గురు

Fri Mar 31 2017 GMT+0530 (IST)

గురు

చిత్రం : ‘గురు’

నటీనటులు: వెంకటేష్ - రితికా సింగ్ - ముంతాజ్ సర్కార్ - నాజర్ - జాకీర్ హుస్సేన్ - తనికెళ్ల భరణి - రఘుబాబు - అనితా చౌదరి తదితరులు
సంగీతం: సంతోష్ నారాయణన్
ఛాయాగ్రహణం: శక్తివేల్
మాటలు: హర్షవర్ధన్
స్క్రీన్ ప్లే: సుధ కొంగర-సునంద-మాధవన్
నిర్మాత: శశికాంత్
కథ - దర్శకత్వం: సుధ కొంగర

కెరీర్లో రీమేక్ సినిమాలతో చాలా హిట్లే కొట్టాడు విక్టరీ వెంకటేష్. ఆయన చివరి హిట్ ‘దృశ్యం’ కూడా రీమేకే. ఇప్పుడు వెంకీ మరో రీమేక్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అదే.. ‘గురు’. తమిళ-హిందీ భాషల్లో విజయవంతమైన ‘ఇరుదు సుట్రు/సాలా ఖడూస్’కు ఇది రీమేక్. తెలుగమ్మాయి సుధ కొంగర దర్శకత్వం వహించింది. ప్రోమోలతో ప్రామిసింగ్ గా కనిపించిన ‘గురు’ పూర్తి సినిమాగా ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ:

ఆదిత్య (వెంకటేష్) సిన్సియర్ బాక్సింగ్ కోచ్. ఐతే తన ముక్కుసూటితనం.. కోపం వల్ల అతను ఇబ్బందులు ఎదుర్కొంటుంటాడు. బాక్సింగ్ అసోసియేషన్లో రాజకీయాల వల్ల అతను ఢిల్లీ నుంచి వైజాగ్ కు బదిలీ అవుతాడు. తనేంటో రుజువు చేసుకోవడానికి చూస్తున్న ఆదిత్యకు రామేశ్వరి (రితికా సింగ్) కనిపిస్తుంది. కూరగాయలమ్ముకుని బతికే పేదింటి అమ్మాయి అయిన రామేశ్వరిలో ఉన్న రా టాలెంట్ గుర్తించి.. ఆమెకు బాక్సింగ్ శిక్షణ ఇవ్వడం మొదలుపెడతాడు ఆదిత్య. ఐతే ఈ క్రమంలో ఆదిత్య.. రామేశ్వరి ఇద్దరూ అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటారు. వాటిని అధిగమించి ఆదిత్య.. రామేశ్వరిని ఛాంపియన్ బాక్సర్ గా ఎలా తీర్చిదిద్దాడన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

తెలుగులో క్రీడల నేపథ్యంలో వాస్తవానికి దగ్గరగా సినిమాలు తెరకెక్కడం అరుదు. ‘అశ్విని’ లాంటి ఒకటీ అరా సినిమాలు మాత్రమే కనిపిస్తాయి. తమ్ముడు.. కబడ్డీ కబడ్డీ.. ఒక్కడు.. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి స్పోర్ట్స్ బేస్డ్ సినిమాలు వచ్చాయి కానీ.. వాటిలో కమర్షియల్ టచ్ ఎక్కువగా ఉంటుంది. రియలిస్టిగ్గా ఉండవు. అలా కాకుండా క్రీడాకారుల కష్టమెలా ఉంటుందో.. వాళ్లెలా ట్రైన్ అవుతారో.. ఓ కోచ్ తన స్టూడెంట్ కోసం ఎంతలా తపిస్తాడో.. క్రీడా సంఘాల్లో రాజకీయాలు ఎలా ఉంటాయో.. వాస్తవానికి దగ్గరగా ఉండేలా చూపిస్తూ తెరకెక్కిన ఇన్ స్పైరింగ్ మూవీ ‘గురు’. బహుశా తెలుగులో ఈ తరహా సినిమా ఇదే మొదటిది కావచ్చు.

క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పరిశోధిస్తే.. మనుషుల జీవితాల్ని పరిశీలిస్తే గొప్ప కథలు బయటికి వస్తాయి అనడానికి.. తపనతో.. మనసు పెట్టి సినిమా తీస్తే చూస్తున్న ప్రతి ప్రేక్షకుడూ స్పందించేలా తయారవుతుంది అనడానికి ‘గురు’ రుజువుగా నిలుస్తుంది. ఇందులోని పాత్రలు ఊహల నుంచి పుట్టినవి కావు. సమాజం నుంచి వచ్చినవి. నిజంగా ఒక ఛాంపియన్ని తయారు చేయాలని తపించే కోచ్ ఎలా ఉంటాడు.. రా టాలెంట్ ఉన్న ఒక మహిళా బాక్సర్ ఎలా ఉంటుంది.. కోచ్-ప్లేయర్ రిలేషన్ షిప్ ఎలా ఉంటుంది.. ఛాంపియన్లు ఎలా తయారవుతారు అన్నది సుధ కొంగర ఎంతో పరిశోధించి తీసినట్లుగా కనిపిస్తుంది ‘గురు’లో. ప్రధాన పాత్రలు రెంటితోనూ ప్రేక్షకుల్ని రిలేట్ చేయడంలోనే ‘గురు’ విజయం దాగుంది. సినిమా అయ్యాక కూడా ఆ పాత్రల్ని వెంటాడితే ఆ పాత్రలతో మనం కనెక్టయినట్లే. ‘గురు’లో వెంకీ.. రితికల పాత్రలు అలాంటివే.

ఓ బస్తీ అమ్మాయిలోని రా టాలెంట్.. స్పార్క్ గమనించి.. తాను సాధించలేనిది ఆ అమ్మాయి సాధిస్తుందని భావించి.. ఆ అమ్మాయిని ట్రైన్ చేసే కోచ్ కథ ఇది. బాక్సింగ్ అసోసియేషన్ రాజకీయాలు.. అమ్మాయిలపై కోచ్ ల లైంగిక వేధింపులు.. అక్కాచెల్లెళ్ల సెంటిమెంట్.. అపార్థాలు.. అసూయ.. కుట్ర.. ఇలా ఎన్నెన్నో అంశాలు ‘గురు’ కథలో మిళితమై ఉంటాయి. అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ.. ఆసక్తికర డ్రామాతో ‘గురు’ను నడిపించింది సుధ కొంగర. బాక్సింగ్ కు సంబంధించి మనకు తెలియని కొత్త విషయాలెన్నో చెప్పడం ‘గురు’ ప్రత్యేకత. అలాగే కమర్షియల్ టచ్ ఇచ్చి ప్రధాన పాత్రల్ని లార్జర్ దన్ లైఫ్ క్యారెక్టర్లుగా చూపించకుండా.. సినిమాటిగ్గా సన్నివేశాల్ని నడిపించకుండా.. వాస్తవానికి దగ్గరగా సినిమాను తీర్చిదిద్దడం వల్ల కూడా ‘గురు’ ప్రత్యేకంగా అనిపిస్తుంది.

హీరో పాత్ర పరిచయం దగ్గర్నుంచే ‘గురు’ కొత్తగా అనిపిస్తుంది. తెర మీద ఆదిత్య కనిపిస్తాడు తప్ప వెంకీ కనిపించడు. బిల్డప్పులేమీ లేకుండా ఒక సన్నివేశంలో భాగంగా హీరో పాత్ర మామూలుగా పరిచయమవుతుంది. అక్కడి నుంచే కథ కూడా మొదలైపోతుంది. హీరోయిన్ పాత్ర కూడా అంతే. లీడ్ క్యారెక్టర్లు రెండూ కూడా టిపికల్ గా.. కొంచెం తలతిక్కగా ఉండటంతో ఆ రెండు పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఆసక్తికరంగా సాగుతాయి. ఆరంభ సన్నివేశాల తర్వాత వెంకీ పాత్ర బ్యాక్ సీట్ తీసుకుంటే.. రితిక లీడ్ తీసుకుంటుంది. ఆమె నటన.. యాటిట్యూడ్ ప్రేక్షకుల దృష్టిని పక్కకు పోనివ్వవు. స్వతహాగా మార్షల్ ఆర్ట్స్ వచ్చిన అమ్మాయి కావడంతో బాక్సర్ పాత్రలో రితిక అదరగొట్టింది. వెంకీ-రితిక మధ్య వచ్చే సన్నివేశాలు కొత్తగా.. ఆసక్తికరంగా ఉండటంతో ప్రథమార్ధం శరవేగంగా సాగిపోతుంది. ఇంటర్వెల్ ముందు డ్రామా.. మలుపు ఆకట్టుకుంటాయి.

ఐతే ద్వితీయార్దంలో కథనం కొంచెం గాడి తప్పుతుంది. వెంకీ పాత్రతో తెర మీది నుంచి పక్కకు తప్పుకున్నాక వచ్చే సన్నివేశాలు అంత ఆసక్తి రేకెత్తించవు. కథనం కొంచెం సాగతీతగానూ అనిపిస్తుంది. వెంకీ పాత్ర ఎప్పుడు మళ్లీ సీన్లోకి వస్తుందా అని ప్రేక్షకులంతా ఎదురు చూస్తారు. ఆ పాత్ర పునరాగమనంతో మళ్లీ కథనం ఊపందుకుంటుంది. ప్రి క్లైమాక్స్.. క్లైమాక్స్ ఎమోషనల్ గా సాగుతాయి. పతాక సన్నివేశం ఉత్కంఠ రేకెత్తిస్తుంది. బౌట్ అయ్యాక వెంకీ-రితిక మధ్య వచ్చే సన్నివేశం సినిమాలో హై పాయింట్. ఎమోషనల్ గా కదిలించే ఆ సన్నివేశాన్ని తెరమీదే చూడాలి. నిడివి తక్కువుండటం ప్లస్. ఐతే ‘గురు’లో ప్రతికూలతలు లేకపోలేదు. కమర్షియాలిటీకి దూరంగా ఉండటం వల్ల ‘గురు’ అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చకపోవచ్చు. కథగా చూస్తే ‘గురు’ అంత కొత్తగా ఏమీ అనిపించదు. ఓ దశ దాటాక సినిమా ఎలా సాగుతుందన్నది అంచనా వేసేయొచ్చు. ద్వితీయార్ధంలో వచ్చే మలుపు.. నాటకీయత ప్రేక్షకుడు ముందే ఊహించేయగలడు. ఇక తమిళ వెర్షన్ చూసిన వాళ్లకు ఇది జిరాక్స్ కాపీలా అనిపిస్తుంది. తేడా ఏమైనా ఉందంటే అది వెంకీ పెర్ఫామెన్సే. ఐతే ఒరిజినల్లోని ఫీల్.. ఎమోషన్లు తెలుగు ప్రేక్షకుల్లోనూ కలిగించడంలో సుధ విజయవంతమైంది.

నటీనటులు:

వెంకటేష్.. రితికా సింగ్ ఇద్దరూ ఇద్దరే. ఎవరికి ఎవరూ తీసిపోకుండా అద్భుతంగా నటించారు. ఒరిజినల్లో మాధవన్ ను చూసి వారెవా అనుకున్నవాళ్లు కూడా వెంకీని చూసి అలాంటి ఫీలింగే పొందుతారు. ఇక నేరుగా వెంకీని చూసిన వాళ్లు మెస్మరైజ్ అయిపోతారు. సినిమాలో ఎక్కడా వెంకీ కనిపించడసలు. ఇమేజ్ గురించి పట్టించుకోకుండా పాత్రకు తగ్గట్లుగా ఒదిగిపోయాడు వెంకీ. ఆయన సీరియస్ గా నటిస్తే ఎంత బాగుంటుందో చెప్పడానికి ఈ సినిమా మరో రుజువు. వెంకీ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్సెస్ లో ఇది ఒకటిగా నిలుస్తుంది. అగ్రెసివ్ గా కనిపించే సీన్లలో వెంకీ అదరగొట్టేశాడంతే. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్లో ఆయన హావభావాలు కట్టిపడేస్తాయి. ఇక రితికా సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వెంకీ పాత్రలో ఇంకొకరిని ఊహించుకోగలమేమో కానీ.. రితికా విషయంలో ఆ ఛాన్సే లేదు. స్వతహాగా బాక్సర్ కూడా కావడంతో ఆమె ఈ పాత్రలో జీవించేసింది. ఆమెను చూస్తున్నంత సేపూ అది నటనలా అనిపించదు. నిజంగానే ఓ బాక్సర్ జీవితాన్ని చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తుంది రితికా. ఐతే రితికకు డబ్బింగ్ విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టాల్సింది. యాస కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. లక్స్ పాత్రలో ముంతాజ్ కూడా ఆకట్టుకుంటుంది. నెగెటివ్ రోల్ లో జాకీర్ హుస్సేన్ కూడా బాగా నటించాడు. నాజర్ పాత్ర.. ఆయన నటన ఆకట్టుకుంటుంది. తనికెళ్ల భరణి.. రఘుబాబు.. అనితా చౌదరి కూడా ఓకే.

సాంకేతిక వర్గం:

సంతోష్ నారాయణన్ నేపథ్య సంగీతం.. శక్తి వేల్ ఛాయాగ్రహణం సినిమాకు బలంగా నిలిచాయి. సంతోష్ పాటల్లో తమిళ వాసనలు కొడతాయి. జింగిడి జింగిడి.. ఓయ్ సక్కనోడా పాటలు బాగున్నాయి. సన్నివేశాల్ని ఎలివేట్ చేయడంలో నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించింది. శక్తివేల్ కెమెరా పనితనం కూడా సినిమాను ప్రత్యేకంగా నిలబెడుతుంది. బాక్సింగ్ బౌట్స్.. ముఖ్యంగా పతాక సన్నివేశంలో ఛాయాగ్రహణం సూపర్బ్. హర్షవర్ధన్ రాసిన డైలాగులు సన్నివేశాలకు తగ్గట్లుగా సహజంగా ఉన్నాయి. ఐతే డైలాగులు చాలా వరకు ఒరిజినల్ నుంచే తీసుకున్నట్లున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకురాలు సుధ కొంగర ఎంత తపనతో ఈ సినిమా తీసిందన్నది తెరమీద స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె సినిమా తీసేముందు చేసిన పరిశోధన అంతా కూడా స్పష్టంగా తెలుస్తుంది. వాస్తవానికి దగ్గరగా ఉండేలా సినిమాను తెరకెక్కిస్తూనే.. ఎమోషనల్ గా కదిలించడంలో.. ఇన్ స్పైర్ చేసేలా సినిమాను రూపొందించడంలో ఆమె విజయవంతమైంది.  ఒకప్పుడు ‘ఆంధ్రా అందగాడు’ అనే ఊరూ పేరు లేని సినిమా తీసిన సుధ కొంగర.. ‘గురు’ లాంటి సినిమా తీసిందంటే ఆశ్చర్యపోవాల్సిందే. చరిత్రను బట్టి చూస్తే ఒక లేడీ డైరెక్టర్ నుంచి ఇలాంటి సినిమా రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే. స్పోర్ట్స్ డ్రామాల్ని ఎలా తీయాలో చెప్పడానికి సుధ ఒక ‘గురు’ను ఒక ఉదాహరణగా నిలబెట్టిందనడంలో సందేహం లేదు.

చివరగా: గురుశిష్యులు మనసులు గెలుస్తారు

రేటింగ్ - 3/5

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS