'గ్యాంగ్ లీడర్'

Fri Sep 13 2019 GMT+0530 (IST)

'గ్యాంగ్ లీడర్'

చిత్రం : 'గ్యాంగ్ లీడర్'

నటీనటులు: నాని - ప్రియాంక మోహన్ - లక్ష్మి - శరణ్య - కార్తికేయ - వెన్నెల కిషోర్ - ప్రియదర్శి - అనీష్ కురువిల్లా తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: మిరోస్లా కూబా
మాటలు: వెంకట్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని - రవిశంకర్ యలమంచిలి - మోహన్
రచన - దర్శకత్వం: విక్రమ్ కె.కుమార్

‘జెర్సీ’తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు నేచురల్ స్టార్ నాని. దీని తర్వాత విక్రమ్ కె.కుమార్ లాంటి విలక్షణ దర్శకుడితో కలిసి చేసిన సినిమా ‘గ్యాంగ్ లీడర్’ మొదట్నుంచి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రోమోల్ని బట్టి చూస్తే మంచి వినోదం పంచే చిత్రంలా కనిపించిన ‘గ్యాంగ్ లీడర్’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి నాని-విక్రమ్ ఏమేరకు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారో చూద్దాం పదండి.

కథ:

పెన్సిల్ పార్థసారథి (నాని) ప్రతీకార కథలు రాసే రచయిత. అతడి దగ్గరికి వివిధ వయసులకు చెందిన అయిదుగురు ఆడవాళ్లు కలిసి వస్తారు. అతడి సాయం కోరతారు. దేవ్ (కార్తికేయ) అనే వ్యక్తి మీద ప్రతీకారం తీర్చుకోవడం వారి లక్ష్యం. వీళ్లకు అతను చేసిన అన్యాయమేంటి? పెన్సిల్ ఈ ఆడవాళ్లకు ఏ రకంగా సాయపడ్డాడు? వీళ్ల మిషన్ చివరికి ఎలా పూర్తయింది అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

కొన్ని కథల్లో లాజిక్కులుండవు.. క్యారెక్టర్లు అంత కన్విన్సింగ్ గా అనిపించవు. సినిమా అంతా అయ్యాక కాస్త తర్కంతో ఆలోచిస్తే.. చాలా లోపాలు కనిపిస్తాయి. ఇదేం కథ.. అవేం మలుపులు అనే ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ సినిమా చూస్తుండగా ఈ లోపాలు కనిపించని విధంగా.. లాజిక్కుల గురించి ఆలోచించని రీతిలో.. ఆ సమయానికి ఎంటర్టైన్ అయ్యేలా మ్యాజిక్ చేస్తారు కొందరు దర్శకులు. విక్రమ్ కె.కుమార్ ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ను ఇలాగే మలిచాడు. సగటు ప్రేక్షకుడికి టైంపాస్ చేయించే  వినోదం.. థ్రిల్ చేసే మలుపులు ఉన్నప్పటికీ.. మరీ సినిమాటిగ్గా - కన్వీనియెంట్ గా సాగిన రైటింగ్ ‘గ్యాంగ్ లీడర్’కు ప్రతికూలత అయింది. ఇందులో పాజిటివ్స్ ఎన్ని ఉన్నాయో.. నెగెటివ్స్ కూడా అన్నే కనిపిస్తాయి. కాకపోతే కాలక్షేపానికి మాత్రం ఢోకా లేదు.

విక్రమ్ కుమార్ కు ఇంటలిజెంట్ డైరెక్టర్ అనే పేరుంది. 13బి.. మనం.. 24 లాంటి సినిమాలు అతడికి ఈ గుర్తింపును తెచ్చిపెట్టాయి. స్క్రీన్ ప్లేతో మ్యాజిక్స్ చేయడం అతడికి అలవాటు. ఐతే తన చివరి సినిమా ‘హలో’లో ఏమాత్రం కన్విన్సింగ్ గా లేని కథాకథనాలతో పూర్తిగా నిరాశపరిచాడు విక్రమ్. అందులో స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేయాలని చూశాడు కానీ.. మొదలుపెట్టిన చోటే ఆగిపోయే ఆ కథతో ప్రేక్షకుడు కనెక్ట్ కావడమే కష్టమవుతుంది. ఐతే ‘గ్యాంగ్ లీడర్’కు వచ్చేసరికి విక్రమ్.. ప్రేక్షకుల బుర్రలకు పెద్దగా పరీక్ష పెట్టకుండా సింపుల్ గా లాగించేయాలని చూశాడు. ఈ క్రమంలో లాజిక్ అనే మాటను పక్కన పెట్టేశాడు. కానీ ఎంటర్టైన్మెంట్.. థ్రిల్ ఇవ్వడంలో మాత్రం విక్రమ్ విజయవంతం అయ్యాడు.

ఆరుగురు దొంగలు కలిసి ఒక బ్యాంకును దోపిడీ చేయడం.. అందులో ఒకడు మిగతా ఐదుగురిని చంపేస్తే.. ఆ ఐదుగురి కుటుంబాల్లోని ఆడవాళ్లు ప్రతీకారానికి సిద్ధపడటం.. వాళ్లంతా కలిసి ప్రతీకార నవలలు రాసే రచయిత సాయం కోసం రావడం.. ఇదంతా సిల్లీ వ్యవహారంలా అనిపిస్తుంది ‘గ్యాంగ్ లీడర్’లో. ప్రధాన పాత్రధారులు ప్రతీకారం కోసం ప్రయత్నిస్తున్నపుడు వాళ్లకు అన్యాయం జరిగిందని ప్రేక్షకుడు కన్విన్స్ కావాలి. కానీ ‘గ్యాంగ్ లీడర్’లో అలాంటి ఫీలింగ్ కలగకపోవడం వల్ల ఆరంభంలో ఈ కథతో కనెక్ట్ కావడం కష్టమవుతుంది. దీని వల్ల ‘గ్యాంగ్ లీడర్’ టేకాఫ్ అంత గొప్పగా అనిపించదు. పెన్సిల్ పాత్రకు సంబంధించి ఆరంభంలో వచ్చే మెరుపులన్నీ టీజర్.. ట్రైలర్లలో చూసినవే. ఆ తర్వాత ఏంటి అని చూస్తే.. నిరాశ తప్పదు.

ఒక పాత్రను ఒక వ్యక్తిత్వంతో - కొన్ని ప్రత్యేకమైన లక్షణాలతో మొదలుపెట్టినపుడు.. ఆ తర్వాత కూడా వాటిని కొనసాగించడం - సందర్భానుసారం ఉపయోగించడం ముఖ్యం. అప్పుడే ఆ పాత్ర సరిగ్గా పండుతుంది. ప్రేక్షకుల మనసులపై బలమైన ముద్ర వేస్తుంది. కానీ టీజర్ - ట్రైలర్లు  కట్ చేయడం కోసం కొన్ని షాట్లు తీసి వదిలేసినట్లు కనిపిస్తుందే తప్ప ఆ తర్వాత పెన్సిల్ పాత్రలో మెరుపులేం లేవు. ఒక మామూలు క్యారెక్టర్ లాగే ప్రవర్తిస్తుంది హీరో పాత్ర. నాని తనదైన కామెడీ టైమింగ్ తో.. పంచులతో కాస్త ఎంటర్టైన్ చేశాడు తప్పితే.. తొలి 40 నిమిషాల్లో పెద్దగా మెరుపులేమీ లేవు. ఐతే విలన్ గా కార్తికేయ పాత్ర ప్రవేశంతో ‘గ్యాంగ్ లీడర్’ ట్రాక్ ఎక్కుతుంది. ఈ పాత్రలోని షేడ్స్ ప్రేక్షకుడిలో క్యూరియాసిటీ తీసుకొస్తాయి. విలన్ గుట్టు తెలుసుకోవడం హీరో.. అతడి గ్యాంగ్ కలిసి సాగించే ఇన్వెస్టిగేషన్ మరీ కన్వీనియెంట్ గా అనిపించినప్పటికీ.. ఆ దశ నుంచి కొన్ని సన్నివేశాలు ఉత్కంఠభరితంగా సాగుతాయి. విలన్ని హీరో కలిసే తొలి సన్నివేశంతో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రథమార్ధానికి హైలైట్. విరామం దగ్గర పెట్టిన ఫ్రేమ్ విక్రమ్ కుమార్ స్థాయిని.. అతడి అభిరుచిని తెలియజేస్తుంది.

ఇంటర్వెల్ దగ్గర కథనంపై పట్టు సంపాదించిన విక్రమ్.. రెండో అర్ధాన్ని మరింత ఆసక్తికరంగా నడిపించాడు. హీరో-విలన్ మధ్య క్యాట్ అండ్ మౌస్ ప్లే కథనాన్ని రక్తి కట్టిస్తుంది.  ప్రేక్షకుల్ని కొంత ఉత్కంఠకు గురి చేసే సన్నివేశాలు పడటంతో ద్వితీయార్ధం వేగంగా సాగిపోతుంది. మధ్య మధ్యలో విక్రమ్ మార్కు స్క్రీన్ ప్లే చమత్కారం ఆకట్టుకుంటుంది. చాలా వరకు సటిల్ గా సాగిపోయే సినిమాలో వెన్నెల కిషోర్ కామెడీ ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతుంది. ప్రి క్లైమాక్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. అక్కడ లక్ష్మి పాత్రకు సంబంధించిన మలుపు ప్రేక్షకుల్ని భిన్న అనుభూతికి గురి చేస్తుంది. క్లైమాక్స్ కొంత అబ్ రప్ట్ గా అనిపించినప్పటికీ.. ద్వితీయార్దంలోని మలుపులు.. ఉత్కంఠ.. వినోదం.. సినిమాపై పాజిటివ్ ఫీలింగ్ తో బయటికి వచ్చేలా చేస్తాయి. ఓవరాల్ గా చూసుకుంటే.. ‘గ్యాంగ్ లీడర్’ ప్రేక్షకుల్ని ఆ సమయానికి బాగానే ఎంటర్టైన్ చేస్తుంది కానీ.. ప్రత్యేకమైన అనుభూతిని కలిగించదు. నాని కోసం కచ్చితంగా ఒకసారి ‘గ్యాంగ్ లీడర్’ చూడొచ్చు.

నటీనటులు:

తనకు ఎలాంటి పాత్ర ఇచ్చినా.. అందులో సులువుగా ఒదిగిపోయి.. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడం నానికి అలవాటు. పెన్సిల్ పార్థసారథి పాత్రలోనూ అతను నూటికి నూరు శాతం మెప్పించాడు. ఈ పాత్రను మొదలుపెట్టిన స్థాయిలోనే సినిమా అంతటా నడిపించి ఉంటే ఈ పాత్ర.. సినిమా ఓ రేంజిలో ఉండేవేమో. కానీ మధ్యలో పాత్ర గాడి తప్పింది. అయినప్పటికీ నాని ప్రతి సన్నివేశంలోనూ అలరించాడు. అతడి కామెడీ టైమింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా లక్ష్మి.. వెన్నెల కిషోర్ కాంబినేషన్లలో వచ్చే సీన్లలో నాని చెలరేగిపోయాడు. అతడి లుక్.. మేనరిజమ్స్ ప్రేక్షకులు ఈజీగా కనెక్టయ్యేలా సాగాయి. హీరోయిన్ ప్రియాంక మోహన్ ఆకట్టుకుంది. ఆమెకు సినిమాలో పెర్ఫామ్ చేసేందుకు పెద్దగా స్కోప్ లేదు కానీ.. బాగా నటించగలనని చాటింది. కనిపించినంతసేపు ఆహ్లాదం పంచింది. ఆమె హావభావాలు బాగున్నాయి. సీనియర్ నటి లక్ష్మి మరోసారి తన అనుభవాన్ని చూపించింది. సరస్వతి పాత్రలో గొప్పగా నటించింది. ఇటు కామెడీ.. అటు సెంటిమెంటులో ఆమె అదరగొట్టింది. విలన్ పాత్రలో కార్తికేయ ఆకట్టుకున్నాడు. హీరోగా కంటే విలన్ పాత్రలకు అతను బాగా సూటవుతాడేమో అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. దేవ్ గా అతను గుర్తుంటాడు. శరణ్యతో పాటు హీరో గ్యాంగులో కనిపించే టీనేజ్ అమ్మాయి.. చిన్న పాప కూడా బాగా చేశారు. వెన్నెల కిషోర్ కనిపించిన కాసేపు కితకితలు పెట్టేశాడు. ప్రియదర్శి ఓకే.

సాంకేతికవర్గం:

అనిరుధ్ రవిచందర్ పాటలు బాగున్నాయి. హొయనా హొయొనాతో పాటు ఇంకో రెండు పాటలు ఆకట్టుకుంటాయి. కానీ ఇంకా ఒకట్రెండు పాటలు పడి ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ కలుగుతుంది. నేపథ్య సంగీతంలో అనిరుధ్ తన స్థాయిని చూపించాడు. మొదట్నుంచి చివరి వరకు తనదైన ఎనర్జీతో ఆర్ఆర్ తో సన్నివేశాల్ని నడిపించాడు. సినిమాటోగ్రాఫర్ మిరోస్లో కూబా పనితనం ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. ఇంటర్వెల్ షాట్ ఒక్కటి చూసి అతడి ప్రతిభను అంచనా వేయొచ్చు. ఇంకా మరెన్నో మెరుపులు కనిపిస్తాయి సినిమాలో. మైత్రీ వాళ్ల నిర్మాణ విలువలకు ఢోకా లేదు. వెంకట్ డైలాగులు బాగున్నాయి. దర్శకుడు విక్రమ్ కుమార్.. కథ.. పాత్రల విషయంలో లాజిక్కుల గురించి పట్టించుకోకపోవడం నిరాశ కలిగించే విషయం. తనకున్న గుర్తింపును అతను నిలబెట్టుకోలేకపోయాడు. కానీ స్క్రీన్ ప్లేలో మలుపులతో.. ఫన్నీ నరేషన్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ద్వితీయార్ధంలో విక్రమ్ ప్రతిభ చాలా చోట్ల కనిపిస్తుంది. కానీ లూజ్ ఎండ్స్ చాలా ఉండటంతో సినిమాపై పూర్తి సానుకూల అభిప్రాయం కలగదు. విక్రమ్ ఫామ్ అందుకున్నాడు కానీ.. మునుపటి స్థాయిలో మాత్రం తన పనితనం చూపించలేదు.

చివరగా: గ్యాంగ్ లీడర్.. పైసా వసూల్ బొమ్మ

రేటింగ్-2.75/5
  
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in TheatreLATEST NEWS