మూవీ రివ్యూ : గాడ్సే
నటీనటులు: సత్యదేవ్-ఐశ్వర్య లక్ష్మి-చైతన్య
కృష్ణ-నోయల్-సిజ్జు మీనన్-పృథ్వీరాజ్-ప్రియదర్శి-తనికెళ్ల
భరణి-నాగబాబు-బ్రహ్మాజీ తదితరులు
సంగీతం: శాండీ అద్దంకి-సునీల్ కశ్యప్
ఛాయాగ్రహణం: సురేష్
నిర్మాత: సి.కళ్యాణ్
రచన-దర్శకత్వం: గోపీగణేష్ పట్టాభి
క్యారెక్టర్
రోల్స్ తో మొదలుపెట్టి.. ఆ తర్వాత కథానాయకుడిగా మారి.. సినిమాల ఎంపికలో తన
అభిరుచిని చాటుకుంటున్న నటుడు సత్యదేవ్. అతడ కెరీర్లో మంచి
సినిమాలున్నప్పటికీ నటుడిగా అతడి సామర్థ్యానికి తగ్గ సినిమాలు పడలేదన్న
అభిప్రాయం అందరిలో ఉంది. ‘గాడ్సే’ ట్రైలర్ చూస్తే అతడి ఆకలి తీర్చే
సినిమాలాగే కనిపించింది. మరి ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం
సత్యదేవ్ కు ఎలాంటి ఫలితాన్నిచ్చేలా ఉందో చూద్దాం పదండి.
కథ:
గాడ్సే
(సత్యదేవ్) ఒక ఐపీఎస్ అధికారితో పాటు సమాజంలోని కొందరు ప్రముఖుల్ని
కిడ్నాప్ చేసి ప్రభుత్వ ఉన్నతాధికారుల ముందు కొన్ని డిమాండ్లు పెడతాడు.
అతడి డిమాండ్ మేరకు ముందుగా ఒక మంత్రిని.. తర్వాత ఓ ఎంపీని వీడియో కాల్
ద్వారా అతడి ముందు ప్రవేశపెడతారు. ముందు గాడ్సేను అందరూ తేలిగ్గా
తీసుకుంటారు కానీ.. తన దగ్గర బందీలుగా ఉన్నవారిలో ఒక్కొక్కరిని అతను చంపడం
మొదలుపెట్టడంతో తన ముందుకు వచ్చిన మంత్రి.. ఎంపీ కొన్ని రహస్యాలను
బయటపెట్టడం మొదలుపెడతారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రితో కలిసి కొందరు బడా
బాబులు చేసిన అన్యాయాలు బయటికి వస్తాయి. వారి వల్ల జీవితం తలకిందులైన
వ్యక్తుల్లో గాడ్సే కూడా ఒకడని తెలుస్తుంది. ఇంతకీ అతడి నేపథ్యమేంటి.. తనకు
జరిగిన నష్టమేంటి.. అందుకు ప్రతిగా అతనేం చేశాడు.. తన లక్ష్యమేంటి.. ఈ
కిడ్నాప్ వ్యవహారం ఎక్కడిదాకా వెళ్లింది అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
గత వారం రిలీజైన ‘అంటే సుందరానికీ’ సినిమా విషయంలో చాలామంది నుంచి ఫస్టాఫ్
కొంచెం సాగతీతగా అనిపించింది సెకండాఫ్ బాగుంది అనే కామెంట్ వినిపించింది.
ఇదే మాట దర్శకుడు వివేక్ ఆత్రేయ దగ్గర ప్రస్తావిస్తే.. సెకండాఫ్ వేగంగా
తీసిన తనకు ఫస్టాఫ్ అలా తీయడం తెలియదా.. ఆ కథను అలా చెబితేనే కరెక్ట్..
పాత్రలను ప్రేక్షకులకు అలవాటు చేయడానికి.. సెకండాఫ్ లో ఎమోషన్ కరెక్టుగా
క్యారీ అవడానికి ప్రథమార్ధాన్ని అలా నడిపించానని వివరణ ఇచ్చాడు. అతడి
వివరణను ఎంతమంది అర్థం చేసుకున్నారో ఏమో కానీ.. ప్రేక్షకులైతే ఆ సినిమాను
ఆశించిన స్థాయిలో ఆదరించలేదు. దర్శకుడి ఉద్దేశం ఏదైనప్పటికీ.. థియేటర్లో
కూర్చున్న ప్రేక్షకుడు ఎక్కడా బోర్ ఫీల్ కాకుండా చేయడం.. కథనాన్ని పరుగులు
పెట్టించడం.. ఈ రోజుల్లో సినిమాలకు చాలా అవసరమైన లక్షణాలు. జానర్
ఎలాంటిదైనా సరే.. ప్రేక్షకులు స్లో నరేషన్ ను అస్సలు ఇష్టపడట్లేదు.
అందులోనూ థ్రిల్లర్ సినిమాలకు వేగం అన్నది చాలా చాలా అవసరమైన లక్షణం. ఆ
జానర్ సినిమానే అయిన ‘గాడ్సే’ ఒక దశ వరకు వేగంగానే నడుస్తుంది. తెర మీద
జరిగే తంతు అంతా ఆసక్తికరంగానే అనిపిస్తూ తర్వాత ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ
రేకెత్తిస్తుంది. కానీ చిక్కుముడులన్నీ విప్పాల్సిన సమయం వచ్చేసరికే
‘గాడ్సే’ గాడి తప్పేసింది. పావు గంటలో చెప్పాల్సిన కథను.. గంట పాటు
సాగదీయడం.. మెలో డ్రామా డోసు మరీ ఎక్కువైపోవడంతో అప్పటిదాకా ఉన్న ఇంప్రెషన్
అంతా పోయి.. సగటు సినిమా లాగే తయారైంది ‘గాడ్సే’.
కథ పరంగా చూస్తే
‘గాడ్సే’ కొత్తగా ఏమీ కనిపించదు. ప్రభుత్వ అధికారుల్ని లేదా రాజకీయ
నాయకుల్ని హీరో కిడ్నాప్ చేయడం.. ప్రభుత్వం ముందు చిత్రమైన డిమాండ్లు
పెట్టడం.. ఈ క్రమంలో డ్రామా రక్తికట్టడం.. ‘ఠాగూర్’-‘ప్రతినిధి’-‘ఈనాడు’
సహా చాలా సినిమాల్లో చూశాం. ఈ ఫార్ములా పాతదే అయినప్పటికీ.. చెప్పే
పద్దతిలో వైవిధ్యం చూపించడానికి ఉన్న అవకాశాలను ‘గాడ్సే’ దర్శకుడు గోపీ
గణేష్ పట్టాభి బాగానే ఉపయోగించుకున్నాడు. కొందరు ప్రముఖులను కిడ్నాప్
చేసిన హీరో.. ప్రభుత్వ యంత్రాంగంతో చర్చలు జరిగే వ్యవహారాన్ని ఇందులో
ఆసక్తికరంగా.. ఉత్కంఠభరితంగానే చూపించారు. హీరో ఉద్దేశమేంటో ముందే
బయటపెట్టకుండా అతడికి జరిగిన అన్యాయంలో భాగమైన ఒక్కో వ్యక్తిని తీసుకొచ్చి
ఒక్కో విషయాన్ని బయటపెట్టించడం ఆసక్తి రేకెత్తిస్తుంది. కొన్ని సీన్లు
సిల్లీగా అనిపించినా సరే.. ప్రథమార్ధం వరకు ‘గాడ్సే’ ఎంగేజ్ చేస్తుంది.
ప్రేక్షకుడిని కథలో నిమగ్నం చేయడంలో దర్శకుడు విజయవంతం అయ్యాడు.
ఇలాంటి
సినిమాల్లో ద్వితీయార్ధం నుంచి ఫ్లాష్ బ్యాక్ చూపించడం సర్వ సాధారణం.
దానికి ప్రేక్షకుడు కూడా మానసికంగా సిద్ధమై ఉంటాడు. ఐతే ‘గాడ్సే’కు ఇక్కడే
వచ్చింది అతి పెద్ద సమస్య. ప్రథమార్ధంలో కథనాన్ని పరుగులు పెట్టిస్తూ..
వేగంగా సన్నివేశాలను నడిపించిన గోపీ గణేష్ ద్వితీయార్ధానికి వచ్చేసరికి
పూర్తిగా శైలి మార్చేశాడు. రొటీన్ ఫ్లాష్ బ్యాక్.. పైగా స్లో నరేషన్ తో
ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. నిరుద్యోగ సమస్య గురించి ప్రేక్షకులు
కదిలిపోయేలా చెప్పాలన్న ప్రయత్నంలో అతను పూర్తిగా ట్రాక్ తప్పేశాడు. ప్రతి
సన్నివేశంలోనూ మెలో డ్రామా శ్రుతి మించిపోయింది. దర్శకుడు
చెప్పాలనుకున్నది 10-15 నిమిషాల్లో కూడా ప్రభావవంతంగా చెప్పే అవకాశం
ఉన్నప్పటికీ.. అతను మాత్రం అంతకు మూడు రెట్ల సమయం తీసుకోవడంతో
ప్రేక్షకుల్లో ఓపిక నశించి పోతుంది. కనీసం ఫ్లాష్ బ్యాక్ లో కొత్తగా ఏమైనా
చూపించాడా అంటే అదీ లేదు. అంతా రొటీన్ వ్యవహారమే. చివరికి హీరో ఒక గొప్ప
ఉద్దేశంతో ఏదో చేయబోతే.. రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మగా మారిన వ్యవస్థ
వల్ల అతడికి అన్యాయం జరగడం.. దీనికి అతను ప్రతీకారం తీర్చుకోవడం.. ఇలా
రొటీన్ కంక్లూజనే వస్తుంది సినిమాకు. ఫ్లాష్ బ్యాక్ ముగిసి వర్తమానంలోకి
వచ్చాక చివరి 20 నిమిషాల్లో మళ్లీ కథనం కాస్త ఊపందుకున్నా.. పతాక ఘట్టం ఓకే
అనిపించినా.. సత్యదేవ్ పెర్ఫామెన్స్.. పవర్ ఫుల్ డైలాగ్స్ కిక్ ఇచ్చినా..
ఇవన్నీ అంతకుముందు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం కష్టమే. మరీ అంచనాలు
లేకుండా ఒకసారి చూడ్డానికి ‘గాడ్సే’ ఓకే అనిపిస్తుంది కానీ.. అంతకుమించి
ఆశిస్తేనే కష్టం.
నటీనటులు:
సత్యదేవ్ ప్రతిభ గురించి
కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘గాడ్సే’లో మరోసారి అతను తన సత్తా ఏంటో
చాటిచెప్పాడు. స్టార్ హీరోలు చేయదగ్గ పవర్ పాత్రలో పవర్ ఫుల్ పెర్ఫామెన్స్
తో అతను అదరగొట్టాడు. సాధారణమైన సన్నివేశాలను కూడా సత్యదేవ్ తన నటనతో
నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కేవలం అతడి నటన వల్ల కొన్ని సన్నివేశాలను
చూడబుద్ధేసింది. పతాక సన్నివేశాల్లో పవర్ ఫుల్ డైలాగులు చెబుతూ అతను ఇచ్చిన
హావభావాలు వారెవా అనిపిస్తాయి. మంచి కథ.. దర్శకుడు సెట్ అయితే సత్యదేవ్
నుంచి అద్భుతాలు ఆశించవచ్చని అనిపిస్తుంది. సినిమాలో అతడిది వన్ మ్యాన్ షో
అని చెప్పాలి. మలయాళ అమ్మాయి స్పెషల్ ఆఫీసర్ పాత్రలో ఐశ్వర్యా లక్ష్మి
బాగానే చేసింది. హీరో భార్యగా నటించిన అమ్మాయి పర్వాలేదు. బ్రహ్మాజీ
నామమాత్రమైన పాత్ర చేశాడు. పృథ్వీ కాస్త ఎంటర్టైన్ చేశాడు. తనికెళ్ల భరణి
కనిపించిన కాసేపు ఆకట్టుకున్నారు. విలన్ పాత్రల్లో సిజ్జు సహా అందరూ
సాధారణంగా కనిపించారు. ఐశ్వర్యతో పాటు కనిపించే పోలీసాఫీసర్ చేసిన అతి అంతా
ఇంతా కాదు.
సాంకేతిక వర్గం:
‘గాడ్సే’కు బడ్జెట్ సమస్యలు
తలెత్తాయో ఏమో కానీ.. సాంకేతికంగా సాధారణంగా అనిపిస్తుందీ చిత్రం. పాటలకు
ఇందులో ప్రాధాన్యం లేదు. ఉన్న ఒకటీ అరా పాటలు కూడా ఆకట్టుకునేలా లేవు.
నేపథ్య సంగీతం పర్వాలేదు. ఛాయాగ్రహణం సోసోగా సాగింది. విజువల్స్ చూసినవే
చూసినట్లు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు కూడా ఆశించిన స్థాయిలో లేవు.
బడ్జెట్ పరంగా ఉన్న పరిమితులు తెరపై తెలిసిపోయాయి. ఇన్ని పరిమితుల మధ్య
రచయిత-దర్శకుడు గోపీ గణేష్ బాగానే కష్టపడ్డాడు. సత్యదేవ్ సహకారంతో ఒక దశ
వరకు కథాకథనాల్ని బాగానే నడిపించగలిగాడు. కానీ ఫ్లాష్ బ్యాక్ దగ్గర అతను
ఔట్ డేటెడ్ గా కనిపించాడు. నరేషన్ పూర్తిగా గాడి తప్పింది. అతను ఎడిటర్ కు
కూడా స్వేచ్ఛ ఇచ్చినట్లు లేడు. గోపీ గణేష్ మాటలు కొన్ని తూటాల్లా పేలాయి.
దర్శకుడిగా అతడికి ఓ మోస్తరు మార్కులు పడతాయి.
చివరగా: గాడ్సే.. గాడి తప్పాడు మధ్యలో
రేటింగ్-2.25/5
Disclaimer
: This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The
Movie Based On This Review And Watch Movie in Theater