ఇష్క్

Fri Jul 30 2021 GMT+0530 (IST)

ఇష్క్

చిత్రం : 'ఇష్క్'

నటీనటులు: తేజ సజ్జా-ప్రియా ప్రకాష్ వారియర్-రవీంద్ర విజయ్-లియోనా లిషోయ్ తదితరులు
సంగీతం: మహతి స్వర సాగర్
ఛాయాగ్రహణం: శ్యామ్ కె.నాయుడు
కథ: రతీష్ రవి
నిర్మాతలు: ఎన్వీ ప్రసాద్-పరాస్ జైన్-వాకాడ అంజన్ కుమార్
దర్శకత్వం: ఎస్.ఎస్.రాజు

‘జాంబి రెడ్డి’తో హీరోగా సత్తా చాటిన తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ‘ఇష్క్: ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ’. వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు ఎస్.ఎస్.రాజు రూపొందించాడు. మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

సిద్ధు (తేజ సజ్జా) చదువు పూర్తి చేసుకుని సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న కుర్రాడు. అతను హాస్టల్లో ఉండి చదువుకుంటున్న అను (ప్రియా ప్రకాష్ వారియర్)తో ప్రేమలో ఉంటాడు. అను పుట్టిన రోజు నాడు పూర్తిగా ఆమెతోనే గడిపి సంతోషపెట్టాలనుకుంటాడు సిద్ధు. ఈ క్రమంలో ఇద్దరూ కార్లో లాంగ్ డ్రైవ్కు వెళ్తారు. ఐతే సిద్ధు-అను ఏకాంతంగా గడుపుతున్న సమయంలో మాధవ్ (రవీంద్ర విజయ్) తాను ఒక పోలీసునంటూ వచ్చి వీళ్లను బెంబేలెత్తిస్తాడు. అతడి కారణంగా సిద్ధు-అను ఎలా ఇబ్బంది పడ్డారు.. తదనంతర పరిణామాలేంటి.. అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

మన చుట్టూ ఉండే మనుషులనే పాత్రధారులుగా మలిచి.. మన చుట్టూ జరిగే చిన్న చిన్న సంఘటనలనే కథాంశాలుగా మార్చుకుని రసవత్తరమైన కథనంతో సినిమాలు తీయడంలో మలయాళ ఫిలిం మేకర్స్ నైపుణ్యమే వేరు. అక్కడి సినిమాలు చూస్తే.. ఇలాంటి కథలతో కూడా సినిమాలు చేయొచ్చా అనిపిస్తుంది. అదే సమయంలో ఇలాంటి కథలతో సినిమాలు తీస్తే మనవాళ్లు చూస్తారా అన్న సందేహం కూడా కలుగుతుంది. కానీ గత కొన్నేళ్లలో మన ప్రేక్షకుల అభిరుచి ఎంతగానో మారి.. వినూత్న కథలను ఆదరిస్తున్న నేపథ్యంలో మలయాళంలో వచ్చిన వైవిధ్యమైన సినిమాలను ఇక్కడికి పట్టుకొస్తున్నారు మన ఫిలిం మేకర్స్.

ఈ కోవలో తెలుగులోకి రీమేక్ అయిన చిత్రం ‘ఇష్క్’. ‘ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ’ అనే క్యాప్షన్ కు తగ్గట్లే ఇది ప్రేమకథా చిత్రం కాదు. ఒక ప్రేమ జంట చుట్టూ తిరిగే థ్రిల్లర్ మూవీ. ఆరంభంలో రొమాంటిక్ మూవీలా కనిపించి.. ఆ తర్వాత ఊహించని ‘మలుపులు’ తిరిగే చిత్రం. ఐతే మాతృకతో పోలికల సంగతి పక్కన పెట్టి చూస్తే.. ఇదో కొత్త ప్రయత్నం లాగే అనిపించినా.. రెండు గంటల పాటు ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా మాత్రం లేదు. చిన్న పాయింట్ పట్టుకుని మరీ సాగదీసినట్లుగా అనిపించడంతో ప్రేక్షకులు అసహనానికి గురై ఇదేం సినిమా అనుకునేలా ‘ఇష్క్’ తయారైంది.

మోరల్ పోలీసింగ్ పేరుతో యువ జంటల్ని వేధించే సమాజం.. వ్యక్తులు.. మీడియా మీద విసిరిన వ్యంగ్యాస్త్రం ‘ఇష్క్’. ఒకరినొకరు ఇష్టపడి.. పెళ్లికి సిద్ధపడ్డ ఓ అమ్మాయి అబ్బాయి ఏకాంతంగా గడుపుతుంటే.. దాన్ని భూతద్దంలో చూడటం ఎంత తప్పో చెప్పే ప్రయత్నం జరిగింది ఇందులో. ఇలాంటి పరిస్థితుల్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఓ వ్యక్తి రెచ్చిపోతే.. దాని వల్ల అమ్మాయి అబ్బాయి ఎంత మానసిక వేదనకు గురవుతారో చూపించి.. బాధితులు తిరగబడి ప్రతీకారం తీర్చుకుంటే అది ఎంత తీవ్రంగా ఉంటుందో ‘ఇష్క్’లో చూపిస్తారు.

ఐతే ఈ పాయింట్ వినడానికి ఆసక్తికరంగా అనిపించినా.. తెరమీద దీని చుట్టూ గంటన్నరకు పైగా కథనాన్ని నడపడంతో వచ్చింది సమస్య. తొలి అరగంటలో ప్రేమ జంట మధ్య బంధాన్ని చూపిస్తూ.. వారి మధ్య గిల్లికజ్జాలతో నడిపించి.. అరగంట తర్వాత అసలు పాయింట్లోకి వస్తారు. అబ్బాయి అమ్మాయి రొమాన్స్ పండుతున్న సమయంలో మొదలవుతుంది విలన్ ఎంట్రీ. పోలీసునని చెప్పి.. పోలీస్ స్టేషన్-కేసు అని బెదిరిస్తూ అతను వీళ్లను ఏడిపించే ఎపిసోడ్ అరగంటకు పైగా నడుస్తుంది. ఇది నడుస్తున్నంతసేపు హీరో హీరోయిన్లు ఎప్పుడెప్పుడు దీన్నుంచి బయటపడతాడా అని చూసినట్లే.. ఒక దశ దాటాక ఈ ఎపిసోడ్ ఎప్పుడు ముగుస్తుందా అని చూసే పరిస్థితిలో ప్రేక్షకులు పడతారు.

హీరో హీరోయిన్లు అక్కడి నుంచి బయటపడ్డాక.. ద్వితీయార్ధంలో ఇలాంటి ఎపిసోడే ఇంకోటి వస్తుంది. హీరో వెళ్లి విలన్ ఇంట్లో తిష్ట వేస్తాడు. అక్కడ ఏం జరుగుతుందా అన్న ఆసక్తి ఉంటుంది కానీ.. కొంత సమయం తర్వాత ఈ ఎపిసోడ్ ఎప్పుడు ముగుస్తుందా అన్న ఆలోచనలో పడిపోతాం. ఎంచుకున్న పాయింట్ బాగున్నా.. చెప్పాలనుకున్న సందేశం కూడా ఓకే అనిపించినా.. చిన్న పాయింట్ పట్టుకుని ఇంతగా లాగేస్తున్నారనే ఫీలింగే ‘ఇష్క్’ పట్ల నెగెటివిటీని పెంచుతుంది. మలయాళంలో ఈ సినిమా విజయవంతం అయి ఉండొచ్చు.

కానీ అక్కడి ప్రేక్షకుల అభిరుచి వేరు. అక్కడొచ్చే సినిమాలు వేరు. మన వాళ్లు కొత్తదనాన్ని ఆదరించరని కాదు కానీ.. దాన్ని కొంచెం వినోదాత్మకంగా చెప్పడం అవసరం. ముఖ్యంగా మన వాళ్లు కథనంలో వేగం ఆశిస్తారు. ‘ఇష్క్’లో అదే మిస్సయింది. ఇటు ప్రథమార్ధంలో.. అటు ద్వితీయార్ధంలో కథ ముందుకు కదలక ఒకే చోట స్ట్రక్ అయినట్లు అనిపించడం ఈ సినిమాతో ఉన్న పెద్ద సమస్య. ఒరిజినల్లో ఉన్నదున్నట్లు దించేసినా కూడా.. అక్కడున్న ఇంటెన్సిటీ సైతం తెలుగులో మిస్సయింది. ఒక డిఫరెంట్ మూవీ చూసిన ఫీలింగ్ కలిగినా.. రెండు గంటల పాటు ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెట్టడంలో మాత్రం ‘ఇష్క్’ విఫలమైంది.

నటీనటులు:

తేజ సజ్జాకు గత రెండు చిత్రాలతో పోలిస్తే నటించడానికి మంచి అవకాశం కల్పించింది ‘ఇష్క్’. ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ.. పరిమిత లొకేషన్లలో నడిచే సినిమా కావడం.. క్లోజప్స్ ఎక్కువగా ఉండటంతో అతను ప్రతిభ చాటుకోవడానికి ఛాన్సొచ్చింది. దీన్ని అతను బాగానే ఉపయోగించుకున్నాడు. తొలి 20 నిమిషాలు మామూలుగా అనిపించినా.. ఆ తర్వాత ఎక్కువగా ఎమోషన్లు పలికించాల్సిన సన్నివేశాల్లో తేజ ఆకట్టుకున్నాడు.

ప్రథమార్ధంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యే సన్నివేశాల్లో.. అలాగే ద్వితీయార్ధంలో విలన్ కుటుంబాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే సన్నివేశాల్లో తేజ మెప్పించాడు. నెగెటివ్ షేడ్స్ చూపించే చోట కూడా తేజ ఓకే అనిపించాడు. ప్రియా ప్రకాష్ వారియర్ హావభావాల విషయంలో జస్ట్ ఓకే అనిపించింది. ఆమె ముఖంలో పెద్దగా ఎక్స్ప్రెషన్స్ పలకలేదు. గ్లామర్ తో మెప్పించే అవకాశం కూడా లేకపోయింది. ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ ఫేమ్ రవీంద్ర విజయ్ నెగెటివ్ రోల్ లో పర్వాలేదనిపించాడు. మాతృకలో చేసిన నటుడితో పోలిస్తే మాత్రం అతను సాధారణంగా కనిపించాడు. అతడి భార్య పాత్రలో చేసిన లియోనా లిషోయ్ ఆకట్టుకుంది. ఇంతకుమించి ప్రాధాన్యమున్న పాత్రలేమీ లేవు.

సాంకేతిక వర్గం:

మహతి స్వర సాగర్ సంగీతం బాగానే అనిపిస్తుంది. సిద్ శ్రీరామ్ పాడిన పాట ఆకట్టుకుంటుంది. ఇంకో పాట పర్వాలేదు. నేపథ్య సంగీతంతో కొన్ని సన్నివేశాల్లో ఇంటెన్సిటీ పెంచడానికి సాగర్ ప్రయత్నించాడు. శ్యామ్ కే నాయుడు ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.

దర్శకుడు ఎస్.ఎస్.రాజు.. క్రెడిట్స్ లో ‘అడాప్షన్’ అని వేసుకున్నాడు కానీ.. ఒరిజినల్ చూసిన వాళ్లకు అలా ఏమీ అనిపించదు. మలయాళ ‘ఇష్క్’ నుంచి ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేశాడు. అయినా సరే.. ఒరిజినల్లో ఉన్న ఇంటెన్సిటీని ఇక్కడ తీసుకురాలేకపోయాడు. ఇలాంటి సినిమాలకు మన వాళ్లు అలవాటు పడకపోవడం.. మాతృకలో ఉన్న లోపాల్ని కానీ.. సాగతీతను కానీ తగ్గించే ప్రయత్నం చేయకపోవడంతో ‘ఇష్క్’ అనుకున్నంత ఆసక్తికరంగా అనిపించదు.

చివరగా: ఇష్క్.. నాట్ ఎన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ

రేటింగ్-2/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS