జై భీమ్

Tue Nov 02 2021 GMT+0530 (IST)

జై భీమ్

చిత్రం : ‘జై భీమ్’

నటీనటులు: సూర్య-రిజిష విజయన్-లిజో మోల్ జోస్-మణికందన్-రావు రమేష్-ప్రకాష్ రాజ్-సంజయ్ స్వరూప్ తదితరులు
సంగీతం: సీన్ రోల్డాన్
ఛాయాగ్రహణం: ఎస్.ఆర్.కదిర్
నిర్మాతలు: జ్యోతిక-సూర్య
రచన-దర్శకత్వం: జ్ఞానవేల్

గత ఏడాది తన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాను అమేజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు సూర్య. థియేటర్లలో రిలీజైతే అద్భుత స్పందన తెచ్చుకునే అవకాశమున్న అలాంటి సినిమా ఓటీటీలో రావడం అభిమానులను ఒకింత నిరాశకు గురి చేసింది. ఐతే ఇప్పుడు సూర్య తన కొత్త చిత్రం ‘జై భీమ్’ను సైతం ఓటీటీ బాట పట్టించాడు. ట్రైలర్ చూస్తే హార్డ్ హిట్టింగ్ మూవీలా కనిపించిన ఈ చిత్రం ఈ రోజే ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

రాజన్న (మణికందన్) తన కష్టాన్నే నమ్ముకున్న గిరిజనుడు. ఉన్నదాంట్లో కష్టపడి తన భార్యా బిడ్డల్ని పోషించుకుంటున్న అతణ్ని చేయని నేరానికి ఒక దొంగతనం కేసులో పోలీసులు ఇరికిస్తారు. తర్వాత ఈ కేసులో అతడి బంధువులైన ఇంకో ఇద్దరు కూడా ఈ కేసులో చిక్కుకుంటారు. పోలీసుల చేతుల్లో చిత్ర హింసలకు గురైన ఈ ముగ్గురు ఉన్నట్లుండి పోలీస్ స్టేషన్ నుంచి అదృశ్యం అవుతారు. నిస్సహాయురాలైన రాజన్న భార్య పార్వతి (లిజో మోల్ జోస్) భర్త ఆచూకీ కోసం ఎంతో ప్రయత్నించి చివరికి హైకోర్టులో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారి కోసం మానవ హక్కుల కోసం ఉచితంగా కేసులు వాదించే చంద్రు (సూర్య)ను ఆశ్రయిస్తుంది. ఈ కేసును టేకప్ చేసిన సూర్యకు ఎదురైన అడ్డంకులు చిక్కుముడులు ఏంటి..? రాజన్న.. మిగతా ఇద్దరు ఏమయ్యారు? చివరికి బాధితులకు న్యాయం జరిగిందా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

సినిమాలు తీసే వాళ్లకు సామాజిక బాధ్యత ఉండాలంటారు. సమాజానికి అవసరమైన.. సమాజాన్ని తట్టి లేపే.. జనాల్లో చైతన్యం తీసుకొచ్చే.. ఆలోచన రేకెత్తించే సినిమాలు తీస్తే.. వాటిని ప్రేక్షకులు చూస్తారా? అంటే ధీమాగా ఔనని సమాధానం చెప్పలేం. ఊరికే సందేశాలు ఇవ్వడానికి.. జనాల్ని ఉద్ధరించడానికి ఎవరూ కోట్లు పెట్టి సినిమాలు తీయలేరు. అలా అని మంచి సినిమాలను ఆదరించరని ప్రేక్షకులను నిందించడమో.. లేదంటే కేవలం కమర్షియల్ అంశాలను మాత్రమే నమ్ముకోవడమో చేయకుండా.. సొసైటీకి ఎంతో అవసరమైన ఒక హార్డ్ హిట్టింగ్ కథను సగటు ప్రేక్షకులు కనెక్టయ్యేలా.. వాళ్లందులో లీనమయ్యేలా తెరకెక్కించడం చాలా కొద్దిమందికే సాధ్యం అవుతుంది. దర్శకుడిలో ఎంతో నైపుణ్యం ఉండాలి. ఈ ప్రయత్నానికి రాజీ లేకుండా మద్దతుగా నిలిచే నిర్మాత కావాలి. ఇమేజ్ గురించి ఆలోచించకుండా కథను ముందుకు తీసుకెళ్లే మంచి నటుడు కూడా అంతే అవసరం. ‘జై భీమ్’ సినిమాకు ఇవన్నీ గొప్పగా కుదిరాయి. దర్శకుడు జ్ఞానవేల్ వాస్తవ ఘటనల ఆధారంగా ఒక గొప్ప కథను తీర్చిదిద్దుకుని.. దానికి పకడ్బందీ కథనాన్ని జోడిస్తే.. నిర్మాతగా.. నటుడిగా ఈ సినిమా కోసం ఎంత చేయాలో అంతా చేశాడు సూర్య. ఫలితంగా ‘జై భీమ్’ ఒక గొప్ప ప్రయత్నంగా మారింది.

తమిళనాడులో 90వ దశకంలో జరిగిన ఒక గిరిజనుడి లాకప్ డెత్ కేసు ఆధారంగా తీర్చిదిద్దుకున్న కథ ఇది. నిస్సహాయులుగా మారిన బాధితుల కోసం చంద్రు అనే ప్రముఖ మానవహక్కుల న్యాయవాది (తర్వాత జడ్జి కూడా అయ్యారు) హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి సుదీర్ఘ కాలం పోరాడి వారికి న్యాయం చేకూరేలా చేసిన సంచలన కేసు గురించి ఆమూలాగ్రం తెలుసుకుని.. దీని చుట్టూ పకడ్బందీ కథాకథనాలు అల్లుకుని ‘జై భీమ్’ను తీర్చిదిద్దాడు దర్శకుడు జ్ఞానవేల్. ఈ ట్రైలర్ చూస్తేనే ఇందులో సున్నిత మనస్కులు తట్టుకోలేని హార్డ్ హిట్టింగ్ విషయాలు ఉంటాయని అర్థమైపోతుంది. అమాయకులపై పోలీసుల అకృత్యాల చుట్టూ జరిగే ఎపిసోడ్ అంతా నిజంగానే జీర్ణించుకోలేని విధంగా ఉంటుంది. ఇంతకుముందు తమిళంలో తెరకెక్కి తెలుగులోనూ అనువాదమైన ‘విచారణ’ సినిమాను గుర్తుకు తెచ్చేలా లాకప్ లో హింసకు సంబంధించిన సన్నివేశాలు చూసి తట్టుకోవడం కష్టమే. దీనికి తోడు ఒక అమాయకుడైన గిరిజనుడిని పోలీసులు తప్పుడు కేసు పెట్టి ఇరికించడం అనేది ఇక్కడ ప్లాట్ పాయింట్ కాబట్టి.. సంబంధిత సన్నివేశాలు ఎలా ఉంటాయో ప్రేక్షకుడికి ఒక అంచనా వచ్చేస్తుంది. ఆ అంచనాలను దాటి సినిమాలో ఏమీ భిన్నంగా జరగదు. దీని వల్ల సూర్య సినిమాలో ఎంట్రీ ఇచ్చే ముందు వరకు జరిగే తతంగమంతా రొటీన్ గా అనిపించడమే కాక.. జీర్ణించుకోలేనంత బాధాకరంగా ఉండి.. ప్రేక్షకులు ఇబ్బందిపడతారు. తెరపై అంతటి బాధను చూడటం ఎలాంటి వారికైనా కష్టమే. ఐతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుని అయినా ఈ ఎపిసోడ్ వరకు లాగించేస్తే.. ఆ తర్వాత ‘జై భీమ్’తో కనెక్ట్ కావడంలో ఏ ఇబ్బందీ ఉండదు.

హీరో కేసు గురించి స్టడీ చేశాక.. కోర్టులో వాదనలు మొదలైన దగ్గర్నుంచి ‘జై భీమ్’ ఒక థ్రిల్లర్ సినిమాలా మారిపోతుంది. కోర్ట్ రూం డ్రామా రక్తి కట్టేలా ఎంతో ఆసక్తికరంగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు దర్శకుడు. ప్రతి సన్నివేశంలో కొత్త విషయాలు తెలుస్తుంటాయి. కథ మలుపులు తిరుగుతుంటుంది. మధ్య మధ్యలో హృద్యమైన సన్నివేశాలు హృదయాన్ని తడుతుంటాయి. తర్వాత ఏం జరుగుతుంది.. ఇంతకీ పోలీసుల చేతుల్లో చిక్కిన బాధితులు ఏమయ్యారనే ఆసక్తి అంతకంతకూ పెరుగుతూ పోతుంది. కోర్ట్ రూంలో వాదనలు జరిగే చోట డ్రామా కంటే ఉత్కంఠకే ఎక్కువ స్కోప్ ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు. దీంతో ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. ఎక్కడైనా కొంచెం బిగి సడలింది అనిపించినా.. సూర్య అద్భుతమైన నటనతో ఆ లోపాన్ని కవర్ చేసేశాడు. చివరి అరగంటలో ఓవైపు రావు రమేష్.. మరోవైపు ప్రకాష్ రాజ్ పాత్రలు కూడా అవసరమైన బలాన్నిచ్చాయి. చివర్లో వచ్చే హృద్యమైన సన్నివేశాలకు తోడు చక్కటి డైలాగ్స్ కూడా పడటం.. సూర్య పెర్ఫామెన్స్ కూడా అదిరిపోవడంతో ‘జై భీమ్’ ప్రేక్షకులను కదిలించేస్తుంది. చాన్నాళ్లు గుర్తుండిపోయే ఒక ప్రత్యేకమైన సినిమా చూసిన భావన కలిగిస్తుంది. 2 గంటల 45 నిమిషాల సుదీర్ఘ నిడివి ఉండటం సినిమాకు కొంత మైనస్సే. ప్రథమార్ధంలో బాధితులకు సంబంధించిన కథను కొంచెం ట్రిమ్ చేయాల్సింది. పోలీసుల కర్కశత్వాన్ని చూపించే సన్నివేశాల డోస్ కూడా చాలా ఎక్కువైపోయింది. తమిళుల సంగతేమో కానీ.. మనవాళ్లు మాత్రం ఇలాంటి ఎపిసోడ్లను తట్టుకోవడం కష్టమే. ఈ ప్రతికూలతల్ని కొంచెం తట్టుకుంటే చాలు.. ‘జై భీమ్’ బాగా ఎంగేజ్ చేస్తుంది. ఇది ఆసక్తి లోటు లేని చూడదగ్గ చిత్రమే కాదు.. ఒక బాధ్యతతో తప్పక చూడాల్సిన చిత్రం.

నటీనటులు:

సూర్య గురించి ఏం చెప్పాలి? సినిమా అయ్యాక అతడికి సెల్యూట్ కొట్టాలని అనిపిస్తుంది. ఇంత ఇంటెన్సిటీతో.. సిన్సియారిటీతో ఇలాంటి పాత్రలను పోషించడం చాలా కొద్ది మందికే సాధ్యమవుతుంది. సూర్య గొప్ప నటనకు తోడు.. వ్యక్తిగతంగా అతడికున్న ఉన్న మంచి ఇమేజ్.. సామాజిక బాధ్యత వల్ల కూడా చంద్రు పాత్ర మరింతగా పండింది. ఈ పాత్రలో అతణ్ని కాకుండా మరొకరిని ఊహించుకోలేం అన్నట్లుగా సాగింది సూర్య పెర్ఫామెన్స్. కొన్ని సన్నివేశాల్లో కళ్లతో బాధను వ్యక్త పరిచిన తీరు.. సూర్య ఎంత ప్రత్యేకమైన నటుడో తెలియజేస్తుంది. సూర్య తర్వాత సినిమాలో అత్యంత ఆకట్టుకునేది.. ప్రేక్షకులను కదిలించేది లిజో మోల్ జోస్. గూగుల్లో ఈ అమ్మాయి ఫొటో ఒకసారి వెతికి చూసి.. సినిమాలో ఆమెను చూస్తే షాకవడం ఖాయం. చేయని నేరానికి బలైన భర్త కోసం తల్లడిల్లిపోయే పేద గిరిజన యువతిగా ఆమె అద్భుత అభినయం ప్రదర్శించింది. అవార్డ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ తనది. రిజిష విజయన్ కూడా బాగా చేసింది. రావు రమేష్ తక్కువ సన్నివేశాల్లోనే తన ప్రత్యేకతను చాటి చెప్పారు. కోర్టు సన్నివేశాల్లో సూర్యకు దీటుగా నటించారు. ప్రకాష్ రాజ్ గురించి కొత్తగా చెప్పేదేముంది? ఆయన ఎప్పుడూ చేసే మూస పాత్రలకు భిన్నమైన క్యారెక్టర్ ఇది. కాకపోతే ఇలాంటి మంచి సినిమాలో ప్రకాష్ రాజ్ కు ఇంకెవరో డబ్బింగ్ చెప్పడం మాత్రం నిరాశ కలిగించేదే. మిగతా నటీనటులందరూ కూడా బాగా చేశారు.

సాంకేతిక వర్గం:

‘జై భీమ్’కు టెక్నికల్ గా అన్ని హంగులూ బాగా కుదిరాయి. సీన్ రోల్డాన్ నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద ప్లస్. సన్నివేశాల్లో భావోద్వేగాలను.. తీవ్రతను సరిగ్గా ప్రేక్షకులు ఫీలయ్యేలా చేయడంలో ఆర్ఆర్ కీలక పాత్ర పోషించింది. కొన్ని చోట్ల బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను కదిలిస్తుంది. సీన్ రోల్డాన్ పాటలు ఓకే. కదిర్ ఛాయాగ్రహణం బాగుంది. థియేటర్లలో అయితే మరింత కనెక్ట్ అయ్యేలా సినిమాటోగ్రఫీ సాగింది. సూర్య నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకున్నాడు. రాజీ లేకుండా ఈ సినిమాకు అవసరమైందంతా సమకూర్చాడు. ఇలాంటి కథకు అండగా నిలిచినందుకు అతణ్ని అభినందించాలి. ఇక దర్శకుడిగా జ్ఞానవేల్ బలమైన ముద్ర వేశాడు. ఇలాంటి కథను ఎంచుకుని ఇంత నిజాయితీగా తెరకెక్కించడం అందరి వల్లా కాదు. కోర్ట్ రూం డ్రామాను అతను పకడ్బందీ స్క్రీన్ ప్లేతో నడిపించాడు. ఎంత రియల్ స్టోరీ అయినా సరే.. ఇంత ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడి ప్రతిభను అభినందించకుండా ఉండలేం.

చివరగా: జై భీమ్.. డోంట్ మిస్ ఇట్

రేటింగ్-3/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in OTT


LATEST NEWS