీలు కత్తులు పట్టుకుని నిద్ర పోతున్న హీరో భార్య ఆమె కొడుకు చుట్టూ మూగుతారు. ఇదేంటి భార్య ప్రమాదంలో ఉంటే హీరో నవ్వుతున్నాడు అనుకుంటాం. కానీ అప్పుడు ‘పోకిరి’లో మహేష్ బాబు రియల్ క్యారెక్టర్ని పరిచయం చేసినట్లు హీరోయిన్ గురించి హీరో బిల్డప్ ఇస్తుంటే.. ఆమె రౌడీల మక్కెలు విరిచేస్తుంది. ఈ సన్నివేశం కొందరికి సిల్లీగా అనిపించొచ్చు. ఇంకొందరితో విజిల్స్ వేయించొచ్చు. ఇలా విజిల్స్ వేయించేవాళ్ల కోసమే ‘క్రాక్’ సినిమా.

దర్శకుడిగా గోపీచంద్ మలినేని శైలి ఏంటో అందరికీ తెలుసు. అలాగే రవితేజ చేసే మాస్ సినిమాలు ఎలా ఉంటాయో కూడా అవగాహన ఉంటుంది. ఈ ఇద్దరి కలయికలో ఎలాంటి సినిమాను ప్రేక్షకులు ఆశిస్తారో అలాంటి మాస్ మసాలా సినిమానే.. క్రాక్. ఆరంభ సన్నివేశంలో ఒక పెద్ద క్రిమినల్ ను పట్టుకోవడం ఎలాగో తెలియక పోలీస్ ఉన్నతాధికారులు తలలు పట్టుకోవడం.. అంతలో ఓ అధికారి.. ‘‘వీడ్ని పట్టుకోవడానికి ఎవడో ఒకడుంటాడు’’ అంటూ అనే డైలాగ్ పేల్చడం.. కట్ చేస్తే కెమెరా అక్కడి నుంచి కర్నూలుకు షిఫ్ట్ అవడం.. హీరో పెద్ద బిల్డప్ మధ్య రంగంలోకి దిగడం.. చాలా సింపుల్ గా ఆ పెద్ద క్రిమినల్ ను పట్టేసుకోవడం.. ఈ ఇంట్రో చూడగానే ‘క్రాక్’ ఫక్తు ఫార్ములా ప్రకారం నడిచిపోయే సినిమా అని అర్థమైపోతుంది. హీరో కనిపించిన ప్రతిసారీ మోతెక్కిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్.. ఒక ఎలివేషన్ సీన్.. లేదంటే పంచ్ డైలాగ్.. ప్రథమార్ధమంతా కూడా ఇలాగే నడిచిపోతుంది. ‘ఎంటర్టైన్మెంట్’ కోసమని ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో కొన్ని సన్నివేశాలు పెట్టారు కానీ.. అవి చాలా సాధారణంగా అనిపిస్తాయి.

ట్రైలర్లో చూపించినట్లే ‘50 రూపాయల నోటు.. మామిడి కాయ.. మేకు’.. అంటూ ఒక సెటప్ పెట్టి దర్శకుడు గోపీచంద్ మలినేని తనకు అలవాటు లేని విధంగా కొత్తగా ఏదో చేద్దామని చూశాడు కానీ.. అదేమంత వర్కవుట్ కాలేదు. ఈ కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉందే అని మొదట అనిపించినా.. తర్వాత దాన్ని డైల్యూట్ చేసే ట్రీట్మెంట్ తో తన రూట్లోకే వెళ్లిపోయాడు గోపీచంద్. ఇలా ఓ కాన్సెప్ట్ అనుకున్నాక దాని ప్రకారం ఒక పద్ధతిగా కథను.. స్క్రీన్ ప్లేను నడిపించడం అవసరం. కానీ ఎంతసేపు హీరో ఎలివేషన్ల మీదే ఫోకస్ పెట్టడంతో కథ ఒక తీరుగా నడవలేదు. ఐతే తొలి గంట ఇలా నడిచిపోయిన.. ఇంటర్వెల్ దగ్గర తొలిసారి విలన్ని హీరో ఢీకొట్టే పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ తో ప్రేక్షకులు అలెర్టయ్యేలా చేశాడు గోపీచంద్. ఈ సన్నివేశం తర్వాత విలన్ ‘‘అక్కడి నుంచే అసలు కథ మొదలైంది’’ అని డైలాగ్ పేలుస్తాడు. నిజానికి ‘క్రాక్’ సినిమా మొదలయ్యేదే ఇక్కడి నుంచి అని చెప్పాలి. ఇక్కడి నుంచే ‘క్రాక్’ ఎలాంటి డీవియేషన్లు లేకుండా ఒక పాయింట్ మీద నడుస్తుంది.

హీరో-విలన్ మధ్య ఎత్తులు పైఎత్తులతో ఒక ఫార్ములా ప్రకారమే ద్వితీయార్ధం నడిచిపోయినా సరే.. మాస్ ను ఎంగేజ్ చేసే యాక్షన్ ఎపిసోడ్లు.. కొన్ని ఆసక్తికర సన్నివేశాలు.. చిన్న ట్విస్టులతో ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. ఫైట్ తర్వాత ఫైట్ రావడం కొంత విసుగ్గా అనిపించినా.. ఆ యాక్షన్ ఘట్టాల్ని తీర్చిదిద్దిన వైనాన్ని మాత్రం అభినందించాల్సిందే. ఫైట్ మాస్టర్ల కష్టం.. కెమెరామన్ ప్రతిభ.. దర్శకుడి టేకింగ్ అన్నీ సమపాళ్లలో కుదిరి ‘క్రాక్’ యాక్షన్ ప్రియులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తుంది. ఐతే సన్నివేశాల పరంగా కొత్తదనం మాత్రం ఏమీ కనిపించదు. కానీ ప్రథమార్ధంలో మాదిరి దశా దిశా లేనట్లు కాకుండా ఒక తీరుగా కథ నడవడంతో ప్రేక్షకుల ఆసక్తి సన్నగిల్లిపోదు. పతాక సన్నివేశంలో సైతం యాక్షన్ బాగానే హైలైట్ అయింది. సెకండాఫ్ లో పూర్తి సీరియస్ గా సాగిన సినిమా చివర్లో వినోదాత్మకంగా ముగిసి చిరునవ్వులతో ప్రేక్షకులు థియేటర్ల నుంచి బయటికొచ్చేలా చేస్తుంది. ముందే అన్నట్లు రవితేజ-గోపీచంద్ కాంబినేషన్ నుంచి ఆశించే మాస్ మసాలా అంశాలకు ‘క్రాక్’లో లోటు లేదు. ఫైట్లు.. పాటలు.. హీరో ఎలివేషన్లు అన్నీ కూడా మాస్ ను టార్గెట్ చేసినవే. మీరు కోరుకునేది అవే అయితే ‘క్రాక్’ కిక్కిస్తుంది.

నటీనటులు: రవితేజకు మంచి మాస్ క్యారెక్టర్ పడితే ఎంత ఓన్ చేసుకుని నటిస్తాడో ‘క్రాక్’ చూపిస్తుంది. గత సినిమాల ఫలితాల ప్రభావం ఏమీ కనిపించకుండా మంచి ఎనర్జీతో నటించి ‘క్రాక్’కు ప్రధాన ఆకర్షణగా మారాడు రవితేజ. పోలీస్ పాత్రలంటేనే రెట్టించిన ఉత్సాహం చూపించే మాస్ రాజా.. వీర శంకర్ పాత్రలోనూ అంతే ఎనర్జీతో నటించాడు. మాస్ ను టార్గెట్ చేసిన సన్నివేశాల్లో రవితీజ పెర్ఫామెన్స్  హైలైట్ గా నిలుస్తుంది. శ్రుతి హాసన్ లుక్స్ పరంగా తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. ఆమెలో ఇంతకుముందున్న గ్రేస్ లేదు. చాలా కృత్రిమంగా తయారైంది ఆమె అవతారం. లుక్ అంతంతమాత్రం అంటే.. మేకప్ కూడా భరించలేని విధంగా ఉంది చాలా చోట్ల. నటన పరంగా శ్రుతి చేయడానికి ఏమీ లేకపోయింది. విలన్ పాత్రల్లో సముద్ర ఖని.. వరలక్ష్మి శరత్ కుమార్ తమ ప్రత్యేకతను చాటుకున్నారు. వాళ్ల పాత్రలు రొటీన్ గా అనిపించినా.. బాగానే హైలైట్ అయ్యాయి. ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. రవిశంకర్ వినోదానికి కొంత మేర ఉపయోగపడ్డాడు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సుధాకర్ పర్వాలేదు.

సాంకేతిక వర్గం:

రెండు మూడేళ్లుగా మంచి ఫాంలో ఉన్న తమన్.. ‘క్రాక్’లో తన జోరు కొనసాగించాడు. సంగీతం మరీ కొత్తగా ఉందని అనలేం కానీ.. ‘క్రాక్’ సినిమాకు నప్పే.. మాస్ ను మెప్పించే పాటలు-నేపథ్య సంగీతంతో అతను ఆకట్టుకున్నాడు. భూమ్ బద్దల్.. మాస్ బిరియాని.. భలేగా ఉన్నావే తగిలావే బంగారం పాటలు హుషారుగా సాగి మాస్ ను ఆకట్టుకుంటాయి. కోరమీసం పోలీసోడా పాట మెలోడీ ప్రియుల్ని ఆకట్టుకుంటుంది. పాటల చిత్రీకరణ కూడా బాగుంది. కొన్ని చోట్ల మరీ లౌడ్ గా అనిపించినప్పటికీ.. చాలా వరకు హుషారు పుట్టించే.. హీరోయిజాన్ని ఎలివేట్ చేసే బ్యాగ్రౌండ్ స్కోర్ తోనూ తమన్ మెప్పించాడు. జీకే విష్ణు విజువల్స్ ‘క్రాక్’కు పెద్ద ప్లస్. యాక్షన్ సన్నివేశాల్లో అతను అద్భుత పనితనం చూపించాడు. లైటింగ్ కెమెరా యాంగిల్స్ వావ్ అనిపిస్తాయి. ఎడిటింగ్ కూడా బాగుంది. ఒక పెద్ద మాస్ సినిమా స్థాయికి ఉండాల్సిన నిర్మాణ విలువలతో ఠాగూర్ మధు తన వంతు బాధ్యత నిర్వర్తించాడు. ఇక దర్శకుడు గోపీచంద్ మలినేని తన శైలిలోనే మాస్ ను అలరించే ప్రయత్నం చేశాడు. కొత్తదనం కోసం కొంత ప్రయత్నం చేసినట్లే చేసి.. దాన్ని మధ్యలో వదిలేశాడు. అతడి గత సినిమాలతో పోలిస్తే కొంచెం భిన్నంగా అనిపించేది యాక్షన్ ఘట్టాలే. హీరో ఎలివేషన్ సీన్లలో గోపీచంద్ పనితనం కనిపిస్తుంది.

చివరగా: క్రాక్.. ఫార్ములా మసాలా

రేటింగ్- 2.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS