కణ్మణి రాంబో ఖతీజా

Thu Apr 28 2022 GMT+0530 (India Standard Time)

కణ్మణి రాంబో ఖతీజా

మూవీ రివ్యూ :  కణ్మణి రాంబో ఖతీజా

నటీనటులు: విజయ్ సేతుపతి-సమంత-నయనతార-ప్రభు-రెడిన్ కింగ్స్ లీ తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: కదిర్-విజయ్ కార్తీక్
నిర్మాత: లలిత్ కుమార్
రచన-దర్శకత్వం: విఘ్నేష్ శివన్

విజయ్ సేతుపతి.. నయనతార.. సమంత.. ఈ ముగ్గురు టాప్ ఆర్టిస్టుల కలయికలో తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ రూపొందించిన చిత్రం ‘కణ్మణి రాంబో ఖతీజా’. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ రోజే విడుదలైన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

రాంబో (విజయ్ సేతుపతి) చిన్నప్పట్నుంచి దురదృష్టవంతుడిగా పేరుపడ్డ కుర్రాడు. అతను పుట్టగానే తండ్రి చనిపోవడం.. తల్లి అనారోగ్యంతో మంచాన పడడంతో అందరూ తనను నష్ట జాతకుడిగా చూస్తారు. తల్లికి తాను ఎంత దూరంగా ఉంటే ఆమె అంత ఆరోగ్యంగా ఉంటుందని భావించి రాంబో ఆమెకు దూరంగా సిటీకి వెళ్లిపోతాడు. అక్కడ కూడా తాను ఏది ఇష్టపడితే అది దూరమవుతుందని నమ్మే అతను.. అమ్మాయిలకు కూడా దూరంగా ఉంటాడు. అలాంటి అతని జీవితంలోకి అనుకోకుండా కణ్మణి (నయనతార).. ఖతీజా (సమంత) వస్తారు. వీరిలో ఒకరికి తెలియకుండా ఇంకొకరికి రాంబో దగ్గరవుతాడు. ఐతే కణ్మణి.. ఖతీజాలకు ఒకరి గురించి ఒకరికి తెలిసే సమయానికే రాంబోకు ఒక మానసిక జబ్బు ఉందని.. అందువల్లే అతను కణ్మణి.. ఖతీజాలను తనకు తెలియకుండానే వేర్వేరుగా ప్రేమించాడని బయటపడుతుంది. మరి ఈ స్థితిలో కణ్మణి.. ఖతీజా ఏం చేశారు.. వీరిలో ఎవరికి రాంబో సొంతమయ్యాడు.. అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

అగ్ర కథానాయిక నయనతార బాయ్ ఫ్రెండుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న విఘ్నేష్ శివన్ తమిళంలో పేరున్న దర్శకుడే. తనదైన చమత్కారం.. చిలిపిదనంతో అతను సన్నివేశాలను నడిపించే తీరు ఫన్ లవింగ్ ఆడియన్స్ కు బాగా నచ్చుతుంటుంది. అతను విజయ్ సేతుపతి.. నయనతార.. సమంత లాంటి టాప్ పెర్ఫామర్ల కలయికలో ట్రయాంగిలర్ లవ్ స్టోరీ తీయడం.. దానికి ఆకర్షణీయ ట్రైలర్ కట్ చేయడంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ట్రైలర్లో ఇద్దరు హీరోయిన్లలో ఒకరు టీ.. ఇంకొకరు కాఫీ తెచ్చి ఇస్తే.. రెండూ కలిపి తాగే సీన్.. నయన్-సామ్ ఒకరి తర్వాత అతడి చెంపలు చెల్లుమనిపించే షాట్.. లాంటివి చూస్తే ‘కేఆర్కే’ మంచి ఫన్ రైడ్ లాగా అనిపించింది. కానీ ఈ మెరుపులన్నీ ట్రైలర్ వరకే పరిమితం. సింపుల్ గా చెప్పాలంటే.. ఇది ‘పైన పటారం.. లోన లొటారం’ టైపు సినిమా. ఒక అర్థరహితమైన కథను అత్యంత పేలవంగా నరేట్ చేయడంతో ‘కేఆర్కే’ ఏ దశలోనూ ఎంగేజ్ చేయదు.

సాధారణంగా సినిమా కథలు సమాజంలోని పరిస్థితులను ప్రతిబింబించేలాగే ఉంటాయి. ఒకప్పుడు సొసైటీలు ఇద్దరు పెళ్లాలున్న వ్యక్తులు చాలామందే కనిపించేవారు. ఇప్పుడు ఎఫైర్లు లేవని కాదు కానీ.. అందరికీ తెలిసేలా ఒక వ్యక్తికి ఇద్దరు పెళ్లాలుండటం ఒకప్పుడు మామూలు విషయంగానే చూసేవారు. అందుకు తగ్గట్లే 80 90 దశకాల్లో ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు టైపు కథలు చాలా వచ్చేవి. కానీ తర్వాత సామాజిక పరిస్థితులు మారాయి. కథలు కూడా మారాయి. ఐతే విఘ్నేష్ శివన్ ఇప్పుడు మళ్లీ ప్రేక్షకులను 80-90లకు తీసుకెళ్లాలని ప్రయత్నించినట్లు అనిపిస్తుంది. ఒక వ్యక్తి ఇద్దరు అమ్మాయిలను ఒకే సమయంలో వేర్వేరుగా ప్రేమించడం.. ఇద్దరినీ పెళ్లి చేసుకోవాలని ఆశపడటం.. ఈ ముగ్గురూ కలిసి ఒకే ఇంట్లో జీవనం సాగించడం.. ‘కేఆర్కే’లో అసలు జీర్ణం కాని పాయింట్. కొన్ని సన్నివేశాల్లో కామెడీ పండించడానికి ఈ పాయింట్ ఓకే కానీ.. దీని మీద రెండున్నర గంటలకు పైగా నిడివితో సినిమా నడిపించాలని చూడటమే సమస్య.

అసలు హీరో ఒకే సమయంలో ఇద్దరితో ప్రేమాయణం నడిపించే వైనాన్ని చూపించడంలోనే చాలా కన్ఫ్యూజ్ చేస్తాడు దర్శకుడు. పగలు క్యాబ్ డ్రైవర్.. రాత్రి బౌన్సర్ గా పని చేసే ఒక మామూలు వ్యక్తి.. ఆయా సమయాల్లో తనను కలిసే ఇద్దరు పోష్ అమ్మాయిలను ఆకర్షించేయడం.. ఇద్దరూ తన కోసం పడి కొట్టేసుకునేలా చేయడంలో లాజిక్ కనిపించదు. ఆ ఇద్దరు అమ్మాయిలకు కూడా వేర్వేరు సమస్యలు ఉంటాయి. వాటిని ఇతను పరిష్కరిస్తాడు.. అందుకు ప్రేమలో వాళ్లు ప్రేమలో పడిపోతారని చూపిస్తారు. కానీ ఈ ఇద్దరు అమ్మాయిలతో ఒకే సమయంలో అతను ఎలా చేరువ అవుతాడో.. ఇద్దరి దగ్గరా ఎలా సిన్సియర్ గా ఉంటాడో అర్థం కాదు. ఇదేం లాజిక్ అనుకుంటుంటే.. అతడికేదో డిజార్డర్ ఉందని.. అతను పగలొక వ్యక్తిలా.. రాత్రొక వ్యక్తిలా వ్యవహరిస్తాడని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు దర్శకుడు. కానీ చివరికి చూస్తే ఈ డిజార్డర్ అంతా బుస్ అని తెలుస్తుంది. ఈ అమ్మాయిలు తన జీవితంలోకి వస్తే తన దురదృష్టం అంతా పోతుందని హీరో భావించి అలా చేస్తాడట. ఇదేం లాజిక్కురా దేవుడా అని తలలు పట్టుకోవడం తప్ప ఏమీ చేయలేం.

ఈ అర్థరహితమైన కథలో.. కనీసం కథనం అయినా ఆసక్తికరంగా ఉందా అంటే అదీ లేదు. ఇద్దరు అమ్మాయిలతో హీరో వేర్వేరుగా నడిపే ప్రేమకథల్లో ఏమాత్రం కొత్తదనం లేదు.

రొమాన్స్.. కామెడీ.. ఇలా ఏ రసం లేకుండా నీరసంగానే నడుస్తాయి ఆ లవ్ స్టోరీలు. ఐతే ఇద్దరు అమ్మాయిలకు అసలు విషయం తెలిసి హీరో కోసం పోటీ పడే సన్నివేశాల దగ్గర ‘కేఆర్కే’ కొంత ఎంగేజ్ చేస్తుంది. పైన ట్రైలర్లో చెప్పుకున్న తరహా సన్నివేశాలు కొన్ని వినోదాత్మకంగా అనిపిస్తాయి. కానీ అవి కూడా ఒక దశ దాటాక ఓవర్ డోస్ అనిపించి ఆసక్తి సన్నగిల్లిపోతుంది. ఇక ఈ కథకు ముగింపు ఎలా ఇవ్వాలో తెలియక చివరి అరగంటలో దర్శకుడు చేసిన విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. అర్థం పర్థం లేని సన్నివేశాలతో చివర్లో అతను కథను.. సినిమాను సాగదీసిన తీరుకు ఉన్న కాస్త ఇంప్రెషన్ కూడా పోతుంది. అసలెక్కడా సీరియస్ గా తీసుకోలేని.. ఎమోషన్ ఫీల్ కాని స్థితిలో ప్రేక్షకుడుంటే.. చివర్లో గుండెలు బరువెక్కిస్తున్నట్లుగా ఒక పాట పెట్టడంలో దర్శకుడి ఆంతర్యమేంటో అర్థం కాదు. సినిమా అయిపోయింది అనుకున్నాక ఇంకో 20 నిమిషాలు సాగతీసి సహనాన్ని పరీక్షించాడు విఘ్నేష్ శివన్. తమిళ సినిమాల పతనానికి ‘కేఆర్కే’ మరో రుజువుగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

నటీనటులు:

విజయ్ సేతుపతి లాంటి మేటి నటుణ్ని తమిళ దర్శకులు వాడుకుంటున్న తీరుకు విచారించాల్సిందే. ‘పుష్ప’ లాంటి సినిమాలో విలన్ పాత్రకు అడిగితే.. డేట్లు ఖాళీ లేక విజయ్ చేయలేకపోయాడు. అలాంటి సినిమాలను వదులుకుని ‘కేఆర్కే’ లాంటి సినిమాలు ఎలా చేస్తున్నాడో అర్థం కాదు. నటుడిగా తన వరకు అతను న్యాయం చేసినా.. రాంబో ఎంతమాత్రం అతడికి ఉపయోగపడే పాత్ర కాదు. నయనతార లుక్ ఈ సినిమాలో బాగా తేడా కొట్టేసింది. ఆమె నటన ఓకే. సమంత తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ముగ్గురు ప్రధాన పాత్రధారుల కాంబినేషన్.. స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నా.. కథ-పాత్రల్లో విషయం లేకపోవడంతో వారి ప్రతిభ సినిమాను కాపాడలేకపోయింది. సీనియర్ నటుడు ప్రభు నామమాత్రమైన పాత్ర చేశాడిందులో. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతిక వర్గం:

సినిమాలో పాజిటివ్ గా చెప్పుకోదగ్గ ఒకే విషయం.. అనిరుధ్ రవిచందర్ సంగీతం. అతడి నేపథ్య సంగీతం మంచి హుషారుతో సాగింది. రెండు పాటలు కూడా బాగున్నాయి. కదిర్-విజయ్ కార్తీక్ ఛాయాగ్రహణం కలర్ ఫుల్ గానే సాగింది. నిర్మాణ విలువలు ఓకే. రైటర్ కమ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్.. ఎంచుకున్న కథే అర్థరహితమైంది. ఇలాంటి కథను కన్విన్సింగ్ గా చెప్పడం కత్తి మీద సామే. ఆ సాము చేయలేక విఘ్నేష్ బోల్తా కొట్టాడు. అతడి సెన్సాఫ్ హ్యూమర్ కొన్ని సన్నివేశాల్లో కనిపించినా.. మిగతా వ్యవహారమంతా నాన్సెన్స్ లాగా అనిపించి ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది.

చివరగా: కణ్మణి రాంబో ఖతీజా.. డబుల్ టార్చర్

రేటింగ్-1.75/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS