మూవీ రివ్యూ : కేజీఎఫ్: చాప్టర్-2
నటీనటులు: యశ్-శ్రీనిధి చౌదరి-సంజయ్ దత్-ప్రకాష్ రాజ్-రావు రమేష్-అచ్యుత్-రవీనా టాండన్-అయ్యప్ప పి.శర్మ తదితరులు
సంగీతం: రవి బస్రుర్
ఛాయాగ్రహణం: భువన్ గౌడ
మాటలు: హనుమాన్ చౌదరి
నిర్మాత: విజయ్ కిరగందూరు (తెలుగు రిలీజ్: సాయి కొర్రపాటి)
రచన-దర్శకత్వం: ప్రశాంత్ నీల్
మూడున్నరేళ్ల
కిందట తెలుగులో పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన కన్నడ అనువాద
చిత్రం కేజీఎఫ్: చాప్టర్-1 ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. తెలుగనే
కాదు.. వివిధ భాషల్లో ఈ సినిమా భారీ విజయాన్నందుకుంది. అప్పట్నుంచీ
కేజీఎఫ్: చాప్టర్-2 కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.
నిరీక్షణకు తెరదించుతూ ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లలోకి దిగింది.
మరి రాకీ బాయ్ కేజీఎఫ్ సామ్రాజ్యంలో ఇంకెలాంటి సాహసాలు చేశాడు. అతడి
కథకు దక్కిన ముగింపేంటి.. ప్రశాంత్ నీల్-యశ్ అంచనాలను ఏమేర
అందుకున్నారు.. తెలుసుకుందాం పదండి.
కథ:
కేజీఎఫ్
సామ్రాజ్యంలోకి రాకీ అనామకుడిగా అడుగు పెట్టి గరుడను అంతమొందించడంతో.. ఇక
మొత్తం సంపదంతా తమ సొంతమని రాకీని అక్కడ దించిన గరుడ శత్రువులు. కానీ రాకీ
లక్ష్యం కేవలం గరుడను చంపడం కాదని.. కేజీఎఫ్ ను చేజిక్కించుకోవడం అని
తర్వాత అర్థమవుతుంది. తమను చిత్రహింసలు పెట్టి బానిసల్లా చూసిన గరుడను రాకీ
చంపేయడంతో నరాచీలో పని చేసేవారందరికీ అతను దేవుడవుతాడు. వారి అండతోనే
కేజీఎఫ్ సామ్రాజ్యాన్ని ఎవ్వరూ ఊహించని స్థాయికి విస్తరిస్తాడు రాకీ. కానీ
చనిపోయాడనుకున్న గరుడ బాబాయి అధీర (సంజయ్ దత్) ఒక వైపు.. మొత్తం వ్యవస్థనే
శాసించేలా తయారైన రాకీని నిలువరించాలని ప్రయత్నించే రాజకీయ నేత రమిక సేన్
(రవీనా టాండన్).. ఇలా చాలామంది రాకీని లక్ష్యంగా చేసుకుంటారు. మరి
వీళ్లందరినీ ఎదుర్కొని రాకీ తన సామ్రాజ్యాన్ని నిలుపుకున్నాడా.. అతడి
ప్రయాణం ఎక్కడిదాకా సాగింది అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
యశ్
ఎవరో మనకు తెలియదు. ప్రశాంత్ నీల్ గురించి పరిచయం లేదు. కన్నడ సినిమాల
గురించి మన వాళ్లకు అసలు పట్టింపే లేదు. అయినా సరే.. ఆ ఇద్దరూ కలిసి చేసిన
‘కేజీఎఫ్’ అనే కన్నడ చిత్రాన్ని తెలుగులోకి అనువదించి రిలీజ్ చేస్తే
విరగబడి చూశాం. రాకీ అనే పాత్రలో యశ్ ను మన దగ్గర ఓ సూపర్ స్టార్ ను
చూసినట్లే చూశాం. హీరో ఎలివేషన్లకు.. మాస్ మసాలా సన్నివేశాలకు.. యాక్షన్
ఘట్టాలకు పెట్టింది పేరైన తెలుగు సినిమాలను కూడా తలదన్నే రీతిలో ‘కేజీఎఫ్’
హీరో ఎలివేషన్లను పతాక స్థాయికి తీసుకెళ్లింది. మాస్ అనే పదాన్ని రీడిఫైన్
చేసింది. యాక్షన్ ఘట్టాలతో ఎక్కడ లేని హై ఇచ్చింది. తెలుగు వాళ్లనే కాదు..
దేశవ్యాప్తంగా వివిధ భాషల ప్రేక్షకులది ‘కేజీఎఫ్’ చూసి ఇదే ఎమోషన్. ఐతే
కేవలం హీరో ఎలివేషన్లతో.. భారీ యాక్షన్ ఘట్టాలు ఉంటే సినిమా ఆడేస్తుందా?
‘కేజీఎఫ్’ ఆడింది అందుకేనా? అంటే కాదన్నదే సమాధానం.
రాకీ పాత్రతో
ఒక ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడింది కాబట్టే అతడి ఎలివేషన్లకు గూస్ బంప్స్
వచ్చాయి. అందులో హీరో ఎదిగే తీరులోనూ ఒక ఎమోషన్ ఉంటుంది. తల్లితో అతడి
అనుబంధం.. అతడిపై ఆమె ప్రభావం.. దీని తాలూకు థ్రెడ్ లోనూ ఒక ఎమోషన్
ఉంటుంది. ఇక రాకీకి ఏర్పడే లక్ష్యం.. అందుకోసం అతను చేసే సాహసోపేత ప్రయాణం
కూడా ఒక ఎమోషనల్ జర్నీనే. ఇలా ఎన్నో లేయర్స్ ఉన్న కథలో.. ఆసక్తికరమైన-బలమైన
పాత్రల మధ్య.. నెవర్ బిఫోర్ అనిపించే విజువల్స్-బ్యాగ్రౌండ్ స్కోర్ తో
రాకీ పాత్రకు ఎలివేషన్లు ఇస్తే అందరూ దానికి కనెక్టయ్యారు. అపూర్వమైన ఆదరణ
అందించారు. ఐతే ఎలివేషన్లలో.. విజువల్ ఎక్స్ పీరియన్స్ లో.. గ్రాండియర్లో
‘కేజీఎఫ్ చాప్టర్1’ కంటే.. ‘చాప్టర్2’ ఇంకొన్ని మెట్లు పైనే ఉంటుంది కానీ..
మొదటి అధ్యాయంలో ఉన్న ఎమోషన్.. కథాబలం.. బలమైన కాన్ఫ్లిక్ట్ మాత్రం ఇందులో
మిస్సయ్యాయి. ‘కేజీఎఫ్-2’ చూశాక ప్రేక్షకులు పెట్టుకున్న భారీ అంచనాల
స్థాయిలో సినిమా లేదనడంలో మరో మాట లేదు. అదే సమయంలో ‘కేజీఎఫ్-2’ చూడాల్సిన
అవసరం లేదని చెప్పలేం.
‘కేజీఎఫ్-1’ ముగింపులో అసలు కథ ఇప్పుడే
మొదలవుతుంది అని అనంత్ నాగ్ పాత్రతో చెప్పిస్తారు. అంటే కథ పరంగా
‘కేజీఎఫ్-2’ ఇంకో లెవెల్లో ఉంటుందని అనుకుంటాం. కానీ ఈ చిత్రానికి కథే
పెద్ద మైనస్. మొదటి భాగంలో ఉన్న మలుపులు.. ఒక పరిణామ క్రమం.. పాత్రల
ఎస్టాబ్లిష్మెంట్.. కాన్ఫ్లిక్ట్.. ఇలాంటివేవీ కూడా ‘కేజీఎఫ్-2’లో
కోరుకున్న స్థాయిలో లేవు. ఫస్ట్ పార్ట్ లో ప్రతిదీ కూడా ప్రేక్షకులకు ఒక
సర్ప్రైజే. అలాంటి సినిమానే మనం ఇంతకుముందెన్నడూ చూసింది లేదు. తెరపై
జరుగుతున్నది చూస్తుంటే మనం ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లిన ఫీలింగ్
కలుగుతుంది. అందుకే ‘కేజీఎఫ్’కు రిపీట్ వాల్యూ కూడా ఉంటుంది. ఇలా మళ్లీ
మళ్లీ ‘కేజీఎఫ్’ చూసి ‘కేజీఎఫ్-2’లోకి అడుగు పెట్టాక మనకు కొత్తగా
ప్రశాంత్-యశ్ ఏం ఆఫర్ చేస్తాడా అని చూస్తాం. ఈ కథను ఎలా ముందుకు
తీసుకెళ్తాడు.. రాకీకి ఇంకెలాంటి సవాళ్లు ఎదురవుతాయి.. వాటిని అతనెలా
ఛేదిస్తాడనే ఆసక్తి పుడుతుంది.
ఓవైపు కేజీఎఫ్ ను తిరిగి తమ
అధీనంలోకి తెచ్చుకోవాలని చూసే అధీరా పాత్రలో సంజయ్ దత్.. మరోవైపు రాకీకి
అడ్డుకట్ట వేయాలని చూసే ఇందిరాగాంధీ తరహా రాజకీయ నేత పాత్రలో రవీనా
టాండన్.. ఈ ఇద్దరూ విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తారు ఒక దశలో. కానీ ఆ
పాత్రలు రెండూ బిల్డప్ కే పరిమితం అయిపోయాయి. కేవలం లుక్ పరంగా సంజయ్ దత్
వారెవా అనిపిస్తాడే తప్ప.. గరుడ మాదిరి భయం పుట్టించేలా.. హీరోకు సవాలుగా
నిలిచేలా ఆ పాత్రను డిజైన్ చేయలేకపోయాడు ప్రశాంత్. అతడెంత క్రూరుడో చూపించే
సన్నివేశం ఒక్కటీ లేదు. కేవలం మూడు యాక్షన్ ఘట్టాలకు ఆ పాత్ర పరిమితం
అయింది. ఒక సీన్లో వచ్చి హీరోను కాలుస్తాడు. ఇంకో సీన్లో హీరో చేతిలో దెబ్బ
తింటాడు. చివర్లో తిరిగొచ్చి హీరో చేతిలో అంతమవుతాడు.. అంతకుమించి ఏమీ
లేదు. ఇక రవీనా టాండన్ పాత్ర విషయంలో ఊరికే హడావుడి తప్ప..
ఓవరాక్షన్-రియాక్షన్ తప్పితే దాని ఇంపాక్ట్ ఏమీ లేకపోయింది. అసలా పాత్ర
సినిమాలో ఎందుకుంది అనే ప్రశ్న తలెత్తుతుంది ఒక దశలో. ఇక రాకీ పాత్ర
విషయానికి వచ్చినా నిరాశ తప్పదు. చాప్టర్-1లో ఉన్నంత యాక్టివ్ క్యారెక్టర్
కాదిది.
కథ పరంగా కూడా కొత్తగా.. ప్రత్యేకంగా చెప్పుకోవడానికి
‘కేజీఎఫ్-2’లో ఏమీ లేదు. ఒక అనామకుడిగా ప్రస్థానం మొదలుపెట్టి.. బయటి
వ్యక్తి ఎవ్వరూ అడుగు పెట్టలేని కేజీఎఫ్ సామ్రాజ్యంలోకి వెళ్లి దాన్ని
ఏలుతున్న గరుడను చంపే వరకు అనేక మలుపులతో సాగుతుంది ‘కేజీఎఫ్’. ఆ చిత్రంలో
తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి ఆరంభం నుంచి చివరి దాకా కొనసాగుతుంది. కానీ
చాప్టర్-2లోకి వచ్చాక ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే.. ఉత్కంఠ రేకెత్తించే
అంశాలేమీ లేవు. కేజీఎఫ్ సామ్రాజ్యాన్ని రాకీ తన చేతుల్లోకి తీసుకోవడంతో
మొదలయ్యే సన్నివేశంతో ఆరంభంలోనే ఒక ‘హై’ అయితే వస్తుంది. కానీ తర్వాత ఈ
సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమాన్ని.. ఆపై అతడికి ఎదురయ్యే అడ్డంకులను..
వాటిని ఛేదించే తీరును అనుకున్నంత ఆసక్తికరంగా చూపించలేదు. ఐతే విజువల్
గా.. ఎలివేషన్ల పరంగా మాత్రం ‘కేజీఎఫ్-2’లో కొన్ని ఎపిసోడ్లు వేరే లెవెల్
అనిపిస్తాయి. రాకీ రీ ఇంట్రడక్షన్ సీన్ కావచ్చు.. అధీరా మీద అతను దాడి చేసే
ఎపిసోడ్ కావచ్చు.. తన సామ్రాజ్యం నుంచి ప్రభుత్వ అధికారులు తీసుకెళ్లిన
గోల్డ్ బిస్కెట్ తిరిగి తెచ్చుకునే క్రమంలో రాకీ విధ్వంసానికి పాల్పడే
సన్నివేశం కావచ్చు.. ప్రేక్షకులకు నెవర్ బిఫోర్ ఫీలింగ్ కలిగిస్తాయి.
