చిత్రం : బీస్ట్
నటీనటులు: విజయ్-పూజా హెగ్డే-షైన్ టామ్ చాకో-సెల్వ రాఘవన్-పృథ్వీ-యోగిబాబు-రెడిన్ కింగ్స్లీ-అపర్ణా దాస్ తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస
మాటలు: హనుమాన్ చౌదరి
నిర్మాత: కళానిధి మారన్ (తెలుగు రిలీజ్: దిల్ రాజు)
రచన-దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్
తమిళంలో విజయ్ ఎప్పట్నుంచో సూపర్ స్టార్ అయినప్పటికీ.. మిగతా స్టార్లతో పోలిస్తే తెలుగులో చాలా ఏళ్ల పాటు అతడికి ఫాలోయింగ్ లేదు. కానీ గత కొన్నేళ్లలో తుపాకి అదిరింది విజిల్ మాస్టర్ లాంటి చిత్రాలతో ఇక్కడ అతడికి ఆదరణ పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు అతడి కొత్త చిత్రం బీస్ట్ మంచి అంచనాల మధ్యే తెలుగులో విడుదలైంది. కొకో కోకిల డాక్టర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించడం పూజా హెగ్డే కథానాయికగా నటించడం కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరగడానికి కారణం. మరి ఈ చిత్రం అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.
కథ:
వీర రాఘవ (విజయ్) ఒక రా ఏజెంట్. దేశం కోసం ఎన్నో సాహసోపేత ఆపరేషన్లలో పాల్గొన్న అతను.. ఉమర్ ఫరూక్ అనే పెద్ద ఉగ్రవాదిని పట్టుకునే క్రమంలో చేపట్టిన ఆపరేషన్లో ఓ చిన్నారి చనిపోవడంతో మనసు వికలం అయి తన ఉద్యోగాన్ని విడిచిపెడతాడు. తాను తప్పు చేశానన్న అపరాధ భావం వెంటాడుతున్న సమయంలో అతను ఒక సెక్యూరిటీ కంపెనీలో ఉద్యోగానికి చేరి చెన్నైలోని ఒక షాపింగ్ మాల్ లో సెక్యూరిటీ కాంట్రాక్టు కోసం దక్కించుకోవడం కోసం తన యజమానితో కలిసి అక్కడికి వెళ్తాడు. అదే సమయంలో ఉగ్రవాదులు ఆ మాల్ ను హైజాక్ చేసి అక్కడున్న అందరినీ బందీలుగా తీసుకుంటారు. మరి ఆ స్థితిలో వీర రాఘవ ఏం చేశాడు.. అతను బందీలందరినీ కాపాడాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
అప్పుడెప్పుడో ‘విజయేంద్ర వర్మ’ అనే సినిమాలో మన నందమూరి బాలకృష్ణ ఒక ఉగ్రవాదిని పట్టుకోవడానికి ప్యారాచూట్ వేసుకుని పాకిస్థాన్లోకి వెళ్లిపోతే.. అది అప్పట్లో పెద్ద ట్రోల్ మెటీరియల్ గా మారింది. నిజానికి అప్పటి ట్రెండుకి అలాంటి అలాంటి ఓవర్ ద టాప్ సీన్లు మామూలే. అయినా సరే.. ఆ సీన్లు చూసి అందరూ తెగ నవ్వుకున్నారు. ముఖ్యంగా తమిళ జనాలైతే ఆ టైంలో మన సినిమాలు చూసి తెగ కామెడీ చేసేవారు. అప్పుడక్కడ చాలా వైవిధ్యమైన.. ప్రయోగాత్మక సినిమాలు వస్తుండేవి. వాళ్లను చూసి మన ఫిలిం మేకర్స్ ఎప్పటికి పాఠాలు నేర్చుకుంటారు.. ఇలాంటి మైండ్ లెస్ మాస్ మసాలా సినిమాలు ఎప్పుడు వదిలిపెడతారు అని మన ప్రేక్షకులే అసంతృప్తి వ్యక్తం చేశారు. 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు సీన్ రివర్సయింది. ఒకప్పుడు నవ్యతకు మారుపేరుగా నిలిచిన కోలీవుడ్లో ఇప్పుడొస్తున్న రొటీన్.. మసాలా.. సెన్స్ లెస్ సినిమాలు చూసి మన వాళ్లు వెటకారాలాడుతున్న పరిస్థితి. అందుకు తాజాగా ఉదాహరణ.. బీస్ట్. తమిళ జనాలు ఒకప్పుడు కామెడీ చేసిన ‘విజయేంద్ర వర్మ’ తరహా సన్నివేశమే ఇప్పుడు ఈ ‘బీస్ట్’లో ఉండటం పెద్ద ట్విస్ట్.
