ఎఫ్.సి.యు.కె

Fri Feb 12 2021 GMT+0530 (IST)

ఎఫ్.సి.యు.కె

ఎఫ్.సి.యు.కె.. ఈ మధ్య టైటిల్.. అలాగే ఓ బోల్డ్ ట్రైలర్ తో ఆకర్షించిన చిన్న సినిమా. జగపతిబాబు కీలక పాత్రలో విద్యాసాగర్ రాజు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించగా.. సీనియర్ నిర్మాత దామోదర్ ప్రసాద్ నిర్మించారు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: ఫణి భూపాల్ (జగపతిబాబు) ఒక మిడిల్ ఏజ్డ్ బిజినెస్ మ్యాన్. వయసుతో సంబంధం లేకుండా ప్లే బాయ్ వేషాలు వేసే ఫణి.. తన అభిరుచికి తగ్గట్లే కండోమ్ డీలర్ గా కొనసాగుతుంటాడు. అతడికి కొడుకు కార్తీక్ (రామ్ కార్తీక్) అంటే చాలా ఇష్టం. ఆ కుర్రాడు ఉమ (అమ్ము అభిరామి) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ముందు కార్తీక్ అంటే ఇష్టం లేకున్నా తర్వాత అతడికి కొంచెం దగ్గరవుతుంది అమ్ము. అంతలోనే కార్తీక్ తండ్రి కారణంగా అతణ్ని అపార్థం చేసుకుని దూరమవుతుంది అమ్ము. మరోవైపు ఫణి ప్లే బాయ్ వేషాల వల్ల ఓ అమ్మాయి చిన్న బిడ్డను కని అతడి కుటుంబానికి అప్పగించి వెళ్లిపోతుంది. తాను పెళ్లికి సిద్ధమవుతున్న దశలో చెల్లెలి రూపంలో ఒక చిన్న పాప ఇంటికి రావడంతో కార్తీక్ కు అవస్థలు మొదలవుతాయి. ఈ పాప కారణంగా కార్తీక్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది.. అతను అమ్మును సొంతం చేసుకున్నాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: జగపతిబాబు ఒక ప్లేబాయ్. ఆయన సూపర్ మార్కెట్లో షాపింగ్ చేస్తూ చేస్తూ.. ఒక మహిళ దగ్గరికెళ్లి ‘‘మీ నిపుల్ కొంచెం ఇస్తారా’’ అంటాడు. ఆమె ‘‘వాట్’’ అంటూ ఆశ్చర్యపోతుంది. దానికాయన.. ‘‘అపార్థం చేసుకోకండి. నేనడిగింది ఈ నిపుల్ గురించి’’ అంటూ చిన్న పిల్లలు నోట్లో పెట్టుకునే రబ్బర్ నిపుల్ చూపిస్తాడు. అదే షాపింగ్ మాల్ లో జగపతిబాబు కొడుకు పాత్రధారి అయిన రామ్ కార్తీక్ ఒక అమ్మాయి దగ్గరికెళ్లి.. డైపర్ కావాలంటాడు. సైజ్ అడిగితే ఆ అమ్మాయి ఎద భాగానికి సమాంతరంగా రెండు చేతులతో సైజ్ చూపిస్తాడు. ఆమె మీరు అలా చూపించకూడదు అని కొంటెగా నవ్వి.. కరెక్ట్ సైజ్ చెప్పమంటుంది. అతను చేతుల్ని ఇంకొంచెం దగ్గరికి తీసుకుని సైజ్ తగ్గించి చూపిస్తాడు. ఇలా చూపించారంటే సైజ్ ‘36’ అయ్యుంటుంది అంటూ డైపర్ తీసి ఇస్తుంది ఆ అమ్మాయి. ఇవీ.. ‘సో కాల్డ్’ బోల్డ్ ఫిలిం ‘ఎఫ్.సి.యు.కె’లో కొన్ని ‘బోల్డ్’ సన్నివేశాల తీరు. ఈ సన్నివేశాలు ఇలా ఉన్నాయి కాబట్టి ఇది ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ టైపు బూతు సినిమానా అంటే అదీ కాదు. చెప్పాలనుకున్నది ఒక ఫ్యామిలీ టైపు కథ. కానీ ఊరికే ఒక బోల్డ్ టైటిల్ పెట్టేసి.. అర్థం పర్థం లేని కొన్ని కుళ్లు బూతు జోకులు పేల్చేసి.. తలా తోకా లేని పాత్రలతో.. దశా దిశా లేని కథాకథనాలతో సినిమాను లాగించడానికి విఫలయత్నం చేశాడు దర్శకుడు విద్యా సాగర్ రాజు.