ఇలాంటి సన్నివేశాలను ప్రశాంత్ నీల్ మాత్రమే తీయగలడనిపిస్తుంది. అతడి
ఊహాశక్తికి సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది. ‘మ్యాడ్ మ్యాక్స్’ తరహా మతి
పోగొట్టే యాక్షన్-ఎలివేషన్ సీన్లకు మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే. వీటి కోసం
‘కేజీఎఫ్-2’ను ఒకసారి చూడొచ్చు.
నటీనటులు:
రాకీ పాత్ర
ఇప్పటికే బలమైన ఇంపాక్ట్ వేసిన యశ్.. ఆ పాత్ర తాలూకు ఇంటెన్సిటీని
చాప్టర్2లోనూ కొనసాగించాడు. అతడి లుక్.. స్క్రీన్ ప్రెజెన్స్ చాలా
బాగున్నాయి. తన వరకు ప్రేక్షకుల అంచనాలను అతను అందుకున్నాడు. హీరోయిన్
శ్రీనిధి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికేమీ లేదు. చాప్టర్1లో మాదిరే
ఇక్కడా ఆమెది నామమాత్రమైన పాత్రే. అధీరాగా సంజయ్ దత్ లుక్ మాత్రం వారెవా
అనిపిస్తుంది. రవీనా టాండన్.. రమికా సేన్ పాత్రలో అవసరానికి మించి
నటించేసింది. చాలా చోట్ల ఆమెది ఓవరాక్షన్ అనిపిస్తుంది. సీబీఐ అధికారి
పాత్రలో రావు రమేష్ బాగానే చేశాడు. ఆ పాత్ర కూడా కొన్ని చోట్ల ఓవర్ ద టాప్
అనిపిస్తుంది. రాకీ కథను కొనసాగించే నరేటర్ పాత్రలో ప్రకాష్ రాజ్ బాగా
చేశాడు. చాప్టర్-1 నుంచి కొనసాగిన అయ్యప్ప పి.శర్మ.. ఇతర నటీనటులంతా ఓకే.
సాంకేతిక వర్గం:
టెక్నికల్
గా ‘కేజీఎఫ్-2’ అత్యున్నతంగానే అనిపిస్తుంది. రవి బస్రూర్ తన నేపథ్య
సంగీతంతో హోరెత్తించేశాడు. కొన్ని చోట్ల ఆర్ఆర్ మరీ లౌడ్ అనిపించినా..
ఓవరాల్ ఇంపాక్ట్ ఓకే. పాటల్లో విశేషం ఏమీ లేదు. చాప్టర్-1 తరహాలో
ప్రత్యేకంగా అనిపించే పాటల్లేవు. భువన్ గౌడ ఛాయాగ్రహణం.. ప్రశాంత్ శైలికి
తగ్గట్లు సాగింది. విజువల్స్ చాలా ప్రత్యేకంగా అనిపిస్తాయి. నిర్మాణ విలువల
గురించి ఎంత పొగిడినా తక్కువే. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్
విషయానికి వస్తే.. అతను దర్శకుడిగా తన పనితనాన్ని మరోసారి చూపించినా..
విజువల్ మాయాజాలంతో ఆకట్టుకున్నా.. రైటింగ్ దగ్గర ఫెయిలయ్యాడు. కథ.. పాత్రల
విషయంలో సరైన కసరత్తు చేయలేదనిపిస్తుంది. పూర్తిగా ఎలివేషన్ల మీదే
దృష్టిపెట్టి కథ గురించి పట్టించుకోలేదనిపిస్తుంది.
చివరగా: కేజీఎఫ్-చాప్టర్ 2.. ఓన్లీ ఎలివేషన్స్ నో ఎమోషన్
రేటింగ్- 2.5/5
Disclaimer
: This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The
Movie Based On This Review And Watch Movie in Theatre