అర్ధ శతాబ్దం

Fri Jun 11 2021 GMT+0530 (IST)

అర్ధ శతాబ్దం

చిత్రం   : ‘అర్ధ శతాబ్దం’

నటీనటులు: కార్తీక్ రత్నం-కృష్ణప్రియ-సాయికుమార్-నవీన్ చంద్ర-శుభలేఖ సుధాకర్-అజయ్-ఆమని తదితరులు
సంగీతం: నవ్ ఫాల్ రాజా
ఛాయాగ్రహణం: ఈజె వేణు-వెంకట్ శాఖమూరి-అష్కర్
నిర్మాతలు: చిట్టి కిరణ్ రామోజు-తేలు రాధాకృష్ణ
రచన-దర్శకత్వం: ప్రవీణ్ పుల్లె

లాక్ డౌన్ నేపథ్యంలో ఓటీటీ విడుదలకు సిద్ధమైన మరో కొత్త చిత్రం ‘అర్ధశతాబ్దం’. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ కార్తీక్ రత్నం ప్రధాన పాత్రలో కొత్త దర్శకుడు ప్రవీణ్ పుల్లె రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ‘ఆహా’ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ చిత్రం సినిమాగా ఏమేర మెప్పించిందో చూద్దాం పదండి.

కథ:
కృష్ణ (కార్తీక్ రత్నం) తెలంగాణలోని ఓ పల్లెటూరిలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేదింటి కుర్రాడు. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకునేందుకు అతను దుబాయికి వెళ్లి కొన్నేళ్లు అక్కడే ఉండి డబ్బులు సంపాదించి రావాలనుకుంటాడు. కానీ తన తల్లికి అది ఇష్టం ఉండదు. ఇదిలా ఉంటే తన ఊర్లోనే ఉండే పుష్ప (కృష్ణ ప్రియ)ను స్కూల్లో ఉన్నప్పటి నుంచి ప్రేమిస్తుంటాడు కృష్ణ. రోజూ తనను చూస్తే ఆమెకు తన ప్రేమను చెప్పడానికి కష్టపడుతుంటాడు. ఐతే కులాల కుంపట్లతో రగిలిపోయే ఆ ఊరిలో పుష్ప మీద అతి ప్రేమతో కృష్ణ చేసిన ఓ పని వల్ల ఘర్షణలు చెలరేగుతాయి. అవి చూస్తుండగానే చాలా పెద్దవిగా మారి ఊరు రణరంగంగా మారుతుంది. మరి ఆ గొడవలు సద్దుమణిగాయా.. పుష్పను కృష్ణ దక్కించుకున్నాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:
‘‘గతించిన క్షణాలన్నీ గ్రంథాలుగా లిఖించబడే రోజున కలవని అడుగులన్నీ కలయికలుగా కలవబడే రోజున.. గెలవని ప్రేమలన్నీ స్మృతులుగా పిలవబడే రోజున.. రాయని అక్షరాలన్నీ రాజ్యాంగాలుగా రాయబడే రోజున మనిషిలో జనించిన ప్రేమలు.. మనిషించిన జయించిన కులాల్ని జయించిన రోజున పుడతాను పువ్వునై మరలా మీలోనే’’... అర్ధశతాబ్దం ముగింపులో హీరో పాత్ర వాయిస్ ఓవర్ తో వినిపించే కవిత ఇది. ఇలాంటి కవితతో సినిమాను ముగించారంటే అప్పటిదాకా తెరపై భావోద్వేగాలతో కూడిన ఒక ఉదాత్తమైన.. ఉన్నతమైన కథనే చెప్పి ఉంటారనుకుంటాం. ఇక ట్రైలర్లో చూసిన ‘‘మన పక్కనుండేటోడు వేరే కులపోడైనా పర్లేదు. కానీ మనమ్మాయి పక్కన పడుకునేటోడు మన కులపోడే అయ్యుండాల’’.. లాంటి డైలాగులు విన్నాక ఇది ‘కంచె’ తరహా గొప్ప ప్రయత్నం లాగానూ కనిపిస్తుంది. ఐతే పాత్రలతో ఇలాంటి భారమైన కవితలు.. డైలాగులు చెప్పించడం వేరు. రెండు గంటల నిడివిలో ఓ కథను సినిమాగా నడిపించడం వేరు. మొదటి పనిని గొప్పగా చేసిన కొత్త దర్శకుడు ప్రవీణ్ పుల్లె.. రెండో పనిలో తేలిపోయాడు. ‘అర్ధ శతాబ్దం’ను ఒక వ్యర్థ ప్రయత్నంగా తయారు చేసి పెట్టాడు.

‘అర్ధశతాబ్దం’ ట్రైలర్ చూస్తే చాలామందికి ఇదొక గొప్ప ప్రయత్నంలాగా కనిపించి ఉంటే ఆశ్చర్యం లేదు. తాము తీసిన సినిమాలోంచి ప్రేక్షకులకు ఏవో భ్రమలు కల్పించేలా ట్రైలర్ కట్ చేసినందుకు మాత్రం ముందుగా దీని మేకర్స్ ను అభినందించాలి. ఏదో ఆశించి సినిమాలోకి అడుగు పెట్టాక కానీ తెలియదు.. ఇది మన సహనానికి పరీక్ష పెట్టబోతోందని. అమ్మాయిని దూరం నుంచి చూస్తూ ఊహల్లోకి వెళ్లిపోయే ప్రేమికుడి వ్యవహారంతో మొదలవుతుంది ‘అర్ధ శతాబ్దం’ నస. ఆ అమ్మాయి కన్నెత్తి చూడదు కానీ.. ఇతను మాత్రం ఊహల్లో ఊరేగిపోతూ పది నిమిషాలకో పాటేసుకుంటూ.. ప్రేక్షకులను ఎంతగా విసిగించాలో అంతగా విసిగిస్తాడు హీరో. ముప్పావు గంట పాటు ఈ ప్రహసనం తప్ప కథ అంగుళం కూడా కదలదు. ఇక సినిమాలో కథ మలుపు తిరిగే సన్నివేశం అయితే ప్రేక్షకులకు దిమ్మదిరిగిపోయేలా చేస్తుంది. దాని గురించి కొంచెం క్లుప్తంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం.

ఒక పువ్వు కోసం ఊరంతా కొట్టుకుంటోందా అంటూ ‘అర్ధశతాబ్దం’ ట్రైలర్లో ఓ డైలాగ్ వినే ఉంటారు. ఆ పువ్వు వ్యవహారమే ఇందులో ట్విస్టు. హీరోయిన్ రోజూ ఒక రోజా చెట్టు దగ్గరికొచ్చి పువ్వు పూసిందా అని చూసి వెళ్తుంటుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఆమె చుట్టూ తిరుగుతున్న హీరో.. ఆ చెట్టులో పూసే పువ్వు తీసుకెళ్లి హీరోయిన్ కు ఇచ్చి తన ప్రేమను చెప్పాలనుకుంటాడు. కానీ ఆ పువ్వు పూసిన రోజు దాన్నెవరో తెంపేస్తారు. చూస్తే అది హీరోయిన్ తల్లోనే కనిపిస్తుంది. ఐతే పువ్వును తనే తీసుకుందేమో అని కూడా ఆలోచించకుండా ఇంకెవడో దాన్ని తీసుకెళ్లి ఆమెకిచ్చాడని (దీనికి రీజనింగ్ ఏమీ ఉండదు) అతడి మీద హీరో గ్యాంగు దాడి చేసేస్తుంది. దాడి చేసింది ఎవరో తెలిసి కూడా వాళ్ల సంగతి చూడకుండా అతడి బలగం వెళ్లి ఊరి మీద పడిపోతుంటుంది. ఇక అంతే సంగతులు. అందరూ కత్తులు.. గొడ్డళ్లు.. పట్టేసుకుని చాలా సరదాగా ఒకరినొకరు చంపేసుకుంటూ ఉంటారు. ఇలా ఓ పక్క ఊరు తగలబడి పోతుంటే.. ఒకడేమో శృంగారంలో మునిగిపోయి ఉంటాడు. ఇంకో గ్యాంగేమో సరదాగా కల్లు తాగుతుంటుంది. ఇంకో ఇంట్లో పెళ్లి హడావుడి ఉంటుంది. ఏదో సిటీలోనో టౌన్లోనో అంటే ఎక్కడేం జరుగుతోందో తెలియలేదనుకోవచ్చు. కానీ ఒక ఊరిలో ఇలాంటి సన్నివేశాలు చూపించడం ఏం లాజిక్కో అర్థం కాదు. ఒకరినొకరు చంపుకునే ఎపిసోడ్ ను ఎంత సిల్లీగా తీశారంటే.. ఎంతో ఇంటెన్స్ గా ఉండాల్సిన ఆ సన్నివేశాలు చాలా కామెడీగా తయారై సినిమాను కొనసాగించలేనంత అసహనం పుడుతుంది.

ఇదంతా ఒకెత్తయితే శుభలేఖ సుధాకర్-అజయ్ ఒక గదిలో కూర్చుని దేశం గురించి.. రాజ్యాంగం గురించి.. మనిషి పుట్టుక గురించి సంభాషించుకునే సన్నివేశాలు మరో ఎత్తు. దర్శకుడికి మానవజాతి చరిత్రతో మొదలుకుని చాలా విషయాలపై ఎంతో పరిజ్ఞానం ఉండి ఉండొచ్చు. అతడికి సమాజం పట్ల కన్సర్న్ ఉండి ఉండొచ్చు. కానీ అసందర్భంగా పాత్రలతో లెక్చర్లు ఇప్పిస్తే తట్టుకోవడం కష్టం. శుభలేఖ సుధాకర్ పాత్రతో వచ్చిన సమస్య ఇదే. ఓ పక్క ఊరిలో సిల్లీ సన్నివేశాలు చూపిస్తూ.. ఇంకో పక్క శుభలేఖ సుధాకర్ పాత్రతో లెక్చర్లు దంచిస్తూ ప్రేక్షకుల అసహనాన్ని పతాక స్థాయికి తీసుకెళ్తాడు దర్శకుడు. కేవలం ప్రతి పాత్రతోనూ భారమైన డైలాగులు చెప్పించడం తప్పితే.. ఒక్క క్యారెక్టర్లోనూ ఔచిత్యం కనిపించదు. ఏ పాత్ర ఎందుకు ఎలా ప్రవర్తిస్తుందో అర్థం కాదు. వివిధ సన్నివేశాల్లో జరుగుతున్న పరిణామాలపై ఆయా పాత్రలు రియాక్టయ్యే తీరు ఏమాత్రం మింగుడుపడదు. ఇక పతాక సన్నివేశాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే.. అంత మంచిది. సినిమా నిండా ఎమోషనల్ సీన్లే కానీ.. ఎక్కడా కూడా ప్రేక్షకుడు ఆ ఎమోషన్ ను ఫీలయ్యే ఛాన్సే ఉండదు. ఓటీటీ మూవీనే కదా ఓ లుక్కేద్దాం అనుకున్నా.. ఆ ఆలోచన విరమించుకోవడానికి ఎంతో సమయం కూడా ఇవ్వని చిత్రం ‘అర్ధ శతాబ్దం’.

నటీనటులు:
‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ కార్తీక్ రత్నం తన వంతుగా కృష్ణ పాత్రను పండించడానికి చూశాడు. కానీ అతడి పాత్ర.. హావభావాలు కొత్తగా ఏమీ కనిపించవు. ఇలాంటి పాత్రలు లెక్కలేనన్ని చూశాం. నటన వరకు కార్తీక్ ఓకే. హీరోయిన్ కృష్ణ ప్రియ గురించి పెద్దగా చెప్పడానికేమీ లేదు. కొన్ని సన్నివేశాల్లో క్యూట్ గా అనిపిస్తుంది కానీ.. ఆమె హీరోయిన్ స్థాయికి సరిపోలేదు. సినిమాలో ఆమెదొక వ్యర్థ పాత్ర. సాయికుమార్ పాత్ర గురించి ఆరంభంలో ఏదో ఊహించుకుంటాం. కానీ ఆ పాత్ర తేలిపోయింది. సాయికుమార్ ఏం చూసి ఆ పాత్ర అంగీకరించారో అర్థం కాదు. శుభలేఖ సుధాకర్ బాగా నటించారు. సంభాషణలు కూడా బాగా చెప్పారు. కానీ సినిమాలో ఆయనున్న పార్ట్ ప్రేక్షకులను తీవ్ర అసహనానికి గురి చేస్తుంది. అజయ్ పాత్రా అంతే. ఆమని పాత్ర పూర్తిగా వేస్ట్ అయిపోయింది. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతిక వర్గం: ‘అర్ధ శతాబ్దం’లో నవ్ ఫాలా రాజా అందించిన పాటలు పర్వాలేదు. తెలంగాణ జానపదాల టచ్ తో అవి ఓకే అనిపిస్తాయి. కానీ సినిమాలో వాటి ప్లేస్మెంట్ మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ఏ పాటా కూడా ఆగి వినాలి.. చూడాలి అనిపించదు. నేపథ్య సంగీతం ఓకే. ముగ్గురు ఛాయాగ్రాహకులు కలిసి చేసిన కెమెరా వర్క్ లో ఏమంత విశేషం కనిపించదు. షార్ట్ ఫిలిం స్థాయి కంటే పూర్ మేకింగ్ స్టాండర్డ్స్ కనిపిస్తాయి ఇందులో. దర్శకుడిగా ప్రవీణ్ పుల్లె పనితనం గురించి చెప్పడానికి ఏమీ లేదు. సమాజం పట్ల అతడికి కన్సర్న్ ఉందని.. తనకో భావజాలం ఉందని అర్థమవుతుంది. ఒక సామాజిక సమస్య చుట్టూ ఇంటెన్స్ మూవీ తీయాలని అతననుకున్నాడు. కానీ పేపర్ మీద రాసుకున్న దానికి.. తెరపై కనిపించేదానికి పొంతనే లేదు. దర్శకుడికి ఒక సినిమా తీసే అనుభవం.. సామర్థ్యం లేదని చాలా సన్నివేశాల్లో స్పష్టంగా తెలుస్తుంటుంది. రచయితగా సంభాషణల్లో కొన్ని మెరుపులు చూపించాడు ప్రవీణ్.

చివరగా: అర్ధశతాబ్దం.. వ్యర్థ ప్రయత్నం

రేటింగ్-1.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Ott

LATEST NEWS