బ్రోచేవారెవరురా

Fri Jun 28 2019 GMT+0530 (IST)

బ్రోచేవారెవరురా

చిత్రం: 'బ్రోచేవారెవరురా'

నటీనటులు :  శ్రీవిష్ణు - సత్యదేవ్ - ప్రియదర్శి - రాహుల్ రామకృష్ణ - నివేదా థామస్ - నివేత పేతురాజ్ - ఝాన్సీ - శివాజీరాజా - బిత్తిరి సత్తి - అజయ్ ఘోష్ - హర్షవర్ధన్ - షఫీ  తదితరులు
సంగీతం : వివేక్ సాగర్
ఛాయాగ్రహణం : సాయి శ్రీరామ్
ఎడిటింగ్ : రవితేజ గిరజాల
నిర్మాత : విజయ్ కుమార్ మన్యం
సమర్పణ : సురేష్ ప్రొడక్షన్స్
రచన - దర్శకత్వం : వివేక్ ఆత్రేయ

ఎంటర్ టైన్ మెంట్ అందించడమే లక్ష్యంగా పెట్టుకుని యూత్ ని టార్గెట్ చేస్తూ కొత్త దర్శకులు చేస్తున్న ప్రయత్నాలు ఈ మధ్య మంచి ఫలితాలనే అందిస్తున్నాయి. రెగ్యులర్ కమర్షియల్ అంశాలకు దూరంగా వినోదమే ప్రధానంగా రూపొందుతున్న ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు సైతం బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. మెంటల్ మదిలో లాంటి సెన్సిటివ్ లవ్ స్టోరీతో మెప్పించిన దర్శకుడు వివేక్ ఆత్రేయ రెండో సినిమాగా వచ్చిన బ్రోచేవారెవరురా టీజర్ నుంచే ఏదో విభిన్నమైన కాన్సెప్ట్ అనే ఇంప్రెషన్ అయితే ఇచ్చింది. దానికి తోడు డిఫరెంట్ గా కథలు ఎంచుకుంటాడని పేరున్న శ్రీవిష్ణుతో  నివేదా థామస్ తోడవ్వడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. మరి వాటికి తగ్గట్టు బ్రోచెవెవరుగా సాగిందా లేదా రివ్యూలో చూద్దాం

కథ:

విశాల్(సత్యదేవ్) సినిమా పరిశ్రమలో దర్శకుడు కావాలన్న లక్ష్యంతో ఉంటాడు.ఓ సందర్భంలో స్టార్ హీరోయిన్ షాలిని(నివేత పేతురేజ్)కు కథ చెప్పే అవకాశం దొరుకుతుంది. కట్ చేస్తే మరో స్టోరీ ఓపెన్ అవుతుంది. కాలేజీలో చదివే ప్రిన్సిపాల్ కూతురు మిత్ర(నివేదా థామస్)మంచి నాట్యగత్తె. వ్యక్తిగతంగా నాన్నతో అటాచ్ మెంట్ ఉండదు. అందులోనే చదివే ఆర్3 బ్యాచ్ లో రాహుల్(శ్రీవిష్ణు)గ్యాంగ్ లీడర్ కాగా మిగిలిన ఇద్దరు రాకీ(ప్రియదర్శి)రాంబో(రాహుల్ రామకృష్ణ)స్నేహితులుగా ఉంటారు. మిత్రతో పరిచయం స్నేహంగా మొదలై అటుపై ప్రేమగా మార్చుకునే క్రమంలో ఉంటాడు రాహుల్. ఆ సమయంలోనే కొన్ని కారణాల వల్ల ఈ ముగ్గురు స్నేహితులు మిత్రతో సహా ఓ కిడ్నాప్ డ్రామాలో భాగం కావాల్సి వస్తుంది. అటు రాహుల్ కూడా అనుకోకుండా  పద్మవ్యూహంలోకి వస్తాడు.  అసలు ఇతనికి ఆ ముగ్గురికి సంబంధం ఏంటి అతను చెప్పిన కథకు దీనికి లింక్ ఏలా కుదిరింది  లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీదే చూడాలి

కథనం - విశ్లేషణ:

ఇలాంటి లైటర్ వీన్ స్టోరీస్ లో ప్రేక్షకులను చివరిదాకా ఆసక్తిగా చూసేలా చేసేది ఫన్. కానీ ఆ ఒక్క ఎలిమెంట్ మీదే రెండున్నర గంటలు ఎంగేజ్ చేయడం కష్టం కాబట్టి కథను విస్తరించే క్రమంలో దానికి క్రైమ్ లేదా థ్రిల్ లాంటి సబ్ ప్లాట్స్ కావాలి. దర్శకుడు వివేక్ ఆత్రేయ అది దృష్టిలో పెట్టుకునే ఆ రెండు మిక్స్ చేస్తూ  కథను రాసుకున్నాడు. ముగ్గురు యువకులు ఓ అమ్మాయి ఇలాంటి థ్రెడ్ మీద గతంలో చాలా సినిమాలు వచ్చాయి. దీన్నో సింపుల్ లవ్ స్టోరీగా ప్రెజెంట్ చేస్తే కొత్తదనం అనిపించదు కాబట్టి వివేక్ తెలివిగా రాహుల్ ఎపిసోడ్ ని మెయిన్ థీమ్ గా తీసుకుని మెల్లగా దానికి విశాల్ ట్రాక్ తో లింక్ చేయడం బాగా కుదిరింది . ఇలాంటి కథలతో గతంలోనూ సినిమాలు వచ్చాయి. ఒక పాయింట్ కు వచ్చేసరికి ముందు ఏం జరగబోతోందో ప్రేక్షకుడు ఈజీగా గెస్ చేసే తరహాలో కొన్ని ఆడాయి కొన్ని పేలాయి. కాని వివేక్ ఆత్రేయ దానికి ఎక్కువ అవకాశం ఇవ్వకుండా స్క్రీన్ ప్లే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు

బ్రోచెవారెవరురా ముఖ్యంగా ఆకట్టుకునేది దర్శకుడి ఇంటలిజెన్స్. చూసేవాళ్ళను ఎప్పటికప్పుడు పక్కదారి పట్టిస్తునే తర్వాత వచ్చే ఎపిసోడ్స్ ద్వారా తాను చేసింది కరెక్టే అని ఒప్పించడం అంత సులభం కాదు. వివేక్ ఆత్రేయ ఈ విషయంలో దాదాపు సక్సెస్ అయ్యాడు. ఇందులో చాలా సబ్ ప్లాట్స్ ఉన్నాయి. వాటిని వివరిస్తే స్పాయిలర్స్ గా మారి రేపు మీరు సినిమా చూసే అనుభూతిని ప్రభావితం చేస్తాయి కాబట్టి ఎక్కువగా రివీల్ చేయడం లేదు కాని ఎక్కడా డీవియేట్ కాకుండా లింక్ చేసిన తీరు విసుగు రాకుండా చేసింది. ఫస్ట్ హాఫ్ లో మొదటి భాగం కాస్త స్లోగా సాగినా కాలేజీ సీన్స్ లో మంచి కామెడీ రాసుకోవడంతో మరీ బోర్ కొట్టదు. కిడ్నాప్ డ్రామా కూడా రొటీన్ గానే మొదలవుతుంది. కాని ప్రీ ఇంటర్వెల్ తో మొదలుకుని క్లైమాక్స్ దాకా ఎక్కడా బిగి సడలకుండా ఒకే టెంపో మైంటైన్ చేయడం మెచ్చుకోదగినదే

కాని సినిమాటిక్ లిబర్టీ తీసుకునే క్రమంలో వివేక్ ఆత్రేయ కొన్ని బేసిక్ లాజిక్స్ ని కన్వినీయంట్ గా వదిలేయడం అక్కడక్కడా సందేహాలు రేపుతుంది. ఒక సెల్ ఫోన్ నెంబర్ యాక్టివ్ గా ఉండి దాని లొకేషన్ ని ఈజీగా ట్రాక్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఆ దిశగా పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించిన హర్షవర్ధన్ ఆలోచించకపోవడం లాంటి కొన్ని ప్రశ్నలు మధ్యమధ్యలో తలెత్తుతాయి. కాని ఇలాంటివి స్పురించడం ఆలస్యం ఒక కొత్త ట్విస్ట్ తో దాన్ని మర్చిపోయేలా చేశాడు దర్శకుడు. అయితే పాత్రలు ఎక్కువ అయిపోవడం ఒకదానికి మరొకటి లాజికల్ గా సంబంధం ఉన్నా ఇన్ని అవసరమా అని ఒకదశలో అనిపించేలా చేయడం కొంత వరకు మైనస్ గా ఉన్నప్పటికీ వాటిని చాలా వారు స్క్రీన్ ప్లేతో మేనేజ్ చేశాడు వివేక్ ఆత్రేయ. రాహుల్ శాలినిల మధ్య లవ్ అంత ఈజీగా డెవలప్ కావడం కన్విన్సింగ్ గా లేకపోయినా మెయిన్ ట్రాక్ అది కాదు కాబట్టి అంతగా పట్టించుకొనవసరం లేదు

