'అక్షర'

Fri Feb 26 2021 GMT+0530 (IST)

'అక్షర'

చిత్రం:: 'అక్షర'

నటీనటులు: నందిత శ్వేత-శ్రీతేజ్-సంజయ్ స్వరూప్-హర్షవర్ధన్-సత్య-షకలక శంకర్-మధునందన్-అజయ్ ఘోష్-అప్పాజీ అంబరీష తదితరులు
సంగీతం: సురేష్ బొబ్బిలి
ఛాయాగ్రహణం: నరేష్ బానెల్
నిర్మాతలు: అహితేజ బెల్లంకొండ-సురేష్ వర్మ అల్లూరి
రచన-దర్శకత్వం: చిన్ని

కరోనా-లాక్ డౌన్ వల్ల వాయిదా పడి చాలా ఆలస్యంగా ఇప్పుడు రిలీజవుతున్న చిత్రాల్లో ‘అక్షర’ కూడా ఒకటి. నందిత శ్వేత ప్రధాన పాత్రలో చిన్ని రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. సామాజికాంశాలతో ముడిపడ్డ ఈ థ్రిల్లర్ చిత్రం విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

అక్షర (నందిత శ్వేత) ఎంఎస్సీ ఫిజిక్స్ చదివి విశాఖపట్నంలో ఓ కార్పొరేట్ కాలేజీలో లెక్చరర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటుంది. ఆమె టాలెంట్ నచ్చి వెంటనే ఉద్యోగం ఇచ్చేస్తాడు దాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకడైన శ్రీతేజ (శ్రీతేజ్). అక్షరతో కొన్ని రోజుల ప్రయాణం తర్వాత ఆమెతో ప్రేమలోనూ పడతాడు శ్రీతేజ. మరోవైపు అక్షర ఉండే కాలనీలో ముగ్గురు కుర్రాళ్లు కూడా ఆమెను మెప్పించే ప్రయత్నంలో ఉంటారు. ఐతే అక్షరను ఒక ప్రత్యేకమైన చోటికి తీసుకెళ్లి తన ప్రేమ గురించి ఆమెకు శ్రీతేజ చెప్పబోతుంటే.. అతణ్ని ఆమె కాల్చి చంపేస్తుంది. అది ముగ్గురు కుర్రాళ్లు చూసి షాకవుతారు. ఎంతో సున్నితంగా కనిపించే అక్షర అంత దారుణానికి ఎలా ఒడిగట్టింది.. తనెవరు... తన గతమేంటి.. ఆ హత్య తర్వాత ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

‘అక్షర’ అనే టైటిల్.. ఈ సినిమా టీజర్ ట్రైలర్లలో చర్చించిన చూపించిన విషయాలను బట్టి ఇది విద్యా వ్యవస్థలో లోపాలు.. అందులో జరిగే దారుణాల నేపథ్యంలో సాగే సినిమా అన్న సంగతి అర్థమైపోయింది. ఉన్నత విద్యను వ్యాపారంగా మార్చి.. పిల్లల్ని చదువు పేరుతో తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ.. ఫీజుల పేరుతో తల్లిదండ్రులను దోచేస్తున్న కార్పొరేట్ కళాశాలల మీద సంధించిన బాణమే ‘అక్షర’. ‘‘విద్య అనేది ప్రాథమిక హక్కు. దాన్ని డబ్బుతో కొనడం తప్పు’’ అంటూ ఇందులో హర్షవర్ధన్ పాత్ర చెప్పే మాటలో ‘అక్షర’ సారాంశమంతా ఉంది. ఇలాంటి ఓ బర్నింగ్ ఇష్యూ మీద.. వాస్తవ ఘటనల ఆధారంగా సీరియస్ గా.. సిన్సియర్ గా ఓ సినిమా తీయాలనుకోవడం మంచి ఉద్దేశమే. మంచి సందేశంతో ముడిపడ్డ ఈ అంశాన్ని సినిమాలో చర్చించిన తీరు కొంత ఆలోచింపజేస్తుంది. ఐతే దీన్ని పక్కన పెట్టి ఒక సినిమాగా ‘అక్షర’ ఎలా ఉంది అంటే మాత్రం సమాధానం చెప్పడానికి తటపటాయించాల్సిందే. మంచి అంశం మీద సినిమా తీయడం.. ఆ అంశాన్ని అర్థవంతంగా చర్చించే ప్రయత్నం చేయడం అభినందనీయమే అయినా.. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే బలమైన కథ లేకపోవడం కథనంలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడం ‘అక్షర’కు పెద్ద ప్రతికూలతలు.

‘అక్షర’ పేరుకే థ్రిల్లర్ సినిమా. ఇందులో ప్రేక్షకులను అంతగా థ్రిల్ చేసే అంశాలే లేవు. తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి రేకెత్తించడం.. ప్రేక్షకుల ఊహలకు భిన్నంగా కథనం సాగడం.. థ్రిల్లర్ సినిమాలకు ఉండాల్సిన ప్రధాన లక్షణాలు. అవి ‘అక్షర’లో కనిపించవు. ఐతే ఇంటర్వెల్ దగ్గర మలుపు సహా సినిమాలో తర్వాత ఏం జరుగుతుందో అంచనా వేయడం పెద్ద కష్టం కాదు. సినిమా ఆరంభంలోనే ఒక కార్పొరేట్ కాలేజీ మేడ పైనుంచి పడి ఓ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడటం.. తర్వాత కథానాయిక మామూలుగా ఆ కాలేజీలో లెక్చరర్ గా చేరి అందరితో కలిసి పోవడం.. ఆ విద్యా సంస్థ డైరెక్టర్ తో సన్నిహితంగా మెలగడం చూస్తే.. ఈమె వెనుక వేరే కథ ఉంటుందని.. తన ఉద్దేశాలు వేరై ఉంటాయని ప్రేక్షకులకు ఒక అంచనా వచ్చేస్తుంది. ఇంటర్వెల్ దగ్గర ఆమె పాత్రను మలుపు తిప్పుతారన్న ఊహ ముందే వచ్చేస్తుంది. ఐతే అక్కడి దాకా దర్శకుడు కథనాన్ని ఎంత ఆసక్తికరంగా నడిపిస్తాడా అని చూస్తే.. కాలనీలోకి తీసుకెళ్లి కామెడీతో కాలక్షేపం చేయించాలని చూశాడు. కానీ అది పూర్తిగా బెడిసికొట్టింది. సత్య.. షకలక శంకర్.. మధునందన్ కామెడీ బాగా చేయగల వాళ్లే కానీ.. వాళ్ల పాత్రలు చాలా సాధారణంగా ఉండటం.. హీరోయిన్ దగ్గర వాళ్ల వేషాలన్నీ విసించేయడంతో సమయం చాలా భారంగా నడుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్టు ఆసక్తి రేకెత్తించినా.. దాన్ని నిలబెట్టేలా ద్వితీయార్ధం లేకపోయింది.

ఇన్వెస్టిగేషన్ తో ముడిపడ్డ సన్నివేశాలు బిల్డప్ ఎక్కువ-విషయం తక్కువ అన్నట్లు తయారయ్యాయి. స్పెషల్ ఆఫీసర్ పాత్ర చేసిన హడావుడి చేస్తే ఏదో ఊహించుకుంటాం కానీ.. తర్వాతి సన్నివేశాలను తేల్చి పడేశారు. వైజాగ్ సిటీ కమిషనర్ పాత్రను సిల్లీగా.. ఒక జోకర్ లాగా చూపించి ఈ సినిమాను సీరియస్ గా తీసుకోమంటే కష్టమే. ఐతే హీరోయిన్ పోలీసులకు చిక్కాక వచ్చే ఆమె ఫ్లాష్ బ్యాక్ సినిమాలో చాలా రొటీన్ అనిపించినా.. ఉన్నంతలో సినిమాలో బలంగా అనిపించేది ఆ ఎపిసోడే. హర్షవర్ధన్ పాత్ర.. దానికి రాసిన సంభాషణలు.. అతడి నటన ఫ్లాష్ బ్యాక్ కు బలంగా నిలిచాయి. కార్పొరేట్ విద్యా సంస్థలు ఎలా సొసైటీని కమ్మేస్తున్నాయనే విషయాన్ని ఆలోచింపజేసేలా తీర్చిదిద్దాడు దర్శకుడు. ఐతే ఈ ఫ్లాష్ బ్యాక్ సహా ద్వితీయార్ధంలో ఎక్కడా కొత్తదనానికి మాత్రం ఆస్కారం లేకపోయింది. తర్వాతి సన్నివేశంలో ఏం జరుగుతుందో పొల్లుపోకుండా చెప్పేయొచ్చు. అంత రొటీన్ గా సాగిపోతుంది ‘అక్షర’. ముగింపులోనూ మెరుపులేమీ లేవు. మొత్తంగా చూస్తే ఈ సినిమాలో చర్చించిన విషయం మంచిది. ఆలోచింపజేసేది. ప్రేక్షకులు రిలేట్ చేసుకోగలిగేది. కానీ ఈ అంశం చుట్టూ అల్లుకున్న కథాకథనాలు మాత్రం నిరాశకు గురి చేస్తాయి. ఈ రొటీన్ రివెంజ్ థ్రిల్లర్ తో ప్రేక్షకులు ఏ మేర కనెక్ట్ అవుతారన్నది సందేహమే.

నటీనటులు:

ఈ కథ మొత్తం నందిత శ్వేత చుట్టూనే తిరిగినా.. ఆమె నుంచి ఆశించే స్పెషల్ పెర్ఫామెన్స్ ఇందులో కనిపించదు. తెలుగులో తొలి సినిమా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో తనపై అంచనాలు పెంచిన నందిత.. ‘అక్షర’లో తనే లీడ్ రోల్ చేసినా అంత ప్రభావవంతంగా అనిపించదు. బాగా చేయలేదు అనలేం కానీ.. నందిత నుంచి ఆశించే స్థాయిలో తన పాత్ర నటన లేవు. శ్రీతేజ్ జస్ట్ ఓకే అనిపించాడు. విలన్ పాత్రలో సంజయ్ స్వరూప్ మెరిశాడు. ముందు ఇతను విలనేంటి అనిపిస్తుంది కానీ.. పోను పోను ఆ పాత్ర ఇంపాక్ట్ కనిపిస్తుంది. హర్షవర్ధన్ సినిమాలో బెస్ట్ పెర్ఫామర్ అని చెప్పొచ్చు. దర్శకుడు చెప్పాలనుకున్న బలమైన సందేశాన్ని ఈ పాత్రతో చెప్పించడం మంచి ఎత్తుగడ. ఫ్లాష్ బ్యాక్ ను నిలబెట్టింది హర్షవర్ధనే. సత్య.. షకలక శంకర్.. మధునందన్.. అజయ్ ఘోష్ నవ్వించడానికి గట్టి ప్రయత్నమే చేసినా ఫలితం లేకపోయింది.

సాంకేతిక వర్గం:

సురేష్ బొబ్బిలి సంగీతం ఏమంత ప్రత్యేకంగా లేదు. పాటలేవీ గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం కొన్ని చోట్ల పర్వాలేదనిపిస్తుంది. నరేష్ బానెల్ ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ చిన్ని.. చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే. చదువు ఎలా చెప్పాలో.. ఎలా చదవాలో అతను బలంగానే చెప్పాడు. అతడి మాటలు చాలా చోట్ల ఆళోచింపజేస్తాయి. విద్యా వ్యవస్థలోని లోపాలను బాగానే ఎత్తి చూపించాడు. ఈ చర్చ వరకు ఓకే కానీ.. ఈ అంశాన్ని చెప్పడానికి అతను రొటీన్ ‘రివెంజ్ డ్రామా’ టెంప్లేట్ ఎంచుకోవడమే నిరాశ పరుస్తుంది.

చివరగా: అక్షర.. మంచి పాయింట్.. రొటీన్ ట్రీట్ మెంట్

రేటింగ్-2.25/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre

LATEST NEWS