'చావు కబురు చల్లగా'

Fri Mar 19 2021 GMT+0530 (IST)

'చావు కబురు చల్లగా'

చిత్రం : 'చావు కబురు చల్లగా'

నటీనటులు: కార్తికేయ - లావణ్య త్రిపాఠి - ఆమని - శ్రీకాంత్ అయ్యంగార్ - మురళీ శర్మ - భద్రమ్ - జబర్దస్త్ మహేష్ తదితరులు
సంగీతం: జేక్స్ బిజోయ్
ఛాయాగ్రహణం: కర్మ్ చావ్లా
నిర్మాత: బన్నీ వాసు
రచన-దర్శకత్వం: కార్తీక్ పెగల్లపాటి

‘ఆర్ ఎక్స్ 100’తో బ్లాక్ బస్టర్ అందుకుని.. అక్కడి నుంచి వరుసబెట్టి సినిమాలు చేస్తూ వస్తున్నాడు యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకుండ. కానీ అతడికి ఆశించిన ఫలితాలు దక్కట్లేదు. ఇప్పుడు అతను ‘చావు కబురు చల్లగా’ అంటూ ఓ వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రోజే విడుదలైన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

బస్తీ బాలరాజు (కార్తికేయ) శవాల బండి డ్రైవర్. రోజూ శవాల దగ్గరికెళ్లి.. వాటిని శ్మశానాలకు తీసుకెళ్లి మనిషి చావు పట్ల ఏమాత్రం చలనం లేకుండా తయారవుతాడు బాలరాజు. ఈ క్రమంలోనే అతను భర్త చనిపోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న మల్లిక (లావణ్య)ను చూసి ప్రేమలో పడతాడు. అందరూ ఇదేం పాడుపని అన్నా పట్టించుకోకుండా తన వెంట పడతాడు. కానీ మల్లిక అతణ్ని తీవ్రంగా ద్వేషిస్తుంది. మరి ఆమె మనసును బాలరాజు మార్చగలిగాడా.. అందరినీ ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకోగలిగాడా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

హీరో శవాల బండికి డ్రైవర్.. హీరోయిన్ భర్త చనిపోయి ఏడుస్తుండగా చూసి ప్రేమలో పడతాడు.. ఈ ఇద్దరి మధ్య ప్రేమాయణం నేపథ్యంలో సినిమా. వినగానే ఎవ్వరినైనా ఎగ్జైట్ చేసే పాయింట్ ఇది. ‘చావు కబురు చల్లగా’ ప్రోమోలు కూడా జనాల్ని బాగా ఆకర్షించడానికి ఈ పాయింటే కారణం. కానీ ప్రోమో కట్ చేసుకోవడానికి చాలా బాగా అనిపించే ఆ పాయింట్ మీద రెండు గంటలకు పైగా నిడివితో సినిమా తీయడం మాత్రం అంత తేలిక కాదు. ‘చావు కబురు చల్లగా’ చూస్తున్నపుడు కూడా ఇదే భావన కలుగుతుంది. ‘గీతా ఆర్ట్స్’ బేనర్లో సినిమా అంటే కేవలం పైన చెప్పుకున్న ప్లాట్ పాయింట్ విని ఎగ్జైట్ అయి సినిమా తీసేస్తారని అనుకోం. అంతకుమించి సినిమాలో ఏదో విశేషం ఉండే ఉంటుందనుకుంటాం. కానీ అలాంటి విశేషాలే కరవయ్యాయి ఈ సినిమాలో. మంచి ఆరంభంతో ఆసక్తి రేకెత్తించగలిగినా.. అక్కడక్కడా కొన్ని మెరుపులున్నా.. ‘చావు కబురు చల్లగా’లో ప్రేక్షకులు ఆశించే స్థాయిలో వినోదం.. భావోద్వేగాలు రెండూ లేకపోయాయి.

‘చావు కబురు చల్లగా’లో ప్లాట్ పాయింట్ కొంచెం కొత్తగా ఉండి ఆసక్తి రేకెత్తిస్తుంది. అలాగే పాత్రలు భిన్నంగా కనిపిస్తాయి. హీరోయిన్ భర్తకు అంత్యక్రియలు పూర్తి చేసి వస్తున్న కుటుంబం ముందుకెళ్లి.. ఆమెను హీరో ప్రేమిస్తున్నట్లు చెప్పడం కూడా చాలా కొత్తగా అనిపించి ప్రేక్షకులు ఒకింత ఆశ్చర్యానికి గురవుతారు. ఇలాంటి చమక్కులు.. ఆశ్చర్యాలు తర్వాత మరిన్ని ఆశిస్తాం కానీ.. మంచి  ఆరంభంతో మొదలై తర్వాత చల్లబడిపోతుందీ సినిమా. పాత్రలు - వాటి నేపథ్యం.. ఈ కథను ఆరంభించిన తీరు కొత్తగా ఉన్నప్పటికీ.. ఆ తర్వాత కథనం రొటీన్ రూట్లోకి వెళ్లిపోవడం నిరాశ పరుస్తుంది. హీరో హీరోయిన్ల పాత్రలతో ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్ట్ ఏర్పరచడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఎన్నో సినిమాల్లో చూసినట్లే అమ్మాయి వెనుక అబ్బాయి పడటం.. అల్లరి చేయడం.. ఆమె అతణ్ని అసహ్యించుకోవడం.. ఇలా మామూలుగా నడిచిపోతుంది ఈ కథ. హీరోయిన్ని మెప్పించడానికి హీరో ఏమీ చేయకపోగా.. ఆమెకు చికాకు పెట్టే పనులు చేస్తుంటాడు. చూస్తున్న ప్రేక్షకులకే చికాకు కలిగించేలా సాగుతుంది అతడి ప్రవర్తన. హీరోను మొరటోడిగా చూపించడం ఓకే కానీ.. ప్రతి సన్నివేశంలోనూ అతను ‘సెన్స్ లెస్’గా ప్రవర్తించడంలో ఔచిత్యమేంటో అర్థం కాదు. వినోదం కోసం ఇలా చేశారేమో కానీ.. ఆయా సన్నివేశాల్లో అనుకున్నంతగా కామెడీ కూడా పండలేదాయె.

ఒక పెద్దింటి అమ్మాయిని చదువూ సంధ్యా లేకుండా బస్తీలో ఉండే హీరో తన వీరత్వాన్ని చూపించి ప్రేమలో పడేసే టైపు మాస్ కథలు ఒకప్పుడు నడిచాయేమో కానీ.. ఇప్పుడు ప్రేక్షకులు ఏదైనా సరే వాస్తవికంగా ఉండాలని ఆశిస్తారు. ‘చావు కబురు చల్లగా’ నడత కూడా కమర్షియల్ సినిమాల టైపులో ఉండదు. పాత్రలను.. సన్నివేశాలను వాస్తవికంగానే చూపించే ప్రయత్నం చేశారు. ఐతే ఒక చదువుకున్న మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి.. బస్తీలో చదువూ సంధ్యా లేకుండా శవాల బండికి డ్రైవర్ గా పని చేసే అబ్బాయిని ప్రేమించడం అన్నది అంత తేలిగ్గా జరిగే విషయం కాదు. హీరో వ్యక్తిత్వం ఉన్నతంగా చూపించినా ఆ పాత్ర మీద ఒక ఆపేక్ష కలుగుతుంది. కానీ ఇక్కడ కథానాయకుడు విచక్షణ లేకుండా.. మొరటుగా ప్రవర్తిస్తుంటాడు. హీరోయిన్ అంటే ప్రాణం అంటాడే తప్ప ఆమెను చేసుకోవడానికి అతడికున్న అర్హత ఏంటన్నది ప్రశ్నార్థకం. అతను ప్రయోజకుడిలానూ కనిపించడు. తన ఔన్నత్యాన్ని చూపించే సన్నివేశాలేమీ ఇందులో కనిపించవు. అలాంటపుడు హీరోను హీరోయిన్ ప్రేమిస్తే బాగుండన్న భావన ముందు ప్రేక్షకుడికి కలగదు. ఇలాంటి వ్యక్తిని హీరోయిన్ ప్రేమించాలంటే బలమైన కారణాలు కనిపించాలి. కదిలించే సన్నివేశాలు పడాలి. కానీ అలాంటివేమీ లేకుండా హీరోయిన్ మాత్రం చాలా సింపుల్ గా అతడి వైపు టర్న్ అయిపోవడం కన్విన్సింగ్ గా అనిపించదు. ప్రేమకథ ఇలా సాధారణంగా సాగడం సినిమాకు ప్రతికూలంగా మారింది.

కథను కొత్త ఆరంభించిన తీరు వల్ల.. కొన్ని కామెడీ సీన్ల వల్ల.. తక్కువ నిడివిలో ముగిసిపోవడం వల్ల ‘చావు కబురు చల్లగా’ ప్రథమార్ధం వరకు ఓ మోస్తరుగా అనిపిస్తుంది. కానీ ద్వితీయార్ధాన్ని నడిపించడానికి అవసరమైన బలమైన సన్నివేశాలు కానీ.. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే మలుపులు కానీ లేకపోయాయి. హీరో పాత్రతో ప్రేక్షకులు ఎక్కడా పెద్దగా కనెక్ట్ అయ్యే అవకాశమే ఇవ్వలేదు దర్శకుడు. దాంతో పోలిస్తే హీరో తల్లిగా ఆమని పాత్ర ఓకే అనిపిస్తుంది. ఆ పాత్రతో ముడిపడ్డ సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. కానీ ఆ పాత్రకు ఇచ్చిన ముగింపు మాత్రం ఏమంత ఆకట్టుకోదు. పతాక సన్నివేశంలో చావుకు సంబంధించిన ఫిలాసఫీ మాత్రం బాగుంది. అందులో బలమైన మాటలు కూడా పడ్డాయి. ఆ సన్నివేశం వరకు కన్విన్సింగ్ గానే అనిపించినా.. అంతకుముందు వరకు జరిగే వ్యవహారం ప్రేక్షకులను నిరాశకు గురి చేస్తుంది. కామెడీ పండించడానికి.. అలాగే ఎమోషన్లకు స్కోప్ ఉండేలా మంచి సెటప్ కుదిరినప్పటికీ.. దాన్ని దర్శకుడు ఉపయోగించుకోలేకపోయాడు. కథను కొత్తగా మొదలైనప్పటికీ.. తర్వాత రొటీన్ దారిలోకి వెళ్లిపోవడం ‘చావు కబురు చల్లగా’కు ప్రతికూలంగా మారింది.

నటీనటులు:

కార్తికేయ గత సినిమాలతో పోలిస్తే కొంచెం కొత్తగా చేయడానికి ప్రయత్నించాడు. బస్తీ బాలరాజు పాత్రకు అతను పర్ఫెక్ట్ అనిపించాడు. అతడి లుక్ తో పాటు నటన కూడా ఆ పాత్రకు సూటయ్యాయి. కానీ బాలరాజు క్యారెక్టరే అంతగా ఆకట్టుకోదు. హీరో పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోవడం మైనస్ అయింది. తన వంతుగా ఆ పాత్రను పండించడానికి కార్తికేయ మాత్రం కష్టపడ్డాడు. పతాక సన్నివేశంలో అతడి నటన ఆకట్టుకుంటుంది. లావణ్య త్రిపాఠి డీగ్లామరస్ రోల్ లో చూడ్డానికి కొత్తగా కనిపించింది కానీ.. కథలో కీలకం అయినప్పటికీ.. ఆ పాత్రకు కథనంలో పెద్దగా స్కోప్ లేకపోయింది. ఆమె పెర్ఫామ్ చేయడానికి కూడా ఎక్కడా అవకాశం రాలేదు. లావణ్య గ్లామర్ తోనూ ఆకట్టుకోవడానికి ఇందులో ఛాన్స్ లేకపోయింది. మురళీ శర్మ తన పాత్రను చక్కగా చేశాడు. ఆమని కూడా బాగానే చేసింది. శ్రీకాంత్ అయ్యంగార్ పర్వాలేదు. భద్రమ్ ప్రథమార్ధంలో కాసేపు నవ్వులు పంచాడు. ఈ పాత్రను మరింతగా ఉపయోగించుకుంటే బాగుండేది.

సాంకేతికవర్గం:

‘ట్యాక్సీవాలా’తో ఆకట్టుకున్న జేక్స్ బిజోజ్.. ‘చావు కబురు చల్లగా’లోనూ మంచి ఔట్ పుటే ఇచ్చాడు. ఐతే అతడి పాటలు మరీ క్లాస్ గా అనిపించి మాస్ స్టయిల్లో సాగే ఈ సినిమాలో సింక్ కాలేదనిపిస్తుంది. పాటలు సినిమాలో వింటున్నపుడు ఓకే అనిపించినా.. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా.. హమ్ చేసేలా లేకపోయాయి. నేపథ్య సంగీతం బాగానే సాగింది. కర్మ్ చావ్లా ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలకేమీ ఢోకా లేదు. సినిమా స్థాయికి తగ్గట్లే ఉన్నాయి. కొత్త దర్శకుడు కార్తీక్ పెగల్లపాటి విషయానికి వస్తే.. అతను మంచి పాయింట్ ఎంచుకున్నప్పటికీ.. దాని చుట్టూ ఆసక్తికర కథనం అల్లలేకపోయాడు. కొన్ని సన్నివేశాల వరకు ప్రతిభ చాటుకున్నప్పటికీ ఓవరాల్ గా నిరాశ పరిచాడు. కథన పరంగా అతను టైంపాస్ చేయించడానికి చూశాడే తప్ప.. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని రేకెత్తించలేకపోయాడు. చావు-పుట్టుకల నేపథ్యంలో వేదాంత ధోరణిలో సాగే అతడి మాటలు మాత్రం ఆకట్టుకుంటాయి.

చివరగా: చావు కబురు చల్లగా.. గాడి తప్పింది మెల్లగా..!

రేటింగ్-2.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS