'అమర్ అక్బర్ ఆంటోని'

Fri Nov 16 2018 GMT+0530 (IST)

'అమర్ అక్బర్ ఆంటోని'

చిత్రం : 'అమర్ అక్బర్ ఆంటోని'

నటీనటులు: రవితేజ - ఇలియానా - షాయాజి షిండే - తరుణ్ అరోరా - ఆదిత్య మీనన్ - అభిమన్యు సింగ్ - సునీల్ - వెన్నెల కిషోర్ - సత్య - శ్రీనివాసరెడ్డి - రఘుబాబు - జయప్రకాష్ రెడ్డి - భరత్ - గిరి - రవిప్రకాష్ తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: వెంకట్ సి.దిలీప్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని - వై.రవిశంకర్ - మోహన్ చెరుకూరి
రచన-దర్శకత్వం: శ్రీను వైట్ల

గతంలో ‘వెంకీ’.. ‘దుబాయ్ శీను’ లాంటి హిట్లు అందించిన మాస్ రాజా రవితేజ.. స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల.. ఇప్పుడు హిట్టు కోసం అల్లాడుతున్న దశలో కలిసి చేసిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోని’. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం వీరి ఆశల్ని నిలబెట్టిందో లేదో చూద్దాం పదండి.

కథ:

అమర్ (రవితేజ) తన చిన్నతనంలోనే తమ తల్లిదండ్రుల్ని.. ఇతర కుటుంబ సభ్యుల్ని కోల్పోతాడు. వీరి కుటుంబం ఎంతో నమ్మి తమ సంస్థలో భాగస్వాములుగా చేసుకున్న వాళ్లే కుట్ర పూరితంగా వాళ్లను చంపేస్తారు. ఓ హత్య చేసి జైలుకు వెళ్లిన అమర్.. తిరిగొచ్చి తనకు కుటుంబాన్ని దూరం చేసిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతాడు. ఐతే అతడికి అనుకోని సమస్యలు ఎదురవుతాయి. తనకే తెలియకుండా చిత్ర విచిత్రంగా.. ముగ్గురు వ్యక్తుల్లా ప్రవర్తిస్తుంటాడతను. ఇంతకీ అతడి సమస్య ఏంటి.. దీన్ని అధిగమించి శత్రువులపై అతను ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

తెలుగు ప్రేక్షకులకు ఒకప్పుడు పతాక స్థాయి వినోదాన్ని అందించిన దర్శకుడు శ్రీను వైట్ల. ఐతే ఒక దశ దాటాక అతడి బలమే బలహీనత అయింది. తన సినిమాల్ని తానే కాపీ కొడుతూ.. ఒక ఫార్మాట్ దాటి బయటికి రాలేక విసుగెత్తించేశాడతను. ఐతే చివరగా ‘మిస్టర్’తో పలకరించిన వైట్ల.. కొంచెం శైలి అయితే మార్చాడు కానీ.. మెప్పించలేకపోయాడు. ఆ సినిమా చూస్తే.. రొటీన్ అయినా ఒకప్పటి వైట్ల సినిమాలే బెటర్ కదా అనిపించింది. ఇప్పుడు ‘అమర్ అక్బర్ ఆంటోని’ చూసినా అదే భావన కలిగితే ఆశ్చర్యం లేదు. ఒక రొటీన్ ప్రతీకార కథనే ఎంచుకుని.. దాన్ని డిఫరెంట్ ట్రీట్మెంట్ తో నడిపించాలని చూశాడు వైట్ల. కానీ అతను ఎంచుకున్న ‘కొత్త’ పాయింట్ సినిమాలో అస్సలు అతకలేదు. దాన్ని డీల్ చేయడంలో వైట్ల పూర్తిగా ఫెయిల్ అయిపోవడంతో ‘అమర్ అక్బర్ ఆంటోని’ ఎటూ కాని సినిమా అయిపోయింది.

ఇంతకీ వైట్ల కొత్తగా ట్రై చేసిన పాయింట్ ఏంటంటే.. హీరోను స్ప్లిట్ పర్సనాలిటీతో చూపించడం. ఎప్పుడో ‘అపరిచితుడు’ రోజుల్లోనే చూసిన ఈ పాయింట్ ను కొంచెం భిన్నంగా డీల్ చేయాలని చూశాడు వైట్ల. కానీ ‘అపరిచితుడు’ లాంటి సినిమాల్లో దీని చుట్టూ నడిచే సన్నివేశాలు చూస్తుంటే.. ఒక ఉత్కంఠ.. ఉద్వేగం కలుగుతాయి. కానీ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో రవితేజ క్యారెక్టర్లు మార్చుకుని చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటే.. కామెడీగా అనిపిస్తుంది తప్ప ఇంటెన్సిటీని ఫీలవ్వలేం. అసలు కథలో ఎక్కడా ఈ పాయింట్ ఇమడక.. ఏదో ఒక సెపరేట్ ట్రాక్ నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పటిదాకా ఇలాంటి కాన్సెప్ట్స్ అలవాటే లేని వైట్ల.. దీన్ని ఎలా డీల్ చేయలో తెలియని సందిగ్ధంలో కంగాళీ చేసేశాడు వైట్ల. స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్లో విక్రమ్ లాంటి నటుడి నుంచి పతాక స్థాయి పెర్ఫామెన్స్ చూశాక.. రవితేజ కూడా సాధారణంగా అనిపిస్తాడు. దీనికి తోడు ఈ పాయింట్లో ఎక్కడా ఇంటెన్సిటీ లేక.. కథ ఒక తీరుగా నడవక ‘అమర్ అక్బర్ ఆంటోని’ అయోమయంగా తయారైంది.

పూర్తిగా కథను అమెరికాలో నడపడం ద్వారా ప్రేక్షకులకు ‘కొత్త’ అనుభూతిని పంచడానికి ఇంకో ప్రయత్నం కూడా చేశాడు వైట్ల. కానీ అది బడ్జెట్ పెంచడానికి కారణమైంది తప్ప.. ఎంతమాత్రం సినిమాకు బలం కాలేదు. వైట్ల కొత్తగా ట్రై చేసిన పాయింట్ తేలిపోగా.. మిగతా కథలో ఏ విశేషం లేకపోయింది. రొటీన్ రివెంజ్ డ్రామా కావడంతో.. కథలో తర్వాత ఏం జరుగుతుందనే ఎగ్జైట్మెంట్ కలగదు. ఫ్లాష్ బ్యాక్ ను బ్రేక్ చేసి.. బ్రేక్ చేసి చూపించడం ద్వారా స్క్రీన్ ప్లేలో కొత్తదనం చూపించాలని వైట్ల చూశాడు కానీ.. దాని వల్ల ఒరిగిందేమీ లేదు. మొదట్లోనే కథంతా అర్థమైపోయాక.. మధ్యలో వచ్చేదంతా ఫిల్లింగ్ లాగే అనిపిస్తుంది తప్ప.. ఎక్కడా కథ ఒక తీరుగా సాగదు. బోరింగ్ ఎపిసోడ్లతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు వైట్ల.

ఈ సినిమాలో వింటేజ్ వైట్ల కామెడీ చూడబోతున్నట్లు చిత్ర బృందం చెప్పుకుంది. కానీ కామెడీలో కూడా పంచ్ మిస్సయింది. ఎప్పట్లాగే కామెడీ బెటాలియన్ పెద్దగానే దించాడు వైట్ల. కానీ ఎక్కడా కూడా పేలిపోయే కామెడీ లేదు. అక్కడక్కడా సత్య.. వెన్నెల కిషోర్.. సునీల్ కొంచెం నవ్వులు పంచారు తప్పితే.. ఒకప్పటి వైట్ల స్థాయి కామెడీకి అవకాశమే లేదు. సెటైర్లకు పెట్టింది పేరైన వైట్ల.. ఈసారి అమెరికాలో తెలుగు సంఘాల మీద పంచులేయాలని చూశాడు. కానీ అది వర్కవుట్ కాలేదు. మొత్తంగా చూస్తే వైట్ల గత సినిమాలతో పోలిస్తే ఇది కొంచెం భిన్నంగా అనిపిస్తుంది తప్ప.. అలరించదు. ఇలాంటి వాటికంటే వైట్ల ఒక ఫార్మాట్లో తీసిన సినిమాలే బెటరన్న ఫీలింగ్ కలుగుతుంది. వైట్ల-రవితేజ కాంబినేషన్ నుంచి ఆశించే అంశాలేవీ ఇందులో లేవు.

నటీనటులు:

రవితేజ ఇందులో కొంచెం కొత్తగా కనిపించాడు కానీ.. అతను పెద్దగా చేసిందేమీ లేదు. రవితేజ కొత్తగా కనిపించాలని కోరుకుంటాం కానీ.. అతను ఇంత నిస్సహాయంగా.. డల్లుగా ఉండటం ప్రేక్షకులకు రుచించదు. చాలాచోట్ల రవితేజ క్లూ లెస్ గా కనిపించాడు. అతడిలో ఎప్పుడూ ఉండే ఎనర్జీ ఇందులో కనిపించలేదు. స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అతడికి సెట్టవ్వలేదు. పాత్రలో వైరుధ్యం చూపించాల్సిన సన్నివేశాల్లో రవితేజ తేలిపోయాడు. ఇలియానా సెక్సీగా కనిపించింది కానీ.. ఫిజిక్ మాత్రం చాలా చోట్ల ఎబ్బెట్టుగా తయారైంది. మరీ లావైపోయిన ఇల్లీని చూసి అభిమానులు తట్టుకోలేరేమో. నటన పరంగా ఇలియానా బాగానే చేసింది. విలన్లుగా ఒకరికి నలుగురు కనిపించారు కానీ.. ఎవ్వరూ ప్రత్యేకంగా కనిపించలేదు. ఒక్క పాత్రనూ సరిగా తీర్చిదిద్దలేదు. ఎఫ్బీఐ ఆఫీసర్ గా అభిమన్యు సింగ్ మామూలు ఓవరాక్షన్ చేయలేదు. అతడి పాత్ర విసిగిస్తుంది. సత్య.. వెన్నెల కిషోర్.. సునీల్ ల కామెడీ పర్వాలేదు. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతికవర్గం:

తమన్ సంగీతం అంతగా ఆకట్టుకోదు. కలలా కథలా.. పాట ఒక్కటి ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఆ పాట చిత్రీకరణ కూడా బాగుంది. నేపథ్య సంగీతం రొటీన్ గా అనిపిస్తుంది. వెంకట్ సి.దిలీప్ ఛాయాగ్రహణం ఒకే. సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చాడు. నిర్మాణ విలువలు మైత్రీ మూవీ మేకర్స్ స్థాయికి తగ్గట్లు రిచ్ గా ఉన్నాయి. ఎక్కడా రాజీ లేకుండా సినిమాకు ఖర్చు పెట్టిన విషయం తెరపై కనిపిస్తూనే ఉంటుంది. ఇక దర్శకుడు వైట్ల గురించి ఏం చెప్పాలి? అభిమన్యు సింగ్ పోషించిన ఎఫ్బీఐ పాత్రను తీర్చిదిద్దిన విధానమే చెప్పేస్తుంది వైట్ల ఎంతగా ఫామ్ కోల్పోయాడో అని. ఏదో కొత్తగా ట్రై చేద్దామని చూశాడు కానీ.. అది బెడిసికొట్టింది. ఇటు కొత్తగా ట్రై చేసిందీ వర్కవుట్ కాలేదు. అలాగని వైట్ల పాత స్టయిల్లో కామెడీ కూడా పండలేదు. మొత్తంగా అతను రెండు రకాలుగా నిరాశ పరిచాడు.

చివరగా: అమర్ అక్బర్ ఆంటోనీ.. అయోమయం!

రేటింగ్: 2/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in TheatreLATEST NEWS