శృంగార పురుషుడైన తండ్రి 60 ఏళ్ల వయసులో ఒక చంటి పిల్లను తీసుకొచ్చి ‘ఇదిగో నీ చెల్లి’ అంటూ పెళ్లికి ఎదిగిన కొడుకు చేతిలో పెడితే ఎలా ఉంటుంది? వినడానికి చాలా ఎగ్జైటింగ్ గా అనిపించే పాయింట్ ఇది. ‘ఎఫ్.సి.యు.కె’ ట్రైలర్లో కూడా దీన్నే హైలైట్ చేసి చూపించారు. టైటిల్ తో పాటు ఈ పాయింట్ చూసి ఇదేదో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అని... చాలా ఫన్నీగా ఉంటుందని అనుకుంటాం. కానీ సినిమాలో జగపతిబాబు పాత్రను పరిచయం చేసిన తీరుతోనే నీరుగారిపోతాం. ఈయన వేశ్యల్ని పెట్టి కండోమ్ యాడ్స్ చేస్తున్నాడని కేసు వేయడం.. దానికాయన కోర్టులో స్టైల్ గా ఊగుతూ వచ్చి బోన్లో నిలబడి తన ఏదో బార్లో కూర్చున్న వాడిలా ఊగిపోతూ తన వాదన వినిపించడం.. నడి వయస్కురాలైన మహిళా జడ్జిగారు ఈయన మైకంలో పడిపోయి తన్మయత్వంతో చూడటం.. ఆ ఇంప్రెషన్ తోనే తీర్పు ఆయనకు అనుకూలంగా ఇవ్వడంతోనే ‘ఎఫ్.సి.యు.కె’ ఏదో తేడా సినిమా అనే సంకేతాలు కనిపిస్తాయి. ఇక అక్కడి నుంచి ఈ చిత్రం చిత్రాను చిత్రంగా సాగుతూ ప్రేక్షకులకు షాకుల మీద షాకులు ఇస్తూనే వెళ్తుంది. ఏ సన్నివేశం ఎందుకొస్తుందో.. దాని పరమార్థం ఏంటో అర్థం కాదు. ఏ పాత్ర ఎలా ప్రవర్తిస్తుందో.. ఏం రియాక్షన్ ఇస్తుందో అంతుబట్టదు. అర్థవంతమైన సన్నివేశం ఒక్కటైనా ఉందేమో చూద్దామని ముందుకు సాగుతుంటాం కానీ ఎక్కడా అలాంటి ఛాయలే కనిపించవు.

ప్రథమార్ధంలో యువ జంట ‘ప్రేమకథ’ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. డేటింగ్ పేరుతో ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలకు ఎలా స్పందించాలో కూడా అర్థం కాదు. ద్వితీయార్ధంలో చిన్న పాపను తీసుకొచ్చి ఎమోషన్లు పిండాలని చూశారు కానీ.. అది ఇంకా భారంగా తయారైంది. జగపతిబాబు లాంటి సీజన్డ్ ఆర్టిస్ట్ సైతం కొన్ని సన్నివేశాల్లో ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పిచ్చి హావభావాలు ఇవ్వడం.. విపరీతమైన ఓవరాక్షన్ చేయడం చూస్తే.. అసలు దర్శకుడు ఏం స్క్రిప్టు చెప్పి ఆయనతో పాటు మిగతా అందరినీ ఎలా మెప్పించాడో బాగా ఖర్చు పెట్టి ఈ సినిమా తీసేందుకు సీనియర్ ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ ను ఒప్పించాడో అని సందేహం కలుగుతుంది. ఇలాంటి స్క్రిప్టుతో 2 గంటల 50 నిమిషాల నిడివితో సినిమా తీయడం ఒక పెద్ద సాహసమే.అసలు ‘ఎఫ్.సి.యు.కె’లో కథేంటో చెప్పమని చూసిన ప్రేక్షకులను అడిగితే.. ఒక్కరైనా ఒక పద్ధతిలో చెప్పగలరా అన్నది సందేహమే. అంత గందరగోళంగా.. అర్థరహితంగా సాగుతుందీ చిత్రం. లాజిక్ లెస్.. మైండ్ లెస్ నరేషన్ తో ఆద్యంతం ప్రేక్షకులను అసహనానికి గురి చేస్తూ సాగే ‘ఎఫ్.సి.యు.కె’ను చివరి వరకు భరించడం ఒక పెద్ద టాస్క్. తొలి అరగంటలోనే సినిమాతో డిస్కనెక్ట్ అయిపోయే ప్రేక్షకులు.. ఆ తర్వాతంతా ‘అబ్బా ఛా’ అనుకుంటూ వెటకారాలాడుతూ సాగితే తప్ప చివరి వరకు థియేటర్లలో కూర్చోవడం కష్టం.

నటీనటులు: ఎఫ్.సి.యు.కె వైపు ప్రేక్షకులను ఆకర్షించేది జగపతిబాబు పాత్రే. మిడిలేజ్డ్ ప్లేబాయ్ అనేసరికి ఆయనేమైనా ఎగ్జైట్ అయిపోయారేమో తెలియదు కానీ.. తెర మీద మాత్రం ఆయన పాత్ర పేలవంగా తయారైంది. లుక్ పరంగా ఆయన కొత్తగా చేసిందేమీ లేదు. చాలా సినిమాల్లో చూసిన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లోనే కనిపించాడు. జగపతిబాబు నటన కొన్ని సన్నివేశాల్లో చికాగ్గా అనిపిస్తే అది ఆయన తప్పు కాదు. రామ్ కార్తీక్.. అమ్ము అభిరామి నటన పర్వాలేదనిపిస్తుంది కానీ.. వారి పాత్రలూ అర్థరహితంగానే అనిపిస్తాయి. దగ్గుబాటి రాజా.. భరత్ లాంటి నటులు.. వాళ్ల పాత్రలు.. నటన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

సాంకేతిక వర్గం: సినిమా సంగతెలా ఉన్నా భీమ్స్ సిసిరోలియో సంగీతం పర్వాలేదనిపిస్తుంది.. పాటల్లో రెండు ఆకట్టుకుంటాయి.. నేపథ్య సంగీతం కూడా ఓకే. కానీ అవేవీ సినిమాకు ఉపయోగపడలేదు. జి.శివ ఛాయాగ్రహణం బాగానే అనిపిస్తుంది. ‘అలా మొదలైంది’ ‘కళ్యాణ వైభోగమే’ లాంటి సినిమాలు తీసిన నిర్మాత దామోదర్ ప్రసాద్ అభిరుచిని ప్రశ్నార్థకం చేస్తుంది ‘ఎఫ్.సి.యు.కె’. సినిమా స్థాయి ఎలా ఉన్నా.. నిర్మాణ విలువల విషయంలో ఆయనేమీ రాజీ పడలేదు. రైటర్ కమ్ డైరెక్టర్ విద్యాసాగర్ రాజు గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఇలాంటి స్క్రిప్టుతో జగపతి బాబు.. దామోదర్ ప్రసాద్ లాంటి వాళ్లను మెప్పించి విజయవంతంగా సినిమా పూర్తి చేసినందుకు మాత్రం అతణ్ని పొగడాల్సిందే.

చివరగా: ఎఫ్.సి.యు.కె.. నాన్ సెన్స్

రేటింగ్-1/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS