ఇచట వాహనములు నిలపరాదు

Fri Aug 27 2021 GMT+0530 (IST)

ఇచట వాహనములు నిలపరాదు

నటీనటులు: సుశాంత్-మీనాక్షి చౌదరి-వెంకట్-వెన్నెల కిషోర్-ప్రియదర్శి-అభినవ్ గోమటం-రవి వర్మ తదితరులు
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
ఛాయాగ్రహణం: సుకుమార్
మాటలు: సురేష్ బాబా-భాస్కర్
నిర్మాతలు: రవిశంకర్ శాస్త్రి-ఏక్తా శాస్త్రి-హరీష్ కోయలగుండ్ల
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: దర్శన్

కెరీర్ ఆరంభంలో వరుసగా పరాజయాలు ఎదుర్కొని 'చి ల సౌ' సినిమాతో ఆ పరంపరకు బ్రేక్ వేశాడు అక్కినేని కుటుంబ కథానాయకుడు సుశాంత్. అతను హీరోగా నటించిన కొత్త చిత్రం 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'. 'చి ల సౌ' తరహాలోనే కొత్త ప్రయత్నం లాగా కనిపించిన ఈ చిత్రం ఈ రో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంట చూద్దాం పదండి.

కథ: అరుణ్ (సుశాంత్) హైదరాబాద్ సిటీలో ఒక ఆర్కిటెక్ట్ కంపెనీలో పనిచేసే మధ్య తరగతి కుర్రాడు. తన కంపెనీలోకి కొత్తగా వచ్చిన మీనాక్షి (మీనాక్షి చౌదరి)తో అతను ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతణ్ని ప్రేమిస్తుంది. తన జీవితంలో కొనబోయే తొలి బైక్ మీద మీనాక్షిని కూర్చోబెట్టి తిప్పాలని అనుకున్న అరుణ్.. బండి కొనగానే దాన్ని తీసుకుని మీనాక్షి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తన ఇంటికి వెళ్తాడు. కానీ అదే సమయంలో మీనాక్షి ఇల్లుండే కాలనీలో ఒక మహిళపై హత్యాయత్నం జరుగుతుంది. తనింట్లో నగలు దొంగతనానికి గురవుతాయి. అరుణ్ వేసుకొచ్చిన బైక్ దొంగదేనని భావించి.. అతడి అంతు చూడాలని కాలనీలో అందరూ తీవ్ర ఆవేశంతో ఎదురు చూస్తుంటారు. ఈ స్థితిలో మీనాక్షి ఇంట్లో ఇరుక్కుపోయిన అరుణ్.. అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అనే వెరైటీ.. ఇంట్రెస్టింగ్ టైటిల్ చూడగానే ఇదేదో కొత్త తరహా సినిమాలా ఉందే అన్న ఆవలు కలిగాయి. ఇక ఈ సినిమా టీజర్.. ట్రైలర్లో కథ గురించి పెద్దగా హింట్స్ ఇవ్వకుండా ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ మాత్రమే చూపించి మరింత ఆసక్తి రేకెత్తించగలిగింది చిత్ర బృందం. కానీ వెరైటీ టైటిల్ పెట్టి.. ఆసక్తికరమైన ప్రోమోలు కట్ చేసి ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షిస్తే సరిపోదు. వారి ఆసక్తిని నిలిపి ఉంచే కథా కథనాలు అన్నింటికంటే ముఖ్యం. ఈ విషయంలో 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' నిరాశకు గురి చేస్తుంది. ఇందులో కథ మరీ కొత్తదని చెప్పలేం కానీ.. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగానే నడుస్తుంది. ఎంచుకున్న పాయింట్ కూడా బాగుంది. కానీ దాని ఎగ్జిక్యూషన్లోనే కొత్త దర్శకుడు దర్శన్ బాగా తడబడ్డాడు. థ్రిల్లర్ కథాంశం ఎంచుకుని తొలి గంటను కామెడీ.. లవ్ అంటూ వృథా చేయడం ఈ సినిమాలో అతి పెద్ద మైనస్ కాగా.. మధ్యలో నుంచి కథ కాస్త ఉత్కంఠ రేకెత్తించినప్పటికీ అవసరం లేని పాత్రలు.. సన్నివేశాల వల్ల తలెత్తిన గందరగోళం.. అనాసక్తికర ముగింపు వల్ల 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో విఫలమైంది.

థ్రిల్లర్ సినిమాలకు సాధ్యమైనంత తక్కువ నిడివితో ఉండటం.. లవ్-కామెడీ లాంటి ట్రాక్స్ ఉన్నా అవి వీలైనంత షార్ట్ గా ఉండేలా చూసుకోవడం కీలకం. కానీ ప్రోమోల్లో థ్రిల్లర్ లాగే కనిపించిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' ఆ జానర్లోకి అడుగు పెట్టడానికే చాలా టైం తీసుకుంది. దాదాపు రెండున్నర గంటల నిడివితో ఉన్న ఈ చిత్రంలో తొలి గంట వీక్షణం సహనానికి పరీక్ష పెడుతుంది. ఒక బైక్ షోరూంలో స్నేహితుల బ్యాచ్ ను కూర్చోబెట్టి కామెడీ చేయించడానికి విఫలయత్నం చేశాడు దర్శకుడు. వెన్నెల కిషోర్ లాంటి మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటుడు ఉన్నప్పటికీ ఆ సీన్లు ఎప్పుడెప్పుడు అయిపోతాయా అన్న ఫీలింగ్ కలుగుతుందంటే ఇక్కడ కామెడీ ఏ మాత్రం వర్కవుటైందో అర్థం చేసుకోవచ్చు. షోరూంలోనే కూర్చుని హీరో తన ప్రేమకథ చెప్పడం ఆరంభించాక ఇందులో అయినా రిలీఫ్ దొరుకుతుందా అని చూస్తే.. అక్కడా నిరాశ తప్పదు. ఎన్నో సినిమాల్లో చూసిన టెంప్లేట్ లవ్ సీన్లు విసుగు పుట్టిస్తాయి. ఓవైపు హీరో ఆర్థిక కష్టాలను ప్రస్తావిస్తూ ఇంకోవైపు అతను ప్రతి సీన్లోనూ డిజైనర్ డ్రెస్సులేసుకుని సీఈవో లాగా తయారై రావడం.. కథానాయికతో సరదాగా ప్రేమాయణం సాగించడం సముచితంగా అనిపించదు. హీరో నేపథ్యానికి.. అతడి అప్పీయరెన్స్ కి అసలు సంబంధమే ఉండదు. ఓపక్క అతడి తల్లి-స్నేహితులు సాదాసీదాగా కనిపించే సీన్లలో కూడా హీరో మాత్రం డిజైనర్ షర్టులతో చాలా క్లాసీగానే కనిపిస్తుంటాడు. అతనో మధ్య తరగతి కుర్రాడన్న భావనే కలగదు. కమర్షియల్ సినిమాల్లో అయితే ఇలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు కానీ.. ఇలా రియలిస్టిగ్గా సాగే చిత్రాల్లో ఇలాంటి లోపాలు ఆమోదయోగ్యం కాదు. అది దర్శకుడి వైఫల్యమే అవుతుంది.

ఇదీ నా లవ్ స్టోరీ అంటూ ముగించే దగ్గర హమ్మయ్య అయిపోయిందా అన్న ఫీలింగ్ ప్రేక్షకులు వస్తుందంటే.. ఆ ప్రేమకథ ఎలా నడిచిందో అంచనా వేయొచ్చు. ఈ ప్రేమకథ అయ్యాక కానీ అసలు కథలోకి వెళ్లలేదు దర్శకుడు. హీరోయిన్ ఇంట్లో హీరో ఇరుక్కుపోయే దగ్గర ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చి ద్వితీయార్ధం మీద ఆసక్తి పెంచగలిగారు. హీరో అక్కడ్నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు కొంత ఉత్కంఠ రేకెత్తిస్తాయి. ఈ సన్నివేశాలు కూడా ఇంకొంత మెరుగ్గా ఉండాల్సింది కానీ.. కథ పరంగా ఉన్న సస్పెన్స్ ద్వితీయార్ధాన్ని నడిపిస్తుంది. సెకండాఫ్ లో చాలా సన్నివేశాల్లో గందరగోళం కనిపిస్తుంది. వెన్నెల కిషోర్.. సునీల్ పాత్రలను ప్రవేశ పెట్టి ప్రేక్షకులకు కొంత వినోదాన్నిద్దామనుకున్నారు కానీ.. అవి బెడిసికొట్టేశాయి. కథ పక్కదారి పట్టడానికి తప్ప ఆ పాత్రలు పెద్దగా ఉపయోగపడలేదు. ఈ పాత్రలతో అవనసరంగా కథనాన్ని సాగదీసి.. చివర్లో సస్పెన్స్ రివీల్ చేసే ఎపిసోడ్లలో మాత్రం దర్శకుడు బాగా హడావుడి పడిపోయాడు. ఇంకొంచెం డీటైలింగ్ అవసరం అనుకున్న చోట.. చకచకా సన్నివేశాలు లాగించేశాడు. సస్పెన్స్ రివీలయ్యే చోట ప్రేక్షకులు కొంత థ్రిల్ అవుతారు కానీ.. ఇదంతా అంత లాజికల్ గా అయితే అనిపించదు. పతాక సన్నివేశాల్లోనూ గందరగోళం కొనసాగడంతో ముగింపులోనూ 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అంత మంచి ఫీలింగ్ ఇవ్వదు. ఓవరాల్ గా చెప్పాలంటే పాయింట్ కొంచెం కొత్తగా అనిపించినా.. ద్వితీయార్ధంలో కొన్ని మూమెంట్స్ ఆకట్టుకున్నా.. ఓవరాల్ గా మాత్రం ఈ చిత్రం నిరాశకు గురి చేస్తుంది.

నటీనటులు: 'చి ల సౌ'తో తన మీద అంతకుముందున్న అభిప్రాయాన్ని చాలా వరకు మార్చిన సుశాంత్.. ఈసారి నిరాశ పరిచాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకుండా వెరైటీగా ట్రై చేయడం అభినందనీయమే కానీ.. బోరింగ్ స్క్రీన్ ప్లేతో నడిచే ఈ కథలో అతను రాణించలేకపోయాడు. పెర్ఫామెన్స్ పరంగా సుశాంత్ ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. ఈ కథకు.. పాత్రకు తగ్గట్లుగా అతను కనిపించలేకపోయాడు. 'అల వైకుంఠపురములో..' హ్యాంగోవర్లో ఉన్నాడో.. దర్శకుడు దృష్టిపెట్టలేదో కానీ.. అతడి అప్పీయిరెన్స్ వల్ల అరుణ్ పాత్ర ఔచిత్యమే దెబ్బ తింది. హీరోయిన్ మీనాక్షి చౌదరి జస్ట్ ఓకే అనిపించింది. కొన్ని చోట్ల అందంగా కనిపించిన ఆమె.. నటన పరంగా అంతగా మెప్పించలేదు. చాన్నాళ్ల తర్వాత తెరపై కనిపించిన వెంకట్ చేయడానికి అంతగా ఏమీ లేకపోయింది. అభినవ్ గోమటం బాగా చేశాడు. ఎస్సైగా విలన్ పాత్రలో చేసిన నటుడి గురించి చెప్పడానికి ఏమీ లేదు. రవివర్మ పర్వాలేదు. వెన్నెల కిషోర్ ను దర్శకుడు ఏమాత్రం ఉఫయోగించుకోలేదు. హరీష్ ఓకే.

సాంకేతిక వర్గం: ప్రవీణ్ లక్కరాజు నేపథ్యం సంగీతం చెవుల తుప్పు వదలగొట్టేస్తుంది. చాలా సన్నివేశాల్లో అవసరానికి మించిన హడావుడి కనిపిస్తుంది ఆర్ఆర్ పరంగా. హీరోయిన్ ఇంట్లో వచ్చే పాట అన్నింట్లోకి వినడానికి బాగుంది. మిగతా పాటలు ఆకట్టుకోవు. సుకుమార్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లున్నాయి. సురేష్ బాబా-భాస్కర్ రాసిన మాటలు కొన్ని చోట్ల ఆకట్టుకుంటాయి. దర్శకుడు దర్శన్ నిరాశ పరిచాడు. అతనెంచుకున్న పాయింట్ బాగున్నా ఎగ్జిక్యూషన్లో ఫెయిలయ్యాడు. థ్రిల్లర్ కథకు పాటించాల్సిన సూత్రాలను అతను విస్మరించాడు. ఇలాంటి కథను ఎంత షార్ట్ గా చెబితే అంత ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో కామెడీ.. లవ్ అంటూ మొదట్లోనే అతను కథను సైడ్ ట్రాక్ పట్టించేశాడు. అసలు కథ మొదలయ్యాక కూడా కుదురుగా నడవలేదు.

చివరగా: ఇది రాంగ్ పార్కింగ్

రేటింగ్-2.25/5

LATEST NEWS