అంధగాడు

Fri Jun 02 2017 GMT+0530 (India Standard Time)

అంధగాడు

‘అంధగాడు’ రివ్యూ

నటీనటులు: రాజ్ తరుణ్ - హెబ్బా పటేల్ - రాజేంద్ర ప్రసాద్ - రాజా రవీంద్ర - షాయాజి షిండే - అశిష్ విద్యార్థి - పరుచూరి వెంకటేశ్వరరావు - జయప్రకాష్ రెడ్డి - సుదర్శన్ - ఫిష్ వెంకట్ తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
ఛాయాగ్రహణం: రాజశేఖర్
మాటలు: భాను కిరణ్ - నందు
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: వెలిగొండ శ్రీనివాస్

గత కొన్నేళ్లలో టాలీవుడ్లో చాలామంది రచయితలు దర్శకులుగా మారారు. వారిలో చాలామంది విజయవంతం అయ్యారు కూడా. ఆ జాబితాలో చేరాలన్న ఆశతో రచయిత వెలిగొండ శ్రీనివాస్ కూడా మెగా ఫోన్ పట్టాడు. దర్శకుడిగా తన తొలి ప్రయత్నంలో రాజ్ తరుణ్-హెబ్బా పటేల్ జంటగా ‘అంధగాడు’ సినిమాను రూపొందించాడు శ్రీనివాస్. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంతో వెలిగొండ శ్రీనివాస్ ఎలాంటి ముద్ర వేశాడో చూద్దాం పదండి.

కథ:

గౌతమ్ (రాజ్ తరుణ్) పుట్టుకతోనే అంధుడు. అతను ఓ ఆశ్రమంలో తన లాంటి అంధులైన చిన్నారులతో కలిసి పెరుగుతాడు. పెద్దవాడయ్యాక రేడియో జాకీగా మారిన గౌతమ్.. నేత్ర (హెబ్బా పటేల్) అనే కళ్ల డాక్టర్ని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతణ్ని ప్రేమిస్తుంది. నేత్ర వల్లే గౌతమ్ కు కళ్లు కూడా వస్తాయి. కానీ కళ్లొచ్చాయని సంబర పడే లోపు అతడికో చిత్రమైన సమస్య ఎదురవుతుంది. గౌతమ్ కు ఎవరి కళ్లయితే పెట్టారో.. ఆ వ్యక్తి ఆత్మగా మారి అతడిని వెంటాడటం మొదలుపెడతాడు. ఆ ఆత్మ కోరిక మేరకు గౌతమ్ హత్యలు కూడా చేయాల్సి వస్తుంది. ఇంతకీ ఆ ఆత్మ నేపథ్యమేంటి.. గౌతమ్ ఎవరెవరిని చంపాడు.. ఈ హత్యల వల్ల అతడికి వచ్చిన ఇబ్బందులేంటి.. చివరికి అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది.. అన్నది తెరమీదే చూడాలి.

కథనం - విశ్లేషణ:

కథను ఏదోలా ఆరంభించి.. ఏదేదో చూపించి.. చివర్లో ఒక ట్విస్టు ఇచ్చి.. ‘‘తూచ్.. ఇప్పటిదాకా మీరు చూసిందంతా అబద్ధం’’.. అంటే ప్రేక్షకుడికి మామూలుగా చిర్రెత్తుకొస్తుంది. ఐతే ‘డార్లింగ్’ లాంటి సినిమాలు మాత్రం ఇందుకు మినహాయింపు. ఆ సినిమాలో దర్శకుడు తమను ఫూల్ చేసినప్పటికీ ప్రేక్షకులు మన్నించారు. అంతకుముందు జరిగింది ఇల్లాజికల్ గా అనిపించినప్పటికీ.. ప్రేక్షకుడు దాని గురించి ఎక్కువగా పట్టించుకోకపోవడానికి కారణం.. ‘కన్విన్సింగ్’గా అనిపించే కథనమే. ప్రేక్షకుడిని మాయ చేసే ఎంటర్టైన్మెంటే. ఐతే ఇలాంటి ‘అబద్ధపు’ కథతోనే తెరకెక్కిన ‘అంధగాడు’ ప్రేక్షకుడిని కన్విన్స్ చేయలేకపోయింది. చివర్లో వచ్చే ట్విస్టు థ్రిల్ చేయకపోయగా.. ప్రేక్షకుడు అఫెండ్ అయ్యేలా చేస్తుంది. ప్రేక్షకుడికి అసలేమాత్రం ఆసక్తి రేకెత్తించని ఒక ఎపిసోడ్ నడిపించి.. చివరికి ఇదంతా ఒక ‘అబద్ధం’ అని చెబుతూ.. ఇచ్చిన ట్విస్టు తేలిపోయింది ‘అంధగాడు’లో.

ఒక రచయిత దర్శకుడిగా మారుతున్నాడంటే.. ఒక బలమైన కథను ఆశిస్తాం. కానీ తెలుగులో చాలా సినిమాలకు రచయితగా పని చేసి.. తొలిసారి మెగా ఫోన్ పట్టిన వెలిగొండ శ్రీనివాస్ ఈ విషయంలో పూర్తిగా నిరాశ పరిచాడు. అతను చాలా మామూలు కథను ఎంచుకున్నాడు. ట్విస్టుల మీద కథలు నడిపించే ట్రెండ్ ఎప్పుడో ముగిసిపోయిందన్న సంగతి మరిచిపోయి.. దాన్నే నమ్మకుని కథను అల్లుకున్న శ్రీనివాస్.. కథనంలోనూ ఏ ప్రత్యేకతా చూపించకపోవడంతో ‘అంధగాడు’ చాలా మామూలు సినిమాగా మిగిలిపోయింది. హీరోను మామూలు వాడిలా.. తన ప్రమేయం లేకుండా హత్యలు చేస్తున్నట్లు చూపించి.. చివర్లో అతడిలోని మరో కోణాన్ని చూపిస్తూ ట్విస్టు ఇవ్వడం అన్నది ఔట్ డేట్ అయిపోయిన వ్యవహారం.

మామూలుగా స్టార్ హీరోల కోసం ఇలాంటి ప్లాట్ ఎంచుకుంటూ ఉంటారు. ఐతే స్టార్ హీరోలు సైతం వాడి వాడి అరిగిపోయిన ఈ ప్లాట్ ను రాజ్ తరుణ్ కోసం ఎంచుకోవడమే పెద్ద మైనస్. సాఫ్ట్ క్యారెక్టర్లు చేసే రాజ్ తరుణ్ మాస్ హీరోలా మారిపోయి విలన్లను ఇరగదీసేస్తుంటే.. పగ కోసం రగిలిపోతుంటే.. చూడ్డానికే ఏదోలా అనిపిస్తుంది. చివర్లో దర్శకుడు ఇచ్చిన థ్రిల్ ఫీలవకపోవడానికి ఇది కూడా ఓ కారణం. ముందు హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ తో సినిమాను మొదలుపెట్టడం.. ఆపై ఇంటర్వెల్ ముంగిట ట్విస్టుతో కథ సీరియస్ టర్న్ తీసుకోవడం.. ప్రి క్లైమాక్సులో మళ్లీ ఇంకో ట్విస్ట్.. ఒక ఫ్లాష్ బ్యాక్.. చివరికి విలన్ పై హీరో ప్రతీకారంతో కథ సుఖాంతం.. ఇలా ‘అంధగాడు’ అరిగిపోయిన కమర్షియల్ ఫార్మాట్లో సాగిపోతుంది. ప్రథమార్ధంలో కొంచెం ఎంటర్టైన్మెంట్ పార్ట్ మినహాయిస్తే.. ఇందులో ఎంగేజ్ చేసే అంశాలేమీ లేవు.

ఈ సినిమాకు అసలు ‘అంధగాడు’ అనే టైటిల్ ఎందుకు పెట్టారన్నదే అర్థం కాదు. అందులో లాజిక్ ఏమీ లేదు. సినిమాలో చాలా సన్నివేశాలు కూడా ఇలాగే ఇల్లాజికల్ గా అనిపిస్తాయి. హీరోయిన్ ఒక కళ్ల డాక్టర్. అలాంటమ్మాయి దగ్గర తాను అంధుడిని కాదు అని మేనేజ్ చేస్తూ ఆమెను ప్రేమలోకి దింపుతాడు హీరో. ఇక కళ్లు లేకపోయినా.. హీరోయిన్ తన దరిదాపుల్లోకి రాగానే పట్టేసే హీరో.. తనకు కళ్లొచ్చాక అదే అమ్మాయి వచ్చి తాను మూగ అని అంటూ తన చుట్టూ తిరుగుతుంటే గుర్తు పట్టడు. ప్రేక్షకులు ఎంత ఉదార స్వభావులైనప్పటికీ మరీ ఇంత సిల్లీగా కథను నడిపిస్తే ఎలా? ఎంత ఇల్లాజికల్ గా సాగినప్పటికీ కాస్తో కూస్తో ఎంటర్టైన్మెంట్ ఉండటంతో ఈ ట్రాకే పర్వాలేదనిపిస్తుంది. సత్య.. సుదర్శన్ ల కాంబినేషన్లో వచ్చే సన్నివేశాల్లో కొన్ని నవ్వులు పండటంతో ప్రథమార్ధం ఓ మోస్తరుగా సాగిపోతుంది. కానీ ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్టుతోనే కథనం ట్రాక్ తప్పుతుంది.

రాజేంద్ర ప్రసాద్ చేసిన దయ్యం పాత్ర ప్రవేశంతో ప్రేక్షకులు థ్రిల్లవడం మాటేమో కానీ.. ఈ ఎపిసోడ్ మొత్తం ప్రేక్షకుల్ని బాగా విసిగిస్తుంది. పైగా ముందుకెళ్లాక ఈ ట్రాక్ మొత్తం ట్రాష్ అనడంతో ప్రేక్షకుడికి చిర్రెత్తుకొస్తుంది. సినిమాను సరదాగా నడిపించాలనే ఉద్దేశంతో కథలోనూ సీరియస్ నెస్ లేకుండా చేశాడు దర్శకుడు. దీంతో చివర్లో వచ్చే ట్విస్టు కూడా కూడా తేలిపోయింది. ప్రథమార్ధంలో లాగా రెండో అర్ధంలో కామెడీ అయినా వర్కవుట్ అయి ఉంటే ఓకే అనుకోవచ్చు. కానీ అదీ లేకపోయింది. పాటలు కూడా సందర్భోచితంగా కాకుండా.. ఇప్పుడు పాట రావాల్సిన టైం అయింది అన్నట్లు వచ్చి పడటంతో ప్రేక్షకుడు మరింతగా డిస్కనెక్ట్ అయిపోతాడు. ద్వితీయార్ధం తలా తోకా లేకుండా సాగుతూ విసిగించడంతో ముగింపు కోసం ఎదురు చూడటమే మిగులుతుంది. ఓవరాల్ గా ‘అంధగాడు’ ప్రేక్షకులకు ఏ రకంగానూ ప్రత్యేకమైన అనుభూతిని మిగల్చడు.

నటీనటులు:

రాజ్ తరుణ్ సినిమా ఆరంభంలో ఓకే అనిపిస్తాడు కానీ.. చివరికి వచ్చేసరికి ఆ పాత్రకు సూటవ్వలేదన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎంటర్టైన్మెంట్ వరకు అంటే ఓకే కానీ.. పగా పత్రీకారాలు.. ఫైట్లు అనేసరికి రాజ్ తరుణ్ తో ఇబ్బంది వచ్చేసింది. ఇలాంటి పాత్ర కోసం రాజ్ తరుణ్ ను ఎంచుకోవడమే పొరబాటు అనిపిస్తుంది. కామెడీ సీన్లలో ఈజీగా చేసుకెళ్లిపోయిన రాజ్.. మిగతా చోట్ల ఇబ్బంది పడ్డాడు. ఈ మధ్య తన సినిమాలన్నీ కూడా కథా బలం లేకుండా పైపై హంగులతో సోసోగా సాగిపోతున్న విషయాన్ని రాజ్ తరుణ్ గుర్తిస్తున్నాడో లేదో? కొంచెం అతను అప్రమత్తమైతే మంచిది. హెబ్బా పటేల్ ఎప్పుడూ చేసేదే చేసింది. ఆమె హావభావాల్లో ఏమాత్రం మార్పు లేదు. ఎప్పట్లాగే పాటల్లో గ్లామర్ షో చేసింది. అక్కడ కూడా ఆమెను చూస్తుంటే ఒక మొనాటనీ కనిపిస్తుంది. ఆ డ్రెస్సులు..  ఆ బాడీ లాంగ్వేజ్.. ఆ పరుగు.. ఆ ఎక్స్ ప్రెషన్స్.. గత సినిమాల్నే తలపిస్తాయి. రాజా రవీంద్ర మెయిన్ విలన్ స్థాయికి సరిపోలేదు. ఆ పాత్ర కూడా ఏమంత ప్రత్యేకంగా లేదు. రాజేంద్ర ప్రసాద్ ను మరీ తేల్చేశారు. ఆయన ఇలాంటి పాత్ర ఎలా ఒప్పుకున్నారో అనిపిస్తుంది. షాయాజి షిండే.. అశిష్ విద్యార్థి కూడా ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. సత్య.. సుదర్శన్ తమదైన శైలిలో కొంతమేర ఎంటర్టైన్ చేశారు. పరుచూరి వెంకటేశ్వరరావు తనకు సరిపోయే పాత్రలో మెప్పించారు.

సాంకేతికవర్గం:

శేఖర్ చంద్ర సంగీతం సోసోగా అనిపిస్తుంది. ‘దెబ్బకు పోయే పోయే..’ పాట ఒక్కటి ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఆ పాట చిత్రీకరణ కూడా బాగుంది. మిగతా పాటలు ఏదో అలా అలా సాగిపోతాయి. శేఖర్ నేపథ్య సంగీతం మామూలుగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల లౌడ్ నెస్ మరీ ఎక్కువైంది. కెమెరామన్ రాజశేఖర్ తన ప్రత్యేకతను చూపించే అవకాశం స్క్రిప్టు ఇవ్వలేదు. నిర్మాణ విలువలు ఓకే. వెలిగొండ శ్రీనివాస్ కు రచయితగా ఎంతో అనుభవమున్నప్పటికీ.. దర్శకుడిగా తన తొలి సినిమాకు స్క్రిప్టు విషయంలో పెద్దగా కసరత్తు చేసినట్లు అనిపించదు. ఏదో పైపైన హడావుడిగా నడిపించేయడమే తప్ప.. ఇందులో బలమైన కథ కానీ.. ఆసక్తి రేకెత్తించే కథనం కానీ లేకపోయాయి. కొన్ని చోట్ల కామెడీ వర్కవుట్ చేసినప్పటికీ.. ఇంకే ప్రత్యేకతా చూపించలేకపోయాడు వెలిగొండ శ్రీనివాస్. దర్శకుడిగా అతను నిరాశ పరిచాడు.

చివరగా: అంధగాడు.. ఆకట్టుకోడు

రేటింగ్-2/5

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS