అతడే శ్రీమన్నారాయణ

Wed Jan 01 2020 GMT+0530 (IST)

అతడే శ్రీమన్నారాయణ

చిత్రం : అతడే శ్రీమన్నారాయణ

నటీనటులు: రక్షిత్ శెట్టి - శాన్వి శ్రీవాస్తవ - బాలాజీ మనోహర్ - అచ్యుత్ - ప్రమోద్ శెట్టి - మధుసూదన్ తదితరులు
సంగీతం: అజనీష్ లోకనాథ్
ఛాయాగ్రహణం: కర్మ్ చావ్లా
నిర్మాతలు: పుష్కర మల్లికార్జునయ్య
రచన - దర్శకత్వం: సచిన్ రవి

ఏడాది కిందట దేశమంతా కన్నడ పరిశ్రమ వైపు చూసేలా చేసిన సినిమా ‘కేజీఎఫ్’. కన్నడ సినిమా స్థాయిని అమాంతం పెంచేస్తూ అద్భుత విజయం సాధించిందా సినిమా. దాని స్ఫూర్తితో ఇప్పుడు అక్కడ మరో భారీ ప్రయత్నం జరిగింది. అదే.. అతడే శ్రీమన్నారయణ. ‘కిరాక్ పార్టీ’తో అందరి దృష్టినీ ఆకర్షించిన రక్షిత్ శెట్టి కథానాయకుడిగా సచిన్ రవి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ బహు భాషా చిత్రం ఈ రోజే తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ట్రైలర్ తో ఆసక్తి రేకెత్తించిన ‘అతడే శ్రీమన్నారాయణ’.. సినిమాగా ఏమేర మెప్పించేలా ఉందో చూద్దాం పదండి.

కథ:

80వ దశకంలో అమరావతి అనే పట్టణంలో నాట్య కళాకారుల బృందం భారీ నిధితో వెళ్తుండగా.. వాళ్లను అడ్డగించి రామ రామ అనే దోపిడీ ముఠా నాయకుడు అందరినీ చంపేస్తాడు. ఐతే వీరి చేతికి నిధి దొరక్కుండా ఆ కళాకారులు ఓ అడవిలో దాచి పెడతాడు. రామరామ మరణానంతరం దొంగల ముఠాకు నాయకుడిగా మారిన అతడి కొడుకు జయరాం (బాలాజీ మనోహర్)తో పాటు.. అతడి సవతి తమ్ముడు తుకారాం (ప్రమోద్ శెట్టి) ఈ నిధిని కని పెట్టడం కోసం ఎంతగానో ప్రయత్నిస్తారు. కానీ 15 ఏళ్ల పాటు వీరి ప్రయత్నం ఫలించదు. అప్పుడే ఎస్ఐ శ్రీమన్నారయణ రంగంలోకి దిగుతాడు. శత్రువులుగా మారిన జయరాం.. తుకారాంలను తెలివిగా ఎదుర్కొంటూ అతను నిధిని కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు. అతడి ప్రయత్నం ఫలించిందా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

నటీనటులు - టెక్నీషియన్లు కొత్త వాళ్లు కావచ్చు.. సినిమా మరో భాషది కావచ్చు.. అయినా సరే.. సినిమాలో విషయం ఉండి.. మంచి ట్రైలర్ కట్ చేసి వదిలితే ఆటోమేటిగ్గా బజ్ వచ్చేస్తోంది ఈ రోజుల్లో. ఈ కోవలో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమా ‘అతడే శ్రీమన్నారయణ’. ‘కేజీఎఫ్’ తరహాలో కన్నడ సినీ పరిశ్రమలో తయారైన మరో భారీ చిత్రమిది. దీని ట్రైలర్ చూడగానే కొత్తదనపు గుబాళింపు కనిపించింది. దీని సంగతేంటోో చూడాలన్న ఫీలింగూ కలిగింది. ఐతే ట్రైలర్ చూసినపుడు సినిమాలో ఏమైతే ప్రత్యేకంగా ఉంటాయి అనిపించిందో అవన్నీ ‘అతడే శ్రీమన్నారాయణ’లో ఉన్నాయి. కానీ బ్యాక్ డ్రాప్.. సెటప్ ఎంత బాగున్నప్పటికీ.. మూడు గంటల పాటు ప్రేక్షకుల్ని కుదురుగా కూర్చోబెట్టి ఎంటర్టైన్ చేయడంలో మాత్రం ‘అతడే శ్రీమన్నారాయణ’ విఫలమైంది.

ఇది మనం తరచుగా చూసే సినిమాల తరహాది కాదు. విజువల్స్ మనల్ని మూడు గంటల పాటు మరో లోకంలోకి తీసుకెళ్తాయి. సంగీతం కొత్త అనుభూతిని పంచుతుంది. కథతో పాటు పాత్రలు కూడా భిన్నంగా అనిపిస్తాయి. ఐతే కౌబాయ్ సెటప్ మధ్య సాగే ఈ ఫాంటసీ థ్రిల్లర్ ను సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యే రీతిలో క్లారిటీతో తీయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. స్పష్టత కొరవడిన కథ.. గజిబిజిగా అనిపించే కథనం.. లాజిక్ కు అందని విధంగా సాగే సన్నివేశాలు.. ప్రేక్షకుడిని అయోమయానికి గురి చేస్తాయి. సినిమాను సరదాగా నడిపించాలన్న ఉద్దేశం మంచిదే కానీ.. ఈ క్రమంలో ఇంటెన్సిటీ లోపించింది. ప్రేక్షకులు ఎక్కడా సినిమాను సీరియస్ గా తీసుకోలేని విధంగా కథాకథనాలు సాగడం ‘అతడే శ్రీమన్నారాయణ’లోని మరో ప్రధాన బలహీనత. రొటీన్ సినిమాల మధ్య కొంచెం భిన్నమైన అనుభవాన్ని కోరుకునే ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించినా.. అందరి ఆమోదం పొందడం మాత్రం కష్టమే.

రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడిగా నటించిన ‘క్విక్ గన్ మురుగన్’ స్టయిల్లో సాగే ఫాంటసీ థ్రిల్లర్ ఈ ‘అతడే శ్రీమన్నారాయణ’. దీని నరేషన్లో ఒక యునీక్ స్టైల్ కనిపిస్తుంది. ఏదీ ప్రేక్షకులకు సూటిగా.. విడమరిచి చెప్పకుండా.. కథను భిన్నంగా నరేట్ చేశాడు దర్శకుడు సచిన్. హీరో పాత్రను మలిచిన విధానం.. దాని ద్వారా వినోదం పంచిన తీరు సినిమాలో ప్రత్యేకంగా కనిపిస్తుంది. పరిచయ సన్నివేశం దగ్గర్నుంచి హీరో పాత్ర భలే ఫన్నీగా సాగుతుంది. అదే సమయంలో సమయోచితంగా దాన్ని ఎలివేట్ చేసిన తీరు కూడా బాగుంది. కౌబాయ్ సినిమాల తరహా సెటప్ కారణంగా సినిమా లుక్కే డిఫరెంట్ గా కనిపిస్తుంది. కన్నడలో కూడా రక్షిత్ పెద్ద స్టారేమీ కాదు. అయినప్పటికీ అతడి మీద పెట్టిన పెట్టుబడి ఆశ్చర్యపరుస్తుంది. కథ బ్యాక్ డ్రాప్.. సెట్టింగ్స్.. విజువల్స్.. అన్నీ కూడా చాలా రిచ్ గా కనిపిస్తాయి.

ఎంచుకున్న కథ.. ఆ కథను చెప్పడానికి తగ్గ సెటప్ అంతా కూడా బాగానే కుదిరినప్పటికీ.. ప్రేక్షకుల్ని సీరియస్ గా ఇన్వాల్వ్ చేసే కథనం ‘అతడే శ్రీమన్నారాయణ’లో మిస్సయింది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు కితకితలు పెడుతూ సాగుతాయి. దర్శకుడి సెన్సాఫ్ హ్యూమర్ సూపర్ అనిపిస్తుంది. కానీ కొత్తదనం పేరుతో మరీ గందరగోళంగా సన్నివేశాల్ని తీర్చిదిద్దడంతో ప్రేక్షకుడు ఆసక్తిని కోల్పోతాడు. కొన్నిసార్లు కథ ఎటు పోతోందో అర్థం కానంత గందరగోళంగా సినిమా నడుస్తుంది. ముందు నుంచి మరీ సరదాగా సినిమాను నడిపించడం వల్ల సీరియస్ గా తీసుకోవాల్సిన సన్నివేశాలు కూడా కామెడీ అయిపోయాయి.

ప్రథమార్ధంలో కొన్ని ఎపిసోడ్లు.. ఇంటర్వెల్ ట్విస్ట్ వల్ల ఒక దశ వరకు సినిమా ఓకే అనిపిస్తుంది. కానీ ద్వితీయార్ధం అనుకున్నంత ప్రభావంతంగా లేకపోయింది. నరేషన్ మరీ నెమ్మదించడం.. అంతవరకు నిధి గురించి ఎంతో బిల్డప్ ఇచ్చి దాంతో ముడిపడ్డ ఎపిసోడ్ ను తేల్చి పడేయడం.. సుదీర్ఘమైన నిడివి ‘అతడే శ్రీమన్నారాయణ’ మీద ఇంప్రెషన్ తగ్గిస్తూ వెళ్తాయి. దాదాపు మూడు గంటల నిడివి ఉన్న సినిమాలో కొన్ని చోట్ల కథనం మరీ నెమ్మదించి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ముందే అన్నట్లు రెగ్యులర్ సినిమాలతో పోలిస్తే ఇది భిన్నమైందే. కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల్ని సంతృప్తిపరిచే అంశాలు కొన్ని ఉన్నాయి. కానీ ప్రేక్షకుల ఆసక్తిని ఆద్యంతం నిలిపి ఉంచే ప్రభావవంతమైన కథనం సినిమాలో మిస్ అయింది. నేటివిటీతో కూడా ఇబ్బంది ఉన్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఏమేర రుచిస్తుందన్నది సందేహమే.

నటీనటులు:

రక్షిత్ శెట్టి మనవాళ్లకు కొత్తవాడే అయినప్పటికీ.. సినిమా మొదలైన కాసేపటికే అతడి పాత్రతో కనెక్టవుతాం. కథకు.. పాత్రకు తగ్గట్లు రక్షిత్ డిఫరెంట్ స్టయిల్ తో నటించి మెప్పించింది. సినిమా సంగతెలా ఉన్నా అతడి పాత్ర మాత్రం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. హీరోయిన్ శాన్వి మన దగ్గర చేసిన సినిమాలతో పోలిస్తే భిన్నంగా కనిపిస్తుంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో ఆమె మెపెప్పించింది. విలన్ పాత్రల్లో బాలాజీ మనోహర్ - ప్రమోద్ శెట్టి బాగానే చేశారు. హీరో సహాయ పాత్రలో అచ్యుత్ ప్రత్యేకత చాటుకున్నాడు. మిగతా నటీనటులంతా ఓకే.

సాంకేతిక వర్గం:

‘అతడే శ్రీమన్నారాయణ’లో అతి పెద్ద ఆకర్షణ సాంకేతిక అంశాలే. కర్మ్ చావ్లా కెమెరా పనితనం సినిమాకు ఒక డిఫరెంట్ లుక్ తీసుకొచ్చింది. ప్రతి సన్నివేశంలోనూ కెమెరామన్ ప్రత్యేకత కనిపిస్తుంది. సినిమాకు అతను హీరో అని చెప్పొచ్చు. అజనీష్ లోకనాథ్.. చరణ్ రాజ్ స్వరపరిచిన పాటలు బాగున్నాయి. అజనీష్ బ్యాగ్రౌండ్ స్కోర్ భిన్నమైన అనుభూతిని పంచుతుంది. డబ్బింగ్ విషయంలో చూపించిన శ్రద్ధ అభినందనీయం. నిర్మాణ విలువలు కన్నడ సినిమా స్థాయికి మించి చాలా బాగున్నాయి. దర్శకుడు సచిన్ రవి కచ్చితంగా భిన్నమైన దర్శకుడు. అతను ఎంచుకున్న కథ.. నరేషన్ స్టయిల్ కొత్తగా అనిపిస్తాయి. కానీ సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యే రీతిలో ఈ కథను చెప్పలేకపోయాడు. అతడి ఆలోచనల్లో స్పష్టత లేకపోయింది. స్క్రీన్ ప్లేలో.. సన్నివేశాల్లో గందరగోళంతో ప్రేక్షకులను అతను అయోమయానికి గురి చేశాడు. కన్నడ ప్రేక్షకుల సంగతేమో కానీ.. మనవాళ్లకు రుచించేలా మాత్రం అతను సినిమాను తీర్చిద్దలేకపోయాడు.

చివరగా: అతడే శ్రీమన్నారయణ.. మంచి ప్రయత్నమే కానీ..!

రేటింగ్-2.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre  

LATEST NEWS