బ్రహ్మాస్త్ర

Fri Sep 09 2022 GMT+0530 (India Standard Time)

బ్రహ్మాస్త్ర

బ్రహ్మాస్త్ర మూవీ రివ్యూ

నటీనటులు: రణబీర్ కపూర్-ఆలియా భట్-అమితాబ్ బచ్చన్-నాగార్జున-మౌని రాయ్-షారుఖ్ ఖాన్ (అతిథి పాత్ర) తదితరులు
సంగీతం: ప్రీతమ్
నేపథ్య సంగీతం: సైమన్ ఫ్రాగ్లిన్
ఛాయాగ్రహణం: మణికందన్-పంకజ్ కుమార్-సుదీప్ ఛటర్జీ-వికాస్ నౌలాఖా-పాట్రిక్ డ్యూరోక్స్
నిర్మాతలు: కరణ్ జోహార్-అపూర్వ మెహతా-నమిత్ మల్హోత్రా-రణబీర్ కపూర్-అయాన్ ముఖర్జీ-మరీజ్కే డిసౌజా
రచన-దర్శకత్వం: అయాన్ ముఖర్జీ

బాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన భారీ చిత్రం.. బ్రహ్మాస్త్ర. రణబీర్ కపూర్-ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ రూపొందించిన ఈ చిత్రం బహు భాషల్లో ఈ రోజే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

శివ (రణబీర్ కపూర్) ఒక అనాథ. ఒక అనాథాశ్రమంలో పెరిగి పెద్దయిన అతను.. ఈషా (ఆలియా భట్)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమె కూడా అతణ్ని ఇష్టపడుతుంది. వీరి ప్రేమ పాకాన పడుతున్న సమయంలో శివకు కొన్ని ప్రత్యేక శక్తులున్నట్లు తెలుస్తుంది. అగ్నితో తనకేదో ప్రత్యేక సంబంధం ఉందని తెలుస్తుంది. అంతే కాక అతను తరచుగా ఒక ట్రాన్స్ లోకి వెళ్లి వస్తుంటాడు. అందులో కొందరు కిల్లర్స్ తన లాగే ప్రత్యేక శక్తులున్న ఒక్కొక్కరిని చంపుకుంటూ వస్తున్నట్లు తెలుస్తుంది. సృష్టికి మూలం అయిన బ్రహ్మాస్త్రాన్ని దక్కించుకోవడానికే వారి ప్రయత్నం అని శివకు అర్థమవుతుంది. ఈ బ్రహ్మాస్త్రం వెనుక కథేంటి.. అది ఎక్కడ ఎవరి దగ్గరుంది.. దాన్ని దుష్ట శక్తుల చేతికి చిక్కకుండా శివ ఎలా కాపాడాడు అన్నది మిగతా కథ.

కథనం విశ్లేషణ:

బాహుబలి ఇరగాడేసిందంటే కేవలం అందులోని భారీతనం వల్ల.. విజువల్ ఎఫెక్ట్స్ మాయాజాలం వల్ల అనుకుంటే అంతకంటే పొరబాటు ఇంకొకటి ఉండదు. అందులో బలమైన కథ ఉంటుంది. ప్రధాన పాత్రల్లో దమ్ము కనిపిస్తుంది. ఇక కథన బలం గురించి చెప్పాల్సిన పనే లేదు. వీటన్నింటికీ విజువల్ ఎఫెక్ట్స్.. భారీతనం అదనపు ఆకర్షణలుగా మారి సినిమా ఇంకో స్థాయికి వెళ్లింది. కానీ బాహుబలి తర్వాత చాలా సినిమాలు ఇలా భారీతనాన్ని.. విజువల్ ఎఫెక్ట్స్ ను నమ్ముకుని నేల విడిచి సాము చేశాయి.. బోల్తా కొట్టాయి. ఈ జాబితాలోకి చేరిన కొత్త చిత్రం.. బ్రహ్మాస్త్రం. అసలు ఏం కథ చెబుతున్నారో క్లారిటీ లేదు. ఏ పాత్ర ఉద్దేశమేంటో అర్థం కాదు. సన్నివేశాల్లో లాజిక్ కనిపించదు. చివరగా చూస్తే అసలీ సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది. కేవలం గ్రాఫిక్స్ మాయాజాలం తప్పితే.. అసలు సినిమాలో ఏముందంటే సమాధానం చెప్పడం కష్టం. ఆ గ్రాఫిక్స్ కూడా సినిమా అంతటా రిపీట్.. రిపీట్ అంటూ ఒకే రకంగా అనిపిస్తూ.. ఒక దశ దాటాక తలపోటు తెప్పిస్తాయి. కథాకథనాల్లో విషయం లేకుండా కేవలం గ్రాఫిక్స్ మాయాజాలంతో నేల విడిచి సాము చేసిన సినిమా.. బ్రహ్మాస్త్రం.

ఈ వేసవిలో వందల కోట్లు ఖర్చు పెట్టిన తీసిన రాధేశ్యామ్ పరిస్థితి ఏమైందో అందరూ చూశారు. యూరప్ లో అద్భుతమైన లొకేషన్లలో.. భారీ భారీ సెట్టింగ్స్ వేసి తీసిన సినిమా అది. ఒక చిన్న షాట్ కోసం కోట్లు ఖర్చు పెట్టారందులో. కానీ ఏం లాభం? సన్నివేశాల్లో విషయం లేక ఆ భారీతనం ఎందుకూ కొరగాకుండా పోయింది. ప్రేమ సన్నివేశాల్లో ఫీల్ కొరవడి ప్రేక్షకులకు శిరోభారంగా తయారయ్యాయి. కానీ గత నెలలో వచ్చిన సీతారామంలో ప్రేమ సన్నివేశాలు ఎంత గొప్పగా పండాయో.. ప్రేక్షకులను ఎలా కదిలించాయో తెలిసిందే. కానీ అదేమీ వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా కాదు. అంటే.. కేవలం భారీగా ఖర్చు పెట్టేస్తే ఫలితం ఉండదు.. కథాకథనాల్లో విషయం ఉంటేనే సినిమాలు ప్రేక్షకులకు ఎక్కుతాయనడానికి ఇదే ఉదాహరణ. బ్రహ్మాస్త్రం సినిమాలో కథాకథనాల గురించి పాజిటివ్ గా చెప్పుకోవడానికి ఏమీ లేదు. రెండు గంటల 45 నిమిషాల సుదీర్ఘ నిడివి ఉన్న సినిమాలో ఎక్కడా కుదురుగా కథను చెప్పే ప్రయత్నమే జరగలేదు. ప్రేక్షకులు ఏ దశలోనూ కనెక్ట్ కాని విధంగా గందరగోళంగా కథను నరేట్ చేశాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. తెరపై చూపించిందంతా కృత్రిమంగా.. కృతకంగా తయారై ఏ దశలోనూ ఎమోషనల్ కనెక్ట్ అనేది ఏర్పడదు.

సృష్టికి మూలమైన బ్రహ్మాస్త్రం.. దాన్ని చేజిక్కించుకోవడానికి దుష్టశక్తులు చేసే ప్రయత్నం.. వారిని అడ్డుకోవడానికి ఒక బృందం చేసే పోరాటం నేపథ్యంలో నడిచే కథతో మన పురాణ గాథలను గుర్తు చేసేలా సాగుతుంది బ్రహ్మాస్త్ర. ఇలాంటి కథలు కొన్ని శతాబ్దాల నేపథ్యంలో నడిస్తే బాగుంటుంది. కానీ ఈ కథంతా ప్రస్తుత కాలంలోనే నడుస్తుంది. ఈ రోజుల్లో అతీంద్రయ శక్తులు.. దుష్ట శక్తులు అంటూ మాయలు మంత్రాల నేపథ్యంలో సినిమా నడుస్తుంటే.. అంతా కృత్రిమంగా అనిపిస్తుంది. దీనికి తోడు గ్రాఫిక్స్ కూడా సహజంగా అనిపించకుండా.. ఆర్టిఫిషియల్ ఫీలింగడ్ కలిగించడం వల్ల వాటితో పెద్దగా కనెక్ట్ కాలేం. కేవలం విజువల్ ఎఫెక్ట్స్ లో ఉన్న భారీతనం వల్ల.. యాక్షన్ ఘట్టాలను బాగా తీర్చిదిద్దడం వల్ల మాస్ ప్రేక్షకులు కొంత వరకు సినిమాతో కనెక్ట్ కావచ్చేమో కానీ.. మిగతా వాళ్లందరికీ బ్రహ్మాస్త్ర శిరోభారంగానే తయారవుతుంది. హీరో సహా ఏ పాత్రను కూడా ఆకట్టుకునేలా తీర్చిదిద్దకపోవడం పెద్ద మైనస్. ఇక ప్రేమకథ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రేమ ప్రేమ అంటూ ఊదరగొట్టేస్తుంటారే తప్ప అందులో ఏమాత్రం ఫీల్ లేదు. ఎమోషన్ లేదు. ఇక బ్రహ్మాస్త్రం చుట్టూ నడిచే స్టోరీ అంతా కూడా అనాసక్తికరంగా అనిపిస్తుంది. ప్రథమార్ధం వరకైనా కథ పూర్తిగా తెలుసుకోవాలన్న కుతూహం వల్ల.. కొన్ని యాక్షన్ ఘట్టాల వల్ల బ్రహ్మస్త్ర పర్వాలేదనిపిస్తుంది కానీ.. ద్వితీయార్ధం మాత్రం పూర్తిగా తేలిపోయింది. కుంగ్ ఫు పాండా సినిమాను గుర్తు చేసేలా హీరోను లక్ష్యం దిశగా గురువు నడిపించే సన్నివేశాలు పరమ బోరింగ్ అనిపిస్తాయి. క్లైమాక్స్ చూశాక ఈమాత్రం దానికా ఇంత హడావుడి చేశారు అనుకునేలా సినిమాను ముగించారు. సినిమా ఒక పార్ట్ చూడడమే ప్రేక్షకుల సహనానికి పరీక్షలా అనిపిస్తే.. ఇక సెకండ్ పార్ట్ గురించి హింట్ ఇచ్చి పంపించడం పెద్ద ట్విస్ట్.

నటీనటులు:

రణబీర్ కపూర్ శివ పాత్రలో ఓకే అనిపించాడు. అతడి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. లేని ప్రపంచాన్ని ఊహించుకుంటూ నటించడంలో అతను ప్రతిభ చాటుకున్నాడు. ఐతే పాత్రకు తగ్గట్లుగా కొంచెం ట్రెడిషనల్ లుక్ కోసం అతను ప్రయత్నించాల్సింది. ఆలియా భట్ తన అందం.. అభినయంతో ఆకట్టుకుంది. సినిమాలోని ఆకర్షణల్లో ఆమె ఒకటి. తన పాత్ర మాత్రం చాలా గందరగోళంగా ఉంది. గురువు పాత్రలో అమితాబ్ బచ్చన్ బాగానే చేశాడు. నాగార్జున పాత్ర ఏమంత ఆకట్టుకోదు. ఆయన లుక్.. నటన కూడా సాధారణంగా అనిపిస్తాయి. నాగ్ అభిమానులు నిరాశకు గురి కావడం ఖాయం. నెగెటివ్ రోల్ లో మౌని రాయ్ మెరిసింది.

సాంకేతిక వర్గం:

ప్రీతమ్ పాటలు బాగున్నాయి. కుంకుమ సాంగ్ ప్రత్యేకంగా అనిపిస్తుంది. మిగతా పాటలు కూడా ఓకే. సైమన్ ఫ్రాగ్లిన్ నేపథ్య సంగీతం మాత్రం చెవుల తుప్పు వదల గొట్టేస్తుంది. భరించలేని శబ్ద కాలుష్యంతో అతను చికాకు పెట్టాడు. ఆర్ఆర్ మరీ లౌడ్ గా ఉంది. సినిమాకు చాలామంది సినిమాటోగ్రాఫర్లు పని చేశారు. విజువల్స్ బాగున్నాయి. గ్రాఫిక్స్ కోసం పడ్డ కష్టమంతా తెరపై కనిపిస్తుంది కానీ.. అవి ప్రేక్షకులకు ఏమాత్రం ఆకట్టుకుంటాయన్నది సందేహం. ఫైర్ బ్యాక్ డ్రాప్ లో ప్రతి సీన్లోనూ ఒకే రకంగా అనిపించే గ్రాఫిక్స్ ఒక దశ దాటాక విసుగు పుట్టిస్తాయి. నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడలేదు. కానీ ఆ ఖర్చు ఎంత మేర సద్వినియోగం అయిందన్నది సందేహమే. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరపై తన కథను భారీగా ప్రెజెంట్ చేయడానికి తాపత్రయ పడ్డాడే తప్ప కథను పకడ్బందీగా తీర్చిదిద్దలేకపోయాడు. కథగా చూసుకుంటే ఏ విశేషం కనిపించదు. గ్రాఫిక్స్ హడావుడి తప్ప సినిమాలో విషయం లేదు అనిపిస్తే అది దర్శకుడి వైఫల్యమే.

చివరగా: బ్రహ్మాస్త్రం.. కంటెంట్ వీక్.. గ్రాఫిక్స్ పీక్

రేటింగ్-2/5

LATEST NEWS