‘బీస్ట్’ ట్రైలర్లో విజయ్ కనీసం హెల్మెట్ పెట్టుకోకుండా.. ఒక జీప్ నడుపుతున్న తరహాలో ఫైటర్ జెట్ నడిపేస్తూ వీరవిహారం చేస్తున్నపుడే ఇదేదో తేడాగా ఉందే అనిపించింది. ఇప్పుడిక సినిమాలో అతను చేసిన వీర విన్యాసాలకు నోట మాట రాదు. విజయ్ అభిమానుల్ని మెప్పించడానికి.. అతడి సూపర్ స్టార్ ఇమేజిని బ్యాలెన్స్ చేయడానికి దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఎంత హద్దులు దాటిపోయాడంటే.. రా ఏజెంట్ అయిన హీరో బైకేసుకుని పక్క ఊర్లోకి వెళ్లినట్లు.. ఫైటర్ జెట్ వేసుకుని పాకిస్థాన్ ఎయిర్ స్పేస్ లోకి వెళ్లిపోయేలా పతాక ఘట్టాన్ని డిజైన్ చేశాడు. నేరుగా టెర్రరిస్ట్ క్యాంపున్న చోటికి హీరో వెళ్లిపోవడం.. వీర లెవెల్లో బాంబులేసేయడం.. టెర్రరిస్టులందరినీ మట్టుబెట్టేయడం.. తాను టార్గెట్ చేసిన టెర్రరిస్ట్ చీఫ్ ను పట్టుకుని అదే ఫ్లైట్లో తిరిగి ఇండియాకు వచ్చేయడం.. ఇలాంటి విడ్డూరాలతో ఈ రోజుల్లో ఒక సినిమాలో పతాక ఘట్టాన్ని తీర్చిదిద్దారంటే ఏమననాలి? అందులోనూ కోలమావు కోకిల (తెలుగులో కొకో కోకిల).. డాక్టర్ లాంటి సినిమాలతో ప్రత్యేకత చాటుకున్న నెల్సన్ ఇలాంటి సినిమా తీయడం జీర్ణించుకోలేని విషయం.
నెల్సన్ తొలి రెండు చిత్రాల్లో కూడా లాజిక్ కు అందని సన్నివేశాలుంటాయి. అవి రెండూ కూడా సీరియస్ థీమ్ తో నడిచే కథాంశాలే కానీ.. సటిల్ హ్యూమర్ తో ప్రేక్షకులను అలరించి మంచి మార్కులు వేయించుకున్నాడు నెల్సన్. ‘బీస్ట్’లో కూడా అతను హైజాక్ డ్రామాలో వినోదాన్ని పండించడానికి ప్రయత్నం చేశాడు కానీ.. విజయ్ సూపర్ స్టార్ ఇమేజే అతడికి పెద్ద అడ్డంకిగా మారింది. ఓటీటీల పుణ్యమా అని దేశీయంగా.. అంతర్జాతీయంగా పకడ్బందీగా.. ఉత్కంఠభరితంగా సాగే అనేక హోస్టేజ్ థ్రిల్లర్లను జనాలు చూస్తున్నారు. అంతటి బిగి ఉన్న సినిమాలు.. సిరీస్ లు చూశాక అదే కథాంశంతో తెరకెక్కిన ‘బీస్ట్’లో అదే ఇంటెన్సిటీని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే క్రమంలో టెర్రరిస్టులను వెర్రిపప్పల్ని చేసి.. హైజాక్ డ్రామాను సిల్లీగా తయారు చేసి పెట్టేశాడు నెల్సన్. చెన్నై లాంటి ఒక పెద్ద సిటీలో ఒక పెద్ద మాల్ ను టెర్రరిస్టులు హైజాక్ చేయడం అంటే ఆషామాషీ విషయం కాదు. అందుకు వాళ్లు వేసే ప్రణాళికలు.. బందీలతో వాళ్లు వ్యవహరించే తీరులో ఒక సీరియస్నెస్ కనిపించాలి. బందీలుగా ఉన్న వాళ్లలో భయం కనిపించాలి. వాళ్లకేమవుతుందో అన్న భయం ప్రేక్షకులకూ కలగాలి. ఈ క్రమంలో ఉత్కంఠ రేగాలి. కానీ మాల్ లో బందీలుగా చిక్కిన వాళ్లంతా పిక్నిక్ లో ఉన్నట్లుగా తమాషాలు చేస్తుంటే.. టెర్రరిస్టులు ఒక్కరిలోనూ కర్కశత్వం అన్నదే లేకుండా వాళ్లు జోకర్లలా కనిపిస్తుంటే.. హీరో ఏమో ఎవడొస్తాడో రండ్రా అంటూ వీర విహారం చేసేస్తుంటే.. ఇక ఉత్కంఠకు ఎక్కడ అవకాశముంది?
‘బీస్ట్’ ఆరంభ సన్నివేశాలు చూస్తే మంచి సినిమా చూడబోతున్నామన్న ఆశలే కలుగుతాయి. పెద్ద ఉగ్రవాదిని పట్టుకున్నప్పటికీ తన వల్ల ఓ చిన్నారి ప్రాణం పోయిందనే అపరాధ భావంతో ఉద్యోగాన్ని విడిచిపెట్టే హీరో తాలూకు ఎమోషన్ కు ప్రేక్షకులు బాగానే కనెక్టవుతారు. హీరోయిన్ తో ప్రేమాయణం మొదలయ్యే సన్నివేశాలు సిల్లీగా అనిపించినా.. సెక్యూరిటీ కంపెనీ యజమానితో ముడిపడ్డ కొన్ని సన్నివేశాల్లో నెల్సన్ మార్కు చమత్కారం కనిపించి.. మంచి ఫన్ రైడ్ కు రెడీ అవుతాం. మాల్ లోకి హీరో అడుగు పెట్టడం.. కాసేపటికే టెర్రరిస్టుల ఎటాక్-హైజాక్ జరగడం..కాసేపటికి హీరో తన మిషన్ మొదలుపెట్టడం వరకు బాగానే అనిపిస్తుంది. ముందుగా అతను కొందరు టెర్రరిస్టుల్ని అలవోకగా లేపేస్తుంటే.. ఇది ఆరంభమే కదా.. తర్వాత అతడికి సవాళ్లు ఎదురవుతాయిలే.. మెయిన్ విలన్ అంత తేలిగ్గా లొంగడులే.. ఈ క్రమంలో ఉత్కంఠభరిత డ్రామా ఉంటుందిలే అనుకుంటాం. కానీ ‘బీస్ట్’ అందుకు పూర్తి భిన్నంగా సాగుతుంది. మెషీన్ గన్స్ పట్టుకుని పదుల సంఖ్యలో టెర్రరిస్టులు వందల మందిని బందీలుగా పెట్టుకున్న చోట.. హీరో ఏదనుకుంటే ఏమనుకుంటే అది జరిగిపోతుంటుంది. ఇంటర్వెల్ కంటే ముందే హీరో టెర్రరిస్ట్ చీఫ్ ను చేరుకుని అతడికి సుస్సు పోయించేస్తాడు. ఇక ద్వితీయార్ధంలో అయితే హీరో వీర విహారం ఇంకో స్థాయికి చేరుకుంటుంది. ఒక్క విజయ్ ను ఎలివేట్ చేయడానికి.. అతడి అభిమానులను అలరించడానికి.. దర్శకుడు మిగతా పాత్రలన్నింటినీ ఆటలో అరటిపండుల్లా మార్చేసి చేయించిన విన్యాసాలకు దిమ్మదిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది. డ్రామా లేదు.. కామెడీకి స్కోప్ లేదు. పూర్తిగా ఓవర్ ద టాప్ హీరోయిజం సన్నివేశాలతో ద్వితీయార్ధాన్ని నింపేసి ‘బీస్ట్’ను సిల్లీ సినిమాగా మార్చేశాడు నెల్సన్. ఒక దశ దాటాక ఏదో వీడియో గేమ్ చూస్తున్నట్లు అనిపిస్తుందే తప్ప సినిమా అన్న ఫీలింగ్ కలగదు. పతాక సన్నివేశాలైతే మరీ టూమచ్. తమిళంలో విజయ్ అభిమానులు అతడి విన్యాసాలకు ఊగిపోతారేమో కానీ.. మన వాళ్లకు మాత్రం ‘బీస్ట్’ శిరోభారమే.
నటీనటులు:
విజయ్ సూపర్ స్టైలిష్ గా కనిపించాడు. డ్యాన్సుల్లో.. ఫైట్లలో ఆకట్టుకున్నాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. స్టైలింగ్ కూడా బాగా చేశారు. సినిమాలో అతడిది వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. కానీ ‘బీస్ట్’కు అతి పెద్ద మైనస్. హీరోయిన్ పూజా హెగ్డే కెరీర్లోనే ఇందులో చేసింది అత్యంత పేలవమైన పాత్ర అనడంలో మరో మాట లేదు. అరబిక్ కుత్తు పాటను పక్కన పెడితే.. ఆమెది సినిమాలో సైడ్ క్యారెక్టర్ టైపు అని చెప్పొచ్చు. దర్శకుడు సెల్వ రాఘవన్ సహాయ పాత్రలో బాగానే చేశాడు. మంత్రి పాత్రలో నటించిన నటుడి ఓవరాక్షన్ తట్టుకోలేదు. వీటీవీ గణేష్ సినిమాలో పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. అతడి వరకు కామెడీ పండింది. యోగిబాబును దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. పృథ్వీ ఆరంభంలో కాసేపు మెరిశాడు. మిగతా నటీనటులంతా మామూలే.
సాంకేతిక వర్గం:
సినిమా ఎలా ఉన్నా అనిరుధ్ మాత్రం తన సంగీతంతో న్యాయం చేశాడు. అరబిక్ కుత్తు.. బీస్ట్ మోడ్.. సినిమా పూర్తయ్యాక వచ్చే జాలీయో జింఖానా.. ఈ మూడు పాటలూ ఆకట్టుకుంటాయి. ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని కాస్త నిలబెడతాయి. అతడి నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. కానీ అతడి ఆర్ఆర్ కు తగ్గ స్థాయిలో సన్నివేశాలే లేకపోయాయి. మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం కూడా బాగుంది. విజువల్స్ ఆద్యంతం మెప్పిస్తాయి. సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలకేమీ ఢోకా లేదు. సినిమా మీద బాగానే ఖర్చు చేశారు. ఐతే తొలి రెండు చిత్రాల్లో పరిమిత వనరులతోనే ఎంతో మెప్పించిన నెల్సన్ దిలీప్ కుమార్.. ఇంత మంచి టీంతో.. భారీ బడ్జెట్లో ఇలాంటి సినిమా తీయడమే విడ్డూరం. కచ్చితంగా అతను విజయ్ ఇమేజ్ మాయలో చిక్కుకున్నాడనే చెప్పాలి. ఎంతసేపూ విజయ్ ను ఎలా ఎలివేట్ చేయాలి.. అతడి అభిమానులను ఎలా మెప్పించాలి అని చూశాడే తప్ప.. కథాకథనాల మీద ఫోకస్ పెట్టలేదు. ఇవే ముఖ్యం అనుకున్నపుడు అతను వేరే కథలేమైనా ప్రయత్నించి ఉండాలి. కానీ ఇలాంటి హోస్టేజ్ థ్రిల్లర్ కథాంశంలో ఇలాంటి ఓవర్ ద టాప్ హీరోయిజం చూపించాలనుకునే సరికి కథ అడ్డం తిరిగింది.
చివరగా: బీస్ట్.. బాదుడే బాదుడు
రేటింగ్-1.75/5
Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre