'అశ్వథ్థామ'

Fri Jan 31 2020 GMT+0530 (IST)

'అశ్వథ్థామ'

చిత్రం : 'అశ్వథ్థామ'

నటీనటులు: నాగశౌర్య-మెహ్రీన్ కౌర్-ప్రిన్స్-సత్య-పవిత్ర లోకేష్-జయప్రకాష్-హరీష్ ఉత్తమన్ తదితరులు
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
నేపథ్య సంగీతం: జిబ్రాన్
ఛాయాగ్రహణం: మనోజ్ రెడ్డి
నిర్మాత: ఉషా ముల్పూరి
కథ: నాగశౌర్య
మాటలు: పరశురామ్ శ్రీనివాస్
స్క్రీన్ ప్లే: రమణ తేజ-ఫణీంద్ర
దర్శకత్వం: రమణ తేజ

కెరీర్లో చాలా వరకు సాఫ్ట్ - లవర్ బాయ్ పాత్రలే చేశాడు నాగశౌర్య. ఇప్పుడతను పూర్తి స్థాయి మాస్ కథతో చేసిన సినిమా ‘అశ్వథ్థామ’. తనే స్వయంగా కథ రాసుకుని సొంత బేనర్లో నాగశౌర్య చేసిన ఈ చిత్రానికి కొత్త దర్శకుడు రమణ తేజ దర్శకత్వం వహించాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

గణ (నాగశౌర్య)కు చెల్లెలంటే పంచ ప్రాణాలు. చిన్నప్పట్నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన చెల్లికి పెళ్లి ఫిక్సవడంతో అతను అమెరికా నుంచి తన ఇంటికొస్తాడు. నిశ్చితార్థం పూర్తయ్యాక కుటుంబమంతా చాలా సంతోషంగా ఉన్న సమయంలో గణ చెల్లెలు ఆత్మహత్యా యత్నం చేస్తుంది. ఆమెను వారించి విషయమేంటని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు గణ. తాను ప్రెగ్నెంట్ అని.. కానీ అందుకు కారణమెవరో తెలియదని చెప్పడంతో అతను హతాశుడవుతాడు. ఈ స్థితిలో ఈ మిస్టరీని ఛేదించడానికి అతనేం చేశాడన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

తన సొంత బేనర్లో ఇంతకుముందు వచ్చిన ‘నర్తనశాల’ పరాజయం పాలవడం గురించి ఆవేదన చెందుతూ.. ఇకపై ఫలితాలతో సంబంధం లేకుండా ‘మంచి’ సినిమాలే చేయాలని నిర్ణయించుకున్నానని.. అందులో భాగంగానే ‘అశ్వథ్థామ’ చేశానని చెప్పాడు నాగశౌర్య. అమ్మాయిలపై అఘాయిత్యాలు చేసే ఒక మానవ మృగాన్ని కథానాయకుడు వేటాడే కథ ఇది. కాబట్టి మంచి దీన్ని ‘మంచి’ సినిమాగా భావించినట్లున్నాడు నాగశౌర్య. శౌర్య స్వయంగా రాసుకున్న ‘అశ్వథ్థామ’ కథలో లైన్ వింటే ఇది ఒక కాజ్ కోసం చేసిన ‘మంచి’ సినిమాలానే అనిపిస్తుంది. ఇది మహిళలు కుటుంబ ప్రేక్షకులు లక్ష్యంగా చేసిన ప్రయత్నంలానూ కనిపిస్తుంది. కానీ దీన్ని నరేట్ చేసిన విధానంలో మాత్రం ఆ ఛాయలేమీ కనిపించవు. ఎంచుకున్న పాయింట్ సార్వజనీనమైందే అయినా.. దాన్ని నరేట్ చేసిన విధానం విలన్ పాత్రను తీర్చిదిద్దిన తీరు వల్ల ‘అశ్వథ్థామ’ ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రమే నచ్చేలా తయారైంది. సైకో విలన్ పాత్రలకు కనెక్టయ్యే వాళ్లకు.. థ్రిల్లర్లు ఇష్టపడేవాళ్లకు ఇది ఓకే అనిపించినా.. మిగతా ప్రేక్షకులకు ‘అశ్వథ్థామ’ అదోలా అనిపిస్తాడు.

కొన్నేళ్ల కిందట రామ్ గోపాల్ వర్మ తీసిన ‘అనుక్షణం’ లైన్లో సాగే చిత్రం ‘అశ్వథ్థామ’. ఐతే వర్మ సినిమా విలన్ సెంట్రిగ్గా సాగితే.. ‘అశ్వథ్థామ’ హీరో కోణంలో నడుస్తుంది. అమ్మాయిల్ని విచిత్రమైన పద్ధతుల్లో ట్రాప్ చేసి.. కోరిక తీర్చుకుని.. తమకేం జరిగిందో తెలియని అయోమయంలో అమ్మాయిలు అఘాయిత్యాలకు పాల్పడేలా చేసే విలన్ పాత్రను కొంచెం భిన్నంగానే తీర్చిదిద్దారు ఇందులో. ఈ ట్రాక్ను స్ట్రెయిట్గా నరేట్ చేయకుండా.. మిస్టరీలా డీల్ చేసిన పద్ధతి ఆకట్టుకుంటుంది. సినిమా చాలా మామూలుగా మొదలైనప్పటికీ.. నిశ్చితార్థం తర్వాత తాను ప్రెగ్నెంట్ అని తెలిసిన చెల్లెలు.. అందుకు కారణం ఎవరో తెలియదని హీరోకు చెప్పడంతో అతను నిలువెల్లా కంపించిపోయే చోట ‘అశ్వథ్థామ’ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక్కడి నుంచి అసలు గుట్టు ఏంటో తెలుసుకునేందుకు హీరో మొదలుపెట్టే మిషన్ తో కథ పట్టాలెక్కుతుంది. విలన్ కు సహకరించే జాలర్ల ముఠాను ట్రాక్ చేసి హీరో పట్టుకునే ఎపిసోడ్ సినిమాలోకెల్లా హైలైట్. అందులో హీరోయిజాన్ని కూడా బాగా ఎలివేట్ చేసి మాస్ ప్రేక్షకులనూ ఎంటర్టైన్ చేశారు.

ఐతే ఇంటర్వెల్ సమయానికి రసపట్టులో పడ్డట్లు కనిపించే ‘అశ్వథ్థామ’ ద్వితీయార్ధం నుంచి మాత్రం ట్రాక్ తప్పుతుంది.  ప్రథమార్ధం వరకు విలన్ ఎవరన్న విషయంలో ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తించేలా సాగిన స్క్రీన్ ప్లే సెకండాఫ్ లోకి వచ్చేసరికి ఫ్లాట్ అయిపోయింది. పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు కనిపించిన హీరో.. దాన్ని ఛేదించి విలన్ని ఎలా కనిపెడతాడు.. తమకు అతణ్ని ఎలా పరిచయం చేస్తాడని ప్రేక్షకులు చూస్తుంటే.. విలన్ని ఇంకెంతసేపు దాచి పెడతాం అన్నట్లుగా ద్వితీయార్ధం మొదలవ్వగానే అతణ్ని ప్రేక్షకులకు చూపించేయడం అంతగా రుచించదు.  ‘అశ్వథ్థామ’ స్క్రీన్ ప్లేలో మొదట్నుంచి ఇలాంటి లూప్ హోల్స్ కనిపిస్తూనే ఉంటాయి. చాలా విషయాల్ని ఆసక్తికరంగా మొదలుపెట్టి మధ్యలో వదిలేయడం మరో సమస్య. థ్రిల్లర్ సినిమాల్లో ఒక సన్నివేశానికి మరో సన్నివేశానికి లింక్ కలపడం కీలకమైన విషయం. ‘అశ్వథ్థామ’ దర్శకుడు ఆ విషయంలో నైపుణ్యం చూపించలేకపోయాడు. హీరో పరిశోధన సాగించే వైనం ఆసక్తికరంగానే అనిపించినా.. కొన్ని చోట్ల అతనేం చేస్తున్నాడో దాని పర్పస్ ఏంటో అర్థం కాని గందరగోళం నెలకొంటుంది. ప్రి క్లైమాక్సులో ప్రేక్షకులు ఆశించే ఉత్కంఠ ఏమీ ఉండదు. ఉన్నట్లుండి హీరో.. విలన్ డెన్లోకి వెళ్లిపోయి అతడి కథకు ముగింపు ఇచ్చేస్తాడు.

అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాల మీద సినిమా తీసినపుడు.. వాళ్లకు రుచించేలా కుటుంబ ప్రేక్షకులూ కనెక్టయ్యేలా ‘అశ్వథ్థామ’ను తీర్చిదిద్దే ప్రయత్నం జరగాల్సింది. ఐతే మొక్కుబడిగా కొన్ని సెంటిమెంట్ సీన్లు పెట్టేసి.. మిగతా వ్యవహారమంతా సైకో థ్రిల్లర్ తరహాలో నడిపించారు. కొన్ని సీన్లు చూసి మెజారిటీ ప్రేక్షకులు తట్టుకోలేరు. అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాల్ని వారి బాధల్ని హీరో వారి కోసం నిలబడే వైనాన్ని మానవీయ కోణంలో చూపించడం కంటే.. ప్రతినాయకుడి పైశాచికత్వాన్ని ఎలివేట్ చేయడం హీరో వీరత్వాన్ని చూపించడం మీదే దర్శకుడు ప్రధానంగా దృష్టిసారించాడు ‘అశ్వథ్థామ’లో. ప్రధానంగా థ్రిల్లర్ తరహాలో సాగే ఈ చిత్రానికి సెంటిమెంటు జోడించే ప్రయత్నం చేసినా.. అదెక్కడా సింక్ కాలేదు. ఇందులో విలన్ పాత్రను తీర్చిదిద్దిన వైనం చూస్తే.. మహిళలు కుటుంబ ప్రేక్షకుల సంగతి తర్వాత కొంచెం సున్నితత్వం ఉన్న కుర్రాళ్లు కూడా దీన్ని జీర్ణించుకోవడం కష్టంగా కనిపిస్తుంది. సైకో థ్రిల్లర్లకు అలవాటు పడ్డ వాళ్లకు ‘అశ్వథ్థామ’ ఓకే అనిపించినా.. మిగతా ప్రేక్షకులకు ఇది ఏమాత్రం రుచిస్తుందన్నది సందేహమే.

నటీనటులు:

నాగశౌర్య పూర్తి స్థాయి మాస్ పాత్ర చేశాడు ‘అశ్వథ్థామ’లో. ఇంతకుముందు అతణ్ని ఎక్కువగా సాఫ్ట్ క్యారెక్టర్లలోనే చూసినప్పటికీ.. ఇంతకుముందు ‘జాదూగాడు’లో మాదిరి ఇందులో ఎబ్బెట్టుగా అనిపించలేదు. పాత్రకు ఫిట్ అనిపించాడు. అందుకోసం పర్ఫెక్ట్ లుక్ లోకి మారాడు. చెల్లెలికి జరిగిన అన్యాయానికి లోలోన నరకయాతన అనుభవిస్తూ ప్రతీకారం కోసం ప్రయత్నించే పాత్రలో శౌర్య ఎమోషన్లు బాగా పలికించాడు. పెర్ఫామెన్స్ పరంగా శౌర్యకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పాత్ర సినిమాలో నామమాత్రమే. హీరో చెల్లెలిగా చేసిన అమ్మాయి పర్వాలేదు. విలన్ పాత్రధారి ఆకట్టుకున్నాడు. అతను కొత్తవాడే అయినప్పటికీ పాత్రకు తగ్గ వెయిట్ తీసుకొచ్చాడు. హరీష్ ఉత్తమన్ బాగా చేశాడు. ప్రిన్స్ - సత్య - జయప్రకాష్ - పవిత్ర లోకేష్ - పోసాని.. వీళ్లెవరికీ సినిమాలో పెద్దగా స్కోప్ లేదు.

సాంకేతిక వర్గం:

శ్రీచరణ్ పాకాల పాటలు సినిమాలో నామమాత్రంగా అనిపిస్తాయి. పాటలకు సినిమాలో ప్రాధాన్యం కూడా లేకపోవడంతో అతను మొక్కుబడిగా లాగించేశాడు. ఐతే నేపథ్య సంగీతం విషయంలో మాత్రం జిబ్రాన్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కొన్ని చోట్ల అవసరానికి మించిన బిల్డప్ లౌడ్నెస్ కనిపిస్తుంది కానీ.. చాలా వరకు బ్యాగ్రౌండ్ స్కోర్ ఉత్కంఠ రేకెత్తించేలా సాగుతుంది. మనోజ్ రెడ్డి ఛాయాగ్రహణం కూడా బాగుంది. నిర్మాణ విలువల విషయంలో శౌర్య ఫ్యామిలీ రాజీ పడలేదు. అతడి స్థాయికి మించి ఖర్చు పెట్టారు. ఒక స్టార్ హీరో సినిమాలా రిచ్ గా తీశారు. నాగశౌర్యే స్వయంగా రాసిన కథలో విషయం ఉంది. కొన్ని సైకో థ్రిల్లర్ల స్ఫూర్తి ఉన్నప్పటికీ.. శౌర్య ఇలాంటి కథ రాయడం అభినందనీయమే. దర్శకుడు రమణ తేజ కూడా కొన్ని చోట్ల ప్రతిభ చూపించాడు. కాకపోతే అతడి స్క్రీన్ ప్లేలో నిలకడ.. బిగి లేకపోయింది. థ్రిల్ సెంటిమెంట్.. ఈ రెంటినీ మిక్స్ చేయడంలో అతను తడబడ్డాడు. ఓవరాల్ గా రమణ పనితనం జస్ట్ ఓకే అనిపిస్తుంది.

చివరగా: అశ్వథ్థామ.. అందరికీ రుచించదు

రేటింగ్-2.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS