అర్జున ఫల్గుణ

Fri Dec 31 2021 GMT+0530 (IST)

అర్జున ఫల్గుణ

చిత్రం : 'అర్జున ఫల్గుణ'

నటీనటులు: శ్రీవిష్ణు-అమృత అయ్యర్-సుబ్బరాజు-నరేష్-జబర్దస్త్ మహేష్-దేవీ ప్రసాద్ తదితరులు
సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణియన్
ఛాయాగ్రహణం: జగదీష్ చీకటి
మాటలు: సుధీర్ వర్మ.పి
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి-అన్వేష్ రెడ్డి
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: తేజ మార్ని

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు శ్రీ విష్ణు నుంచి వచ్చిన కొత్త చిత్రం ‘అర్జున ఫల్గుణ’. ‘జోహార్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన తేజ మార్ని.. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

అర్జున ఫల్గుణ.. టైటిల్ ఎంత గంభీరంగా ఉందో కదా? ‘‘నాది కాని కురుక్షేత్రంలో.. నాకు తెలియని పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాను. అయినా బలైపోవడానికి నేను అభిమణ్యుణ్ని కాదు. అర్జునుణ్ని’’.. డైలాగ్ లో చాలా డెప్త్ కనిపిస్తోంది కదా.. ఆ టైటిల్ చూసి.. ఈ డైలాగ్ విని.. ఎప్పుడో ఏదో ఒక కొత్తదనం కోసం ప్రయత్నించే శ్రీవిష్ణు హీరో కదా అని.. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్లు మంచి కంటెంట్ ఉన్న సినిమాలే తీస్తుంటారు కదా అని నమ్మకంగా ‘అర్జున ఫల్గుణ’ థియేటర్లోకి వెళ్లి కూర్చున్న ప్రేక్షకులు మబ్బులు విడిపోయి ‘సినిమా’ కనిపించడానికి ఎంతో సమయం పట్టదు. దర్శకుడు తేజ మార్నికైనా.. హీరో శ్రీ విష్ణుకైనా.. నిర్మాత నిరంజన్ రెడ్డికైనా.. అసలేముందని ఈ కథతో సినిమా చేయాలనిపించిందో అర్థం కాదు. స్క్రిప్టును అంచనా వేయడంలో పొరపాటు పడితే పడి ఉండొచ్చు గాక. కానీ సినిమా తీస్తున్నపుడు.. పూర్తయ్యాక ఔట్ పుట్ చూసుకున్నపుడు ఎలా ధీమాగా ఉన్నారో.. ఇంత ధైర్యంగా థియేటర్లలో రిలీజ్ చేసే సాహసం చేశారో అన్న సందేహాలు కలుగుతాయి. ఇంకెవరో ఇలాంటి సినిమా చేస్తే సరేలే అనుకోవచ్చు కానీ.. మంచి టేస్ట్.. క్రెడిబిలిటీ ఉన్న ఉన్న శ్రీ విష్ణు-నిరంజన్ రెడ్డి ‘అర్జున ఫల్గుణ’ లాంటి సినిమాతో రావడమే జీర్ణించుకోలేని విషయం.

ముఖచిత్రం చూసి ఒక పుస్తకాన్ని అంచనా వేయకూడదని అంటారు. టైటిల్సూ.. ప్రోమోలు చూసి కూడా సినిమాను అంచనా వేయి తప్పులో కాలేయకూడదని చాటి చెప్పే చిత్రం ‘అర్జున ఫల్గుణ’. ప్రోమోల్లో ఉన్నవన్నీ పైపై మెరుగులే అని.. సినిమాలో అసలేమాత్రం విషయం లేదని అర్థం కావడానికి ఎంతో సమయం పట్టదు. తొలి పావుగంటలోనే ఈ సినిమాపై ఉన్న అంచనాల భ్రమలన్నీ తొలగిపోతాయి. ఊర్లో తన స్నేహితుల గుంపును వేసుకుని అల్లరి చిల్లరిగా తిరిగేసే హీరో.. అతను తాగొచ్చి అల్లరి చేస్తుంటే చీవాట్లు పెట్టే తండ్రి.. కొడుకును వెనకేసుకొచ్చే తల్లి.. ఇలాంటి పాత్రలు.. వీళ్ల మధ్య వచ్చే ఆరంభ సన్నివేశాలు చూస్తేనే ఇదొక ‘టెంప్లేట్’లో సాగిపోయే రొటీన్ సినిమా అని అర్థమైపోతుంది. స్నేహితుడికి ఏదో సమస్య వస్తే ముందు వెనుక చూడకుండా వెళ్లిపోయి హీరో ఫైట్ చేసేయడం.. అతడి కోసం తన జీవనాధారాన్ని త్యాగం చేసేయడం చూసి ఇక సినిమా నుంచి కొత్తగా ఆశించడానికి ఏమీ లేదని గట్టిగా ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. హీరో డబ్బుల కోసం నేరం ఒక నేరం చేయడానికి రెడీ అవడం ఇంటర్వెల్ పాయింట్ అయితే.. అందుకు దారి తీసే కారణాలతో ముడిపడ్డ ప్రథమార్ధంలో ప్రేక్షకుల్లో ఎంతో కొంత ఎమోషన్ తీసుకొచ్చే ఒక్క సన్నివేశం కూడా పడలేదు.

ఇక రెండో అర్ధంలో దర్శకుడు ‘స్వామి రారా’ టెంప్లేట్ ఫాలో అయిపోయాడు. క్రైమ్ చేసి పారిపోతున్న హీరో-అతడి ఫ్రెండ్స్.. వాళ్లను తరిమే పోలీసులు.. రౌడీలు.. ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పోలీసులు పట్టుకున్న ప్రతిసారీ చాలా సింపుల్ గా హీరో అతడి గ్యాంగ్ తప్పించుకునే సీన్లు చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. ప్రథమార్ధంలోని సన్నివేశాలైనా అంతో ఇంతో నయం కానీ.. ద్వితీయార్ధంలో అయితే ప్రతి సన్నివేశం కూడా సిల్లీతనానికి కేరాఫ్ అడ్రస్ లాగా కనిపిస్తాయి. ఒక సీన్లో హీరో బృందం డబ్బులతో అడవిలోకి పారిపోతుంటే.. వెంట పడుతున్న పోలీసులు ఉన్నట్లుండి ఆగిపోతారు. ఏంటి సంగతి అని చూస్తే ముందు క్లైమోర్ మైన్స్ ఉన్నాయి జాగ్రత్త అన్న బోర్డుంటుంది. క్లైమోర్ మైన్స్ పోలీసులు నక్సలైట్ల కోసం పెట్టినా.. నక్సలైట్లు పోలీసుల కోసం పెట్టినా.. ఇలా బోర్డు పెట్టి హెచ్చరిక ఎందుకు జారీ చేస్తారసలు? ఇక హీరో గ్యాంగులో ఒక్కొక్కరు మైన్స్ మీద కాలేస్తుంటే అవి దీపావళి తారా జువ్వల్లా వెరైటీ యాంగిల్లో దూసుకెళ్తుంటాయి తప్ప ఎవ్వరికీ ఏమీ కాదు. ఇంత సిల్లీగా సన్నివేశాన్ని నడిపించి.. దానికి బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఇచ్చిన ఎలివేషన్ చూస్తే డైరెక్టర్ కాన్ఫిడెన్సుకి ఏమనాలో అర్థం కాదు.

అదేం చిత్రమో కానీ.. ఈ సినిమాలో హీరో గంజాయిని గోనె సంచెలోనే కట్టి తీసుకెళ్తుంటాడు.. విలన్ 50 లక్షల డబ్బుల కట్టల్ని కూడా సరిగ్గా అలాంటి సంచిలోనే కట్టి తీసుకొస్తాడు ఇంకేదీ దొరకనట్లు. పోలీసులు ఆ సంచి కోసమే తన వెంట పడుతున్నాడని తెలిసినా.. ఏదో మొక్కుబడి ఉన్నట్లుగా ఎక్కడా ఆ డబ్బుని బ్యాగ్ లోకి మార్చకుండా భద్రంగా అదే సంచిలో తన ఊరి దాకా తీసుకొస్తాడు హీరో. ఇంకే ప్లేసూ దొరకనట్లు గడ్డివాములో ఆ సంచిని దాచి పెడతాడు. గడ్డివాములో డబ్బులు దాచాక అక్కడేం జరుగుతుందో ఆటోమేటిగ్గా ఊహించేయొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో సన్నివేశం ఒక కళాఖండమే. కొంచెం ముందుగానే ఈ సినిమాను సీరియస్ గా తీసుకోవడం మానేసి.. వెటకారంగా చూడ్డం మొదులపెడితే తప్ప చివరి వరకు కూర్చోవడం కష్టం. చివర్లో కొన్ని మెరుపులున్నప్పటికీ అప్పటికే వచ్చిన లాజిక్ లెస్.. సిల్లీ సీన్లు ఓపిక నశించిపోయేలా చేస్తాయి. మొత్తంగా చూస్తే శ్రీ విష్ణు కెరీర్లో అత్యంత పేలవమైన చిత్రం అనడానికి ‘అర్జున ఫల్గుణ’ గట్టి పోటీదారుగా నిలుస్తుందనడంలో సందేహమే లేదు.

నటీనటులు:

శ్రీ విష్ణు నటుడిగా తన వంతు ప్రయత్నం చేసినా.. అర్జున్ పాత్రను నిలబెట్టలేకపోయాడు. అతడి ఇమేజ్ కు భిన్నంగా అర్జున్ పాత్రకు విపరీతమైన బిల్డప్.. ఎలివేషన్ ఇవ్వాలని చూడటం బెడిసికొట్టింది. అమృత అయ్యర్ చాలా సాధారణంగా కనిపించింది. ఆ పాత్ర కూడా చాలా పేలవం. నరేష్ అందరిలోకి కొంత ప్రత్యేకంగా కనిపించాడు. చాన్నాళ్ల తర్వాత కీలకమైన విలన్ పాత్ర చేసిన సుబ్బరాజు కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. జబర్దస్త్ మహేష్ హీరో ఫ్రెండుగా ఓ ముఖ్య పాత్రలో రాణించాడు. మిగతా ఇద్దరు స్నేహితులుగా నటించిన కుర్రాళ్లు కూడా బాగా చేశారు. దేవీ ప్రసాద్ ఓకే.

సాంకేతిక వర్గం:

సంగీత దర్శకుడు ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ కు తెర మీద ఏం జరుగుతోందో అర్థం కాలేదో.. దాంతో అతడికి సంబంధం లేదో అనుకున్నాడో తెలియదు కానీ.. ప్రతి సీన్లోనూ బ్యాగ్రౌండ్ స్కోర్ విపరీతమైన ఎలివేషన్ ఇవ్వడానికి చూశాడు. విషయం లేని సన్నివేశాల్లో ఈ రణగొణ ధ్వనులతో చికాకు పుడుతుంది. చాలా చోట్ల నేపథ్య సంగీతం భరించలేని విధంగా సాగింది. పాటలు కూడా అంతంతమాత్రమే. జగదీష్ చీకటి ఛాయాగ్రహణం పర్వాలేదు. నిర్మాణ విలువలు మ్యాట్నీ స్థాయికి ఏమాత్రం తగ్గట్లుగా లేవు. ఈ సినిమాను వాళ్లు ప్రొడ్యూస్ చేశారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ సంస్థ బ్రాండ్ వాల్యూను ఈ సినిమా దెబ్బ తీసేదే. దర్శకుడు తేజ మార్ని గురించి చెప్పడానికి ఏమీ లేదు. రచయితగా.. దర్శకుడిగా అతను పూర్తిగా విఫలమయ్యాడు.

చివరగా: అర్జున ఫల్గుణ.. వామ్మో వాయ్యో

రేటింగ్-1.75/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS