భానుమతి అండ్ రామకృష్ణ

Fri Jul 03 2020 GMT+0530 (IST)

 భానుమతి అండ్ రామకృష్ణ

చిత్రం : భానుమతి అండ్ రామకృష్ణ

నటీనటులు: నవీన్ చంద్ర-సలోని లుథ్రా-రాజా చెంబోలు-వైవా హర్ష తదితరులు
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడిసింగు
నిర్మాత: యశ్వంత్ ములుకుట్ల
రచన-దర్శకత్వం: శ్రీకాంత్ నగోతి

థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫాంలోకి వచ్చిన మరో సినిమా ‘భానుమతి అండ్ రామకృష్ణ’. టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర కొత్తమ్మాయి సలోని లుథ్రా జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ నగోతి దర్శకత్వం వహించాడు. అల్లు వారి ఓటీటీ ‘ఆహా’లో ఈ రోజే విడుదలైన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: భానుమతి (సలోని లుథ్రా).. పేరు పాతదే అయినా ఈ కాలానికి తగ్గట్లు ఆధునిక భావాలున్న అమ్మాయి. ఓ అడ్వర్టైజింగ్ కంపెనీలో మంచి స్థాయిలో ఉంటుంది. ఐతే ఆత్మవిశ్వాసంతో పాటు ఆత్మాభిమానం కూడా ఎక్కువైన భానుమతి.. తనకంటూ కొన్ని పద్ధతులు పెట్టుకుని అందుకు అనుగుణంగానే నడుచుకుంటుంటుంది. అందువల్ల ఆమె ఎక్కువమందికి నచ్చదు. ఐదేళ్ల పాటు తనతో ప్రేమలో ఉన్న రామ్ (రాజా చెంబోలు) కూడా తనను విడిచిపెట్టి వెళ్లిపోతాడు. ఓవైపు బ్రేకప్ 30వ పడిలోకి వచ్చాక కూడా పెళ్లి కాలేదంటూ తల్లిదండ్రులు సహా అందరూ పెట్టే ఒత్తిడి భరించలేకపోతున్న తరుణంలో భానుమతితో కలిసి పని చేయడానికి ఆమె టీంలోకి రామకృష్ణ (నవీన్ చంద్ర) వస్తాడు. అతడిది భానుమతికి పూర్తి విరుద్ధమైన వ్యక్తిత్వం. అమాయకుడు నెమ్మదస్థుడు. తొలి పరిచయంలో భానుమతికి అసలేమాత్రం నచ్చని రామకృష్ణ.. ఆ తర్వాత ఆమెకెలా చేరువయ్యాడు.. తర్వాత వీరి ప్రయాణం ఎలా సాగింది.. చివరికి ఇద్దరూ ఒక్కటయ్యారా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: బాగా ఫాస్ట్ అయిన ఒక మోడర్న్ అమ్మాయి.. బాగా నెమ్మదస్తుడైన ఒక అమాయక అబ్బాయి.. ముందు ఆ అబ్బాయిని చూస్తేనే ఆమెకు ఇరిటేషన్.. కానీ తర్వాత అతడి అమాయకత్వం అమ్మాయికి నచ్చేస్తుంది. ఈ క్రమంలో వీరి ప్రయాణం.. మధ్యలో ఓ సంఘర్షణ.. చివరికి కథ సుఖాంతం. ఈ ఫార్మాట్లో తెలుగులో సినిమాలు చాలానే ఉన్నాయి. ‘భానుమతి అండ్ రామకృష్ణ’ కూడా ఆ కోవలోనిదే. కథే కాదు ఇందులో కథనం.. సన్నివేశాలు కూడా అంత కొత్తగా ఏమీ అనిపించవు. చాలా సినిమాల్లో చూసినట్లే అనిపిస్తాయి. అయినా సరే.. ఈ భానుమతి రామకృష్ణలు గంటన్నరసేపు కూర్చోబెడతారు. వాళ్లిద్దరి పాత్రలతో ఈజీగానే కనెక్టయిపోతాం.. వాళ్ల కాన్వర్జేషన్లు ఆసక్తి రేకెత్తిస్తాయి.. వాళ్ల రొమాన్స్ మనకో చిన్న ఫీల్ ఇస్తుంది. మరీ వెంటాడే సినిమా అయితే కాదు కానీ.. చూసినంతసేపు ‘ఓకే’ అనిపించి మంచి కాలక్షేపాన్నే ఇస్తుంది ‘భానుమతి అండ్ రామకృష్ణ’.

‘భానుమతి అండ్ రామకృష్ణ’లో ప్రత్యేకంగా అనిపించే విషయం.. ఎక్కడా ఎక్కువ మెలోడ్రామా లేకపోవడం. పాత్రలు సన్నివేశాలు అన్నీ కూడా సహజంగా సాగిపోవడం. సినిమాలో మరీ కొత్తదనం లేకపోయినా.. ఈ లక్షణాల వల్లే సినిమా ట్రెండీగా అనిపిస్తుంది. తనకు డ్రామా అంటే అస్సలు నచ్చదని హీరోయిన్ పదే పదే చెబుతుంటుంది. సినిమాలో కూడా అంతే.. ఎక్కడా డ్రామాకు ఛాన్సే ఇవ్వలేదు. ఏ సన్నివేశాన్నీ పొడిగించకుండా సింపుల్ గా తెగ్గొట్టేయడం.. ఆకట్టుకుంటుంది. టైటిల్ కార్డ్స్ పడేటపుడు తన బాయ్ ఫ్రెండ్ తో హీరోయిన్ జరిపే ఫోన్ సంభాషణ తాలూకు నాలుగు ముక్కలు బ్యాగ్రౌండ్లో వినిపించడంతోనే ఆమెను అతను అతి కష్టం మీద భరిస్తున్నాడనే విషయం బోధపడేలా చేశాడు దర్శకుడు. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే బ్రేకప్ సన్నివేశాన్ని కూడా తక్కువ నిడివిలో ఎఫెక్టివ్ గా చూపించి.. వీళ్లిద్దరి మధ్య ఐదేళ్ల పాటు ప్రేమాయణం ఎలా సాగి ఉండొచ్చన్న అంచనా ప్రేక్షకుల అంచనాకు వచ్చేలా చేశాడు.

ఇక సినిమాలో సన్నివేశాలు ఎంత షార్ప్ గా ఉంటాయో చెప్పడానికి మరో ఉదాహరణ.. బ్రేకప్ తర్వాత ఒక అబ్బాయి నుంచి పెళ్లి ప్రపోజల్ రావడంతో అతణ్ని కలిసేందుకు వెళ్తుంది హీరోయిన్. వీళ్ల మధ్య సంభాషణ నడుస్తుండగా.. కథానాయికకు పరిచయమున్న భార్యాభర్తలిద్దరు అక్కడికి వస్తారు. ఆమెనుద్దేశించి మాటల మధ్యలో చివరికి 30 ఏళ్లొచ్చాక పెళ్లి చేసుకుంటున్నావ్ అని భార్య అంటే.. ఇతనేనా నీ బాయ్ ఫ్రెండ్ రామ్ (ఎక్స్) అంటూ భర్త అతణ్ని విష్ చేస్తాడు. వాళ్లు వెళ్లిపోయాక చిన్న పాస్ ఇచ్చి ఇంకే డైలాగ్ కూడా లేకుండా ఆ సన్నివేశానికి తెరదించారు. తర్వాత ఏం జరిగి ఉంటుందనేది ప్రేక్షకుల ఊహకే వదిలేశారు. ఇలా అన్నీ విడమరిచి చెప్పకుండా ఎడిటింగ్లో చూపించిన షార్ప్నెస్ ఆకట్టుకుంటుంది. ఇక హీరో హీరోయిన్ల మధ్య సహజంగా సాగే సన్నివేశాలు కాన్వర్జేషన్లతో కథనం వేగంగానే సాగిపోతుంది.

ఐతే హీరోయిన్ కోణం నుంచి కథను ఆరంభించి.. ఆమె పాత్రకు అధిక ప్రాధాన్యం ఇచ్చి.. చివరి దాకా ఆమెనే హైలైట్ చేయడం అన్నది ఎప్పుడూ చూసే తెలుగు సినిమాలతో పోలిస్తే ఈ చిత్రాన్ని భిన్నంగా నిలబెట్టే విషయమే కానీ.. ఆమె హీరోను మెచ్చడానికి కారణాలు వివరంగా చూపించి అసలు హీరోకు హీరోయిన్ ఎందుకు నచ్చుతుందో ఎక్కడా హైలైట్ చేసి చూపించలేదు. హీరో పాత్ర కూడా కొన్ని చోట్ల అసహజంగా కొంత నాటకీయంగా అనిపిస్తుంది. ఇక సినిమాలో కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా బలంగా లేదు. బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది. సినిమాను ముగించడం కోసం హడావుడిగా ఆ సన్నివేశాలు వచ్చి పడిపోయినట్లు తోస్తుంది. ప్రేమకథ తాలూకు గాఢతను ప్రేక్షకులు అనుభూతి చెందేలోపే సినిమా ముగింపు దశకు వచ్చేసింది. దీంతో ఒక ఇన్ కంప్లీట్ ఫీలింగ్ వెంటాడుతుంది. నిడివి కూడా గంటన్నరకు పరిమితం చేయడం నిర్మాణ విలువల్లో పరిమితుల దృష్ట్యా కూడా ‘భానుమతి అండ్ రామకృష్ణ’ ఒక ‘సినిమా’ స్థాయికి తక్కువగా.. ఒక పెద్ద షార్ట్ ఫిలింలా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ప్రత్యేకమైన అనుభూతిని కలిగించకపోయినా.. కాలక్షేపానికైతే ఢోకా లేని చిత్రం ‘భానుమతి అండ్ రామకృష్ణ’.

నటీనటులు: నవీన్ చంద్ర ప్రతిభ ఏంటో ఈ ‘చిన్న’ సినిమాతో మరోసారి రుజువైంది. అమాయకత్వం నిండిన రాముడు మంచి బాలుడు తరహా పాత్రలో అతను సులువుగా ఒదిగిపోయాడు. పాత్రలాగే నవీన్ నటన కూడా ‘లవబుల్’గా అనిపిస్తుంది. నటనలో కొలతలు తెలియని మరో నటుడెవరైనా ఈ పాత్ర చేస్తే.. కచ్చితంగా ఈ పాత్ర ఈ సినిమా తేడా కొట్టేసేవే. ఇప్పటికే ఎంతోమంది చేసిన తరహా పాత్రలోనే అతను తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇక సినిమాలో సర్ప్రైజ్ అంటే హీరోయిన్ సలోని లుథ్రానే. తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని ఈ అమ్మాయి.. సినిమా మొదలైన కాసేపటికే బాగా అలవాటైన అమ్మాయిలా కనిపిస్తుంది. హీరోయిన్లకు ఇలా వ్యక్తిత్వం హీరోకు మించి ప్రాధాన్యం ఉన్న పాత్రలు అరుదుగానే దొరుకుతాయి. అందులోనూ కొత్తమ్మాయికి ఇలాంటి అవకాశం రావడం విశేషమే. లుక్స్ పరంగా యావరేజ్ గా అనిపించినా.. నటనతో సలోని ఆ ప్రతికూలతను అధిగమించింది. 30 ప్లస్లో కూడా పెళ్లికాక ఇబ్బంది పడే ఈ పాత్రకు నిజానికి అందరూ సూటవ్వరు కూడా. ఆ రకంగా సలోని ఈ సినిమాకు ప్లస్సే అయింది. వైవా హర్ష ఉన్నంతలో బాగానే నవ్వించాడు. అతడి పాత్రకు ఇంకాస్త పొడిగింపు ఉంటే బావుణ్ననిపిస్తుంది. రాజా చెంబోలు తనకు అలవాటైన పాత్రలో మరోసారి ఓకే అనిపించాడు. సినిమాలో అంతకుమించి పెద్ద పాత్రలేమీ లేవు.

సాంకేతిక వర్గం: శ్రవణ్ భరద్వాజ్ సినిమా నడతకు తగ్గ పాటలు నేపథ్య సంగీతం అందించాడు. రెండూ ట్రెండీగా అనిపిస్తాయి. పాటలు విడిగా అనిపించకుండా.. కథనంలో కలిసిపోయాయి. నేపథ్య సంగీతం మొదట్నుంచి చివరిదాకా మంచి ఫీల్ తో సాగుతుంది. సాయిప్రకాష్ విజువల్స్ కూడా బాగున్నాయి. నిర్మాణ విలువల్లో రాజీ కనిపిస్తుంది కానీ.. చిత్ర బృందమే అనేక పరిమితులు విధించుకుని సినిమా తీసినట్లు అనిపిస్తుంది. ఇక అరంగేట్ర దర్శకుడు శ్రీకాంత్.. ఓకే అనిపించాడు. అతను పెద్ద సాహసాలేమీ చేయకుండా టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్ స్టోరీనే తీసుకుని.. దాన్ని ట్రెండీగా నరేట్ చేసే ప్రయత్నం చేశాడు. కథను ఇంకొంచెం విస్తరించి.. దాని స్థాయిని పెంచి ఉంటే బాగుందనిపిస్తుంది. తొలి సినిమాతో శ్రీకాంత్ ఆశ్చర్యపరచలేదు.. అద్భుతాలు చేయలేదు కానీ.. తాను ఓ కథను ఆసక్తికరంగా చెప్పగలనని మాత్రం చాటిచెప్పాడు.

చివరగా:  భానుమతి అండ్ రామకృష్ణ.. టైంపాస్ రొమాంటిక్ కామెడీ

రేటింగ్-2.5/5

LATEST NEWS