మలుపులు చాలా ఉన్నప్పటికీ వాటిని అన్ ఫోల్డ్ చేస్తూ చిక్కులు విప్పదీస్తూ పోవడం ఆకట్టుకుంటుంది. అయితే పాత్రల సహజత్వం కోసం హీరొయిన్ తండ్రి కాలేజీ ప్రిన్సిపాల్ ని అదే పనిగా హీరోతో కాస్త దూకుడుగా తిట్టించడం - లేడీ టీచర్ ని క్లాస్ రూమ్ లోనే ఓ బూతుతో బెంచ్ దగ్గర తిట్టేసుకోవడం కొంత ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. యూత్ టీచర్లు పేరెంట్స్ పట్ల ఇంత అగౌరవంగా ఉండటం మరీ తప్పేమీ కాదేమో అన్న అభిప్రాయం ఒకదశలో కలుగుతుంది కూడా. సరే ఇదే ట్రెండ్ అని సరిపెట్టుకోవల్సిందే. ఇక హీరో బృందం చేసిన తప్పుల వల్ల కొందరికి తీవ్ర నష్టం కలగడాన్ని దర్శకుడు హ్యాండిల్ చేసిన తీరు బాగుంది కాని వాళ్ళ ద్వారానే వాటికి పరిష్కారం చూపించి కనువిప్పు కలిగేలా చేసుంటే ఇంకా బాగుండేది కాని లెంత్ దృష్ట్యా దాన్ని లైట్ గా తీసుకున్నట్టు కనిపిస్తుంది. హైదరాబాద్ లో ఉండే హీరో బ్యాచ్ ఫ్రెండ్ కూడా కాసేపు గుర్తుండేలా చూపించిన ఇంపాక్ట్ వివేక్ లోని క్యాస్టింగ్ సెన్స్ ని బయట పెడుతుంది. ఇలాంటివన్ని దీనికి ప్లస్ పాయింట్ గా నిలిచాయి.

నటీనటులు:

ఇందులో పేరుకి శ్రీవిష్ణు హీరో అయినప్పటికీ అతనితో సమానంగా మిగిలినవారికీ స్కోప్ దక్కడం హర్షించదగ్గ విషయం. పెడసరిగా మాట్లాడే తన టైమింగ్ తో ఇందులోనూ మైంటైన్ చేసిన శ్రీవిష్ణు తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నాడు. తను ఉన్న సీన్లన్ని చక్కగా నిలబెట్టుకుంటూ వచ్చాడు. ఇక ప్రియదర్శి రాహుల్ రామక్రిష్ణ పాత్రలలో కొత్తదనం లేకపోయినా స్నేహితుడికి అండగా నిలిచే క్రమంలో చక్కని పెర్ఫార్మన్స్ ఇచ్చారు.

నివేతా థామస్ ముందు నుంచి చెబుతూ వచ్చినట్టుగానే కథ మొత్తం తననే బేస్ చేసుకుని సాగుతుంది. డాన్స్ మీద ఇష్టాన్ని చంపుకుని నాన్న మాట కాదనలేక బలవంతంగా చదువుతూ నలిగిపోయే పాత్రలో మంచి ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. కామెడీ లేకుండా సీరియస్ గా సాగిపోయే ఎమోషన్స్ ని అవసరమైన చోట బాగా పలికించింది - 118 కన్నా ఇందులో మెరుగైన రోల్ గా చెప్పుకోవచ్చు. గ్లామర్ షోలు పాటలు లాంటివి ఏవి లేకుండా కేవలం నటన ద్వారా మాత్రమే గుర్తింపు వచ్చే ఇలాంటి పాత్రలు తనకే రావడం ఒక రకంగా లక్ అని చెప్పుకోవచ్చు.

సత్యదేవ్ ది లిమిటెడ్ రోల్ అయినప్పటికీ సెటిల్డ్ గా చేశాడు. బ్లఫ్ మాస్టర్ తరహాలో వేరియేషన్స్ ఇచ్చే ఛాన్స్ కథ ఇవ్వలేదు. నివేత పెతురాజ్ చాలా పరిమితమైన రోల్. ఓ నాలుగు డైలాగులు రెండు నవ్వులతో మేనేజ్ చేసింది. హీరో తండ్రిగా చేసిన నటుడికి సైతం మంచి స్పేస్ దొరికింది. హర్షవర్ధన్ - అజయ్ ఘోష్ - శివాజీ రాజా - ఝాన్సీ ఇచ్చిన తక్కువ స్పేస్ లోనే ఆడేసుకున్నారు. బిత్తిరి సత్తిని సరిగా ఉపయోగించుకోలేదు కాని కీలకమైన మలుపుకు కారణమయ్యే పాత్ర అదే.

సాంకేతిక వర్గం:

మొదటి సినిమా మెంటల్ మదిలోతో సెన్సిటివ్ లవ్ స్టొరీ ఎంచుకున్న వివేక్ ఆత్రేయ ఈసారి దానికి విరుద్ధంగా క్రైమ్ ప్లస్ కామెడీ థ్రిల్లర్ ని ఎంచుకోవడం మంచి ఫలితాన్ని ఇచ్చింది. తనలో కథకుడికి మరింత పదును పెడుతూ ప్రేక్షకుల మెదళ్లకు చిక్కుముడులు అందిస్తూ సాగించిన డ్రామా ఆకట్టుకునేలా సాగింది. అయితే కమర్షియల్ అంశాలకు చోటివ్వకుండా రాసుకున్న ఆత్రేయ కామెడీ మీద ఇంకాస్త ఫోకస్ పెట్టి ఉంటే ఇదో హిలేరియస్ ఎంటర్ టైనర్ గా మిగిలిపోయేది. ఇన్నేసి పాత్రల ట్విస్టులను ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ప్రెజెంట్ చేసిన తీరుని చూస్తే ఇంకాస్త గ్రిప్పింగ్ నేరేషన్ కనక రాసుకుంటే న్యూ ఏజ్ సినిమాలో ఇలాంటి దర్శకులు కొత్త ట్రెండ్లు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దానికి ఊతమిస్తే ఇప్పుడీ బ్రోచేవారెవరురా దాన్ని మరింత బలపరిచింది

ఇక సంగీత దర్శకుడు వివేక్ సాగర్ విషయానికి వస్తే పాటలతో మరీ గొప్పగా ఆకట్టుకోలేదు కాని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మాత్రం నిలబెట్టే ప్రయత్నం చక్కగా చేశాడు. పాటల ప్లేస్ మెంట్ కి ఎక్కువ అవకాశం లేకపోవడంతో  బిజిఎం మీద ఎక్కువ ఫోకస్ పెట్టి దాని మీదే తన పనితనాన్ని చూపించాడు. అయితే టైటిల్ ట్రాక్ అయినా క్యాచీకి ట్యూన్ చేసి ఉంటే ఇంకాస్త త్వరగా ఇలాంటి సినిమాల థీమ్స్ జనానికి చేరే ఛాన్స్ ఉంటుంది. సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం బడ్జెట్ పరిమితులను దాటుకుని రిచ్ లుక్ రావడానికి మంచి ఎఫర్ట్ పెట్టడం గమనించవచ్చు. టెక్నికల్ గా తన కెమెరా వర్క్ మీద కామెంట్స్ రాకుండా మంచి క్వాలిటీ చూపించాడు. ఇలాంటి జానర్ మూవీస్ లో నిడివి చాలా కీలకం. ఓవరాల్ గా కొంత ట్రిమ్మింగ్ అవసరం అనిపించినప్పటికీ రవితేజ గిరజాల ఎడిటింగ్ పాస్ అయిపోయింది. మాన్యం బ్యానర్ వాల్యూస్ భారీగా లేకపోయినా సబ్జెక్టుకు తగ్గట్టు బాగున్నాయి

ఫైనల్ గా చెప్పాలంటే బ్రోచెవారెవరురా కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా నిరాశపరచకుండా మెప్పిస్తుంది. రొటీన్ అంశాలకు భిన్నంగా నవతరం దర్శకులు చేస్తున్న ఇలాంటి ప్రయత్నాలు ప్రేక్షకులను మెప్పించడమే కాదు అప్ కమింగ్ మేకర్స్ కు సైతం స్ఫూర్తిగా నిలుస్తాయి. లోపాలు ఉన్నప్పటికీ వాటిని మరిపించే ట్రీట్ మెంట్ ఉంది కాబట్టి రాంగ్ ఛాయస్ గా నిలిచే ప్రమాదాన్ని తప్పించుకుని సేఫ్ అయ్యింది. తెలివికి మరీ ఎక్కువ పని చెప్పకుండా ప్రేక్షకులును ఎంగేజ్ చేస్తూ వెళ్ళే బ్రోచేవారెవరురా వివేక్ ఆత్రేయ ద్వితీయ విఘ్నం తప్పించినట్టే

చివరగా: బ్రోచెవారెవరురా - అలరించే కామెడీ క్రైమ్ థ్రిల్లర్!

రేటింగ్ : 3/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre